ఎం కోటేశ్వరరావు
కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై వుగ్రవాదులు జరిపిన దాడి తరువాత మన దేశానికి మద్దతుగా పాకిస్ధాన్ మీద వత్తిడి తెస్తున్నట్లు అమెరికా పెద్ద ఫోజు పెట్టింది. దానికి పరాకాష్టగా ఐక్యరాజ్యసమితిలో జైషే మహమ్మద్ సంస్ధ నేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించాలనే తీర్మానం గురించి కొద్ది రోజులు వూదరగొట్టింది. ప్రధాన స్రవంతి మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. పాకిస్ధాన్‌లో వుగ్రవాద మూకలకు అన్ని విధాలుగా శిక్షణ ఇప్పించి మన మీదకు వుసిగొల్పి వారిని పోషించటానికి ఆర్ధికంగా దశాబ్దాలపాటు సాయపడి వెన్నుదన్నుగా వున్నది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న లోకోక్తి తెలిసిందే. వుగ్రవాదులను తొలుత పెంచి పోషించినా,తరువాత వారి మీద చర్యలు తీసుకున్నా లేదా తీసుకున్నట్లు నటించినా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. ఒకవైపు వుగ్రవాదానికి వ్యతిరేకంగా మనకు టన్నుల కొద్దీ సానుభూతి ప్రకటనలు తప్ప ఆచరణలో అంతకు మించిమరేమీ లేదు. మరోవైపు మనలను ఆర్ధికంగా దెబ్బతీసే నిర్ధిష్ట చర్యలకు అమెరికా తెరతీసింది. ఇండో-అమెరికా భాయీ భాయీ అన్నట్లుగా నరేంద్రమోడీ-డోనాల్డ్ ట్రంప్ కౌగిలింతల దౌత్యం వికటించిందా ?
కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బట్టి చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వెల్లడిస్తున్నారు. నిజంగా అది జరుగుతుందా లేదా అన్నది పెద్ద సందేహం. దాని గురించి తలబద్దలు కొట్టుకోనవసరం లేదు. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మరొకటేదీ పట్టదు. అందువలన ఒక చోట రాజీపడినా మరొక రంగం మీద అది దృష్టి సారిస్తుంది. నీతి అయోగ్ వుపాధ్యక్షుడిగా పనిచేసిన అరవింద్ పనగారియా మార్చి13న రాసిన ఒక వ్యాఖ్యానంలో వాణిజ్య యుద్ధంలో ట్రంప్ తదుపరి లక్ష్యం భారత్ అని పేర్కొన్నారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల పర్యవసానంగా కొన్ని దశాబ్దాలుగా మన దేశానికి అమెరికా వర్తింప చేస్తున్న సాధారణ సానుకూల ప్రాధాన్యతను(జిఎస్‌పి) రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు మార్చినెల నాలుగవ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. తమ వస్తువుల దిగుమతులను అడ్డుకుంటున్న పన్నులను భారత్ తగ్గించటం లేదని, ఇతర విధాలుగా అడ్డుకుంటోందని ట్రంప్ ఆగ్రహం వెలిబుచ్చాడు. ఒకవేళ ఆ సౌకర్యం రద్దయినా మనకు పెద్దగా నష్టం లేదని, మనం కూడా అమెరికా మీద ప్రతిచర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 21బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులులో వుంది. దీన్ని సమం చేసేంత వరకు అమెరికా ఇలాంటి బెదిరింపులు చేస్తూనే వుంటుంది.
అసలే మన ఎగుమతులు పడిపోతూ వివిధ దేశాలతో వాణిజ్యలోటులో వున్నాం. మునిగిపోయే స్ధితిలో వున్న నావ గడ్డిపోచను కూడా భరించలేదన్న విషయం తెలిసిందే. కొందరు వర్ణిస్తున్నట్లు అమెరికా చర్య గడ్డిపోచ వంటిదే అనుకోవటానికి లేదు. నయానో భయానో మన మార్కెట్‌ను తన వస్తువులతో నింపి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్నది అమెరికా లక్ష్యం. సదరు జిఎస్‌పి జాబితాలోని ఎగుమతులు ఒక స్ధాయి దాటిన తరువాత వర్తించే రాయితీలు రద్దవుతాయి. అందువలన అనేక అంశాలను పరిశీలించినపుడు మనకు చేసే హెచ్చరిక ఒక సాకు తప్ప దాని వెనుక పెద్ద అజెండాయే వుందని చెప్పవచ్చు. అమెరికా ప్రకటించిన జిఎస్‌పి ఒక్క మన దేశానికే ఇచ్చిన ప్రాధాన్యత కాదు, అనేక వర్ధమాన దేశాలకు వేసిన ఎర అది. ప్రపంచంలో అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయి, దీనికి మన దేశం మినహాయింపు కాదు, అవసరం కూడా. అవి లేకపోతే మన పరిస్ధితి మరింతగా దిగజారి వుండేది. అమెరికా అనుకున్న విధంగా మనదేశం దిగుమతి పన్నులను తగ్గించి మార్కెట్‌ను తెరవలేదు. అందుకే ట్రంప్ మన దేశాన్ని పన్నుల రాజు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇటీవలి మనదేశ నిర్ణయాలు అంటే సమాచారాన్ని స్ధానికంగానే అంటే భారత్‌లోనే భద్రపరచాలి, ఆన్‌లైన్ వాణిజ్య వుత్పత్తుల అమ్మకాలపై ఆంక్షల వంటి చర్యలు అమెజాన్, వాల్‌మార్ట్ వంటి కంపెనీలకు అంగీకారం కాదు.హెచ్1బి వీసాలు, పని అనుమతుల మీద అమెరికా ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చే అల్యూమినియం, వుక్కు దిగుమతులపై ఆంక్షల వంటి చర్యలను అమెరికా తీసుకుంది. ఇవన్నీ మనకు నష్టం కలిగించేవే. దీనికి ప్రతిగా అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువులు, సరకులపై దిగుమతి పన్నులు పెంచుతామని మన దేశం హెచ్చరించింది. అందుకుగాను ఏప్రిల్ ఒకటవ తేదీని గడువుగా ప్రకటించింది.జిఎస్‌పి సౌకర్యాన్ని భారత్‌కు వుపసంహరిస్తే ఆ జాబితాలోని వస్తువులు సరఫరా చేయటానికి చైనా సిద్దంగా వుంది.వుదాహరణకు 25,50కిలోల పాకింగ్ సంచులు, షాపింగ్, కారీబ్యాగ్‌లు తయారు చేసే పరిశ్రమలు అమెరికాలో లేవు. వాటిని మనవంటి ఇతర దేశాల నుంచి చౌకగా పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని తయారు చేసే చిన్న పరిశ్రమలు గత మూడు సంవత్సరాలుగా మన దేశంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
అమెరికా తన వాణిజ్య, రాజకీయ ప్రయోజనాల కోసం మనవంటి దేశాలను తన పాటకు అనుగుణ్యంగా నృత్యం చేయాలని డిమాండ్ చేస్తోంది.ఇరాన్, రష్యాల మీద అది విధించిన ఆంక్షలను మూడోపక్ష దేశాలు కూడా అమలు జరపాలని వత్తిడి చేస్తోంది. దానిలో భాగంగానే మన దేశం వెనెజులా, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదు అని శాసిస్తోంది. దానికి తలగ్గిన మోడీ సర్కార్ ఇరాన్ నుంచి గణనీయంగా చమురు దిగుమతులను తగ్గించింది. అయినా అమెరికాకు సంతృప్తి లేదు. సరిగ్గా ఎన్నికల సమయాన్ని ఎంచుకొని మన దేశం మీద వత్తిడి చేయటం వెనుక బ్లాక్‌మెయిలింగ్ కనిపిస్తోంది. జిఎస్‌పి రద్దు చేస్తామని అనటం అంటే మన దేశం మీద మరిన్ని చర్యలు వుంటాయని బెదిరించటమే. ఎన్నికల వేళ తీసుకొనే నిర్ణయాల పర్యవసానాలు ఎలా వుంటాయో అన్న సంశయం వుంటుంది కనుక కొత్త లోక్‌సభ కొలువు తీరే వరకు ఎలాంటి చర్యలు వుండకపోవచ్చు. ఒక వేళ అనూహ్యంగా నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వచ్చినా, లేక బిజెపిఏతర సర్కార్ వచ్చినా మెడమీద కత్తిలా బెదిరింపు వేలాడుతూ వుంటుంది. తద్వారా తన షరతులకు లంగతీసుకోవచ్చు లేదా వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించవచ్చు అన్నది స్పష్టమే. జిఎస్‌పి మనకు ఎలా లాభమో చూద్దాం. 2017లో మన దేశం చేసిన 49బిలియన్ డాలర్ల ఎగుమతులలో జిఎస్‌పి వస్తువుల వాటా 5.6బిలియన్‌లు, అంటే పదకొండుశాతం. అంటే ఆ మేరకు మన వస్తువులను అమ్ముకోవటం కష్టం అవుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి తయారీదార్లు నష్టపోతారు. ఆమేరకు అమెరికా కూడా నష్టపోతుంది. అంతే కాదు మన దేశం విధించే ప్రతికూల పన్నులతో దాని పదిబిలియన్ డాలర్ల ఎగుమతులు కూడా దెబ్బతింటాయి.
మన మీద డోనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం కలగటానికి కారణం ఏమిటి? ట్రంప్ ఆంక్షలను తిరస్కరించి రష్యా నుంచి మనం మూడు బిలియన్ డాలర్ల అణుశక్తి అకుల జలాంతర్గామిని అద్దెకు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం, ఏడు బిలియన్ డాలర్ల విలువగల ఎస్-400 క్షిపణి మరియు రక్షణ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాము. అమేథీలో ఏడున్నర లక్షల ఏకె-203 రైఫిళ్లతయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రష్యాతో సంయుక్త ఒప్పందం చేసుకున్నాము. గత పది సంవత్సరాల కాలంలో రష్యా సహకారంతో 170 మిలిటరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాము. అమెరికా నుంచి మనకు లేనివి రష్యా నుంచి మనకు రెండు సానుకూలతలు వున్నాయని మాజీ సైనికాధికారి, ప్రస్తుతం రక్షణ వ్యవహారాలను ప్రచురించే పత్రిక సంపాదకుడిగా వున్న ప్రవీణ్ స్వామి పేర్కొన్నారు. అమెరికా కంటే రష్యా మరింత టెక్నాలజీ అందచేస్తుంది, పుతిన్ చెప్పేదానిని గ్జీ జింపింగ్ వింటారు, చైనా నుంచి వ్యూహాత్మక రక్షణను రష్యా ఇస్తుంది అన్నారు. గత పది సంవత్సరాలలో అమెరికాతో భారత్ జరిపిన లావాదేవీల విలువకు సమంగా ఆరెనెలల్లో రష్యాతో భారత్ ఒప్పందాలు చేసుకుందని రష్యన్ పత్రిక స్పుత్నిక్ వ్యాఖ్యానించింది. ఎగుమతి అనుమతులతో నిమిత్తం లేకుండా నేరుగా మనదేశానికి రక్షణ వుత్పత్తులను విక్రయించేందుకు 14 రష్యన్ బడా ఆయుధ తయారీ సంస్ధల దేశాధ్యక్షుడి అనుమతులను పొందాయి. సిప్రి అనే సంస్ధ విడుదల చేసిన ఆయుధ విక్రయ లావాదేవీల సమాచారం ప్రకారం ప్రపంచం దిగుమతి చేసుకుంటున్న ప్రతి వంద ఆయుధాల్లో మన వాటా 9.5కాగా వాటిలో 2014-18 మధ్య 58శాతం రష్యా నుంచే వున్నాయి.21 మిగ్ 29,సుఖోయ్ విమానాల కొనుగోలు చర్చలు,పాతవాటి నవీకరణ చర్చలు జరుగుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణం. మన మిలిటరీని అమెరికా ఆయుధాలతో నింపాలని సోవియట్ యూనియన్ కూలిపోయిన గత 28సంవత్సరాల నుంచి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో అసహనంతో వున్నాడు.
రక్షణ వుత్పత్తులను తన శత్రుదేశం రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేయటం ఒకటైతే హార్లే డేవిడ్సన్ మోటారు సైకిళ్లపై విధిస్తున్న అధిక దిగుమతి పన్నుల నుంచి అనేక వస్తువులపై మన ఆంక్షలను అమెరికా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వైద్య పరికరాలు, పాల వుత్పత్తుల పరిశ్రమల వారు ట్రంప్ మీద పెద్ద ఎత్తున వత్తిడి తెచ్చారు. గుండెకు అమర్చే స్టెంట్స్, మోకాలి చిప్పలుగా అమర్చే పరికరాల వుత్పత్తుల ధరలను మన దేశం తగ్గించటాన్ని, మరికొన్నింటిని తగ్గించే ఆలోచనలను వైద్యపరికరాల తయారీదారులు అభ్యంతర పెడుతున్నారు. మన దేశం దిగుమతి చేసుకొనే పాలవుత్పత్తులపై ఒక ఆంక్ష వుంది.అతల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా కేంద్రప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారం పాలు ఇచ్చే పశువులు తినే దాణాలో రక్తం,ఇతర జంతు అంతర్గత అవవయాలకు సంబంధించినవేవీ కలవ కూడదు. తమ వుత్పత్తుల్లో అలాంటివి లేవని ఎగుమతి చేసే సంస్ధలు హామీ పత్రాలు ఇవ్వాలి. ఇలాంటి అశాస్త్రీయమైన హామీలను తామెలా ఇస్తామని, నమ్మకం ఆధారంగా లావాదేవీలు జరగాలని అమెరికన్లు అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ నిబంధనను తామే ఎత్తివేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని నరేంద్రమోడీ సర్కార్ వీటి గురించి ఎలాంటి సంప్రదింపులు జరిపేది లేదని స్పష్టం చేసింది.
పైన పేర్కొన్న అంశాల పూర్వరంగంలో ట్రంప్ సర్కార్ ఏడాది కాలంగా జిఎస్‌పి రద్దు, ఇతర అంశాల గురించి మనకు హెచ్చరికలు పంపుతూనే వుంది. మార్చినెల మొదటి వారంలో ట్రంప్ జిఎస్‌పి వుపసంహరణ గురించి ప్రకటన చేశారు. దీని మీద నోటీసు ఇచ్చిన తరువాత రెండు నెలల్లో అది రద్దవుతుంది. ఇప్పుడు ఆ దశలోనే వుంది. ఇప్పటికైనా భారత్ సరైన ప్రతిపాదనలు చేస్తే తమ నిర్ణయాన్ని సమీక్షిస్తామని అమెరికా తాజాగా ప్రకటించింది. ఎన్నికల్లో లేదా ఎన్నికలు ముగిసిన వెంటనే అయినా ఏదో ఒకటి తేల్చాలని పట్టుపడుతోంది. రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు పూర్తవుతాయి గనుక తరువాత చూద్దాం లెమ్మని మోడీ సర్కార్ భావిస్తోంది. ఫలితాలు ఎలా వుంటాయి, కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ట్రంప్ బెదిరింపులకు తలొగ్గుతారా, ఎదిరిస్తారా అన్నది వూహాజనిత ప్రశ్నలు !