Tags

, , , , , ,

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయి పది రోజులు దాటింది. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 3-4గంటల మధ్య పేలుడు సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని సామాజిక, సాంప్రదాయ మీడియా, రాజకీయ రంగంలో చూస్తే వుగ్రవాదుల దాడులను ఎలా అరికట్టాలనేదాని కంటే యుద్దోన్మాదాన్ని, కొన్ని సామాజిక తరగతుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టటం, పుల్వామా వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందే అంశాలకు ప్రాధాన్యత ఏర్పడటం నిజంగా విచారకరం. వామపక్షాలు మినహా బిజెపి కూటమి, కాంగ్రెస్‌ కూటమి పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో లబ్దిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మీడియాలోని కొంత మంది వుద్రేకాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దాడికి సంబంధించి భద్రతాలోపం ఎక్కడ జరిగిందో ఇంతవరకు వెల్లడి కాలేదు. ఇదేమీ చిన్న విషయం కాదు. గతంలో సైనిక కేంద్రాలపై జరిగితే ఇప్పుడు కదులుతున్న వాహన శ్రేణి లక్ష్యంగా జరిగింది.

దాడి జరిగిన సమయంలో నరేంద్రమోడీ ఒక వీడియో షూటింగ్‌లో మునిగిపోయి మూడుగంటల వరకు దాడిని పట్టించుకోలేదని, సమోసాలు, ఇతర తినుబండారాలు తిన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే ప్రభుత్వం, బిజెపినేతలు దాన్ని తిరస్కరిస్తూ నాలుగు గంటలకే ప్రధాని దాడి వుదంతం మీద సమీక్షలు ప్రారంభించారని ఆ రోజు రాత్రి అసలు భోజనమే చేయలేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. తాము ఎవరు చెప్పింది వాస్తవమో కాదో తేల్చలేకపోయామని అందువలన రెండు పక్షాలు చెప్పిన అంశాలను వార్తలుగా ఇస్తున్నట్లు, ముందు చెప్పిన తీర్పును వెనక్కు తీసుకుంటున్నామని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ఇక్కడొక భట్టిప్రోలు తీర్పు అనే గుంటూరు జిల్లా పిట్టకధ చెప్పాల్సి వుంది. కొండమీద గొడవ జరుగుతుంటే చూద్దామని వెళ్లామని రెండువైపుల వారు వారు కత్తులు ఝళిపిస్తుండగా పెద్దగా వురుములు, మెరుపులు వచ్చాయని ఆ సమయంలో ఎవరు ఎవరిని ముందు కొట్టారో తాము చూడలేకపోయామని పెద్దలు చెప్పారన్నది సారాంశం. ఎన్నికల రోజులు, మోడీ తిరిగి పదవిలోకి వస్తారో రారో ఎందుకు పంచాయతీ అనుకుందేమో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా. దాన్ని కాసేపు పక్కన పెడదాం.

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పుల్వామా దాడి జరిగిన ఎనిమిదవ రోజు అంటే 22వ తేదీన లక్నో నగరంలో భారతీయ మనోగతం అనే అంశంపై నిర్వహించిన సభలో పాల్గన్నారు.ఒక విద్యార్ధి లేచి పుల్వామా దాడికి ముందు తరువాత కూడా అసలు మన భద్రతా సంస్ధలు ఏమి చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నువ్వనుకుంటున్నదే దేశంలోని ప్రతి సామాన్యుడి బుర్రలో మెదులుతోందంటూ వెంటనే బటబటా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చేశారని వార్తలు వచ్చాయి. ఆయన సామాన్యుడేమీ కాదు, నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని కావాలని అనుకుంటున్నవారిలో వున్నట్లు ప్రచారం జరుగుతున్న నేత. ఎనిమిది రోజుల తరువాత బహిరంగంగా ఏడవటం ఏమిటి?

పుల్వామా దాడి జరిగి 24 గంటలు కూడా గడవ లేదు, దేశం దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో వేగంగా ప్రయాణించే తొలి రైలు వందే భారత్‌ను ప్రారంభించే అవకాశాన్ని వదులు కోలేదు. ఆ తరువాత నాలుగు రోజులకు 19వ తేదీ సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ నాయకత్వంలో పెద్ద ప్రతినిధి వర్గం మన దేశ పర్యటనకు వచ్చింది.ప్రాణాలు కోల్పోయిన 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కుటుంబాల కన్నీటి చారికలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి. ఆ దాడికి జైషే మహమ్మద్‌ అనే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద సంస్ధ బాధ్యురాలు. ప్రపంచంలో మత ప్రాతిపదికన పని చేస్తున్న ప్రతి వుగ్రవాద సంస్ధకూ సౌదీ పెట్రో డాలర్లు నిత్యం అందుతుంటాయని తెలుసు.అమెరికా పధకం, సౌదీ ప్రోత్సాహం, సాయం లేకుండా పాకిస్దాన్‌లో వుగ్రవాద ముఠాలు మనుగడ సాగించటం సాధ్యం కాదు. మోడీకి అది తెలియంది కాదు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌(ఎంబిఎస్‌) రాజరిక వారసుడిగా ఎంపికయ్యాడు తప్ప ఇంకా రాజు కాలేదు. రాజ ప్రముఖుడిగా అధికార మర్యాదలు పొందుతున్నాడు. యువరాజు బృందాన్ని మన ప్రధాని నరేంద్రమోడీ రాజభవన్‌లో కలవాల్సి వుండగా ప్రోటోకాల్‌( గౌరవ స్ధాన భేద సూచనం) పక్కన పెట్టి తనకంటే తక్కువ స్థాయి కలిగిన యువరాజును ఆహ్వానించేందుకు ఏకంగా విమానాశ్రయానికి వెళ్లి కౌగిలింతలతో స్వాగతం పలకటం విపరీతపోకడగా దేశ ప్రజలకు కనిపించింది.

నరేంద్రమోడీ అంతకు ముందు కూడా పలువురు విదేశీనేతల పర్యటనల్లో కౌగిలింతలతో సరికొత్త దౌత్యానికి తెరతీశారు. సౌదీ యువరాజు పుల్వామా దాడి జరిగిన తరువాత ముందుగా పాక్‌ పర్యటనకు వెళ్లాడు. మన దేశ పర్యటన, తరువాత చైనా పర్యటన కూడా అంతకు ముందే ఖరారైంది. నిజంగా సౌదీ మనకు అత్యంత ముఖ్యదేశమే అయితే మన దేశంలో ఇంత పెద్ద విషాదం జరిగి, దానికి బాధ్యత పాకిస్ధాన్‌దే అని మన దేశ ప్రకటించిన తరుణంలో రాకుమారుడి పర్యటన వాయిదా వేసుకొని వుండాల్సింది. అయితే నరేంద్రమోడీయే 24గంటలు కూడా గడవక ముందే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావటం, అభిలపక్ష సభను బహిష్కరించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గంటున్నపుడు సౌదీ యువరాజు ఎందుకు పర్యటన వాయిదా వేసుకోవాలంటే సమాధానం వుండదు. కారణం చెప్పకపోయినా పుల్వామా వుదంతం కారణంగానే పాక్‌ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకొని మన దేశానికి ముందనుకున్నట్లుగానే వచ్చాడు. అతగాడికి స్వాగతం పలకటానికి పాకిస్ధాన్‌, మన దేశం రెండూ పోటీ పడ్డాయి. రావల్పిండిలో 21తుపాకులు, జెట్‌ ఫైటర్‌తో ఘనస్వాగతం పలికారు, బంగారంతో చేసిన తుపాకిని బహుమతిగా ఇచ్చారు. మన దేశంలో ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ కౌగిలింతలతో స్వాగతం పలికాడు. చైనాలో అధ్యక్షుడు జింపింగ్‌తో కలసి ఫొటో దిగాడు.

జింపింగ్‌ సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. చైనా తన వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకొనేందుకు రోడ్‌ మరియు బెల్ట్‌ పేరుతో ఒక పెద్ధ కార్యాచరణ తలపెట్టింది. దాన్నే కొందరు చైనా సిల్క్‌ మార్గం అని పిలుస్తున్నారు. చైనా పురాతన కాలంలో తన సిల్కును వివిధ దేశాలకు తీసుకుపోయి విక్రయించిన మార్గాన్ని అలా పిలిచారు. అయితే అది ఇప్పుడు అంతగా అతకదు. నిజానికి చైనా ఒక మార్గాన్నే తలపెట్టలేదు. చిన్నా పెద్దవి ఆరు మార్గాలు లేదా కారిడార్లను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. దానిలో అనేక దేశాలు చేరి ప్రయోజనం పొందేందుకు ముందుకు వస్తున్నాయి. వాటిలో సౌదీ అరేబియా ఒకటి. ప్రస్తుతం సౌదీ చేసుకుంటున్న దిగుమతులలో చైనా వాటా 19శాతం వుంది. తరువాత అమెరికా 8, జర్మనీ 7.5 శాతాలతో వుండగా 5.2శాతంతో మనది ఆరవ స్ధానం. పాకిస్ధాన్‌ది 0.34శాతం. అందువలన చైనా అధ్యక్షుడు సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడో వేరే చెప్పనవసం లేదు. పాకిస్ధాన్‌కు సౌదీ అవసరం ఎంత వుందో సౌదీకి పాక్‌ అవసరం కూడా అంతే వుంది. మూడు బిలియన్‌ డాలర్ల నగదు అంద చేసేందుకు, మూడు సంవత్సరాల పాటు చమురు కొనుగోలు చెల్లింపులను వాయిదా వేసేందుకు జనవరిలోనే సౌదీ అంగీకరించింది. అందువలన ఇమ్రాన్‌ ఖాన్‌ ఘనస్వాగతాలు పలకటాన్ని అర్ధం చేసుకోవచ్చు. మన ప్రధానికి ఏమైంది. ఏమి సాధించాలని గౌరవ మర్యాదలను పక్కన పెట్టినట్లు ?నరేంద్రమోడీ అంటే రాజకీయంగా, ఇతరంగా అందరికీ ఆమోదయోగ్యుడు కాదన్నది తెలిసిందే. అయినా ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి మన దేశ ప్రధాని అయ్యారు. అలాంటి పదవిలో వున్నవారు నియమ లేదా వ్రతభంగం కావించటం అంటే అది దేశం మొత్తానికి వర్తిస్తుంది. దాడిని అనేక దేశాల మాదిరి ఖండించింది తప్ప పాక్‌ గురించి సౌదీ ఒక్క మాట మాట్లాడని పూర్వరంగంలో పాకిస్దాన్‌కు మనకంటే దగ్గరి స్నేహితుడైన సౌదీ రాజ ప్రతినిధికి నిబంధనలను పక్కన పెట్టి స్వాగతం పలకటం మింగుడుపడని అంశమే. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

వుగ్రవాది అంటే అందరికీ తెలిసింది బిన్‌ లాడెన్‌. అతగాడిని వుపయోగించుకుంది అమెరికా, పెంచి పోషించింది సౌదీ సర్కార్‌. చివరకు ఏకు మేకైనట్లు, గురువుకు పంగనామాలు పెట్టినట్లు తనను పెంచి పోషించిన అమెరికాలోనే న్యూయార్క్‌ పపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి సూత్రధారి అయ్యాడు. సౌదీ వుగ్రవాదులతోనే ఆపని చేయించాడు. అమెరికాకు సౌదీ అనుంగు దేశం అని తెలిసిందే. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కుట్రలో సౌదీ పెద్ద భాగస్వామి. అలాంటి సౌదీ గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ 2015లో రాసిన ‘టైమ్‌ టు గెట్‌ టఫ్‌ ‘( కఠినంగా వుండాల్సిన సమయం) పుస్తకంలో ప్రపంచంలో వుగ్రవాదానికి అత్యధిక నిధులు అందచేసే దేశం సౌదీ అని పేర్కొన్నాడు. బరాక్‌ ఒబామా సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్‌ 2009లో రాసిన ఒక మెమోలో ప్రపంచవ్యాపితంగా వున్న సున్నీ వుగ్రవాద ముఠాలకు ఇప్పటికీ సౌదీ కీలకమైన ఆర్ధిక మద్దతుదారుగా వుంది. ఆల్‌ఖ్వైదా, తాలిబాన్‌, లష్కరే తోయబా ఇతర సంస్దలు ప్రతి ఏటా కోట్లాది డాలర్లను సౌదీ ద్వారా పొందుతున్నాయి అని పేర్కొన్నారు. వుగ్రవాదులకు నిధులు అందచేసే దేశాలలో సౌదీ అరేబియాను తీవ్ర ముప్పు వున్న దేశాల జాబితాలో చేర్చాలని జనవరిలోనే ఐరోపా యూనియన్‌ నిర్ణయించింది.

మన ప్రధాని నరేంద్రమోడీకి ఏ సమయంలో పెద్ద నోట్ల రద్దు ఆలోచన వచ్చిందోగానీ జిందాతిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా వుగ్రవాదంతో సహా అన్ని సమస్యలను పెద్ద నోట్ల రద్దుతో పరిష్కరించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాన్ని మన మెజారిటీ జనం గుడ్డిగా నమ్మిన విషయం తెలిసిందే.నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు, మన ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరిగింది తప్ప వుగ్రవాదులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మన దేశానికిి పాకిస్దాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు వుంటే, దానిలో వాస్తవాధీన రేఖతో సహా కాశ్మీర్‌లో 1,225కిమీ, పంజాబ్‌తో 553కిమీ వుంది.( పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దు 744కిలోమీటర్లు వుంది.) ఒక్క కాశ్మీరులోనే అన్ని విభాగాలకు సంబంధించి దాదాపు ఏడులక్షల భద్రతా సిబ్బంది వున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల నడుములు విరిచేసి వుంటే నిజానికి అక్కడ అంత మంది అవసరం వుండదు. అయినా యధావిధిగా కొనసాగుతున్నారంటే నరేంద్రమోడీ నోట్ల రద్దుకు జనాన్ని తప్పుదారి పట్టించినట్లే కదా !

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్ధాన్‌ను మరింత బలహీనపరచాలని మనం ప్రయత్నిస్తుంటే సౌదీ ఆర్ధికంగా ఆదుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో పూర్వపు సోవియట్‌ పలుకుబడి పెరగకుండా చూసేందుకు, ఇరాన్‌, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలలో తన రాజకీయ వ్యతిరేకులను దెబ్బతీసేందుకు తాలిబాన్లు, ఇతర అనేక పేర్లతో మత తీవ్రవాదుల తయారీని అమెరికా ఎంచుకున్నది. దానికి కార్యస్ధలం పాకిస్దాన్‌ అయితే, గణనీయ మొత్తంలో నిధులు సమకూర్చింది సౌదీ అరేబియా, ఆయుధాలు, మందుగుండువంటివి అందించింది అమెరికా, ఐరోపాధనిక దేశాలు. ఈ త్రయం ఇస్లాంలో మెజారిటీగా వున్న సున్నీ తెగవారిని ఎంచుకుంటే వీరి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్‌ షియా, ఇతర తెగలను ఎంచుకొని శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్లలో తాలిబాన్లు పెద్ద శక్తిగా వున్నారు. మారిన రాజకీయపరిణామాలలో ఆఫ్ఘన్‌ తాలిబాన్లు అమెరికాకు ఏకు మేకయ్యారు. వారిని అదుపు చేయనందుకు అమెరికన్లు పాకిస్దాన్‌పై ఆగ్రహంతో వున్నారు. రెండవది మన దేశ మార్కెట్‌ను ఆక్రమించటం అసలు లక్ష్యం గనుక మనలను సంతుష్టీకరించేందుకు పాకిస్దాన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని ఆపినట్లు ప్రకటించారు. అది బెదిరింపు తప్ప వేరు కాదు. తాలిబాన్లను అణచివేయటంలో విఫలమైన అమెరికా తన తట్టాబుట్ట సర్దుకుపోతామని చెబుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే కతార్‌లో జరిపే చర్చలకు తాలిబాన్లను రప్పించే బాధ్యతను పాకిస్ధాన్‌కు అప్పగించారు. భవిష్యత్‌లో ఒక వేళనిజంగానే అమెరికన్లు నిష్క్రమిస్తే ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్‌ అనుకూల తాలిబాన్ల ప్రభావాన్ని తగ్గించాలంటే అక్కడి, పాకిస్దాన్‌లోని కిరాయిమూకల అవసరం వుంటుంది. ఇదే సమయంలో ఇరాన్‌-పాక్‌ వైరుధ్యాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. పాక్‌ మద్దతు వున్న తాలిబాన్లు ఇరాన్‌కు వ్యతిరేకం. అందుకు ఇరాన్‌లోని సిస్టాన్‌-బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాక్‌, ఆఫ్ఘన్‌వైపు నుంచి ప్రవేశించే వుగ్రవాదులు తరచూ దాడులు జరుపుతుంటారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు మరణించారు. అందువలన అనివార్యంగా పాక్‌తో సౌదీ అరేబియా సంబంధాలను కొనసాగించకతప్పదు. అమెరికా పధకంలో భాగంగా ఎమెన్‌పై ఇప్పటికే సౌదీ అరేబియా దాడులు జరుపుతోంది. పాకిస్ధాన్‌ను అదుపులోకి తెచ్చుకోవటం అమెరికన్లకు చిటికెలో పని.

ప్రోటోకోల్‌ను పక్కన పెట్టి కౌగిలించుకున్నంత మాత్రాన పాకిస్దాన్‌ను వదలి సౌదీ మనకు మిత్రదేశంగా మారే అవకాశాలు ఏమాత్రం లేవు. అంతదానికి అలాంటి మర్యాదలెందుకన్నది ప్రశ్న. ప్రపంచ రాజకీయాలు, మిలిటరీ వ్యూహాలలో పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతానికి మొదటి ప్రపంచ యుద్దం నుంచీ ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాంతంలో అపార చమురు, ఇతర ఖనిజ సంపదలతో పాటు మిలిటరీ రీత్యాకీలక ప్రాంతంగా వుండటమే కారణం. ఈ ప్రాంతాన్ని అదుపులో పెట్టుకొనేందుకు అమెరికన్లు చేయని దుర్మార్గం లేదు. సౌదీ ప్రభుత్వం లేదా అక్కడి ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలు భారత్‌, పాక్‌, చైనాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వాటి ప్రయోజనాలకే పెద్ద పీట. ఈ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా చేస్తోంది. తన వ్యూహాత్మక భాగస్వామ్యం, పెట్టుబడులకు అది ఎనిమిది దేశాలను ఎంచుకుంటే వాటిలో మనది ఒకటి. అన్ని దేశాలతో ఒకే విధంగా లేదు. దానిలో భాగమే పాక్‌తో ప్రత్యేక అనుబంధం. అందుకే కాశ్మీర్‌ సమస్యలో దాని మద్దతు పాకిస్దాన్‌కే వుంది. ముప్పైమూడు సంవత్సరాల సౌదీ రాకుమారుడిని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే నరేంద్రమోడీ గట్టిగా కౌగిలించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు.