Tags

, ,

Image result for article 370 and terrorism

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి పర్యవసానాలతో మీడియాలో చర్చలు, మిలిటరీ చర్యలు, పరిస్ధితిని ఓట్లు రాబట్టుకొనేందుకు వినియోగించుకొనే రాజకీయ ఎత్తుగడలను దేశం గమనిస్తోంది. మీడియా చర్చలు, రాతల్లో అనేక అంశాలను వుగ్రవాదానికి ముడిపెడుతున్నారు. దీనిలో రెండు రకాలు ప్రచారానికి ప్రభావితమైన వారు ఒక తరగతి అయితే వుద్ధేశ్యపూర్వకంగా లంకె పెట్టేవారు మరి కొందరు. వాటిలో ప్రధానమైవి అసలు జమ్మూ కాశ్మీర్‌కు 370, 35ఏ ఆర్టికల్స్‌ వంటి వాటిని వర్తింప చేసినందునే వుగ్రవాదం తలెత్తింది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మిలిటరీకి తొలిసారిగా పూర్తి అధికారాలను ఇచ్చింది, వాటిని సడలించకుండా కొనసాగించి అంతు తేల్చేయాలి. వుగ్రవాదం మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించకోకూడదు. జైషే మహమ్మద్‌ వుగ్రవాద సంస్ధ నేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అడ్డుపడుతోంది. ఇలా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఒక విశ్లేషణలో వివరించటం సాధ్యం కాదు గనుక ఆర్టికల్‌ 370, దాని సంబంధిత అంశాలను చూద్దాం. విద్వేషాలు, వుద్రేకాలును తగ్గించుకొని భిన్న కోణాలను పరిశీలించటం అవసరం. ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చటమే అవుతుంది. ఎంతకైనా తెగించి అనేక రాజ్యాంగ వ్యవస్ధలను దెబ్బతీయటం, నీరుగార్చటం, స్వప్రయోజనాలకు వుపయోగించుకుంటున్న స్ధితి. సదరు ఆర్టికల్‌ను రద్దు చేయటం అంటే దాని వుద్ధేశ్యాలను మరొక రూపంలో పరిరక్షించాలా వద్దా? రద్దు చేయాలనే వారు ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాటి ప్రతిపాదనలు చేసినట్లు కనిపించదు. ప్రత్యామ్నాయం అదీకూడా కాశ్మీర్‌ను రక్షించుకోవటం కోసం అంతకంటే మెరుగైనదిగా వుంటేనే సమ్మతం అవుతుంది. ఆ దిశగా సంపూర్ణ మెజారిటీ వున్న బిజెపి ఎలాంటి చర్యలూ చేపట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం నిరంతరం ప్రయత్నిస్తున్నది. కాశ్మీర్‌ సమస్యపై నిజంగా చిత్తశుద్ది వుంటే దాని మీద ఒక సమగ్ర శ్వేతపత్రాన్ని జనం ముందు పెట్టి మంచి చెడ్డలను తెలుసుకొనేందుకు అవకాశమివ్వాలి. అలాగాక నిరంకుశంగా ఆర్టికల్‌ రద్దుకు పూనుకుంటే అది అంతటితో ఆగదు. ఒక్క బాబరీ మసీదే కాదు ఇంకా అలాంటి అనేక మసీదులను కూల్చాల్సి వుందని సంఘపరివారం చెబుతున్నట్లుగా రాజ్యాంగంలోని అనేక అంశాల మీద విబేధాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వుదాహరణకు తెలుగు రాష్ట్రాలలో వున్న 1-70 గిరిజన హక్కుల రక్షణ చట్టం తమకు సమ్మతం కాదని అనేక మంది డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఎన్నో !

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి దేశరాజ్యాంగానికి లోబడి కొన్ని అంశాలపై స్వయం ప్రతిపత్తి అధికారమిచ్చే 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలన్నది బిజెపి ఎన్నికల వాగ్దానం. ఆ పార్టీ మాతృసంస్ధ అయిన జనసంఘం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. మధ్యలో అత్యవసర పరిస్ధితి అనంతరం జనసంఘాన్ని రద్దు చేసి జనతా పార్టీలో విలీనం చేసిన సమయంలో మినహా తిరిగి బిజెపి పేరుతో కొత్త దుకాణాన్ని తెరిచినప్పటి నుంచి పాత వ్యతిరేకతను కొనసాగిస్తోంది. ఈశక్తులతో పాటు అంబేద్కర్‌, మరికొందరు కూడా 370 ఆర్టికల్‌ను వ్యతిరేకించారు. ఇది దాస్తే దాగేది కాదు. జనసంఘం, బిజెపి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన దాని రాజకీయ విభాగాలే అన్నది ముందుగా గ్రహించాలి. అలాగే సదరు ఆర్టికల్‌ను కొనసాగించాలని కోరే పార్టీలు అంతకంటే ఎక్కువగా వున్నాయి.

‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి.

Image result for article 370 and terrorism

ఇలాంటి సంస్ధ ఏర్పాటు చేసిన బిజెపిపైకి ఏమి చెప్పినప్పటికీ దాని చర్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే వుంటాయన్నది వేరే చెప్పనవసరం లేదు. అందుకోసం జనాన్ని మతపరంగా చీల్చేందుకు ప్రతిదానికి ఒకసాకును వెతుక్కుంటుంది.కాశ్మీర్‌కు 370 ఆర్టికల్‌ నుంచి కూడా అది సాధించదలచిన ప్రయోజనమదే. అందుకుగాను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు, దాని భావజాలానికి ప్రభావితమైన వ్యక్తులు ఎంతకైనా తెగించి చేయాల్సిందంతా చేస్తాయి. ఆర్టికల్‌ 370 రాజ్యాంగబద్దమైనది కనుక దాన్ని సవాలు చేసే అవకాశం లేదు. అందువలన దాని సంబంధితమైన ఆర్టికల్‌ 35ఏ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ ఢిల్లీకి చెందిన వుయ్‌ ద సిటిజన్స్‌ అనే ఒక సంస్ధ మరికొందరు వ్యక్తులుగా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాని మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నది. ఇలాంటి ప్రజాసంబంధమైన అంశాలలో ఎవరైనా తమను కూడా ప్రతివాదులుగా చేర్చమని కోర్టును అభ్యర్దించి చేరేందుకు అవకాశం వుంది. ఆ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) చేరింది. ఇలాగే మరికొన్ని సంస్ధలు, వ్యక్తులు ఈ కేసులో ప్రతివాదులుగా చేరి జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటాన్ని కూడా సవాలు చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియా, సామాజిక మీడియాలో లేవనెత్తిన కొన్ని అంశాల తీరుతెన్నులు, వాస్తవ అవాస్తవాలను చూద్దాం.

ఆర్టికల్‌ 35ఏ ఆర్టికల్‌ 370లో భాగమా కాదా ?

ఆర్టికల్‌ 370 గురించి ప్రతిపాదనలు వచ్చినపుడు దాని అంశాలపై వివాదం అప్పుడే తలెత్తింది. రాజ్యాంగరచన కమిటీ అధ్యక్షుడిగా, ప్రధాన రచయితగా వున్న బిఆర్‌ అంబేద్కర్‌ సదరు ఆర్టికల్‌ను రూపొందించేందుకు తిరస్కరించారు. దాంతో కాశ్మీరు రాజు హరిసింగ్‌ వద్ద దివానుగా పనిచేసి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ ప్రభుత్వంలో పోర్టుపోలియో లేని మంత్రిగా పని చేసిన గోపాలస్వామి అయ్యంగార్‌ రూపొందించి రాజ్యాంగంలో చేర్చే ప్రతిపాదన చేసి ఆమోదం పొందారు. ఈ ఆర్టికల్‌ రాజ్యాంగమౌలిక స్వరూపంలో భాగమే. ఒక వేళ 35ఏ ఆర్టికల్‌ను కోర్టు గనుక కొట్టివేస్తే అది దాని ఒక్కదానికే పరిమితం కాదు, ఆర్టికల్‌ 370తో పాటు 1950 నుంచి ఇప్పటి వరకు చేసిన అనేక అంశాల చెల్లుబాటు సమస్య తలెత్తుతుంది.అందువలన దాన్ని సవాలు చేయటం వెనుక వున్న ఎత్తుగడను అర్ధం చేసుకోవటం కష్టం కాదు. అనేక మంది నిపుణులు రెండు ఆర్టికల్స్‌ను విడదీసి చూడలేమని చెప్పారు. సమస్య సుప్రీం కోర్టు ముందు వుంది కనుక ఎవరి వాదన, అభిప్రాయాలు సరైనవో స్పష్టం కానుంది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని శక్తులు అంగీకరిస్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి పిల్లల్ని కనేవయస్సు వున్న మహిళలు ప్రవేశించటాన్ని నిషేధించే ఆంక్షలను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధలు వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోర్టు విచారణ ఒకరోజులో జరిగింది కాదు, రహస్యమైంది కాదు. ఏ రోజూ కోర్టు కేసులో ప్రతివాదిగా చేరని శక్తులు తీర్పును అమలు జరపకూడదని వత్తిడి తేవటం తెలిసిందే. శనిసింగనాపూర్‌లోని శని ఆలయంలో మహిళలకు ఆలయ ప్రవేశంపై వున్న ఆంక్షలను కోర్టు కొట్టివేసినపుడు వీరు నోరు మెదపలేదు. శబరిమల కోర్టు తీర్పును అంగీకరించని, వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన సంఘపరివార్‌ శక్తులు అంతవరకే పరిమితం అవుతాయా ? ఎవరు చెప్పగలరు?

ఆర్టికల్‌ 35ఏ రద్దు వెనుక దానిని వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయుల లక్ష్యం ఏమిటి?

ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు ఎక్కువగా వున్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేశారు. వెంటనే ఇజ్రాయెల్‌ తనకు కేటాయించిన భాగానికి పరిమితం కాకుండా పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్‌ నుంచి యూదులను రప్పించి పాలస్తీనా ప్రాంతాలలో అరబ్బులను మైనారిటీలుగా మార్చి వాటి స్వభావాన్నే మార్చేందుకు పూనుకున్న విషయాన్ని మనం చూశాము. కాశ్మీరులో కూడా అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి హిందువులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా, సంస్కృతి, సంప్రదాయాలను మార్చివేయాలని అనేక మంది బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే.

అసలు ఆర్టికల్‌ 35ఏ ప్రధాన అంశాలు ఏమిటి ?

1956 నవంబరు 17న ఆమోదించిన ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ ప్రకారం నిర్వచించిన శాశ్వత నివాసి(పర్మనెంటు రెసిడెంట్‌-పిఆర్‌)కి చెప్పిన వివరణ ప్రకారం 1954 మే 14వరకు వున్న రాష్ట్ర అంశాల ప్రకారం లేదా పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివాసిగా వున్న వారు లేదా చట్టబద్దంగా స్ధిర ఆస్తులను సంపాదించుకున్నవారు గానీ జమ్మూ కాశ్మీరులో శాశ్వత నివాసులుగా పరిగణించబడతారు. శాశ్వత నివాసి నిర్వచనాన్ని మార్చే హక్కు ఆ రాష్ట్ర శాసనసభకు మాత్రమే వుంది, దాన్ని కూడా మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించి వుండాలి. ఆ రాష్ట్ర రాజ్యాంగం అంగీకరించిన విచక్షణాధికారాల ప్రకారం అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే చట్టసభలకు పోటీ చేసేందుకు, ఓటు హక్కుకు అర్హులు. శాశ్వత నివాసులు కాని వారు స్వంత ఆస్ధులు కలిగి వుండటానికి,రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగం పొందటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, లేదా ప్రభుత్వ నిధులు పొందిన వృత్తి విద్యాకాలేజీలలో చేరటానికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం-భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పంద అవగాహన ప్రకారం ఈ రక్షణలు కల్పించారు.

ఇతర రాష్ట్రాలకు లేని ఈ ప్రత్యేక హక్కు జమ్మూ కాశ్మీర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

పైన పేర్కొన్న ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ భారత్‌లోని ఒక రాష్ట్రంగా కాశ్మీర్‌కు వర్తిస్తుంది. అది 1957 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఇలాంటిది మరొక రాష్ట్రానికి లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కాశ్మీర్‌లో భారత పార్లమెంట్‌,కేంద్ర ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే వర్తిస్తాయి. ఇతర అంశాలన్నింటి విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో పేర్కొనని వాటిలో రాష్ట్ర శాసనసభ అనుమతి పొందిన ప్రభుత్వానికి మాత్రమే దఖలు పడతాయి. అంటే ఏ రాష్ట్రానికి లేని స్వయంప్రతిపత్తి దీనికి రాజ్యాంగం ఇచ్చింది. దానిలో భాగంగానే 1965 వరకు రాష్ట్ర గవర్నర్‌ను సదర్‌ ఏ రియాసత్‌ అని ముఖ్యమంత్రిని ప్రధాని అని పిలిచారు. దీనికి వున్న చారిత్రక నేపధ్యాన్ని దాచిపెట్టి ఇలాంటి అంశాలపై బిజెపి వంటి కొన్ని శక్తులు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రెండుగా విభజించి పాకిస్ధాన్‌ను ఏర్పాటు చేశారు.ఆ సమయంలో కాశ్మీర్‌ బ్రిటీష్‌ పాలనలో ఒక సంస్ధానంగా వుంది. హరిసింగ్‌ రాజుగా వున్నాడు. భారత్‌లో లేదా పాకిస్ధాన్‌లో దేనితో వుండాలో నిర్ణయించుకొనే హక్కు 1947నాటి స్వాతంత్య్ర చట్టం సంస్ధానాలకు ఇవ్వనప్పటికీ నాడు సామ్రాజ్యవాదులు చేసిన కుట్రలో భాగంగా ఏ దేశంలోనూ చేరబోనని, స్వతంత్ర రాజ్యంగా వుంటానని ప్రకటించాడు. బ్రిటీష్‌ వారు భారత్‌ను వదలి పోవాలని 1947ఆగస్టు15న స్వాతంత్య్రప్రకటన జరగాలని ముందే నిర్ణయం జరిగిపోయింది. అయితే బ్రిటన్‌ పాలకులు నూతన ఏర్పాట్లు జరిగేంత వరకు యథాతధ స్ధితి కొనసాగుతుందంటూ ఒక ఒప్పందాన్ని తయారు చేసి స్వతంత్ర భారత్‌,పాక్‌, ఇతర సంస్ధానాధీశులతో 1947 జూన్‌ మూడున ముసాయిదా ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అయితే అది కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితం చేస్తుందా అని జవహర్‌లాల్‌నెహ్రూ చర్చల సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. మహమ్మదాలీ జిన్నా మాత్రం అలా అంగీకరించాల్సి వుందని చెప్పారు.దీనితో పాటు బ్రిటీష్‌ పాలకులు కొత్తగా ఏర్పడబోయే స్వతంత్ర భారత్‌,పాకిస్ధాన్లలో దేనితే జతకట్టేదీ తెలుపుతూ అంగీకార పత్రం మీద సంతకాలు చేయాలని మరొక మెలిక పెట్టారు. ఈ రెండింటినీ సంస్ధానాధీశుల ఛాంబర్‌ ముందు పెట్టారు. పది మంది సంస్ధానాధీశులు, పన్నెండు మంది మంత్రులతో సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. జూలై 31న ఆ కమిటీ ఆ పత్రాలను ఖరారు చేశారు. అయితే కొంత మంది సంస్ధానాధీశులు తాము యథాతధ స్ధితి ఒప్పందంపై సంతకాలు చేస్తాము తప్ప ఏ దేశంతో జతకట్టేదీ తేల్చుకొనేదానిపై ఆలోచించుకొనేందుకు సమయం కావాలని మెలికపెట్టారు. 1947 ఆగస్టు 15లోగా తమతో జతకట్టే సంస్ధానాధీశులతోనే యథాతధ స్దితి ఒప్పందంపై సంతకాలు చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగు సంస్ధానాలు మినహా మిగిలిన వారందరూ సంతకాలు చేశారు.

వాటిలో నిజాం పాలనలోని హైదరాబాద్‌ రెండునెలల వ్యవధి కోరింది, గుజరాత్‌లో జునాఘడ్‌ దాని సామంత రాజ్యాలు సంస్ధానాలు రెండు వున్నాయి. జమ్మూకాశ్మీర్‌ తాము స్వతంత్రంగా వుంటామని ప్రకటించినప్పటికీ పాకిస్దాన్‌తో యథాతధ స్థితి ఒప్పందం చేసుకుంది. వెంటనే దానిని పాకిస్ధాన్‌ అంగీకరించింది. చర్చలు జరపాల్సి వుందని భారత్‌ ప్రకటించింది. బలూచిస్తాన్‌ సంస్ధానం తాము స్వతంత్రంగా వుంటూమంటూ యథాతధ స్ధితి ఒప్పందంపై పాక్‌తో సంతకాలు చేసింది.

యథాతధ స్థితి ఒప్పందంపై పాక్‌ సంతకాలు చేసినప్పటికీ కాశ్మీర్‌ ఆక్రమణకు కుట్రలకు తెరలేపింది. భరించలేని రాజు పన్నులకు వ్యతిరేకత పేరుతో ఆందోళనలను పురికొల్పింది. దానిలో భాగంగానే 1947 అక్టోబరు 6న పాకిస్ధాన్‌ ముస్లిం గిరిజనులను ముందు వారికి మద్దతుగా పాక్‌ సైన్యాన్ని పంపి కాశ్మీర్‌పై దాడి చేసి బలవంతంగా ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. వెంటనే రాజు హరిసింగ్‌ తమకు సాయం చేయాలని భారత్‌ను కోరటం, చేరిక ఒప్పందాన్ని ఆమోదించాలన్న మన ప్రభుత్వ షరతుకు అంగీకరించి సంతకం చేయటం, మన సేనలు కాశ్మీర్‌ రక్షణకు పూనుకోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. చేరిక ఒప్పందం(ఇనుస్ట్రుమెంట్‌ ఆఫ్‌ యాక్సెషన్‌-ఐఓఏ) ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి కాశ్మీర్‌ విషయంలో విదేశీ, రక్షణ, సమాచార అంశాలలో మాత్రమే అధికారాలు వుంటాయి. మిగిలిన సంస్ధానాలన్నీ చేరిక ఒప్పందం మీదనేగాక స్వాతంత్య్రం తరువాత విలీన ఒప్పందం మీద కూడా సంతకాలు చేశాయి. కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పాక్‌్‌ అక్కడ నెలకొల్పిన పాలనా వ్యవస్ధ కారణంగా మన ప్రభుత్వం కూడా మన ఆధీనంలోకి వచ్చిన కాశ్మీర్‌లో ప్రత్యేక పాలన చేయాల్సి వచ్చింది. విలీన ఒప్పందం జరగాలంటే అప్పటి వరకు వున్న తమ అంతర్గత చట్టాల కొనసాగింపుకు హామీ వుండాలని, స్వయంప్రతిపత్తి తదితర అంశాలు ముందుకు రావటంతో ఏ రాష్ట్రానికి లేని విధంగా జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది.అది ఇప్పటికీ వునికిలో వుంది. ఆక్రమించిన కాశ్మీర్‌ ప్రాంతాన్ని ఒక ఎత్తుగడగా పాక్‌ సర్కార్‌ దానిని తమ దేశంలో విలీనం చేయకుండా ఒక స్వయంప్రతిపత్తి ప్రాంతంగా మార్చింది. దానికి ఒక అధ్యక్షుడు, ప్రధాని వుంటారు. కాశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేసుకోలేదని ప్రపంచానికి చాటేందుకు ఇప్పటికీ పార్లమెంట్‌లో ఆక్రమిత్‌ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదు. ఈ పూర్వరంగంలో షేక్‌ అబ్దుల్లా తదితర నాయకులతో జరిపిన సంప్రదింపులు, కాశ్మీరీల స్వయంప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇవ్వటంలో భాగంగా ఈ పూర్వరంగంలో 370 ఆర్టికల్‌ను చేర్చారు.

Image result for article 370 and terrorism

ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?

దీనికి కాంగ్రెస్‌ నెహ్రూ నాయకత్వమే కారణమని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం, బిజెపి పాడిందే పాడుతున్నాయి. అది వారి రాజకీయం. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, కాశ్మీర్‌ వ్యవహారాలలో పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీటవేసి కాశ్మీర్‌ సమస్యను సంక్లిష్టంగా మార్చిన నేటి స్ధితిని చూసి గతంలో జరిగిన ఏర్పాటును విమర్శించటం, రాళ్లు వేయటం రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వున్నవారికి, వారి ఎత్తుగడలను అర్ధం చేసుకోకుండా ప్రచార ప్రభావానికి లోనైన వారికి సులభమే. కాశ్మీర్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ఇటు భారత్‌, అటు చైనా, సోవియట్‌ యూనియన్‌, పశ్చిమ, మధ్య ఆసియా మీద తమ పెత్తనాన్ని రుద్దాలని, మిలిటరీ వ్యూహాన్ని అమలు జరపాలని చూసిన బ్రిటీష్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల కుట్రను నాటి కేంద్రప్రభుత్వ నాయకత్వం వమ్ము చేసిందని మరచి పోరాదు. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల ‘గూండా’ గా ఎలాంటి పరిస్ధితికి కారణమైందో మనం చూస్తూనే వున్నాం. మన ఈశాన్య రాష్ట్రాలను విడదీసి ప్రత్యేక రాజ్యాలను ఏర్పాటు చేయాలన్నది కూడా సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే. ఈ రోజు కాశ్మీర్‌లో వుగ్రవాదులు చెలరేగిపోవటానికి ఆర్టికల్‌ 370, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు ఇవ్వటం అని సంఘపరివార్‌ ప్రచారం చేస్తున్నది. అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు. కాశ్మీర్‌ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలలో, పంజాబ్‌లో వేర్పాటు, తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి, ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల పరిస్ధితి చక్కబడలేదు. వాటికేమీ ప్రత్యేక ఆర్టికల్‌, ప్రత్యేక ఏర్పాట్లు లేవు, అయినా వుగ్రవాదులు ఎందుకు తయారైనట్లు ? అందువలన 370 ఆర్టికల్‌కు కాశ్మీరులో వుగ్రవాదానికి లంకె పెట్టటం బోడిగుండుకు మోకాలికీ ముడివేసే ప్రయత్నం తప్ప వేరు కాదు. మన పక్కనే వున్న శ్రీలంకలో తమిళ ఈలం పేరుతో ప్రత్యేక రాజ్యాన్ని కోరిన ఎల్‌టిటిఇ ఇతర వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ, ఆయుధాలు అందించిన వాస్తవం తెలిసిందే. అది తప్పా ఒప్పా అంటే మన దేశ ప్రయోజనాలు, లక్ష్యాలు ఇమిడి వున్నాయి. మనం మద్దతు, శిక్షణ ఇచ్చిన వుగ్రవాదులు చివరికి మన దేశానికి కూడా ముప్పుగా తయారవుతున్నారని తేలగానే అదే వుగ్రవాదులను అణచేందుకు శాంతిపరిరక్షక దళాల పేరుతో మన సైన్యం శ్రీలంకకు వెళ్లిన విషయం, దానికి ప్రతీకారంగా వుగ్రవాదులు రాజీవ్‌ గాంధీని హత్య చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అకాలీలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ భింద్రన్‌వాలే అనే వుగ్రవాదిని పెంచి పోషించిన విషయమూ విదితమే. చివరికి ఏకుమేకైన తరువాత వాడిని మట్టుపెట్టేందుకు స్వర్ణదేవాలయం మీదికి మిలిటరీని పంపాల్సి వచ్చింది. వీటన్నింటి వెనుక మన దేశాన్ని దెబ్బతీసే అమెరికా, ఐరోపా ధనిక దేశాల సామ్రాజ్యవాదుల హస్తం వుంది. ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకు ఆఫ్ఘన్‌ సర్కార్‌ ఆహ్వానం మేరకు గతంలో సోవియట్‌ యూనియన్‌ సైన్యాన్ని పంపింది. దానికి ప్రతిగా తాలిబాన్‌ వుగ్రవాదులను తయారు చేసిన అమెరికా సోవియట్‌ సేనల వుపసంహరణ వరకు మద్దతు ఇచ్చింది. తరువాత ఆ తాలిబాన్లే అమెరికానే సవాలు చేయటంతో అంతకు ముందు వారిని దేశభక్తులుగా చిత్రించిన అమెరికా వుగ్రవాదులంటూ వారిని అణచేందుకు దశాబ్దాల తరబడి అక్కడ తన సైన్యంతో దాడులు చేసింది. చివరకు వారిణి అణచలేక వారితో రాజీచేసుకొని తన సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు ఇప్పుడు చర్చలు జరుపుతున్నది. అందువలన వారి వలలో పడకుండా వుగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాల్సి వుంది.