Tags
BJP, CEO chandrababu naidu, chandrababu naidu, chowkidar narendra modi, Data Theft, Narendra Modi, trs, ysrcp
ఎం కోటేశ్వరరావు
దేశంలో ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తోంది. దీనికి నేరపూరిత అంశాలు తోడవుతున్నాయి. నేను దేశానికి పెద్ద కాపలాదారును అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అని పిలిపించుకోవటం కంటే సిఇఓ అంటేనే నాకు పెద్ద కిక్కబ్బా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పుకొని ఎంతో తృప్తి పొందారు. ఇప్పుడు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. పెద్ద కాపలాదారు సంరక్షణలో వున్న రాఫెల్ విమానాల లావాదేవీలు, చర్చల పత్రాలు చోరీకి గురైనట్లు మార్చి ఆరవతేదీన అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా తాము నిల్వచేసిన తమ పార్టీ సమాచారం చోరీకి గురైందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణా పోలీసులు, మరికొందరి మీద గుంటూరు జిల్లాలో ఫిర్యాదు చేశారు. అతి పెద్ద కాపలాదారు రక్షణలో వున్న రక్షణ శాఖ పత్రాల చోరీ గురించి ఎలాంటి ఫిర్యాదు లేదా కేసు నమోదు లేకుండానే ఏకంగా వున్నత న్యాయ స్ధానానికి తెలియచేయటం సరికొత్త వ్యవహారశైలికి నిదర్శనం. సమాచార చౌర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్యలు, చర్చ మొదలైన వారం రోజులకు తమ సమాచారం పోయిందని తెలుగుదేశం గొల్లు మంటూ కేసు దాఖలు చేసింది. సామాన్యులు ఈ పరిణామాలను ఒక పట్టాన అర్ధం చేసుకోవటంలో విఫలమైతే జుట్టుపీక్కోవటం తప్ప ఏమీ చేయలేరు.
రెండు అంశాలు స్పష్టం. రాఫెల్ పత్రాలు చోరీకి గురైనట్లు మోడీ సర్కార్ కోర్టుకు నివేదించటం అంటే హిందూ పత్రిక వెల్లడించినవి వాస్తవమే అని నిర్ధారించటం. రెండవది చేయాల్సిన పని చేయనందుకు పెద్ద కాపలాదారు మీద ముందు కేసు నమోదు చేసి వుద్యోగం నుంచి వూడగొట్టాలి. ఏండ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా చోరీ చేసేందుకు వీలుగా వుంచి కాపాడుకోవటంలో విఫలమైన తెలుగుదేశం కంపెనీ సిఇవో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బాధ్యతల్లో కొనసాగించటమా లేదా అన్నది సదరు కంపెనీ లేదా పార్టీకి వదిలివేద్దాం. దొంగలు దోచుకుపోయిన తరువాత ఇంటికి తాళాలు వేసినట్లు తెలుగుదేశం వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఎందుకాపని చేశారంటే మిగిలిన సమాచారాన్ని కాపాడుకొనేందుకు అంటున్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ధర ఎక్కువా, తక్కువా, ఎంతో అనుభం వున్న ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టారా లేదా అన్న చర్చ జరుగుతోంది, వున్నత న్యాయస్ధానంలో విచారణలో వుంది. వాటిని పక్కన పెడితే రాఫెల్ విమానాలో మరొకటో మన వాయుసేనకు అవసరం అనేదానిలో ఎలాంటి తేడాలు లేవు. రాఫెల్‌గాక పోతే మరోకంపెనీ లావాదేవీలు లేదా ప్రభుత్వం చెబుతున్నట్లు అత్యంత రహస్య సమాచారాన్ని నరేంద్రమోడీ సర్కారు జాగ్రత్త పరచలేదు అన్నది తేలిపోయింది. సదరు పత్రాలు హిందూ పత్రిక చోరీ చేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఆరోపించింది.
ప్రపంచంలో ఇలా అధికారిక పత్రాలు బహిర్గతం కావటం కొత్తేమీ కాదు. అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వుంచే సమాచారాన్ని జూలియన్ అసాంజే అనే పెద్ద మనిషి బహిర్గతం చేసిన వాటిని సంవత్సరాల బడి చదువుతూనే వున్నా ఇంకా తరగటం లేదు. కళ్ల ముందు జరిగే ఒక దుర్మార్గం లేదా ఒక అక్రమాన్ని సహించలేని వారో లేదా సదరు లావాదేవీ పోటీలో వెనుక బడి తోటి కంపెనీ అక్రమాలకు బలైన వారో ఇలాంటి పత్రాలను స్వయంగా మీడియాకు తెచ్చి ఇవ్వటం బహిరంగ రహస్యం. అలాంటి వనరు ఏదో ఒకటి లేకుండా మీడియా వ్యక్తులు దొంగతనం చేసి సంపాదించిన దాఖలా లేదా అలాంటి వుదంతాలలో శిక్షలు పడిన వుదంతాలు నాకైతే కనపడలేదు. అదే హిందూ పత్రిక గతంలో బోఫోర్సు పత్రాలను, బిజెపి నేత మాజీ మంత్రి అయిన అరుణ్‌శౌరీ జర్నలిస్టుగా వున్న సమయంలో అనేక కుంభకోణాలను బయట పెట్టారు. కానీ అప్పుడెవరూ ప్రభుత్వ పత్రాలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయలేదు. జర్నలిస్టులను దొంగలుగా చిత్రించి కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో, ప్రపంచంలో కేసులు వుండని జర్నలిస్టులు, మీడియా సంస్ధలు వుండవు.
రాఫెల్ లావాదేవీల అక్రమాల గురించి హిందూ పత్రిక ప్రకటించిన వెంటనే ఫిబ్రవరి ఎనిమిదిన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దానిలో చోరీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నెల రోజుల తరువాత చోరీ జరిగిందని అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వాటిని బయట పెట్టిన రెండు పత్రికల మీద విచారణ, చర్యను పరిశీలిస్తున్నట్లు అటార్నీ జనరల్ కోర్టుకు వెల్లడించారు. అది కూడా ఈ లావాదేవీలపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలన్న పిటీషన్లపై విచారణ ప్రారంభమైన తరుణంలో అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కోర్టులో చేసిన వాదనను చూస్తే అధికార రహస్యాల చట్ట వుల్లంఘన అనే కత్తిని మీడియా మీద ప్రయోగించేందుకు పూనుకుందన్నది స్పష్టం. దాన్నే రక్షణగా చేసుకొని పునర్విచారణను అడ్డుకోవాలని చూస్తోంది. పునర్విచారణ పిటీషన్ విచారణకు ముందే వార్తా పత్రికలు సంబంధిత అంశాలను ప్రచురించటం కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే అని అందువలన ఇది కోర్టు ధిక్కారం కూడా అని ఏజి వాదించారు. దీనికి ప్రతిగా పిటీషన్‌దారైన ప్రశాంత భూషణ్ కోర్టుకు వాస్తవాలను వివరించే పిటిషనర్లను అడ్డుకొనే ప్రయత్నమే ఏజి ప్రకటనలని నిజానికి అవే కోర్టు ధిక్కరణకిందికి వస్తాయన్నారు.
ప్రపంచంలో ప్రజాస్వామ్యం వున్న ఏదేశంలోనూ ఒక వార్త మీడియాకు ఎలా వచ్చిందో చెప్పాలని ఆదేశించే హక్కు ఏ కోర్టుకూ లేదు. మీడియాకు అనేక వనరుల నుంచి వార్తలు వస్తాయి. వాటిని బయటకు వెల్లడించబోమనే ఎలాంటి రాతకోతలు లేని హామీతోనే స్వీకరిస్తాయి, ప్రచురిస్తాయి.అలాంటి విశ్వసనీయతను మీడియా కాపాడుకొంటూ వస్తోంది. ఈ వుదంతంలో హిందూ పత్రిక ప్రచురించిన వాటి గురించి పత్రిక చైర్మన్, స్వయంగా రాఫెల్ పత్రాలను బయట పెట్టిన ఎన్ రామ్ ఈ విషయాలనే స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలు కోర్టు విచారణలోనూ వస్తాయి కనుక వాటి గురించి మరోసారి పరిశీలిద్దాం.
తెలుగుదేశం- వైసిపి మధ్యలో తెరాస !
రెండవ అంశం ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ సమాచార చోరీ వివాదం.సమాచార చోరీ చాలా సంక్లిష్టమైనది. దానికి ముందే చెప్పుకున్న జూలియన్ అసాంజే వికీలీక్స్ వెల్లడించిన సమాచార వుదంతం చక్కటి వుదాహరణ. అసాంజే ఆస్ట్రేలియా కంప్యూటర్ ప్రోగ్రామర్. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలు, సిఐఏ, అమెరికా రాయబారులు పంపే ప్రయివేటు సమాచారం లక్షల ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశాడు. అతని మీద నేరుగా చర్యలు తీసుకొనే అవకాశం లేక లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై స్వీడన్ అరెస్టు చేసి విచారణ జరిపింది, తేలిందేమీ లేదు. స్వీడన్‌తో అమెరికాకు వున్న ఒప్పందం కారణంగా రహస్యాలను బయట పెట్టిన కేసులో అమెరికాకు అప్పగిస్తామని స్వీడన్ ప్రకటించింది. దాంతో అతను బ్రిటన్ పోలీసులకు లంగిపోయాడు. పదిరోజుల పాటు విచారించి బెయిలు మీద విడుదలయ్యాడు. బ్రిటన్ కూడా అమెరికాకు పంపే యత్నాలను గమనించి బ్రిటన్ పోలీసుల కళ్లుగప్పి లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్ర యం పొందాడు. 2017లో ఈక్వెడార్ పౌరసత్వం కూడా పొంది అక్కడే వుంటున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలు అర్దమైతే తప్ప ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అర్ధం కాదు.
స్వాతంత్య్రం తరువాత అనేక రాష్ట్రాలను చీల్చి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. బహుశా ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పార్టీల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం ఒక విధంగా భారత రాజకీయ రంగం మీద కొత్త అంకం అనుకోవాల్సి వుంటుంది. తెలుగు వారు గణనీయ సంఖ్యలో వున్న కర్ణాటకలో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్రసమితి(తెరాస) మధ్య మొదలైన తెరవెనుక రాజకీయ పోరు గతేడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదకు వస్తే, ఇప్పుడు అది కత్తులు దూసుకొనే స్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకోవాలి అని అనుకోవాలేగానీ అవకాశాలు, సాకులు బోలెడన్ని.మనకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ గనుక చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క, ఎత్తుకు పై ఎత్తు, దొరికితే దొంగలు, జగత్ కిలాడీలు, జగత్ జెంత్రీలు వంటి సినిమాలను చూసి తెలుగువారు చాల మెళకువలను నేర్చుకున్నారు. తాజాగా వచ్చిన ఎఫ్‌టు అనే తెలుగు సినిమాలో ఒక అధికారి తాను తెలంగాణా లేదా ఆంధ్రకు చెందిన వాడిని అని చెబితే ఎక్కడ తేడా వస్తుందోనని కేంద్ర పాలిత ప్రాంతం యానం అని చెబుతాడు. ఇప్పుడు వర్తమానానికి వస్తే సమాచార చౌర్యం. సమస్య తెలుగుదేశం-వైసిపి వ్యవహారంలా వున్నప్పటికీ బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి పాత్రకూడా తక్కువేమీ కాదు. దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారు, ఫిర్యాదులు చేసిన వారందరూ సామాన్య జనాన్ని గందరగోళపరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన ఐటి గ్రిడ్స్ ఇండియా అనే ఒక కంపెనీ తెలుగుదేశం పార్టీకోసం సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారు చేసిందని, దానిలో వుపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పధకాల లబ్దిదారులు, ఓటర్ల వివరాలను తస్కరించారని హైదరాబాద్‌కు చెందిన టి లోకేశ్వర్ రెడ్డి అనే సమాచార విశ్లేషకుడు మార్చినెల రెండవ తేదీన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సమాచార చోరీ వివాదం ప్రారంభమై సినిమాల్లో మాదిరి మలుపులు తిరుగుతోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటిగ్రిడ్ కంపెనీలో సోదాలు జరిపి సిబ్బందిని ప్రశ్నించారు. యజమాని ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతను అమరావతిలో అంటే విజయవాడలో ఏపి పోలీసుల రక్షణలో వున్నాడన్నది బిజెపి, తెరాస ఆరోపణ. దాని గురించి తెలుగు దేశం పార్టీ వారు అవుననీ, కాదనీ ఏమీ మాట్లాడరు. మార్చి మూడవ తేదీన ఏపి పోలీసులు హైదరాబాదు వచ్చి సమాచార చోరీ ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అతనేమీ సమాచార దొంగకాదు. ఐటి గ్రిడ్ సిబ్బందిని నిర్బంధించారన్న అరోపణలతో కోర్టుకు ఫిర్యాదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా తమను ప్రశ్నించారు తప్ప నిర్బంధించలేదని కోర్టుకు తెలపటంతో కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది. ఐటి గ్రిడ్ కంపెనీని వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించటంతో సమాచార చౌర్యం కేసు రాజకీయ రంగు పులుము కుంది.
ఈ లోగా హైదరాబాద్‌కు చెందిన దశరధరామి రెడ్డి అనే మరోవ్యక్తి హైదరాబాద్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో తాత్కాలికంగా నివాసం వుంటున్న వారి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వస్ధలాలలో ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్నది దాని సారాంశం. ఫిర్యాదుదారు హైదరాబాదులో వుండటంతో తాము ఇక్కడ కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సమాచార తస్కరణ కేసు సత్వర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాదు పోలీసులు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలంగాణాకు చెందిన పోలీసులు, కొందరితో కుమ్మక్కై తమ పార్టీ సమాచారాన్ని అపహరించారని పేర్కొన్నారు. తెలంగాణా పోలీసులు సత్వర విచారణకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే , దానికి పోటీగా ఏపి సర్కార్ రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఒకటి తెలుగుదేశ ం పార్టీ సమాచార చౌర్యం మీద అయితే రెండవది ఫారం ఏడుతో అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన వారి మీద చర్యతీసుకొనేందుకు అని ప్రకటించారు.
చట్టపరమైన అంశాలు, కేసులు ఏమౌతాయి అన్న అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ వివాదం ఎందుకు మొదలైందన్నది ఆసక్తి కలిగించే అంశం. తమ వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలను రచించుకొనేందుకు ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్ కంపెనీలు జన ఆమోదంతో నిమిత్తం లేకుండా మభ్య, ప్రలోభపరచి లేదా సాధ్యంగాక తస్కరించి సమాచార సేకరణ,దాయటం అందరికీ తెలిసినదే. ఇప్పుడిది కార్పొరేట్ రాజకీయ పార్టీలకు పాకింది. పార్టీ కార్యకర్తల, సభ్యుల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో సమాచార సేకరణ, ఎన్నికల సమయంలో దాన్ని వుపయోగించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది.గతంలో ముఖ్య మంత్రి పేరుతో ప్రతి ఇంటికీ లేఖలు రాస్తే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారులను కూడా చేర్చి తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవటం అసలు వివాదానికి మూలం. విచారణలో ఏ విషయాలు బయటపడతాయో లేక ఓటుకు నోటు కేసు మాదిరి తెరవెనుకకు పోతాయో మనకు తెలియదు. ఒకటి జరిగి వుండాలి. ఇది వూహ మాత్రమే. తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్‌కు అప్పగించి తన యాప్ ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు నిర్ణయించి వుండాలి. అది తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణాలో తన మిత్రపక్ష సహకారంతో ఆ సమాచారాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రతి వ్యూహం రచించి వుండాలి. దానిలో భాగంగానే తస్కరణ ఫిర్యాదులు, ఐటి గ్రిడ్‌పై పోలీసుల విచారణ,సమాచార కాపీ, దాన్ని వైఎస్‌ఆర్‌సిపికి అందచేసి వుండాలి. దీనిలో మరొక అంశం ఏమంటే తమకు ఓటు వేసే అవకాశం లేదు అనుకొనే వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లకు తెలియకుండానే కొందరు కుట్ర చేసి దరఖాస్తులు చేయటం, వాటిని అధికారం యంత్రాంగం తెలిసీ లేదా తెలియనట్లు నటించిగానీ దరఖాస్తులో కోరిన మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించటం జరుగుతోంది. ఇలాంటి చర్యలకు తెలుగుదేశం-వైసిపి రెండు పార్టీలూ పాల్పడ్డాయన్నది అందరినోటా వినిపిస్తున్న అంశం. ఎవరు సమాచారాన్ని దొంగిలించారు లేదా ఎవరు ఐటి గ్రిడ్‌కు అప్పగించారు, దాని దగ్గర నుంచి టిఆర్‌ఎస్ సర్కార్ సాయంతో వైసిపికి అందచేశారా అనేది ఒకటైతే ఆ సమాచారం అంతా అసలు మన దేశంతోనే సంబంధం లేని అమెజాన్, గూగుల్ కంపెనీల సర్వర్లకు చేరిందన్నది మరొక అంశం. మరి అదెలా జరిగినట్లు ?
నిజానికి ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయిగానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఎందుకు అంటే రెండు పార్టీలు అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీ దుకాణం ఖాళీ అవుతుంది. గత ఎన్నికలలో తెలుగు దేశం సీట్ల పరంగా ఎక్కువ పొందినా ఓట్ల పరంగా పెద్దగా రాబట్టలేదు. రెండు పార్టీల మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఏ పార్టీ అయినా అధికారానికి వస్తేనే అది ఐదు సంవత్సరాలూ నిలుస్తుంది. ఏదో ఒకసాకుతో ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులను టోకుగా లేదా చిల్లరగా కొనుగోలు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తన బలాన్ని పెంచుకొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వున్నప్పటికీ స్పీకర్ల అండ, చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ఫిరాయింపుదార్లను రక్షిస్తున్నారు. పార్టీ మారకుండానే మంత్రిపదవులను సైతం కట్టబెట్టిన విపరీతాన్ని చూశాము. అందువలన ఎలాగైనా సరే అధికారాన్ని పొందాలన్నదే ఏకైక సూత్రంగా ఇప్పుడు అధికారపార్టీలు పని చేస్తున్నాయి.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్నికల తాయిలాలు, డబ్బులు పంచటం, కులాన్ని రంగంలోకి తీసుకురావటం పాత పద్దతులు. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలుగా వున్న వారి వ్యాపారాలు, ఇతర లావాదేవీలను దెబ్బతీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ద్వారా తమవైపు తిప్పుకోవటం అధికారపార్టీలు కొత్తగా ప్రారంభించిన ప్రమాదకరక్రీడ. ఎవరు అధికారంలో వుంటే వారు దీన్ని ఆడుతున్నారు. ఇది రాష్ట్రాలను దాటింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తన లేదా తన మిత్రపక్ష రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్ధలను వుపయోగించుతోందన్నది ఒక విమర్శ. హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా వున్న వారు బహిరంగంగానే ఆరోపించిన అంశం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణా వున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పని చేస్తోందన్నది ఆరోపణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఏపికి చెందిన చంద్రబాబు నాయుడు జోక్య ం చేసుకొని తమను ఓడించేందుకు ప్రయత్నించినదానికి ఇది బదులు తీర్చుకోవటంగా కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ సమాచార చోరీ జరిగిందన్న ఫిర్యాదుకు, తమ సమాచారాన్ని చోరీ చేశారన్న ఆరోపణకు రెండింటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వుంది. అధికారంలో వున్న పార్టీగా అధికారిక సమాచార చోరీ నివారణకు, చివరకు స్వంత సమాచార చోరీని అడ్డుకోవటంలో ఎందుకు విఫలమైంది అన్నదానికి జవాబు చెప్పాల్సింది వారే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడని, సామాజిక మీడియాను వుపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో కూడా జాబితా తయారీలోనే ఓటర్లకు ప్రలోభాలు, తమకు ఓట్లు పడవు అనుకున్న ప్రాంతాలలో ఓటర్లజాబితాల్లో అక్రమాలు, కుంటి సాకులు చూపి ఓటర్లను అడ్డుకోవటం బహిరంగ రహస్యం.
ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తొలగింపుల గురించి తెలుగుదేశాంవైసిపి పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే రేపు ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాకపోతే రెండోవారిని నిందించటానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోవాలి.ఓట్ల తొలగింపు గురించి సాధారణంగా ఎన్నికల రోజు, లేదా తరువాత ఆరోపణ,ప్రత్యారోపణులు వస్తాయి.అలాంటివి ఇప్పుడు ముందే వస్తున్నాయంటే అర్ధం అదే. ఈ పూర్వరంగంలో ఎన్నికల సంస్కరణలు లేదా నిబంధనల సవరణ అంశం ముందుకు వస్తోంది. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఇచ్చినట్లే, రద్దు దరఖాస్తుల ప్రకారం ఏ ఓటర్లను తొలగిస్తున్నదీ, అభ్యంతరాలుంటే తెలియచేయాల్సిందిగా కోరుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందచేస్తే తప్పుడు దరఖాస్తులా నిజమైనవా అన్నది తేలుతుంది. కనీసం తొలగింపు ఓటర్లను బూత్‌ల వారీ ఎలక్ట్రానిక్ జాబితాలను అయినా పార్టీలు, ఓటర్లకు అందుబాటులో వుంచి సరిచూసుకొనేందుకు వీలు కల్పించాలి. బోగస్ దరఖాస్తులుగా తేలిన వాటిని దరఖాస్తుదారులను, వాటిని విచారణ చేయకుండా ఆమోదించి ఓట్లను తొలగించిన సిబ్బంది మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటువంటివి పునరావృతం కాకుండా వుంటాయి. ఒకసారి ఓటు హక్కు వచ్చిన తరువాత ఓటరు స్వయంగా కోరితే లేదా మరణిస్తే తప్ప జాబితా నుంచి రద్దయితే దానికి జాబితా తయారు చేసినవారిని బాధ్యులుగా చేయాలి.