Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాల్సిందిగా కోరుతూ డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ తన జన్మస్ధలం న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లో మార్చినెల రెండవ తేదీన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. పోలాండ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన శాండర్స్‌ చిన్నతనంలో ఎలాంటి ఇబ్బందులను అనుభవించిందీ నేటి దిగువతరగతివారితో పోల్చుకొని గతాన్ని గుర్తు చేసుకున్నారు. మీ అందరి మద్దతుతో నేను పార్టీ అభ్యర్ధిత్వపోటీలో విజయం సాధించటమే కాదు ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకార అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ను కూడా ఓడించబోతున్నామని చెప్పాడు. ఆకాశ హర్మ్యాలు, జూదశాలలు, క్లబ్బులు నిర్మించేందుకు మిలియన్ల కొద్దీ డబ్బు ఇచ్చే తండ్రి నాకు లేడు, మూడు సంవత్సరాల వయస్సులో ఏడాదికి రెండులక్షల డాలర్లు ఇచ్చే కుటుంబం నుంచి నేను రాలేదు అంటూ ట్రంప్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అండతో ఈ దేశాన్ని మార్చబోతున్నాం, అంతిమంగా కేవలం ఒకశాతం మంది కోసం కాకుండాఆ మనందరికోసం పని చేసే ప్రభుత్వం మరియు ఆర్ధిక వ్యవస్దను సృష్టించబోతున్నామని పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతనుద్దేశించి చెప్పారు.

పార్టీ అభ్యర్దిగా ప్రచారం ప్రారంభించిన మూడు రోజుల తరువాత తాను డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిగా మాత్రమే పోటీ చేస్తానంటూ శాండర్స్‌ ఒక ప్రమాణ పత్రం మీద సంతకం చేశారు. గత ఎన్నికలలో హిల్లరీ క్లింటన్‌తో పోటీ బడిన శాండర్స్‌ ఒక వేళ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం దక్కకపోతే మూడవ పక్ష లేదా స్వతంత్ర అభ్యర్ధిగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారంటూ ఆయన ప్రత్యర్దులు ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేకపోగా హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే 2024 జరిగే వెర్‌మౌంట్‌ సెనెటర్‌ ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్దిగా బరిలో వుంటానని ప్రకటించటంతో అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేవారు పార్టీ సభ్యులై వుండాలని, పార్టీ అభ్యర్ధిగా మాత్రమే పోటీ చేస్తాననే ప్రమాణం చేయాలనే నిబంధనను గట్టిగా అమలు జరపాలని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు వత్తిడి చేశారు. ఆ మేరకు తాజాగా శాండర్స్‌ ప్రమాణం చేశారు. రాష్ట్రాలలో పార్టీ ప్రతినిధులతో నిమిత్తం లేకుండా 1984లో ప్రవేశ పెట్టిన సూపర్‌ డెలిగేట్స్‌ అంటే పార్టీలో సీనియారిటీ,చేసిన సేవ, నిధుల వసూలులో పెద్ద చేయిగా వుండటం వంటి అంశాల ప్రాతిపదికన కొంత మందిని ప్రత్యేక ప్రతినిధులుగా కేంద్ర పార్టీ ఎంపిక చేస్తుంది. వారు అంతిమంగా పార్టీ అభ్యర్ధిని ఎంచుకొనే ప్రక్రియలో తమకు ఇష్టమైన వారికి ఓటు వేయవచ్చు అనే అవకాశం కల్పించారు. సహజంగా అలాంటి ప్రత్యేక ప్రతినిధులు తమను ఎంపిక చేసిన కమిటీ ఎటు మొగ్గితే అటే ఓటు వేస్తారన్నది గత అనుభవం, 2016 ఎన్నికలలో కూడా పార్టీ హిల్లరీ క్లింటన్‌ వైపు మొగ్గటంతో రాష్ట్రాలలో ఎంత మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ బెర్నీ శాండర్స్‌ చివరికి ఈ ప్రత్యేక ప్రతినిధుల కారణంగా ఓడిపోయారు. ఈ అనుభవంతో అభ్యర్ధి ఎన్నికలో వారి ప్రమేయాన్ని తొలగించాలని శాండర్స్‌, తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో వారి ప్రమేయాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అది ఎంతవరకు అన్నది ఇప్పుడే చెప్పలేము. అయితే నైతికంగా ఇది శాండర్స్‌ సాధించిన విజయం.

తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ సభ్యుడిగా 1990లో ఎన్నికయ్యారు. తరువాత వెర్‌మౌంట్‌ రాష్ట్రం నుంచి స్వతంత్ర సెనెటర్‌గా 2006 నుంచి కొనసాగుతున్నారు. పార్లమెంట్‌లో ఆయన డెమోక్రటిక్‌ పార్టీతోనే కలసి వ్యవహరిస్తారు. 2016లో జరిగిన ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం కోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడ్డారు. ఒకప్పుడు వామపక్ష వాదిని అని చెప్పుకొనే పరిస్ధితులు లేని అమెరికాలో తాను సోషలిస్టును అని పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని బహిరంగంగా చెప్పుకొన్న శాండర్స్‌ వర్తమాన అమెరికా రాజకీయాలలో ఒక సంచలనానికి నాంది పలికారు. లక్షలాది మంది యువతీ యువకులు తాము కూడా సోషలిస్టులమే అంటూ గత ఎన్నికలలో ఆయనకు పెద్ద ఎత్తున బాసటగా నిలిచినప్పటికీ కార్పొరేట్‌లాబీ ఆయన అభ్యర్ధిత్వాన్ని అడ్డుకుంది. అయినప్పటికీ రెట్టించిన వుత్సాహంతో 77 సంవత్సరాల శాండర్స్‌ తిరిగి పోటీకి ముందుకు వచ్చారు. అందరికీ ఆరోగ్యం, గంటకు కనీసవేతనం 15డాలర్ల వంటి నినాదాలను ముందుకు తెచ్చారు. నేడు డెమోక్రటిక్‌ పార్టీలో ఆయనను వద్దనే వారు కూడా ఆ నినాదాలను వ్యతిరేకించే స్థితి లేదంటే డెమోక్రటిక్‌ పార్టీ మీద ఎంతటి ప్రభావం కలిగించారో చెప్పవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడనున్నట్లు ప్రచారంలో వున్న వారిలో కమలా హారిస్‌, కోరీ బుకర్‌, ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు కూడా అందరికీ ఆరోగ్యం అనే బిల్లును 2017లో ప్రతిపాదించిన వారిలో వున్నారు.

ఇటీవలి వరకు సోషలిజం అంటే ఆసక్తి చూపని వారు అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను చూసి పునరాలోచన పడుతున్న స్ధితిలో బెర్నీ శాండర్స్‌ వంటి వారు ముందుకు తెస్తున్న డెమోక్రటిక్‌ సోషలిజం, ప్రజలు చెల్లించే పన్నులు కార్పొరేట్లకు కాదు, అందరికీ వుపయోగించాలి, ఎలాంటి నియంత్రణలు లేని పెట్టుబడిదారీ వ్యవస్ధ చెడ్డది వంటి అంశాలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. సోషలిజం భావన తమకు ఎంతో వుత్తేజం కలిగిస్తున్నదని, డెమోక్రటిక్‌ సోషలిస్టు భావనలు డెమోక్రటిక్‌ పార్టీకి కొత్త రూపునిస్తున్నాయని పలువురు ఆ పార్టీ వెలుపల వున్న వారు కూడా భావిస్తున్నారు.

Image result for bernie sanders

అమెరికా ఎన్నికలలో ప్రత్యర్ధుల మీద తప్పుడు ప్రచారం చేయటం సర్వసాధారణం. సోషల్‌ మీడియా దీనికి ప్రధాన వేదికగా వుంది. ఈ ఎన్నికలలో కూడా తాను తిరిగి రంగంలో వుంటానని శాండర్స్‌ ప్రకటించిన తరువాత అటువంటి ప్రచారం ప్రారంభమైంది.వాటిలో ఒకదాని సారాంశం ఇలా వుంది. శాండర్స్‌ ఒక్క వ్యాపారాన్ని కూడా ప్రారంభించలేదు, కొత్తగా కనుగొన్నదేమీ లేదు, స్ధిరమైన వుద్యోగం లేదు, 25సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వుండి ఒక్క బిల్లునూ ప్రతిపాదించలేదు.ఎన్నిక అవటానికి ముందు ప్రభుత్వ భృతిమీద ఆధారపడ్డాడు. 74ఏండ్ల వృద్ధుడు ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక వ్యవస్ధలను సరిచేస్తానంటున్నాడు, అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. అతని హీరో కారల్‌ మార్క్స్‌ మాదిరి సాధించేదేమీ వుండదు. దీనిలో పేర్కొన్న మొదటి రెండు అంశాలు వాస్తవమే. శాండర్స్‌ అమెరికన్‌ పీపుల్స్‌ హిస్టారికల్‌ సొసైటీ పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్ధను స్ధాపించి తక్కువ ఖర్చుతో వెర్‌మౌంట్‌, న్యూ ఇంగ్లండ్‌ ప్రాంతాల గురించి అక్కడి జనం, జరుగుతున్న పరిణామాల మీద లఘు చిత్రాలు నిర్మించాడు. దాన్ని వాణిజ్యంగా ఎవరూ భావించటం లేదు. వాణిజ్యం కలిగి వుండి యజమానులుగా వున్నవారే పోటీ చేయాలని రాజ్యాంగంలో లేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఎన్నికకు ముందు వాణిజ్యవేత్తలుగా వున్నది డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా ఏడుగురు మాత్రమే.2017లో ఆయన ఆస్ధి విలువ 20లక్షల డాలర్లు.చికాగో విశ్వవిద్యాలయం నుంచి 1964లో డిగ్రీ తీసుకున్న తరువాత 1981లో బర్లింగ్టన్‌ మేయర్‌ అయ్యేంత వరకు అనేక చిన్న చిన్న వుద్యోగాలు చేశాడు. ఒక మానసిక చికిత్సాలయంలో సహాయకుడు, కార్పెంటర్‌, కిండర్‌గార్డెన్‌ టీచర్‌, పత్రికలకు వ్యాసాలు రాయటం వంటి పాక్షిక పనులు చేశాడు. ప్రజాప్రతినిధిగా ఒక్క బిల్లును కూడా ప్రతిపాదించలేదనటం కూడా సత్యదూరమే. శాండర్స్‌ ప్రతిపాదించిన ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇలాంటి సాధారణ జీవితం గడిపిన నేపధ్యం కలిగి వున్న కారణంగానే అనేక మంది దిగువతరగతి జనం ఆయన మద్దతుదార్లుగా వున్నారు. శాండర్స్‌ ఆస్ధుల గురించి ఆధారం లేని వార్తలు అనేకం వ్యాపింప చేస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి మధనం జరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న అసమానతలు చివరకు ఆ వ్యవస్దనే మార్చివేసేందుకు దారితీస్తాయని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త ధామస్‌ పికెట్టీ హెచ్చరించిన తరువాత ఈ చర్చ ఇంకా ఎక్కువైంది. సోషలిజం వైపు మొగ్గు చూపుతున్న యువత రోజు రోజుకూ పెరుగుతోందన్నది ఇటీవలి కాలంలో అనేక సర్వేలు వెల్లడించాయి.అయితే మొత్తంగా అమెరికన్లు ఇప్పటికీ మెజారిటీ పెట్టుబడిదారీ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. యువతలో వచ్చిన మార్పు పాలకవర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. యువత ఎందుకు సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నకు సోవియట్‌ యూనియన్‌ తరహా సోషలిజం గురించి వారికి తెలియదని, బెర్నీ శాండర్స్‌ ముందుకు తెచ్చిన డెమోక్రటిక్‌ సోషలిజం భావన ఆకర్షిస్తున్నదని సర్వే నిపుణులు చెబుతున్నారు.సర్వేల్లో వెల్లడౌతున్న ధోరణులను చూసి బెంబేలెత్తుతున్న కార్పొరేట్‌ మీడియా వాటిని వక్రీకరించేందుకు చేయని ప్రయత్నం లేదు. సోషలిస్టు అని పిలిపించుకోవటం ఎంతో మత్తెక్కిస్తున్నదని యువత అంగీకరిస్తున్నదంటూ ఇటీవల న్యూయార్క్‌ మాగజైన్‌ ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. షిమన్‌ వాన్‌ జుయలెన్‌ వుడ్‌ రాసిన ఆ వ్యాసంలో డేటింగ్‌ కోరుకుంటున్న సోషలిస్టు యువత తమకలలకు తగిన మరొక సోషలిస్టును ఎంచుకొనేందుకు ఇప్పుడు సలహాలు తీసుకోవచ్చని, బ్రూక్లిన్‌లో ఇదొక కొత్త మార్గంగా మారిందని పేర్కొన్నారు. ఇందుకు తగిన విధంగా రెడ్‌ యెంటా పేరుతో ఒక యాప్‌ను కూడా తయారు చేశారు. దానిలో తమ రాజకీయ అభిప్రాయాలకు తగిన వారిని ఎంచుకొనే వీలు వున్నది. ఇటీవలి వరకు సోషలిజం అంటే ఎరుపు భయాన్ని కలిగించే విషం, అసంగతం, చరిత్ర చెత్తబుట్టలో వేసినటువంటి, కానీ 2016లో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టులకు కొత్త ప్రజాదరణను తెచ్చింది. దేశవ్యాపితంగా 250 స్దానిక బృందాలలో 55వేల మంది సభ్యులున్నారు. న్యూయార్క్‌ డెమోక్రాట్‌ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అసాధారణ రీతిలో పార్లమెంటుకు ఎన్నికయ్యారని దానిలో పేర్కొన్నారు. యువతలో ప్రారంభమైన చర్చ సాధారణంగా మారుతున్నదని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకతను పెంచుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 6.2కోట్ల మంది మిలినియల్‌ యువత ఓటర్లుగా వున్నారు. వీరిలో పెరుగుతున్న సోషలిస్టు అనుకూల భావనలు సహజంగానే పెట్టుబడిదారీ వర్గానికి కంగారు పుట్టిస్తాయి.

Image result for bernie sanders 2020

అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది. డెన్మార్క్‌, ఫిన్లండ్‌, స్వీడన్‌ వంటి నోర్డిక్‌ దేశాలు అమెరికాతో పోల్చితే మెరుగైన సామాజిక భద్రతా పధకాలతో మెరుగ్గా వున్నాయి. కొంత మంది వాటిని కూడా సోషలిస్టు వ్యవస్ధలుగా వర్ణించేవారు లేకపోలేదు. అందువలన కొందరు అమెరికా యువత అలాంటి సోషలిజమైనా మెరుగేకదా అనే వైఖరితో కూడా వున్నారని చెబుతున్నారు.అవన్నీ చిన్న దేశాలని అలాంటిది అమెరికాలో సాధ్యం కాదని చెబుతుంటే ఎందుకు కాదనే ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి, సోషలిజం గురించి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా గాలప్‌ సర్వే ప్రకారం డెమోక్రటిక్‌ పార్టీలో 57శాతం మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరితో వున్నారని తేలింది. నిజమైన సోషలిజం అంటే సోవియట్‌యూనియన్‌, క్యూబా, వెనెజులాల్లో వుందని అక్కడ విఫలం చెందింది కనుక సోషలిస్టు భావన జోలికి పోవద్దని కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వెనెజులాను ప్రస్తావించి అమెరికాలో సోషలిజానికి తావులేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకవైపు సోషలిజం గురించి వక్రీకరిస్తున్నప్పటికీ అమెరికా యువతలో మొగ్గు నానాటికీ పెరుగుతున్నది, దానికి ప్రధాన కారణం అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం, జనంపై మోపుతున్న భారాలు నానాటికీ పెరగటమే.అందువల్లనే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఎక్కువగా వెల్లడవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం గురించి మీడియా సర్వేలు కేంద్రీకరించాయి.దానిలో బెర్నీ శాండర్స్‌ను అడ్డుకొనేందుకు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కనిపిస్తోంది. 45శాతం మంది సోషలిస్టు అభ్యర్దిని కోరుకుంటున్నారని 55శాతం మంది ఆరోగ్య రంగంలో ప్రధాన మార్పు లేదా ఆర్దిక అవకాశాలు కల్పించేవారు కావాలని, 42శాతం మంది చిన్న మార్పులు, పెద్ద ఖర్చు లేకుండా పరిమిత మార్పులు తెచ్చేవారు కావాలని, 40శాతం మంది ట్రంప్‌ను ఓడించేవారు చాలని కోరుకుంటున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అమెరికన్లు ఇప్పుడు మూడు పూటలా తింటున్నారని, సోషలిజంలో అంతకంటే అదనంగా వచ్చేదేమిటని ఒక ప్రచారం. ప్రజాస్వామ్య అమెరికాలో ఎలాంటి కరవులు రాలేదని, గత శతాబ్దిలో సంభవించి పది పెద్ద కరవుల్లో ఆరు సోషలిస్టు దేశాల్లోనే వచ్చాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషలిజంలో భావ ప్రకటనా స్వేచ్చ వుండదనే పాతబడిన రోత ప్రచారం సరేసరి.

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే లోపు అమెరికాలో మరోసారి సోషలిజం గురించి వక్రీకరణ ప్రచారం పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలు, సంక్షోభం నుంచి తేరుకోలేని తీరులో సోషలిజం గురించి అమెరికా యువతలో సోషలిజం గురించి మరింతగా చర్చ జరగటం తప్ప మరొక మార్గం లేదు. దాని మీద వ్యతిరేకతను, వక్రీకరణలను ఎంతగా ప్రచారం చేస్తే అంతగా దాని మంచి చెడ్డలు, వాస్తవాల గురించి చర్చ జరుగుతుంది. అది సోషలిజానికి మేలు చేస్తుంది. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి !