Tags

, , , , ,

Image result for seoul peace prize

ఎం కోటేశ్వరరావు

2009 ప్రపంచ శాంతి నోబెల్‌ బహుమతికి తాను అర్హుడిని కాదని నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సిగ్గుపడుతూ గానీ అస్సలు బాగోదని గానీ బహిరంగంగానే చెప్పాడు. పాలస్తీనా అరబ్బులను అణచివేసి వారి మాతృదేశాన్ని ఆక్రమించుకున్న యూదు దురహంకారులు షిమన్‌ పెరెజ్‌, యత్జిక్‌ రబిన్‌, వారి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన యాసర్‌ అరాఫత్‌, ముగ్గురికి కలిపీ 1994 నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. చరిత్రలో ఇంకా ఇలాంటి విపరీత పోకడలతో శాంతిని హరించిన వారిని ఎంపిక చేయటంతో శాంతి బహుమతి అంటే పరిహాసానికి మారుపేరుగా మారింది. అరాఫత్‌ తమకు లంగనంత కాలం అమెరికన్ల దృష్టిలో వుగ్రవాది, కొన్ని పరిస్ధితుల కారణంగా రాజీకి రావటంతో శాంతిదూత అయ్యాడు. అంతెందుకు గుజరాత్‌ మారణకాండ కారణంగా ముఖ్యమంత్రిగా అమెరికా పర్యటనకు తిరస్కరించిన అమెరికన్లు మోడీ ప్రధాని కాగానే వైఖరి మార్చుకున్న విషయం తెలిసిందే. ఇంతకూ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే మన ప్రధాని నరేంద్రమోడీ ఫిబ్రవరి 21న దక్షిణ కొరియాలో ‘ సియోల్‌ శాంతి బహుమతి ‘ అందుకున్నారు.

సియోల్‌ శాంతి బహుమతి లక్ష్యం, దానికి నరేంద్రమోడీని ఎంపిక చేసిన తీరు చూస్తే ఒకింత పరిహాస ప్రాయంగా, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత మాదిరి అనిపిస్తే ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదేమో ! కొరియా ద్వీపకల్పంలో, అదే విధంగా ప్రపంచంలో శాంతి ప్రయత్నాలు, కొరియన్ల ఆకాంక్షలకు అనుగుణంగా 1990లో సియోల్‌ శాంతి బహుమతి ఏర్పాటు చేశారు. 1988లో సియోల్‌లో 24వ ఒలింపిక్స్‌ను జయప్రదంగా నిర్వహించటాన్ని పురస్కరించుకొని రెండు సంవత్సరాల తరువాత దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు కమ్యూనిస్టు వుత్తర కొరియా కూడా హాజరై తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ పూర్వరంగంలో దానికి కొరియా అన కుండా సియోల్‌ అని నామకరణం చేయటం సంకుచితం. రెండు సంవత్సరాలకు ఒకసారి దీనిని అందచేస్తున్నారు. బహుమతి గ్రహీతకు పత్రంతో పాటు రెండులక్షల డాలర్ల నగదు ఇస్తారు. మానవాళి మధ్య శాంతి సామరస్యాల సాధన, దేశాల మధ్య ఐకమత్యం, ప్రపంచ శాంతికి కృషి చేసిన వారిని ఎంపిక చేస్తారు. 2018వ సంవత్సరానికి గాను ప్రపంచమంతటి నుంచి 1300 మంది నుంచి వందకు పైగా పేర్లు ప్రతిపాదనలుగా వచ్చాయి. వారిలో నరేంద్రమోడీ తగిన వ్యక్తిగా ప్రకటించారు.

‘వూహించండి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? సూచన: పాకిస్ధాన్‌ సంబంధితమైంది కాదు ‘ అని ఒక వ్యాఖ్యకు, మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ బహుమతి వార్తకు పెట్టిన శీర్షికలలో వున్నాయి. ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడు. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివృద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివృద్ధికి కృషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించి మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కృషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.

మోడి ఆర్ధిక విధానాలలో భాగంగా (మోడినోమిక్స్‌) పెద్ద నోట్ల రద్దు దేశానికి ఎంతటి నష్టం కలిగించిందో పదే పదే చెప్పనవసరం లేదు. నోట్ల రద్దు సమయంలో తప్ప తరువాత ఇంత వరకు ప్రతిపక్షాలు, ఆర్ధిక నిపుణులు ఎంత గగ్గోలు పెట్టినా దానివలన కలిగిన ప్రయోజనం ఏమిటో మోడీ నోరు విప్పలేదు. ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాల కల్పన అంటే దేశంలో లెక్కలు సరిగా వేయటం లేదు, అందువలన ఎన్నో కల్పించినా ఎన్ని కల్పించామో చెప్పలేకపోతున్నామంటూ తప్పించుకోవటం తెలిసిందే. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ను అనుసరించటం ఇప్పటి వరకు కొన్ని పార్టీలకే పరిమితం అయితే ఇప్పుడు ఆ జబ్బు విదేశాంగశాఖ అధికార గణానికి కూడా అంటుకుందనుకోవాలి.మోడీ విధానాలు మానవాళికి తోడ్పడ్డాయనటం కూడా దానిలో భాగమే. అయినా విపరీతం గాకపోతే నరేంద్రమోడీ ఆర్ధికవేత్త ఎలా అవుతారు?

ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికల ప్రకారం గత ఐదు సంవత్సరాలలో (2014-18) 187 దేశాలలో మన దేశం 135 నుంచి 130వ స్ధానానికి చేరుకుంది. ఐదు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ప్రపంచబ్యాంకు ప్రకటించే సులభతరవాణిజ్య సూచికలో 142 నుంచి 77కు ఎగబాకింది. మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసి దండిగా లాభాలను తరలించేందుకు ఈస్డిండియా కంపెనీ ఏకంగా దేశాన్నే ఆక్రమించి మన మీద బ్రిటీష్‌ రాణీగారి పాలన రుద్ధింది. ఇప్పుడు మనం విదేశాలన్నీ మన మార్కెట్లో సులభంగా వాణిజ్యం చేసుకొని దండిగా లాభాలు తరలించుకపోయేందుకు విదేశీ కంపెనీలను మనమే తలమీద ఎక్కించుకుంటున్నాం. దీన్ని జనం అడ్డుకోకపోతే 77ఏం ఖర్మ ఒకటో నంబరులోకి తీసుకుపోతారు. మోడీ ప్రజాపక్షమే అయితే మానవాభివృద్ది సూచిక అలా ఎగబాకటం లేదేం? పైకి పోయే కొద్దీ పోటీ తీవ్రంగా వుంటుంది. ఇదే కాలంలో చైనా మానవాభివృద్ధి సూచిక 91నుంచి 86కు పెరిగింది. ఒకవైపున ఈ కాలంలోనే మన అభివృద్ధిరేటు చైనా కంటే ఎక్కువ అని వూరూవాడా వూదరగొట్టారే. అతిపేద దేశం బంగ్లా కూడా ఈ కాలంలో తన ర్యాంకును 142 నుంచి 136కు పెంచుకుంది. తీవ్రవాదం, వేర్పాటు వాదంతో చితికిపోయిన పొరుగు దేశం శ్రీలంక మానవాభివృద్ధి సూచికలో 76దిగా వుంది. మనది గొప్ప అని చెప్పుకోవటానికి సంకోచించనవసరం లేదా ? అసమానతలను తగ్గించకుండా మిలీనియం అభివృద్ది లక్ష్యాలను సాధించలేమని, అందుకు కృషి చేస్తామని చెప్పిన దేశాలలో మనది ఒకటి. మోడీగారు తన మహత్తర ఆర్ధిక విధానాలతో దాన్ని ఎక్కడ నిలిపారు? అసమానతల సూచికలో నలభై నాలుగు దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాలలో మనది 39, మన తరువాత బంగ్లాదేశ్‌ వుంది. మన కంటే ఎగువన 36 స్ధానంతో పాకిస్తాన్‌ నిలిచింది. ఎగువ మధ్యతరగతి ఆదాయం వున్న 38 దేశాలలో చైనా 27వ స్ధానంలో వుంది.

ప్రాంతీయంగా చూస్తే దక్షిణాసియా ఎనిమిది దేశాలలో వరుసగా మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్దాన్‌, పాక్‌,నేపాల్‌, భారత్‌, బంగ్లా, భూటాన్‌ వున్నాయి. అసమానతల తగ్గింపుకు కొలబద్దలుగా ఒకటి విద్య, వైద్యం, సామాజిక రక్షణ పధకాలకు చేసే ఖర్చు, రెండు, ఆదాయాన్ని బట్టి పన్ను విధింపు, మూడు, కార్మిక విధానాలు, వేతనాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని మూడు తరగతులుగా పరిగణించి ఇచ్చిన పాయింట్లు, రాంకులు ఎలా వున్నాయో చూద్దాం.

దేశం         ఒకటి పాయింట్లు, ర్యాంకు రెండు పాయింట్లు, ర్యాంకు మూడు పాయింట్లు, ర్యాంకు సాధారణ ర్యాంకు

మాల్దీవులు         0.222, 1          0.336, 7              0.636, 1                      1

శ్రీలంక              0.106, 3          0.604, 2              0.416 ,2                      2

ఆఫ్ఘన్‌               0.061, 7          0.455, 5             0.383, 3                      3

పాకిస్తాన్‌            0.057, 8          0.578, 3             0.241, 4                      4

నేపాల్‌              0.080, 5          0.394, 6             0.221, 5                      5

భారత్‌              0.061, 6         0.607, 1              0.107, 6                      6

బంగ్లాదేశ్‌           0.098, 4         0.464, 4               0.67, 8                       7

భూటాన్‌            0.229, 1         0.131, 8               0.80, 7                      8

మానవాభివృద్ధికి చేయాల్సిన ఖర్చులో దక్షిణాసియాలోనే మన పరిస్ధితి ఇంత అధ్వాన్నంగా వుంటే సియోల్‌ శాంతి బహుమతి కమిటీ ఎంపిక వెనుక ఏమతలబు దాగి వున్నదో కదా ! దక్షిణ కొరియా నిన్న మొన్నటి వరకు వుక్కుబూట్ల పాలనలోనే వుంది. ప్రస్తుతం పేరుకు పౌరపాలనే అయినా మిలిటరీ కనుసన్నలలోనే పని చేస్తుంది. నిత్యం వుత్తర కొరియాను రెచ్చగొడుతూ కొరియా ద్వీపకల్పంలో అశాంతిని రెచ్చగొడుతూ వుభయ కొరియాల విలీనానానికి అడ్డుపడుతున్న విషయం జగద్విదితం. అలాంటి దేశాన్ని మన నరేంద్రమోడీ తోటి ప్రజాస్వామిక వ్యవస్ధ అనీ ప్రాంతీయ, ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నదని కీర్తించటం ఏమిటి? గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండను ప్రస్తావిస్తూ నాడు అక్కడ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీకి ఈ బహుమతి ఇవ్వటం గతంలో ఈ బహుమతి పొందిన పెద్దలను అవమానించటమే అని దక్షిణ కొరియాలోని 26 స్వచ్చంద సంస్ధలు, మానవ హక్కుల బృందాలు మోడీ దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేశాయి. 2002లో మోడీ వుద్ధేశ్యపూర్వకంగానే గుజరాత్‌లో ముస్లింలపై దాడులు జరగటాన్ని అనుమతించారని వెయ్యిమందికి పైగా మరణించినట్లు అవి పేర్కొన్నాయి. 2005లో పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు 2002 గుజరాత్‌ దాడుల్లో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని, 223 మంది అదృశ్యమయ్యారని, మరో రెండున్నరవేల మంది గాయపడ్డారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోడీ, మరికొంత మంది పాత్రపై శిక్షార్హమైన సాక్ష్యాలేవీ లేవని 2017లో గుజరాత్‌ హైకోర్టు పేర్కొన్నది. అయితే ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా అది ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల తరువాత విచారణకు రానున్నది.

దేశంలో ఆర్ధిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయన్నది కాదనలేని సత్యం. ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాము. ఇదే సమయంలో ప్రపంచంలో ఎదుగుదల గిడసబారిపోయిన పిల్లల్లో 30.8శాతం మన దగ్గరే వున్నారని, మన పిల్లలు ప్రతి ఐదుగురిలో ఒకరు వుండాల్సినదాని కంటే బరువు తక్కువగా వున్నట్లు చెప్పుకోవటానికి సిగ్గుపడాలా వద్దా ? విద్య, వైద్యం,సామాజిక భద్రతకు మనం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నామని తెలిసిందే, 2018-19 బడ్జెట్లో వీటికి చేసిన కేటాయింపు 21.6 బిలియన్‌ డాలర్లు. పోషకాహారలేమి వలన మన దేశం ఏటా నష్టపోతున్న మొత్తం 46బిలియన్‌ డాలర్లు అంటే అర్ధం ఏమిటి? నష్టాన్నయినా సహిస్తాంగానీ ఖర్చుమాత్రం పెంచం, ఏమి ఆర్ధికవిధానమిది? తిండి కలిగితే కండ కలదోయ్‌ కండకలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ ఈ సందర్భంగా గుర్తుకు మానరు. మంచి వయస్సులో వున్నపుడు మనదేశంలో ఒక వ్యక్తి సగటున 6.5సంవత్సరాలు పని చేస్తుండగా అదే చైనాలో 20, బ్రెజిల్‌ 16, శ్రీలంకలో 13సంవత్సరాలని, భారత్‌ 195దేశాలలో 158వ స్ధానంలో వుందని లాన్సెట్‌ పత్రిక తాజాగా ప్రకటించింది.

ఆర్ధిక అసమానతల విషయానికి వస్తే పరిస్ధితి ఆందోళనకరంగా మారుతోంది.1980లో ఎగువన వున్న పదిశాతం మంది చేతిలో 31శాతం దేశ సంపదల మీద ఆధిపత్యం వహిస్తుంటే అది 2018నాటికి 55శాతానికి పెరిగింది.దేశ జనాభాలో షెడ్యూల్డు తరగతుల జనాభా 8శాతం కాగా అతి తక్కువ సంపద కలిగిన వారిలో వారి శాతం 45.9గా వుంది. సంపద తక్కువ అంటే జీవిత కాలమూ, ఆరోగ్యమూ, విద్య అన్నీ తక్కువగానే వుంటాయి.ఈ కారణంగానే ఆరోగ్య సమస్యలతో అప్పులపాలై 2011-12 మధ్య ఐదున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి వెళ్లారు. మన వంటి దేశాలలో ప్రజారోగ్యానికి జిడిపిలో ఐదుశాతం ఖర్చు చేయాల్సి వుంటుందని నిపుణులు తేల్చారు.2025నాటికి ఆ స్ధాయికి తమ ఖర్చును పెంచుతామని మన ప్రభుత్వం జాతీయ ఆరోగ్యవిధానంలో ప్రకటించింది. కానీ ఆచరణ ఎక్కడ ? ఇతర అల్పాదాయ దేశాల సగటు 1.4శాతం కాగా 2015లో మన ఖర్చు 1.02శాతం మాత్రమే. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్‌ అన్న గురజాడ గోడు వినేదెవరు? ఐదేండ్ల నరేంద్రమోడీ పాలనా తీరు తెన్నులను గుడ్డిగా సమర్ధించేవారికి సియోల్‌ శాంతి బహుమతి మరొక భజనాంశం. విమర్శనాత్మక దృష్టితో పరిశీలించేవారికి ఒకవైపు నవ్వు మరొకవైపు చిరాకు పుట్టిస్తుంది.