Tags

, , ,

Image result for agriculture india

ఎం కోటేశ్వరరావు

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలనే నిర్ణయం, ప్రతికూల వాతావరణం కారణంగా భవిష్యత్‌ అయోమయంగా మారటంతో బ్రిటన్‌ రైతాంగానికి ఆత్మహత్యల ముప్పు తలెత్తిందని గార్డియన్‌ పత్రిక మార్చినెల మూడవ తేదీన ఒక వార్త ప్రచురించింది. మన దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైతాంగ ఆత్మహత్యల వార్తలను వింటున్న నేపధ్యంలో పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్న బ్రిటన్‌ రైతులు కూడా ఇలాంటి పరిస్ధితిలో వున్నారా అన్నది నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఐరోపా యూనియన్‌లో గణనీయంగా వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తున్న దేశాలలో బ్రిటన్‌ ఐదవ స్ధానంలో వుంది.అలాంటి చోట సగటున వారానికి ఒకరి కంటే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాలలో ఎక్కువగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మన దగ్గర ప్రమాదాలు జరిగినపుడు, వైద్యసాయం కోసం 108 సేవలు వున్నట్లే బ్రిటన్‌లో కూడా ఇబ్బందుల్లో వున్న జనం ఫోన్ల ద్వారా కొన్ని సంస్ధలకు తెలియచేస్తారు.ఇటీవల అలాంటి ఫోన్లు డజన్ల కొద్దీ వస్తున్నాయని, కొందరిని ఆత్మహత్యల నివారణ నిఘాలో వుంచినట్లు జాతీయ రైతు సంఘం(ఎన్‌ఎఫ్‌యు) తెలిపింది. మంచుతుపాన్లు, కరవు పరిస్థితులను ఎదుర్కొన్న రైతాంగం ఇప్పుడు ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లాలనే(బ్రెక్సిట్‌) నిర్ణయంతో మరింత అయోమయానికి గురైనట్లు పేర్కొన్నది. పలటానికి సిద్దం అవుతున్న టైం బాంబులా బ్రెక్సిట్‌ వుందని కొందరు వర్ణించారు. అదే జరిగితే ఒక్కొక్క గొర్రె లేదా మేకకు 25-30 పౌండ్లు( ఒక్కొక్క పౌండు విలువ 93-94 రూపాయల మధ్య వుంటుంది) నష్టపోతారని, రైతాంగాన్ని ఆదుకొనేందుకు సబ్సిడీలు తప్ప మరొక మార్గం లేదని వార్తలు వచ్చాయి.

కొంత మంది మేథావులు ఇటీవలి కాలంలో సబ్సిడీలు కోరేవారిని, మద్దతు ఇచ్చే వారిని చిన్న చూపుచూస్తున్నారు. దయాదాక్షిణ్యాలతో బిచ్చం వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇది తప్పుడు అవగాహన. వ్యవసాయం, పరిశ్రమలు లేదా సేవలకు సబ్సిడీలు లేకుండా నడిచే అవకాశాలను చూపి వ్యతిరేకిస్తే అర్ధం వుంది. అయితే ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. కార్పొరేట్‌ పద్దతుల్లో లేదా ఎగుమతి వాణిజ్యం కోసం పంటల సాగు చేసే వ్యవసాయదారులకు, తన కుటుంబం, దేశ అవసరాల కోసం సాగు చేసే వారి పట్ల ఒకే విధమైన వైఖరి అనుసరించాలా? కచ్చితంగా వుండకూడదు, తేడా వుండాలి.

Image result for agriculture india

అసలు ఈ సబ్సిడీలు లేదా రాయితీలు అనే డిమాండ్‌ లేదా విధానం ఎందుకు అమల్లోకి వచ్చింది ? ఆయా దేశాల్లో తలెత్తిన సంక్షోభం, అవసరాలు వాటిని ముందుకు తెచ్చాయి. రాబోయే రోజుల్లో తెస్తాయి. తాను చేసిన వాగ్దానం మేరకు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా మద్దతు ధరలను నిర్ణయించినట్లు మన ప్రధాని నరేంద్రమోడీ కొద్ది నెలల క్రితం వూదరగొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బిజెపి పాలిత రాష్ట్రాలలోని ఇతర జనంతో పాటు రైతాంగం ఆ పార్టీని సాగనంపారు. దీంతో దిమ్మెరపోయిన నరేంద్రమోడీ చిన్న రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం అందించే పధకాన్ని ఎన్నికల మొక్కుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ అనుభవాన్ని చూస్తే విదేశాల నుంచి వచ్చే చౌక దిగుమతులనుంచి తమ రైతాంగాన్ని రక్షించేందుకు, ప్రపంచ మార్కెట్లో పోటీకి తగిన విధంగా తయారు చేసేందుకు, ఇతర కారణాలతో సబ్సిడీలు ఇవ్వటం తెలిసిందే. తాజాగా వాణిజ్య యుద్ధంలో ఎదుటి దేశం మీద దాడి చేసేందుకు కూడా సబ్సిడీలను ఆయుధంగా ప్రయోగించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్తగా ప్రపంచానికి చాటాడు.

ముందుగా ప్రపంచంలో వ్యవసాయ రంగం ద్వారా ఆయా దేశాల్లో ఎంతశాతం మందికి వుపాధి లభిస్తోందో చూద్దాం. ప్రపంచ బ్యాంకు రూపొందించిన వివరాల మేరకు 2017లో సగటున ప్రపంచ వ్యాపితంగా 181 దేశాలలో 26.81శాతం మంది వుపాధి పొందుతున్నారు. అత్యధికంగా ఆఫ్రికాలోని బురుండీలో 91.44శాతం కాగా ఆసియాలోని సింగపూర్‌లో అత్యల్పంగా 0.12శాతం మంది వున్నారు. సగటు కంటే ఎక్కువ మంది ఆధారపడుతున్న దేశాలు 72 వున్నాయి. 26-27శాతం మధ్య ఈక్వెడార్‌, శ్రీలంక, కాంబోడియా, కిర్కిజిస్తాన్‌, బోట్సవానా వున్నాయి. మనది ఎగువ 72లో 42.74శాతమందితో 43వ స్ధానంలో వుండగా 42.02శాతంతో పాకిస్ధాన్‌ 44వదిగాను, బంగ్లాదేశ్‌ 39.07శాతంతో 52వ స్ధానంలో వుంది. మన పొరుగునే వున్న చైనా 17.51శాతంతో 94వ స్ధానంలో వుంది. అమెరికా 1.66 శాతంతో 167వ స్ధానంలో వుంది. దీన్ని బట్టి మనకు తేలుతున్నదేమంటే సగటు కంటే ఎక్కువ మంది వ్యవసాయంమీద వుపాధి పొందుతున్న ప్రతి దేశంలోనూ వ్యవసాయ సబ్సిడీలు అంటే అర్ధం కేవలం పంటల సాగుకు మాత్రమే కాదు, వుపాధికి కూడా ఇస్తున్నట్లుగా భావించాలి. సబ్సిడీలు ఇంకా ఇతర అనేక అంశాల మీద ఆధారపడి ఇస్తున్నారు. స్ధలాభావం రీత్యా ప్రతి దేశం గురించి చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు కనుక కొన్ని దేశాల గురించి చూద్దాం.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయానికి బ్రిటన్‌ లేదా దాని వలసలుగా వున్న కొన్ని దేశాలకు అవసరమైన ముడిసరకులు సరఫరా చేసే దేశంగా మాత్రమే వుంది. మన జనానికి సరిపడా ఆహార ధాన్యాలు పండే పరిస్ధితి కూడా లేదు. బెంగాల్‌ కరవుతో సహా అనేక కరవు పరిస్ధితులు అందుకు నిదర్శనం. స్వాతంత్య్రం తరువాత ఆకలి, మన అవసరాలను అవకాశంగా తీసుకొని కొన్ని ధనిక దేశాలు మనల్ని లంగదీసుకొనేందుకు ప్రయత్నించాయి. అమెరికాలో చేసిన పబ్లిక్‌ లా 480(పిఎల్‌ 480)ని ఆధారం చేసుకొని అక్కడి నుంచి ఆహార ధాన్యాలను మన దేశ మార్కెట్లో కుమ్మరించారు. ప్రచ్చన్న యుద్దంలో సోవియట్‌ యూనియన్‌వైపు మొగ్గుచూపిన మన దేశాన్ని తనవైపు తిప్పుకోవటం కూడా దీని తెరవెనుక లక్ష్యం. ఈ పూర్వరంగంలో అమెరికా మీద ఆధారపడకుండా వుండేందుకు మన ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం 1960 దశకంలో హరిత విప్లవానికి చర్యలు తీసుకుంది. అందరికీ తెలిసిన ఎంఎస్‌ స్వామినాధన్‌ చొరవతో అధిక దిగుబడి గోధుమ వంగడాల తయారీకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగమే జై కిసాన్‌, జై జవాన్‌ నినాదం.

అమెరికా నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాల గురించి సంతృప్తి లేదా భ్రమలు కావచ్చు. నాటి విధాన నిర్ణేతలు స్వాతంత్య్రం తరువాత తొలి ప్రాధాన్యత పారిశ్రామికీకరణకు ఇచ్చారు.1956 నాటి అమెరికా పిఎల్‌ 480 చట్టం కింద చౌక ధరలకు ధాన్యం దిగుమతి కారణంగా మన దేశంలో ధరలు పడిపోవటం లేదా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం రాకపోవటం వంటి సమస్యలతో గ్రామీణ భారతంలో అసంతృప్తి ప్రారంభమైంది. అది వ్యవసాయ వుత్పత్తి పడిపోవటం లేదా ఎదుగుదల నిలిచిపోవటానికి దారి తీసింది. రెండవది రాజకీయంగా ప్రచ్చన్న యుద్దంలో అమెరికా వత్తిడి పెరగటం వంటి కారణాలు కూడా తోడై 1950దశకం చివరిలో వ్యవసాయ రంగం మీద కేంద్రీకరణతో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా రాయితీ ధరలకు సంకరజాతి విత్తనాల సరఫరా, విద్యుత్‌, ఎరువుల రాయితీలు, విస్తరణ సేవల వంటి వాటికి తెరతీశారు.

అమెరికాలో కూడా పారిశ్రామిక విప్లవంతో తయారైన వస్తువులకు మార్కెట్‌ను కల్పించేందుకు భూమి లేని వారికి భూమి ఇచ్చి ఆదాయం కల్పించేందుకు అనేక చర్యలలో భాగమే పెద్ద ఎత్తున ఇస్తున్న సబ్సిడీలు. అమెరికాలో భూ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసే క్రమంలో 1862లో అనేక మందికి ప్రభుత్వం భూమి కేటాయించింది. అలా భూమి పొందిన వారికి అవసరమైన పెట్టుబడులు, ఇతర అవసరాల కోసం రుణాలు ఇచ్చేందుకు, విస్తరణ సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలు కూడా సాగు సబ్సిడీలలో భాగమే. తెలుగు రాష్ట్రాలలో కూడా 1970దశకంలో భూమి అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా అమెరికా వ్యవసాయ రంగం కూడా కుదేలైంది.1929లో ధరల పతనాన్ని నివారించేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాన్ని చేశారు. పంటల సాగును తగ్గించాలని రైతులను కోరారు. ప్రభుత్వమే వుత్పత్తులను కొనుగోలు చేసి నిల్వచేసింది. తరువాత అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ న్యూ డీల్‌ పేరుతో అనేక చర్యలను ప్రకటించి మహా సంక్షోభం నుంచి గట్టెంకించేందుకు ప్రయత్నించాడు. దానిలో భాగంగా వ్యవసాయ సబ్సిడీలను అమలులోకి తెచ్చాడు. అవి రూపాలను మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతున్నాయి. 1999 నాటికి వ్యవసాయ సబ్సిడీలు రికార్డు స్దాయికి 22 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 1995-2010 మధ్య ఏడాదికి అన్ని రకాల వ్యవసాయ సబ్సిడీలు 52బిలియన్‌ డాలర్లకు చేరాయి.ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో చిన్న రైతాంగం దెబ్బతిన్నారు. ఒబామా సర్కార్‌ వ్యవసాయ, ఆహార సబ్సిడీలకు కోత పెట్టేందుకు ప్రతిపాదించి ఆమేరకు తగ్గించివేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రానున్న పది సంవత్సరాలలో ఆహార, వ్యవసాయ పరిశోధనలు, సబ్సిడీలకు 867బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించింది. చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దాని వలన జరిగే నష్టాన్ని భరించేందుకు రైతాంగానికి 12బిలియన్‌ డాలర్ల ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే.

అమెరికాలో వ్యవసాయ సబ్సిడీలను వ్యతిరేకించేవారు లేకపోలేదు. వారు చేస్తున్న కొన్ని వాదనలను చూద్దాం. పంటల బీమా పధకం కారణంగా రెతులు అనావృష్టికి తట్టుకోలేని పంటల విత్తనాలను నాటి పరిహారాన్ని పొందేందుకు మొగ్గు చూపుతున్నారు తప్ప అనావృష్టిని తట్టుకొనే రకాల సాగువైపు మొగ్గటం లేదు. కరవు ప్రాంతాల్లో సాగు వలన భూగర్భ జలాలను విపరీతంగాఆ రైతులు వాడుతున్నారు, ఇప్పుడున్న మాదిరి నీటి వెలికితీత కొనసాగితే ఈ శతాబ్ది అంతానికి అనేక జలాశయాలు ఎండిపోతాయి. ఇప్పటికే కొన్ని ఆ దశలో వున్నాయి. వాటిని తిరిగి వర్షపు నీటితో నింపాలంటే ఆరువేల సంవత్సరాలు పడుతుంది. మొక్కజన్న రైతాంగాన్ని నిరుత్సాహపరచాలి, 40శాతం వుత్పత్తి పశుదాణాకు మరలుతోంది. సబ్సిడీల కారణంగా ఎథనాల్‌ తయారీ కోసం కూడా రైతులు మొక్కజన్న సాగు చేస్తున్నారు. ఎథనాల్‌ తయారు చేసేందుకు ఏడాదికి 120బిలియన్‌ గ్యాలన్ల నీరు వృధా అవుతోంది. టెక్సాస్‌ రాష్ట్రంలో పత్తి రైతులకు ఏటా మూడు బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని చైనాకు ఎగుమతి చేసి అక్కడ చౌకగా తయారయ్యే దుస్తులను తిరిగి దిగుమతి చేసుకుంటున్నారు. ఆహార ధాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్న కారణంగా కూరగాయలు, పండ్లకంటే చౌకగా లభిస్తున్నందున అమెరికన్ల సగటు ఆహారంలో నాలుగో వంతు ధాన్యాలే ఆక్రమిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు పదిశాతం కంటే తక్కువగా వున్నాయి. వ్యవసాయ సబ్సిడీల్లో ఆరుశాతం వూబకాయాలను పెంచే ఆహారానికి మరలుతున్నది.సబ్సిడీలు గ్రామీణ అమెరికాలో భూముల ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఖర్చులను తగ్గించే ఆలోచనలకు రైతులను దూరం చేస్తున్నాయి. కొన్ని పంటలకు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు.అమెరికా రైతులకు రాయితీలు అవసరం లేదు, ఎందుకంటే అత్యంత అనుకూలమైన ప్రాంతాలు అక్కడ వున్నాయి. కావలసినంత సారవంతమైన భూమి, నీరు అందుబాటులో వుంది. ఇతర పరిశ్రమల మాదిరే వ్యవసాయం కూడా సమస్యలను ఎదుర్కొంటోంది తప్ప వేరే కాదు కనుక దానికి ప్రాధాన్యత పెద్ద పీట వేయనవసరం లేదు. నాలుగు వందల మంది అత్యంత ధనవంతుల్లో 50 మంది వ్యవసాయ రాయితీలు పొందారు, 62శాతం సాగుదార్లకు అసలు రాయితీలు లేవు. ఎగువన వున్న ఒకశాతం మంది 26శాతం సబ్సిడీలు పొందారు. అమెరికా సబ్సిడీల వివాదం కారణంగానే దోహా దఫా చర్చలు, ఇతర వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి.

1930లో అమెరికా జనాభాలో 25శాతం అంటే మూడు కోట్ల మంది 65లక్షల కమతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు.అందువలన వారి ఆర్దిక స్ధితిని స్ధిరపరచటానికి సబ్సిడీలను ఒక మార్గంగా ఎంచుకున్నారు. 2012నాటికి కమతాలు 21లక్షలకు, వ్యవసాయం మీద ఆధారపడే జనాభా ముప్పైలక్షలకు తగ్గిపోయింది. తరువాత సంవత్సరాల్లో మరింత తగ్గుతుందని అంచనా. ఇంత తక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వారు వున్నా సాగు గిట్టుబాటు కావటం లేదని, సబ్సిడీలు అవసరమని చెబుతున్నారు.2011లో వ్యవసాయ రంగం నుంచి నిఖర ఆదాయం 94.7 బిలియన్లు అయితే 2018లో అది 59.5 బిలియన్లకు తగ్గిపోతుందని అంచనా. అమెరికా సబ్సిడీ మొత్తాలలో 15శాతం పెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్దలు 85శాతం సబ్సిడీలను పొందుతున్నాయని కాటో సంస్ధ పేర్కొన్నది.1995-2016 మధ్య ఏడు రాష్ట్రాలు 45శాతం మేరకు సబ్సిడీలను పొందాయని పర్యావరణ బృందం పేర్కొన్నది. సబ్సిడీలు చిన్న రైతుల కంటే పెద్ద రైతులు అదీ పత్తి, సోయా, మొక్కజన్న, గోధుమ, వరి పండించే వారే ఎక్కువ భాగం పొందారని తెలిపింది. 2014లో చేసిన చట్టం ప్రకారం చురుకుగా సాగులో నిమగ్నమయ్యే ఒక రైతు గరిష్టంగా ఏడాదికి లక్షా 25వేల డాలర్లు మాత్రమే (మన రూపాయల్లో 88లక్షల రూపాయలు) పొందటానికి అర్హుడని విధించిన నిబంధనను తుంగలో తొక్కుతున్నారని కూడా వెల్లడించింది.

సబ్సిడీలు కొనసాగాలనే వారి వాదన ఎలా వుందంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఇస్తున్న రాయితీల వలన అక్కడి రైతులు వాణిజ్యపరంగా అన్యాయమైన రీతిలో ప్రయోజనం పొందుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ రాయితీల మొత్తాన్ని తగ్గిస్తున్న కారణంగా ధనిక దేశాల నుంచి ప్రపంచ ధాన్య నిల్వలకు తోడయ్యే మొత్తం తగ్గిపోతుంది. ఆహార లభ్యత తగ్గి ఆహార ధరలు తీవ్ర వడిదుడుకులకు గురవుతాయి.తుపాన్లు, అనావృష్టి, యుద్ధాలు, మాంద్యాల వంటి వాటి నుంచి రైతులను ఆదుకోవాలి, ఇతర వాణిజ్య వుత్పత్తుల కంటే ఆహారం ముఖ్యం. డాలరు విలువ పెరిగితే ఇతర దేశస్ధులు కొనేందుకు ముందుకు రారు.

ప్రభుత్వ రంగ సంస్ధలను ఆధారం చేసుకొని ఎదిగిన పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్దలు అవసరం లేదు మేమే అన్ని పరిశ్రమలు నెలకొల్పుతాం, సబ్సిడీలు మాకే ఇవ్వండని మన దేశంలో చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ సబ్సిడీలకు కూడా వ్యతిరేకమైన వాదనలు ముందుకు తెస్తున్నారు. దీని వెనుక అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. సబ్సిడీ విధానాలు వనరులను సక్రమంగా వినియోగించటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. మారుతున్న మధ్యతరగతి ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం ఆహారంలో కూరగాయలు, మాంసవుత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ధాన్య డిమాండ్‌ తగ్గుతోంది. ప్రస్తుత విధానాలు దీనికి అనుగుణంగా లేవు. వరి, గోధుమ పంటలు సాగు భూమిలో నాలుగింట మూడు వంతులు, మొత్తం విలువలో 85శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ పంటలు ఇప్పటికే మిగులుగా వున్నాయి, రైతులకు ఇతర పంటలకు ప్రోత్సాహం లేనందున వీటిని కొనుగోలు చేసే హామీ వున్నంత కాలం ఇవే కొనసాగుతాయి. మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా వుత్పత్తిదారులు స్పందించే విధంగా ప్రస్తుత విధానాలను మార్చాల్సి వుంది. వనరులను అధికంగా వినియోగించటం ద్వారా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. భూమిలో చేరే నీటి కంటే రెండు రెట్లు దాని నుంచి తీసుకుంటున్నారు.నీటి లభ్యత తగ్గిపోయే కొద్దీ బోర్లను లోతుగా వేస్తూ విద్యుత్‌ అధిక వినియోగ సమస్యను పెంచుతున్నారు. రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు.

వివిధ దేశాలు లేదా కూటముల మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాలు కొత్త సమస్యలను, సబ్సిడీలను ముందుకు తెస్తున్నాయి. వుదాహరణకు పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య (టిపిపి) వాణిజ్య ఒప్పంద ప్రకారం కిలో పందిమాసం లేదా పంది వారుపై జపాన్‌లో విధిస్తున్న 482ఎన్‌లను పదిహేను సంవత్సరాల వ్యవధిలో 50ఎన్‌లకు తగ్గించాల్సి వుంది. దీనివలన పన్ను తగ్గేకొద్దీ విదేశీ మాంసం జపాన్‌లో ప్రవేశించి స్ధానిక పందుల పెంపక రైతులకు ఆదాయాల మీద ప్రభావం చూపుతుంది. అందువలన జపాన్‌ సర్కార్‌ వారికి సబ్సిడీలను పెంచేందుకు పూనుకుంది. గతంలో 1994-2001 మధ్య వురుగ్వే దఫా ఒప్పందం వలన జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 6.1లక్షల ఎన్‌లను సబ్సిడీగా జపాన్‌ అందచేసింది. నలభై దేశాలకు సంబంధించి గత రెండు దశాబ్దాలలో సబ్సిడీల గురించి విశ్లేషించిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు చెబుతున్నదాని ప్రకారం సగటున ఒక శాతం విదేశీ దిగుమతులు పెరిగితే 0.2శాతం మేరకు సబ్సిడీల కోసం ప్రభుత్వ ఖర్చు పెరుగుతోంది. అయితే దీనికి భిన్నంగా విదేశీ దిగుమతులపై పన్ను పెంపు కారణంగా ట్రంప్‌ సర్కార్‌ దానికి పరిహారంగా రైతులకు సబ్సిడీ అందిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయాపై చైనా 20శాతం పన్నులను పెంచటంతో అమెరికా మార్కెట్లో 20శాతం మేరకు ధరలు పడిపోయాయి. దీని ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద పడకుండా చూసేందుకు ట్రంప్‌ కొత్త సబ్సిడీలను ముందుకు తెచ్చారు. సబ్సిడీలను రాజకీయవేత్తలు తమ రాజకీయ ప్రయోజనాలకు కూడా వినియోగించుకోవటం అంటే ఇదే.గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా గ్రామీణ రైతాంగ వ్యవసాయ ఆదాయాలు తిరోగమనంలో వున్నాయి. ఫలితంగా రైతుల రుణ భారం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 13.8బిలియన్లు పెరిగి 406.9 బిలియన్‌ డాలర్లకు చేరింది.2019లో తమ పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశాభావం వెలిబుచ్చిన వారు 22శాతం మందే వున్నారు. గత పది సంవత్సరాలలో దివాలా తీస్తున్న రైతుల సంఖ్య వున్నతస్ధాయికి చేరింది. 2013లో నిఖర వ్యవసాయ ఆదాయం 134.8 బిలియన్‌ డాలర్లుండగా 2018లో 66.3కు పడిపోయింది. రానున్న ఐదు సంవత్సరాలలో కూడా సగటున 77.3బిలియన్లకు మించదని అంచనా వేస్తున్నారు.

ఐరోపా యూనియన్‌(ఇయు)లో 2021-2027 మధ్య వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించారు. యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చే నిధులు ఆగిపోనున్న పూర్వరంగంలో ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే బ్రిటన్‌ వాటా కూడా రద్దవుతున్న కారణంగా సబ్సిడీల మొత్తం కూడా తగ్గే అవకాశం కూడా వుంది. వుమ్మడి వ్యవసాయ విధానంలో భాగంగా ఇయు సభ్య దేశాలకు సబ్సిడీ మొత్తాలను కేటాయిస్తారు. ప్రస్తుతం 365బిలియన్‌ యూరోలను ప్రతిపాదించారు. ఎంత మేరకు కోత పెడతారనేది ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి బ్రిటన్‌ తప్పుకోవటమా లేదా అన్నది తేలిన తరువాత వెల్లడి కావచ్చు. గరిష్టంగా లక్ష యూరోలకు పరిమితం చేయాలని, అరవై వేల యూరోలకు మించిన వాటిమీద ఎంత మేరకు కోత పెట్టాలనేది నిర్ణయిస్తారు. చిన్న, మధ్యతరగతి రైతాంగానికి ఎక్కువ మొత్తం చెల్లించాలనే ఆదేశాన్ని నిబంధనల్లో చేర్చాలని ప్రతిపాదించారు.

Image result for andhra pradesh agriculture

ఐరోపా యూనియన్‌లో ఆహార పంటలకే కాదు ద్రాక్ష సారా(వైన్‌)కు కూడా సబ్సిడీలు ఇస్తున్నారనే అంశం చాలా మందికి తెలియదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ప్రపంచమంతటా వుంది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే ఐరోపాలో దాన్ని దెబ్బతీసే ద్రాక్షసారాకు సబ్సిడీలు ఇవ్వటం వెనుక లాభాలు తప్ప ఆరోగ్యం కాదన్నది స్పష్టం. రెండు రకాల పద్దుల కింద ఈ సబ్సిడీలు ఇస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఐరోపా వైన్‌ వుత్పత్తిదారులు ఇతరులతో మార్కెటింగ్‌ పోటీలో నిలవాలన్నదే. అంటే పోటీబడి తాగుబోతులకు సరఫరా చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ సబ్సిడీ మొత్తాలు పెరుగుతున్నాయి. ఈ నిధులలో 90శాతం స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ వుత్పత్తిదార్లకే చేరుతున్నాయి. 2014-18 మధ్య ఆరు బిలియన్ల యూరోలు సబ్సిడీ ఇచ్చారు.2007-13 సంవత్సరాలలో క్యాన్సర్‌పై పరిశోధనలకు కేటాయించిన మొత్తం 150 కోట్ల యూరోలు మాత్రమే. 2009-15 మధ్య వైన్‌ ఎగుమతులలో పెరుగుదల ద్వారా 67.1కోట్ల యూరోల ఆదాయం వచ్చింది. ఇందుకోసం చేసిన ఖర్చు 69.2బిలియన్‌ యూరోలు. దీన్ని సులభంగా అర్దమయ్యేట్లు చెప్పాలంటే కంపెనీల 97యూరోల సంపాదనకు జనం సొమ్ము 100 యూరోలు ఖర్చు చేశారు.టర్కీలో పశుసంవర్ధన, వ్యవసాయదార్లకు అంతకు ముందున్న మొత్తంపై 2018లో 15శాతం పెంచుతూ సబ్సిడీ బడ్జెట్‌ను ఆమోదించారు. రైతులు వాడే పెట్రోలు, డీజిల్‌ ఖర్చులో సగం మొత్తాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికన్లు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వ్యవసాయ సబ్సిడీ ఇస్తూనే మరోవైపు ఇతర దేశాల మీద ఎదురుదాడి చేస్తున్నారు. దోహా చర్చలు విఫలం కావటానికి ఇదొక కారణం. మన దేశంలో మద్దతు ధరలు ఎక్కువగా వున్నాయంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో) లో ఫిర్యాదు చేసిన అమెరికా మన పొరుగు దేశం చైనాను కూడా వదల్లేదు. అందువల్లనే సబ్సిడీల గురించి వుమ్మడిగా పోరాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి. డబ్ల్యుటివోలో అంగీకరించిన మొత్తం కంటే చైనా ధాన్య రైతులకు ఎక్కువ సబ్సిడీ ఇస్తోందని అమెరికా ఫిర్యాదు చేసింది. చైనా తీసుకున్న ఈ చర్యల వలన అమెరికన్‌ రైతులు తమ ప్రపంచ స్ధాయి వుత్పత్తులను చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారన్నది దాని సారాంశం. 2015లో దిగుమతి చేసుకున్న మొక్కజన్నల కంటే తమ రైతాంగానికి 40శాతం అదనంగా ఇచ్చిందని 2016లో అది 50శాతానికి చేరినట్లు విశ్లేషకులు రాశారు.

ఎగుమతి మార్కెట్లో అందరికీ సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. నిజానికి అది ధనిక దేశాల ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ధనిక దేశాల ఆటలను సాగకుండా వర్ధమాన దేశాలు పతిఘటించటం, ధనిక దేశాలైన ఐరోపా-అమెరికా మధ్య విబేధాలు తలెత్తటం దీనికి కారణం. ఇంతవరకు గతంలో ధనిక దేశాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు అవి సబ్సిడీలను తగ్గించలేదు. మరోవైపు తమ ఆధిపత్యాన్ని వుపయోగించుకొని సభ్య దేశాలో ద్వైపాక్షిక ఒప్పందాలను రుద్దేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. సబ్సిడీ నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నాయి. మన దేశంలో కనీస మద్దతు ధరల ప్రకటన కూడా సబ్సిడీగానే పరిగణిస్తున్నది. ప్రపంచ ధరలు అత్యంత కనిష్ట స్ధాయిలో వున్న 1986-88నాటి మార్కెట్‌ ధరల ప్రాతిపదికన ఇప్పుడు అంటే 30సంవత్సరాల తరువాత సబ్సిడీలను లెక్కించటం తప్పుడు లెక్కలు తప్ప మరొకటి కాదు. ఈ విధానం సహజంగానే సబ్సిడీ ఎక్కువ వున్నట్లు చూపుతుంది.వర్తమాన విలువ ప్రకారం చూస్తే సగటున ఒక రైతుకు ఏడాదికి డాలర్లలో ఇస్తున్న మొత్తాలు ఇలా వున్నాయి.అమెరికా 68,910, జపాన్‌ 14,136, ఐరోపాయూనియన్‌ 12,384, బ్రెజిల్‌ 468, చైనా 348, భారత్‌ 228, ఇండోనేషియా 73 డాలర్లు ఇస్తున్నది. మన వంటి దేశాలకు వస్తువిలువలో పదిశాతం వరకు రాయితీలు ఇచ్చేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అనుమతిస్తున్నాయి. భారత్‌, చైనా, ఇండోనేషియా,ఈజిప్పు వంటి దేశాలు ఇంకా ఆ స్ధాయికి చేరుకోలేదు అంటే ఇంకా రాయితీలు ఇవ్వవచ్చు. అయినా అమెరికా మన మీద, చైనా మీద డబ్ల్యుటిఓలో ఫిర్యాదు చేసిందని ముందే చెప్పుకున్నాము. ధనిక దేశాలు తమ వద్ద వున్న మిగులును మనవంటి దేశాల మీద కుమ్మరించేందుకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తుంటే వర్ధమాన దేశాలు వున్న వుత్పత్తిని నిలబెట్టుకొనేందుకు, అవసరాలకు సరిపడా పెంచుకొనేందుకు రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇదే తేడా, దీన్ని గమనించకుండా సబ్సిడీలంటే సబ్సిడీలే ఎవరు ఇస్తున్నా ఎత్తివేయాల్సిందే అని వితండ వాదనలు చేసే వారిని ఏ బాపతు కింద జమకట్టాలో రైతాంగమే నిర్ణయించుకోవాలి.