Tags
Attorney General KK Venugopal, ‘Stolen’ Rafale documents, Official Secrets Act, Rafale fighter jet, The Hindu
ఎం కోటేశ్వరరావు
అటు కేంద్రంలోనూ, ఇటు కొన్ని రాష్ట్రాలలోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తే పాలకులు తాము ప్రమాణం చేసిన మాదిరి అధికారిక రహస్యాలను కాపాడటం కంటే అవి మీడియాలో రాకుండా ఎలా చూడాలా, అందుకు మీడియాను ఎలా కట్టడి చేయాలి అన్నదాని మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు తాజా వుదాహరణ రాఫెల్ విమానాల కొనుగోలు లావాదేవీల అక్రమాలపై పునర్విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఆయన నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా ప్రభుత్వ ఆలోచన, కార్యాచరణకు ప్రతిబింబమే.
రాఫెల్ విమానకొనుగోళ్ల లావాదేవీలపై విచారణ జరపనవసరం లేదని గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దానిని పున:సమీక్షించాలని కొందరు పిటీషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈనెల ఆరున సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్కె కౌల్, కెఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్ విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభిస్తూ ఇప్పటికే రికార్డులలో వున్న అంశాల మీదనే పిటీషనర్లు పునర్విచారణ జరపాలని కోరాలని, దీనికి సంబంధించి ఇటీవల మీడియా ప్రచురించిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోదని ప్రకటించారు. ఆ సందర్భంగా జరిగిన వాదోపవాదాల సారాంశం ఇలా వుంది.
పిటీషనర్ ప్రశాంత భూషణ్ : మేము కోరిన సహాయ స్వభావాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నా పిటీషన్లో లావాదేవీని రద్దు చేయమని కోరలేదు, అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని మాత్రమే కోరుతున్నా. తీర్పు సమయంలో కోర్టు అనేక దోష పూరితమైన అంశాల మీద ఆధారపడింది. సీల్డుకవర్ నోట్స్‌ద్వారా దోషపూరితమైన అంశాలను ప్రభుత్వం సరఫరా చేసినందున అలా చేసి వుండవచ్చు. ఆర్ధిక నష్టం గురించి తెలిసి కూడా తప్పుడు అంశాలను కోర్టుకు నివేదించిన ప్రభుత్వ అధికారులను కూడా రప్పించాలి.
అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ : పిటీషనర్లు మరియు ది హిందూ పత్రిక రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అపహరించిన పత్రాల మీద ఆధారపడ్డారు. దీని గురించి అధికారిక రహస్యాల చట్టం మేరకు దర్యాప్తుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రభుత్వ పత్రాలను ప్రచురించిన రెండు ప త్రికలు, ఒక సీనియర్ న్యాయవాది మీద చర్యను మేము పరిశీలిస్తున్నాము. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించినది, పిటీషన్‌పై విచారణ జరపక ముందే కోర్టును ప్రభావితం చేసేందుకు వార్తా పత్రికలు ముద్రించాయి. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది.
ప్రశాంత భూషణ్: కోర్టుకు వాస్తవాలను నివేదించకుండా పిటీషనర్లను అడ్డుకొనే ప్రయత్నంగా ఎజి ప్రకటనలు వున్నాయి. అటువంటి చర్యల ద్వారా ఎజియే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.
ఏజి: (సమాచార హక్కు చట్టంలోని అంశాలను చదువుతూ ) రాఫెల్ గురించి రక్షణ పత్రాలను బహిర్గత పరచటాన్ని ఈ చట్టం మినహాయిస్తున్నది.(హిందూ పత్రిక ప్రచురించిన అంశాలను చదువుతూ) ఈ పత్రాల మీద రహస్యం అని రాసి వుంది, అవి బహిరంగపరచటానికి వుద్దేశించినవి కాదు. ఈ పత్రాలను ప్రపంచం మొత్తానికి ప్రచురించారు. అదెంత నష్టం చేకూర్చిందో చూడండి. ఎఫ్ 16విమానాలకు ప్రతిగా రాఫెల్‌జెట్ విమానాలు మన దేశ రక్షణకు అవసరం,ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన శిక్షణ కోసం పైలట్లను ఇప్పటికే పారిస్ పంపారు.
పధాన న్యాయమూర్తి : పునర్విచారణ పిటీషన్‌కు పరిమితం కండి పరిశీలించాల్సిందానిని మేమేదైనా వదలి వుంటే చూస్తాము.
జస్టిస్ కెఎం జోసెఫ్ : ఇక్కడ జాతీయ భద్రత అంశం వుత్పన్నం కాదు.దర్యాప్తు చేయాలా వద్దా అన్నది కోర్టు ముందున్న అంశం. అందుకోసం అపహరణకు గురైన సాక్ష్యాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది. సాక్ష్య చట్టంలో దీని గురించి స్పష్టంగా వుంది. ఒక వేళ అవినీతి జరిగి వుంటే అధికారిక రహస్యాల చట్టం కింద ప్రభుత్వం రక్షణ పొంద కూడదు.
ఎజి:(న్యాయమూర్తి జోసెఫ్‌తో విబేధిస్తూ) పత్రాలు ఎక్కడి నుంచి సేకరించారన్నది ముఖ్యం, విశేషాధికారం వున్న రక్షణ మంత్రిత్వశాఖ నుంచి పిటీషనర్లు వాటిని ఎలా సంపాదించారు? అధికారిక రహస్యాల చట్టాన్ని వుల్లంఘించారు అనే ప్రాతిపదికన పునర్విచారణ పిటీషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరుతున్నాను.
ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ : ఒక నిందితుడు అపహరణకు గురైన పత్రం అనేదాని ప్రాతిపదికన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే కోర్టు దానిని విస్మరించాలా ?
ఎజి:భారత్‌లో వున్న చట్టం ప్రకారం వనరు ముఖ్యం !
ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ : వనరు ముఖ్యం అనే సాధికారతను మాకు చూపండి.
ఏజి: 2004లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పశ్యంత్ వెల్లడించిన తీర్పులో చట్టవిరుద్ద పద్దతుల్లో సేకరించిన సాక్ష్యం మీద ఆధారపడకూడదని పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ : ఒక వ్యక్తి రహస్య పత్రాలను సంపాదించటం నేరపూరితమైన శిక్షకు అర్హునిగా అధికారిక రహస్యాల చట్టం పేర్కొన్నది. అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి, అయితే ఆ పత్రం చెల్లకుండా పోతుందా ?
ఏజి: కోర్టు అలాంటి పత్రాలను పట్టించుకోకూడదు.
న్యాయమూర్తి కెఎం జోసెఫ్ :ఏజి మన ముందుంచిన సూత్రాన్ని బోఫోర్స్ కేసుకు కూడా వర్తింపచేయాలా? ఆ కేసును కూడా అపివేయాలా ?
న్యాయమూర్తి ఎస్కె కౌల్ : ఆ పత్రాలు మా ముందుకు వచ్చాయి, మేము వాటిని పరిశీలించకూడదని మీరు చెప్పుకూడదు.
ఎజి: శత్రువుకు వ్యతిరేకంగా ఈ దేశం బతికి బట్టకట్టాలంటే ఈ కొనుగోళ్లు తప్పని సరి.
న్యాయమూర్తి కౌల్ : ఏజి వాదనలను అంగీకరించినప్పటికీ, ఒక వేళ కోర్టు వివేకాన్ని దెబ్బతీసేవిగా వుంటే కొన్ని అంశాలు వినటానికి తగినవే.
ఏజి: ఈ సమస్యకు రాజకీయ కోణం వుంది. పార్లమెంటు ముందు ఇప్పటికే కాగ్ నివేదికనుంచారు. అది ఈ సమస్యను పరిశీలిస్తుంది. అపహరించిన పత్రాల నుంచి కొన్ని భాగాలను ప్రచురించిన పత్రికల వార్తల ప్రాతిపదిన సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే విదేశాలకు చెడు సంకేతాలిచ్చినట్లు అవుతుంది.భవిష్యత్‌లో విదేశీ కంపెనీలు రక్షణ కొనుగోలు లావాదేవీల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి, లావాదేవీలు పార్లమెంట్, టీవీ ఛానల్స్, వార్తా పత్రికలు పరిశీలించిన తరువాత కోర్టులు చూస్తాయని అనుకుంటారు.భారతీయ వాయుసేనకు అత్యవసరంగా అవసరమైన జట్ విమానాల సేకరణ ఆలస్యం అవుతుంది.
ఈ కేసు తదుపరి విచారణ మార్చి 14కు సుప్రీం బెంచ్ వాయిదా వేసింది. కోర్టులో తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపటంతో న్యాయవాదులు, జర్నలిస్టుల మీద దర్యాప్తు, చర్యలు తీసుకోవటం లేదని తరువాత అటార్నీ జనరల్ వివరణ ఇచ్చినట్లు ఎడిటర్స్ గిల్డ్ తన ప్రకటనలో పేర్కొన్నది. అయినప్పటికీ ఇటువంటి బెదిరింపులతో తీవ్ర కలత చెందినట్లు, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపింది.
గతంలో కుహనా వార్తలను అదుపు చేసే పేరుతో జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని అక్రిడిటేషన్లను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదరించింది. ఇప్పుడు 1923లో బ్రిటీష్ ప్రభుత్వం చేసిన అధికారిక రహస్యాల చట్టాన్ని ముందుకు తెచ్చి దాని ప్రాతిపదికన చర్యతీసుకుంటామని బెదిరించారు. ఇది దేశ భద్రత కంటే అధికారంలో వున్న వారి అవినీతి, లావాదేవీలలోని అక్రమాలు బయటకు రాకుండా చూసే యత్నంగా వుంది. నిజానికి ఈ చట్టం 2005లో చేసిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నది. ప్రభుత్వానికి లేదా అధికారంలో వున్నవారికి ఇబ్బంది కలిగించే ప్రతి సమాచారాన్ని దేశ భద్రత పేరుతో తొక్కిపెట్టేందుకు వీలు కల్పిస్తున్నది. రెండు చట్టాల మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. 1998లో ప్రభుత్వ పెట్టుబడుల వుపసంహరణకు సంబంధించిన కేంద్రకాబినెట్ నోట్లోని అంశాలను ఒక జర్నలిస్టు బయటపెట్టినందుకు కేసు పెట్టారు. 2006లో ఒక కాశ్మీరు జర్నలిస్టు మిలిటరీ సమాచారాన్ని మిలిటెంట్లకు అందచేస్తున్నాడని అరోపించి కేసు పెట్టారు. తీరా విచారణలో ఆ సమాచారం బహిరంగంగా అందరికీ అందుబాటులో వున్నట్లు తేలింది. బోఫోర్సు నుంచి 2జి స్ప్రెక్ట్రమ్ కుంభకోణాల వరకు జర్నలిస్టులు బయటపెట్టినవే తప్ప ప్రభుత్వం వెల్లడించేందుకు ముందుకు రాలేదు. ఆ సమాచారం బయటకు వచ్చినందున దేశ భద్రతకు వాటిల్లిన ముప్పేమీ లేదు. రాఫెల్ కేసు కూడా అలాంటిదే. ప్రభుత్వం కొన్ని అంశాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నది. ఫ్రెంచి కంపెనీ అమ్ముతున్నది మనం కొనుగోలు చేస్తున్నాం, ఎన్నికొనుగోలు చేస్తున్నదీ బహిరంగమే. తేడా అల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎక్కువ ధర చెల్లిస్తున్నారని, ప్రభుత్వ కంపెనీని పక్కన పెట్టి ప్రయివేటు కంపెనీ ప్రయోజనం కోసం నిబంధనలను మార్చారని. దీనిలో దేశభద్రతకు వచ్చిన ముప్పేమిటో తెలియదు.
అటార్నీ జనరల్ చేసిన వాదన పర్యవసానాలు ఎలా వుంటాయో చూద్దాం. ఒక కేసు విచారణలో ఒక వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే సాక్ష్యాలను కోర్టు ముందుంచటంలో విఫలమయ్యాడు. వున్న ఆధారాల మేరకు అతను నేరం చేశాడని కోర్టు మరణశిక్ష విధిస్తుంది. అది అమలు గాక ముందే సదరు వ్యక్తికి చెందిన వారు నిందితుడిని నిర్దోషిగా నిరూపించే అధికారిక సాక్ష్యాన్ని అక్రమ పద్దతుల్లో సంపాదించి కోర్టు ముందు పెడితే అక్రమంగా సాక్ష్యాలను తెచ్చారు గనుక వినేది లేదు వురి వేయాల్సిందే అని కోర్టు చెప్పాల్సి వుంటుంది. రాఫెల్ లావాదేవీలను ఆసరా చేసుకొని ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటి వరకు బిజెపి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఏజి ద్వారా మీడియా రహస్య పత్రాలను అపహరించిందంటూ నిందలు వేస్తూ బెదిరింపులకు పూనుకుంది. ఈ వైఖరిని అడ్డుకోకపోతే ఈ ప్రభుత్వం లేదా రాబోయే పాలకులు మరొకరు ఈ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మరింతగా అమలు జరిపే ప్రమాదం పొంచి వుంది.