Tags

, , , , , ,

Image result for why trs government imposed 144 section on rythu bandhu beneficiaries

ఎం కోటేశ్వరరావు

తెలంగాణా ‘రైతు బంధు ‘ సర్కార్‌ నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాల్లో రైతులు గుమి కూడకుండా 144వ సెక్షన్‌ విధించింది. పడిపోతున్న పసుపు, ఎర్రజొన్నల ధరలతో ఆందోళన చెందిన రైతన్నలు గత వారం రోజులుగా ఆందోళన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఏడవతేదీ ఒక రోజు ఆందోళన చేసి 11వ తేదీలోగా పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకోకపోతే పన్నెండున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదిలింది, ఎలా? ధరలకు హామీ ఇచ్చికాదు, పోలీసు శాఖ ద్వారా 144వ సెక్షన్‌, ముఖ్యనాయకులు అనుకున్నవారిని అరెస్టులు చేయించింది. అయినా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేశారు. వారంతా రైతు బంధు పధకం కింద ఎకరానికి నాలుగు వేలు తీసుకున్నవారే, అందుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారే. ముఖ్య మంత్రి సచివాలయానికి రాకపోతే ఏమైతది అని కెసిఆర్‌ ప్రశ్నిస్తే అవును నిజమే ఏమైతది,ఏం కాలేదు రానవసరం లేదంటూ ఆయనకు మద్దతుగా గుండుగుత్తగా ఓట్లు వేసిన వారే. అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది, అయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే ఏమైతది అని ఇంకా అదే కెసిఆర్‌ అనలేదు గానీ ఒక వేళ అన్నా నిజమే ఏమైతది అని మద్దతు ఇవ్వటానికి సిద్దంగా వున్నవారే వారంతా. నిజామాబాద్‌ ఎంపీ కవితక్క వారి దగ్గరకు రాలే, ప్రతి వారి దగ్గరకు వెళ్లి నే వున్నా, మీ వాడినే అని చెబుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆ వైపు చూడలే. ఎంఎల్‌ఏలంతా తమకు అత్యవసరమైన, దరొక్కపోతే ప్రాణాలు పోయే మంత్రిపదవులు ఇతర అవసరాల కోసం తిరగటానికే ఖాళీ లేకపోవటంతో రైతుల గురించి పట్టించుకోలా. అయితే ఎవరూ పట్టించుకోనపుడు మనం చూస్తూ వూరుకోకూడదు కదా అని పోలీసులు 144వ సెక్షన్‌ ప్రయోగించి, కొందరిని అదుపు లేదా అరెస్టు చేసి తమకు చేతనైన సాయం చేశారు. దిక్కులేక, దరితోచక రైతులు ఆంక్షలను ధిక్కరించి రోడ్డెక్కారు.పదహారవ తేదీలోగా ధరల సంగతి చూడకపోతే తిరిగి ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైతు బంధువు ఎలా స్పందిస్తారో !

రైతు బంధుపేరుతో కెసిఆర్‌ ఎకరానికి నాలుగు లేక ఐదు వేలు ఇస్తేనో, కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఐదెకరాలలోపు రైతులకు నరేంద్రమోడీ ఆరువేలు ఇస్తేనో దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదని నిజామాబాద్‌ రైతాంగ ఆందోళన వెల్లడిస్తోంది. ఇవాళ నిజామాబాద్‌ పసుపు రైతులైతే రేపు గుంటూరు జిల్లా దుగ్గిరాల, కడప పసుపు రైతులు కావచ్చు. రైతు బంధు లేదా కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఇచ్చే సాయాన్ని తప్పు పట్టనవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వబోయే ముందు పశువులకు పూజలు చేసి అలంకరణలు చేయటం తెలిసిందే. ఈ బంధులు, సమ్మాన్‌లు కూడా అలాంటివే అని నమ్మేవారి నమ్మకాన్ని, అనుభవాన్ని కూడా కొట్టిపారవేయలేము. మార్కెటింగ్‌తో సహా వ్యవసాయరంగాన్ని తమకు పూర్తిగా అప్పగించి, ప్రత్యక్ష సాయం పేరుతో నాలుగు రూకలు వెదజల్లి రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని ప్రయివేటు వాణిజ్య బకాసురులు ఎప్పటి నుంచో మనదేశం మీద వత్తిడి తెస్తున్నారు. నయా వుదారవాద విధానాలు లేదా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాల వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్న విధానాల సారం ఏమంటే సరిహద్దులు, మిలిటరీ, కరెన్సీ, పోలీసు, న్యాయవ్యవస్ధ వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలను మార్కెట్‌ శక్తులకు అంటే పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారికి అప్పగిస్తే అభివృద్ధి ఫలాలు కిందికి వూటమాదిరి దిగుతాయి. అన్నింటినీ తెల్లవారేసరికి అమలు జరపటం సాధ్యం కాదు గనుక ముందు వున్న వ్యవస్ధల లోపాలను చూపి కించపరచటం, పనికిరానివిగా చిత్రించటం, తరువాత వాటిని క్రమంగా కూల్చివేయటం.

స్వయం సమృద్ధి అన్నది స్వాతంత్య్ర వుద్యమ లక్ష్యం. అందుకే తొలి రోజుల్లో జై జవాన్‌ జైకిసాన్‌ పేరుతో హరిత విప్లవానికి శ్రీ కారం చుట్టి ఒక మేరకు జయప్రదం అయ్యాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తరణ సేవలు, దిగుబడులను పెంచేందుకు సంకర విత్తనాలు, రసాయనికి ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. రైతుల వద్ద తగిన పెట్టుబడులు లేని కారణంగా సబ్సిడీలను అందచేశారు. నయా వుదారవాద విధానాల బాట పట్టగానే సబ్సిడీలు ఇవ్వటం అంటే సోమరితనాన్ని ప్రోత్సహించటమే అని, లక్షిత ప్రయోజనాలకు బదులు ఇతర వాటికి వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికీ పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. దుర్వినియోగం, సద్వినియోగం అన్నది ఎప్పుడూ వుంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకొనే చర్యలను ఎవరూ తప్పు పట్టటం లేదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా ఇంటికే నిప్పుపెట్టుకుంటారా?

వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు రైతాంగ జేబులు నింపేవి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది తెలియని తనమే. అవి మొత్తం సమాజానికి ఇచ్చే రాయితీలు. వుదాహరణకు కాలువల ద్వారా , విద్యుత్‌ మోటార్ల ద్వారా వరిసాగు ఖర్చును పోల్చుకుంటే రెండవది రైతులకు గిట్టుబాటు కాదు. తాము పెట్టిన ఖర్చుకు అనుగుణంగా ఎక్కువ ధరకు అమ్ముతామంటే కొనే వారు వుండరు. అందువలన ప్రభుత్వాలు విద్యుత్‌ రాయితీ ఇస్తున్నాయి. అది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లా లేక ఆ పొలాల్లో పని చేసే కార్మికులకు, బియ్యాన్ని ఆహారంగా వాడే అందరికీ ఇస్తున్నట్లా ? మొత్తం నీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి జనాభా అవసరాలకు సరిపడా పంటలను పండించే విధానాలను అనుసరిస్తే విద్యుత్‌తో వరిసాగు చేసే అవసరం వుండదు, రాయితీలతో పని లేదు. నీరు లేని చోట మరొక పంటను ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు కలిగిస్తే వారిలో అసంతృప్తి వుండదు.

Image result for nizamabad farmers agitation

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, పరిమితంగా అయినా కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రచారం చేసే వారు వీటిని వ్యతిరేకించకపోగా మద్దతు ఇస్తున్నారు. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా ? తెలంగాణాలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదార్లకు మొండిచేయి చూపి, వ్యవసాయం చేయని భూ యజమానులకు నగదు ఇవ్వటం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కదా ! ఆ లోపాన్ని సవరించాలి తప్ప ఆ పేరుతో సాయాన్ని వ్యతిరేకించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈసాయాన్ని సాకుగా చూపి పంటలకు గిట్టుబాటు ధరల ప్రకటన, మార్కెట్‌ మాయాజాలం నుంచి రక్షణ చర్యలకు ప్రభుత్వాలు మంగళం పలుకుతాయని కొందరు చెబుతున్నదానిని కొట్టి పారవేయగలమా, నిప్పులేనిదే పొగ వస్తుందా ?

Image result for nizamabad farmers agitation

రైతాంగానికి వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదు అంటే సాగు పెట్టుబడులు పెరగటం, తగిన ఆదాయం లేకపోవటం తప్ప మరొకటి కాదు. ఒకవైపు అమెరికా వంటి ధనిక దేశాలు ప్రపంచ వాణిజ్య నిబంధనల పరిమితులకు మించి మన రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారంటూ దాడి చేస్తున్నాయి. మరోవైపు మన దేశంలోనే కొంత మంది పెద్దలు ఇప్పటికే మనం ఆహార ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో మిగులు సాధించి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం గనుక వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వనవసరం లేదు, ఎఫ్‌సిఐ, సిసిఐ, మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ సంస్ధల అవసరం ఇంకేమాత్రం లేదని చెబుతున్నారు. అమెరికా వంటిదేశాలు తమ కార్పొరేట్‌ బకాసురుల కోసం మన వ్యవసాయ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు వత్తిడి తెస్తుంటే, మన మేథావులు కొందరు వారి ఏజంట్లుగా రంగంలోకి దిగితే మరికొందరిలో సమగ్రదృష్టి లోపించి వారికి తెలియకుండానే అవే వాదనలను బుర్రలకు ఎక్కించుకుంటున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల వుత్పత్తి గణనీయంగా పెరిగిన మాట నిజం, అయితే అది దేశ అవసరాలకు అనుగుణంగా పెరిగిందా అంటే లేదు. ఒక వైపు మన దేశం 2018 ఆకలి సూచికలో 119 దేశాల జాబితాలో 103వ స్ధానంలో, ఆక్స్‌ఫామ్‌ ఆహార లభ్యత 125 దేశాల సూచికలో 97వ స్ధానంలో వున్నాం అని చెబుతుండగా మనం ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నామంటే మన దగ్గర కొనుగోలు చేయలేక కడుపు మాడ్చుకుంటున్నవారు గణనీయంగా వున్నారన్నది చేదు నిజం. అందుకే పోషకాహార లేమి, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వాటితో వచ్చే జబ్బులతో జేబు గుల్ల చేసుకుంటున్నవారు గణనీయంగా వుంటున్నారు. భరించలేని వైద్య ఖర్చు కూడా రైతాంగాన్ని రుణవూబిలోకి దించే అంశాలలో ఒకటిగా వుందని తెలిసిందే.

మన సినిమా హీరోలు కంటి చూపుతో కాల్చి చంపుతుంటే, నరేంద్రమోడీ సర్కార్‌ అంకెలతో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తోంది. దేన్ని గురించి ప్రశ్నించినా మన దగ్గర అంకెలు సరైనవి కాదు అంటోంది. దాన్ని పక్కన పెడదాం వున్న అంకెల సమాచారం ప్రకారం 1903-08 సంవత్సరాల మధ్య బ్రిటీష్‌వారి పాలనలో మన తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.3కిలోలు. నూతన అర్దిక విధానాలు లేదా సంస్కరణలు ప్రారంభమైన 1991లో 186.2కిలోలు వుండగా పాతిక సంవత్సరాల తరువాత 2016లో 177.7కిలోలుగా వుంది. మనది ప్రజాస్వామ్యం కనుక కమ్యూనిస్టు చైనాతో పోల్చవద్దని కొందరు చెబుతుంటారు. అక్కడ 2015లో తలసరి లభ్యత 450, మన కంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో 200, అమెరికాలో 1,100కిలోలు వుంది. ప్రజాస్వామ్యం అంటే జనాన్ని కడుపు మాడ్చటమా ? ఈ పరిస్దితుల్లో మన వుత్పత్తిని ఇంకా పెంచాలంటే ప్రభుత్వ ప్రోత్సహకాలు లేకుండా సాధ్యమా ?

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002ా03 నుంచి 2008ా09 నాటికి ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018ా19నాటికి 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాంలో 2014ా15లో 0.62శాతం వుండగా అది 0.43శాతానికి పడిపోయింది.నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్ల లోపు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు, చంద్రబాబు నాయుడు దానికి మరో నాలుగువేలు కలిపి పదివేలు చెల్లించేందుకు నిర్ణయించటం తాజా వార్త. ఈ విధంగా సబ్సిడీలను తగ్గిస్తూ రైతుల మీద భారాలు మోపుతుంటే సాగు సాగేదెట్లా ? గత్యంతరం లేని రైతాంగం రోడ్డెక్కకుండా ఎలా వుంటుంది?