Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.