Tags

, , , , , ,

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.