Tags

, , , ,

Image result for surgical strikes by india

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన పన్నెండవ రోజు మన వాయుసేన ఆక్రమిత్‌ కాశ్మీర్‌లో 19నిమిషాలలో మూడు చోట్ల 12 మిరేజ్‌ జట్‌ ఫైటర్లతో నిర్ణీత లక్ష్యాలపై ఆకస్మిక (సర్జికల్‌) దాడి చేసింది. తెల్లవారు ఝామున మూడు నాలుగు గంటల మధ్య జరిపిన ఈ దాడిలో 200 నుంచి 300 వరకు మరణించినట్లు, అనేక వుగ్రవాద స్ధావరాలను ధ్వంసం చేసినట్లు మన అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన మాట నిజమే కాని తమకు ఎలాంటి ఆస్ధి,ప్రాణ నష్టం జరగలేదని పాక్‌ ప్రకటించింది. ఒక పౌరుడు గాయపడినట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఇది తొలి వార్తల సారాంశం.

శత్రుదేశాల మధ్య దాడులు, యుద్ధాలు జరిగినపుడు ముందుగా బలయ్యేది నిజం. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు అంత పెద్ద సంఖ్యలో వుగ్రవాదులు మరణించారా, వారిలో పౌరులు లేరా అని ఎవరైనా సందేహిస్తే దేశద్రోహుల కింద జమకట్టేస్తారు. పుల్వామా దాడికి పాల్పడిన వారి మీద, ప్రేరేపించిన వారి మీద చర్య తీసుకోవాలనటంలో ఎవరికీ ఎలాంటి శషభిషలు లేవు. ఎవరూ మరొకరి దేశభక్తిని ప్రశ్నించాల్సిన పని లేదు. ఒక వుదంతం మీద సందేహాలు వ్యక్తం చేయటాన్ని సహించకుండా అసలు ప్రశ్నించటమే తప్పన్నట్లు ప్రవర్తించేవారితోనే పేచీ. మంగళవారం తెల్లవారు ఝామున జరిగిన దాడి గురించి కాసేపు పక్కన పెడదాం.

2016సెప్టెంబరు 18న యురి సైనిక కేంద్రంపై జైషే మహమ్మద్‌ వుగ్రవాదులు జరిపిన దాడిలో 19మంది సైనికులు మరణించారు. దానికి ప్రతిగా పదకొండు రోజుల తరువాత మన బలగాలు సర్జికల్‌ దాడి జరిపాయి. దానిలో 35 నుంచి 70 మంది వుగ్రవాదులు మరణించినట్లు సైనికవర్గాల సమాచారం మేర మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సర్జికల్‌ దాడి అసలు జరగలేదని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే సరిహద్దులో జరిగిన స్వల్పపోరులో తమ సైనికులు ఇద్దరు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని, ఇదే సమయంలో ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, ఒకరిని బందీగా పట్టుకున్నట్లు పాక్‌ చెప్పుకుంది. ఈ వుదంతం జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచినా వాస్తవం ఏమిటో ఇప్పటికీ తెలియదు. దాడి వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసినదే.

ఈ వుదంతం తరువాత 2016నవంబరు 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించి మొత్తం దేశం మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇతర అంశాలతో పాటు నాడు చెప్పిందేమిటంటే వుగ్రవాదులకు నగదు అందకుండా అరికట్టటం అని కూడా ప్రధాని చెప్పిందాన్ని దేశమంతా నిజమే అని నమ్మిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వలన కలిగిన ప్రయోజనం ఏమిటో ఇంతవరకు రద్దు చేసిన మోడీ అధికారికంగా ప్రకటించలేదు కనుక దాన్ని కూడా సర్జికల్‌ స్ట్రైక్‌ అనాల్సి వచ్చింది. వుగ్రవాదుల పీచమణచేందుకు తీసుకున్న ఈ చర్యతో ఫలితాలు వచ్చాయంటూ అధికార పార్టీ పెద్దలు పెద్దఎత్తున ప్రచారం చేసిన విషయం గుర్తు చేయటం దేశ ద్రోహం కాదేమో !

దారుణమైన వుదంతాలు జరిగినపుడు దేశ పౌరుల్లో ఆవేశకావేషాలు తలెత్తటం, దెబ్బకు దెబ్బతీయాలన్న వుద్రేకం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. వుగ్రవాదం మనకు కొత్త కాదు, ఈశాన్య రాష్ట్రాలలో మొదలై తరువాత కాశ్మీర్‌, పంజాబ్‌కు వ్యాపించింది. నక్సల్స్‌ తీవ్రవాదం గురించి తెలిసిందే.దాదాపు ఆరుదశాబ్దాల చరిత్ర, అనుభవం వుంది. అలాగే సర్జికల్‌ దాడులూ కొత్త కాదని మనవి. మయన్మార్‌లో శిబిరాలను ఏర్పాటు చేసుకున్న ఈశాన్య రాష్ట్రాల వుగ్రవాదులు మన భూభాగాలపై దాడులు చేసి మయన్మార్‌ పారిపోయే వారు. పెద్ద వుదంతాలు జరిగినపుడు గుట్టుచప్పుడు కాకుండా మన సైనికులు సర్జికల్‌ దాడులు జరిపి తిరిగి వచ్చేవారు. బయటకు ప్రకటించేవారే కాదు. ఇప్పుడు ప్రతిదాన్నీ ఓటుగా మార్చుకోవాలన్న ప్రచారకండూతి వైరస్‌ సోకిన కారణంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగానే గతంలో జరిగిన సర్జికల్‌ దాడికి ఆధారాలు ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తాజాగా జరిగిన దాడిని గురించి తెలిసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి బదులు రాజస్దాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గనిదాడి గురించి మాట్లాడటాన్ని ఏమనుకోవాలి.

మంగళవారం నాటి దాడి నిర్దిష్ట సమాచారంతో నిర్ధిష్ట వుగ్ర స్దావరాలపై జరిగిందని చెబుతున్నారు. మన వేగుల వ్యవస్ధ సమర్ధతను అనుమానించాల్సిన అవసరం లేదు. అదే వ్యవస్ధ వైఫల్యాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. దాని గురించి అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. సర్జికల్‌ దాడులను సమర్ధవంతంగా నిర్వహించినపుడు వుగ్రవాద కదలికలను, సైనిక స్ధావరాల మీద, ప్రయాణిస్తున్న పారామిలిటరీ బలగాల మీద జరిగిన దాడులను ఎలా పసిగట్టలేకపోయారు. ఇదే ప్రశ్నను వుత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను ఒక విద్యార్ది అడిగితే ఇదే దేశసామాన్యులందరి మదిలో వుందంటూ బటబటా ఏడ్చినట్లు వార్తలు వచ్చాయి.

Image result for surgical strike  2019

పొలాన్ని దున్నకుండా, నేలను ఆరోగ్యంగా వుంచకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. వుగ్రవాదం, వుగ్రవాదులు కూడా అలాంటి వారే. ఆ పిచ్చిమొక్కలను మొలవకుండా చూడాలి. ఒకసారి పీకివేస్తే తిరిగి మొలకెత్తే పిచ్చి, కలుపు మొక్కల వంటివే అవి. జమ్మూ కాశ్మీర్‌లో వుగ్రవాద చర్యలకు సంబంధించి 2014 నుంచి 2019 ఫిబ్రవరి 15వరకు దక్షిణాసియా వుగ్రవాద పోర్టల్‌ క్రోడీకరించిన సమాచార వివరాలు ఇలా వున్నాయి.2019 ఫిబ్రవరి 15వరకు.

సంవత్సరం హత్యోదంతాలు పౌరులు భద్రతాసిబ్బంది  వుగ్రవాదులు మొత్తం మరణాలు

2014            91        28         47            114          189

2015            86        19         41            115          175

2016           112        14         88            165          267

2017           163         54        83             220          357

2018           204         86        95              270         451

2019             16          2         43               29           74

మొత్తం           672        203      397             913         1513

ఈ పట్టికను చూసినపుడు మోడీ పాలనా కాలంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతకు ముందు సంవత్సరాలలో ఈ సంఖ్యలు ఇంకా చాలా ఎక్కువగా వుండి యుపిఏ పాలన చివరి సంవత్సరాలలో గణనీయంగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్‌స్రైక్‌లు, సామాజిక మీడియాలో కొన్ని తరగతుల మీద వ్యాపింప చేస్తున్న విద్వేష ప్రచారం, శాంతి భద్రతల సమస్యగా చూసి భద్రతా దళాలకు విచక్షణారహిత అధికారాలు ఇస్తే వుగ్రవాదం తగ్గుతుందన్నది ఒక తప్పుడు అభిప్రాయంగా రుజువు అవుతున్నది. ముందే చెప్పినట్లు వుగ్రవాదులనే పిచ్చి మ్కొలు పెరగకుండా, అదుపు తప్పి పోకుండా వుండాలంటే అందుకు అనువైన పరిస్ధితులను మార్చాలి తప్ప ఎంత పెద్ద కలుపు నివారణ మందులు వాడినా ఇతర కొత్త సమస్యలు తలెత్తుతాయి తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. ఇది ఒక్క కాశ్మీరు అంశం కాదు, మన దేశ, ప్రపంచ అనుభవం. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల పౌరులను విశ్వాసంలోకి తీసుకొని వారిలో చైతన్యం కలిగించి వుగ్రవాద వ్యతిరేకపోరులో వారిని కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం లేదా ?