Tags

, , , , ,

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !