Tags

, , , , , ,

Image result for islamophobia is a global crisis

ఎం కోటేశ్వరరావు

గత శుక్రవారం నాడు న్యూజిలాండ్‌లోని క్రీస్టు చర్చ్‌ పట్టణంలోని రెండు మసీదుల మీద జరిగిన వుగ్రదాడి ప్రపంచాన్ని వులిక్కిపడేట్లు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 28ఏండ్ల బ్రెంటన్‌ హారిసన్‌ టారంట్‌ అనే శ్వేతజాతి వుగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు, పదకొండు మంది చావుబతుకుల మధ్య వున్నారు, అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలో ఇస్లాం, ముస్లింల పట్ల పెరుగుతున్న విద్వేషం, తప్పుడు ప్రచారం ప్రపంచ వ్యాపితంగా వుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ జనాభా మొత్తం 50లక్షలకు అటూ ఇటూగా వారిలో ముస్లింలు 50వేల వరకు వున్నారు. వారిలో కొందరు మతం మారిన వారు. మన దేశంలో హిందువుల వునికికే ముప్పుగా ఇస్లాం, క్రైస్తవం తయారయ్యాయని మతోన్మాదశక్తులు ఎలా నిరంతరం ప్రచారం చేస్తున్నాయో, ఈ టారంట్‌ అనే వాడు కూడా ప్రపంచంలో శ్వేత జాతికి ముస్లింలు ముప్పుగా తయారయ్యారనే వున్మాదానికి లోనయ్యాడు. తనకు బ్రిటీష్‌ ఫాసిస్టు ఓస్వాల్డ్‌ మోస్లే, నార్వీజియన్‌ హంతకుడు ఆండ్రెస్‌ బ్రెవిక్‌ వంటి వారు స్పూర్తి నిచ్చారని, ప్రపంచంలో శ్వేతజాతి గుర్తింపునకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన ప్రతీక, తనకు వుత్తేజమిచ్చిన వాడని అని మసీదులపై దాడులకు ముందు ఇంటర్నెట్‌లో పెట్టిన 74పేజీల పత్రంలో పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌ వుదంతం ప్రపంచ సంక్షోభానికి ఒక తార్కాణంగా అనేక మంది వర్ణించారు. అనేక దేశాలు, మీడియాలో ముస్లిం వ్యతిరేకత ఒక సాధారణ అంశంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముస్లింలందరిని వుగ్రవాదులు అనం, అనకూడదు గానీ వుగ్రవాదులందరూ ముస్లింలుగానే కనిపిస్తున్నారు కదా అనే ఒక గడుసరి ప్రచారంతో అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు.సంప్రదాయ మీడియాలో, సామాజిక మీడియాలో అనేక కధనాలను వండి వారుస్తున్నారు. ఎక్కడ వుగ్రవాద దాడి జరిగినా ఖండిస్తామంటూ పుల్వామా వుదంతాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌ న్యూజిలాండ్‌లోని క్రీస్తు చర్చ్‌ మసీదుల వుదంతాల విషయానికి వచ్చేసరికి శ్వేతజాతి జాతీయవాదం( దురహంకారం) నుంచి ఎలాంటి ముప్పు లేదని వెంటనే ప్రకటించాడు.అదే ట్రంప్‌తో సహా అమెరికా నేతలెవరూ తమ ఖండన ప్రకటనల్లో ముస్లిం అనే పదం లేకుండా జాగ్రత్తపడటం విశేషం.

ఇటీవలి కాలంలో అమెరికా, ఐరోపాలోని ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక చర్యలు తీసుకున్నాయి. ముస్లిం దేశాల నుంచి వలసలపై అనేక ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల బురఖాలపై ఆంక్షలు పెడితే మరికొన్ని చోట్ల ముఖాన్ని పూర్తిగా కప్పుకోవటానికి వీల్లేదని ఆదేశించారు. తమ మత విశ్వాసాల ప్రకారం స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో కరచాలనం చేయకూడదంటూ అందుకు తిరస్కరించిన ఒక ముస్లిం జంటకు స్విడ్జర్లాండ్‌ పౌరసత్వాన్ని నిరాకరించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో షరియా వ్యతిరేక చట్టాలు చేశారు. ఇస్లాం మనలను ద్వేషిస్తుంది, ముస్లిం వలసలపై నిషేధం విధించాలని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ దేశాలన్నింటా ముస్లిం వలసలను అనుమతిస్తే శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. మొత్తం ముస్లిం మతావలంబకులు ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా వున్నది కేవలం 24శాతం మందే. వారంతా వలస వచ్చినా ఎక్కడా మెజారిటీగా మారే అవకాశం లేదు, అసలది జరిగేది కాదు. కానీ అనేక మంది ఈ ప్రచారాన్ని తలకెక్కించుకొని వున్మాదులుగా మారి అనేక చోట్ల హత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికీ పాల్పడుతున్నారు.

Image result for islamophobia is a global crisis

మీడియాలో వుగ్రవాదం ఎలా వుందో చూద్దాం. యాభై మందిని చంపిన క్రీస్తు చర్చి హంతకుడిని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక గన్‌ మన్‌(తుపాకితో వున్న వ్యక్తి) అని శీర్షికలో పెడితే కాశ్మీర్‌లో ఒక మహిళా పోలీసు అధికారిని చంపిన వాడిని టెర్రరిస్టు అని అదే పత్రిక శీర్షిలో పెట్టింది. అంతే కాదు ఆవులను వధిస్తున్నారనే పేరుతో దాడులు చేసే వారిని గోరక్షకులు అని లేదా ఫలానా సంఘకార్యకర్తలని ముద్దుపేర్లతో మీడియా రాయటం, చూపటం తప్ప వారిని హిందూ తీవ్రవాదులు అనేందుకు నోరు రాదు. అదే పశ్చిమ దేశాల్లో ఒక శ్వేతజాతీయుడు హత్యాకాండకు పాల్పడితే వాడిని మతిస్థిమితం లేనివాడిగా ముద్రవేస్తారు తప్ప జాత్యహంకార వున్మాది, వుగ్రవాది అని ఎక్కడా పేర్కొనరు. వారిని వుత్తేజపరుస్తున్నదేమిటో, ప్రేరేపిస్తున్నదేమిటో అసలు చర్చించరు.

ముస్లింలు, ఇస్లామ్‌కు సంబంధించి ప్రపంచవ్యాపితంగా అనేక ముస్లిమేతర దేశాలలో వ్యతిరేకత పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంది. అమెరికాలో అది 80శాతం, బ్రిటన్‌లో 70శాతం వున్నట్లు పరిశోధనల్లో తేలింది. పత్రికల్లో కాలమిస్టులు, టీవీలలో యాంకర్లు, రేడియోల్లో జాకీలు అనేక మంది తమ వ్యతిరేకతను వెల్లడించుకున్నారు.2015లో అమెరికాలో ఇద్దరు తీవ్రవాదులు దాడి చేసి వారి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఇంటిని సందర్శించిన అనేక మీడియా సంస్ధల జర్నలిస్టులు అక్కడ వున్న ఖురాన్‌, నమాజు చేసే దుప్పటి, ఇతర ప్రార్ధనా సంబంధమైన వాటిని చూపుతూ వుగ్రవాదులు తమ ఆయుధాలుగా వీటిని కూడా వుపయోగించవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్యకేంద్ర స్ధలం పక్కనే మసీదు నిర్మాణాన్ని ఒక ఛానల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టు తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడ మసీదును అనుమతించటం పశ్చిమ దేశాల వుదారత్వంతో పాటు పిరికితనానికి నిదర్శనమని రెచ్చగొట్టాడు.

Image result for islamophobia india

ముస్లింలతో అమెరికాకు ముప్పు ఏర్పడిందని ట్రంప్‌తో సహా అనేక మంది గతంలో రెచ్చగొట్టారు. తీవ్రవాద ముస్లిం వుగ్రవాదుల నుంచి అమెరికన్లను రక్షించేందుంటూ ఏడు ముస్లిం దేశాల నుంచి జనాన్ని అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2008-2016 మధ్య అమెరికాలో 201 వుగ్రవాద చర్యలు చోటు చేసుకుంటే వాటిలో ట్రంప్‌ నిషేధించిన దేశాలైన ఇరాన్‌, లిబియా,సోమాలియా, సూడాన్‌,సిరియా, ఎమెన్లకు చెందిన వారు పాల్గొన్న లేదా ప్రేరేపించిన వుదంతాలు కేవలం మూడే. అమెరికాలో ట్రంప్‌ హయాంలో, అంతకు ముందూ జరిగిన హత్యాకాండను చూస్తే అత్యధిక సంఘటనల్లో నేరగాండ్లు శ్వేతజాతీయులే వున్నారు. వారి చేతుల్లోనే ఎక్కువ మంది మరణించారు. వారెవరికీ ముస్లిం తీవ్రవాద సంస్ధలతో లేదా విదేశీయులతో సంబంధాలు లేవు, ఇస్లాం నుంచి వుత్తేజాన్ని పొందిన వారు కాదు. ప్రపంచ జనాభాలో ముస్లింలు 24శాతం కాగా 1970 నుంచి ఇటీవలి వరకు జరిగిన అన్ని వుగ్రవాద దాడుల్లో ముస్లింలు జరిపినవి 10.3శాతమే అని ఇటీవల కొంత పెరిగినా జనాభా నిష్పత్తికంటే తక్కువని తేలింది. ముస్లిం తీవ్రవాదుల దాడులకు బలైన వారిలో మెజారిటీ బలైంది కూడా ముస్లింలే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for islamophobia is a global crisis

ప్రపంచంలో కేవలం ముస్లిం తీవ్రవాద సంస్ధలే వున్నట్లు మీడియా చిత్రిస్తున్నది. వుగాండాలో లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ ఆర్టీ(ప్రభు ప్రతిఘటన సైన్యం) పేరిట క్రైస్తవ తీవ్రవాదులు లక్ష మందిని హత్య చేశారు.టెన్‌ కమాండ్‌మెంట్స్‌ ప్రాతిపదికన క్రైస్తవ మతరాజ్యాన్ని ఏర్పరచాలన్నది దాని లక్ష్యం. అమెరికాలో ఆర్మీ ఆఫ్‌ గాడ్‌(దేవుని సైన్యం) పేరుతో వున్న తీవ్రవాదులు అబార్షన్లకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్నారు. వీరికీ ఇస్లామిక్‌ దేశాలలోని ఆల్‌ఖైదా, తాలిబాన్లకు తేడా ఏముంది? అమెరికాలో, ఇతర ఐరోపా దేశాల్లో శ్వేతజాతీయులతో కూడిన వుగ్రవాద బృందాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయి. మీడియా తీరు తెన్నుల విషయానికి వస్తే ముస్లిం తీవ్రవాదులు ఒక సంఘటనకు పాల్పడినపుడు మీడియాలో 105పతాక శీర్షికల్లో అది చోటు చేసుకుంటే అదే ముస్లిమేతర వుగ్రవాదులు పాల్పడిన ఘటనకు కేవలం 15పతాక శీర్షికలే వుంటున్నట్లు అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో తేలింది. అమెరికాలో 2006-2015 మధ్య జరిగిన శ్వేతజాతి మరియు మితవాద వుగ్రవాదులు జరిపిన దాడుల కంటే ముస్లింలు జరిపిన దాడులకు అమెరికన్‌ మీడియాలో రెట్టింపు ప్రచారం చోటు చేసుకుందని తేలింది. ప్రపంచమంతటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులు, తీవ్రవాదంతో ముప్పు ఏర్పడిందన్నది ఒక తప్పుడు ప్రచారం.

వుగ్రవాద మూలాల విషయానికి వస్తే ఎంతో వివరించాల్సి వుంటుంది. సామాజిక చరిత్రలో కొత్త తత్వశాస్త్రం(మతం) వునికిలోకి వచ్చినపుడల్లా గతమెంతో ఘనమంటూ పాతరోతను నిలబెట్టేందుకు తిరోగమన వాదులు, కొత్తదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పురోగమన వాదులు వుగ్రవాదం వైపు మళ్లిన చరిత్ర మనకు కనిపిస్తుంది. నిజానికి వుగ్రవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాపితంగా అంగీకరించిన అర్ధం ఇంతవరకు లేదు. మధ్య ప్రాచ్యంలో రోమన్లను కూలదోసేందుకు యూదులు కొందరు వుగ్రవాదులుగా మారారు. క్రీస్తు శకం తొలి శతాబ్దిలో సికారి అనే యూదు సంస్ధ ఏర్పాటయింది.దానికి ముందు జాకబ్‌, సైమన్‌ అనే యూదునేతలు దేవుడు తప్ప యూదులను మరొకరు పాలించటానికి లేదని అవసరమైతే సాయుధ ప్రతిఘటన చేయాలని వుద్బోధించారు.సికారి సంస్ధకు చెందిన వారు ఇంకొక అడుగు ముందుకు వేసిన సాయుధ ప్రతిఘటనతో పాటు రోమన్లతో సయోధ్య కోరుకున్న యూదులను కూడా హతమార్చాలని పిలుపునిచ్చింది. అందుకు గాను వారు జన సమూహాల్లో కలసిపోయి తమ దగ్గర దాచుకున్న కత్తులతో శత్రువులుగా ఎంచుకున్నవారిని హతమార్చే వారు. తరువాత వారు ఇతరులతో కలసి మరణించిన వారికోసం ఏడుపులు పెడబొబ్బలు పెట్టి తప్పించుకొనే వారట.పదిహేడవ శతాబ్దిలో స్పెయిన్‌లో కాథలిక్‌ రాజ్యాన్ని స్ధాపించేందుకు గై ఫాకెస్‌ నాయకత్వంలో మత వుగ్రవాదులు విఫల తిరుగుబాటు చేశారు. తరువాత ఫ్రెంచి విప్లవ సమయంలో తమ మాట వినని వారిని నిర్ధాక్షిణ్యంగా అధికారంలో వున్నవారే చంపి రాజ్య వుగ్రవాదానికి తెరలేపారు.

Image result for islamophobia is a global crisis

హంగరీలో ముస్లింలు ఒకశాతం మంది కూడా లేరు, అయినా సరే అక్కడి ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ హంగేరియన్‌ పిల్లలను కనేందుకు దేశంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వలసలను అంగీకరించటం అంటే మనం లొంగిపోవటమే అని కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టాడు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగకపోతే లండన్‌ నగరం ఫ్రెంచి పెట్టుబడిదారులకు బదులు టర్కీ ముస్లింలతో నిండిపోతుందని బ్రెక్సిట్‌ అనుకూల వాదులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం కారణంగా అమెరికాలో 17శాతం మంది ముస్లింలు వున్నారని మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో అమెరికన్లు చెప్పారు. నిజానికి అక్కడ ఒకశాతానికి దగ్గరగా వున్నారు.ఫ్రాన్స్‌లో కూడా వున్నదాని కంటే నాలుగు రెట్లు వున్నారనే ప్రచారానికి అక్కడి వారు లోనయ్యారు. అనేక ముస్లిం దేశాలలోని ఛాందసులు కూడా ఇలాంటి ప్రచారంతోనే అక్కడి సమాజాలను రెచ్చగొడుతున్నారు. మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు ‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ అని సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి. మతోన్మాదం తలకెక్కితే ఏ మతం వారైనా ఒకటే. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్యను పెంచేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, దాన్ని వమ్ముచేసేందుకు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని చెప్పిన కాషాయ తాలిబాన్లను చూశాము. న్యూజిలాండ్‌లో ముస్లింలను హతమార్చిన క్రైస్తవ వుగ్రవాది ఏమన్నాడో చూడండి.’ మన భూముల నుంచి ఒక వేళ రేపు మనం ఐరోపాయేతరులందరినీ( వారిలో భారతీయ హిందువులు కూడా వుంటారని మరచిపోవద్దు) బయటకు పంపివేసినా యూరోపియన్ల సంఖ్య నశించి చివరకు అంతమౌతుంది.చివరికి తిరిగి మనం ప్రజననశక్తిని పెంచుకోవాలి లేకపోతే అది మనల్ని చంపివేస్తుంది.’ ఇస్లామిక్‌, కాషాయ తాలిబాన్లకు, వీడికి తేడా ఏముంది? ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు, అందుకే వుగ్రవాదం ప్రపంచ సంక్షోభానికి చిహ్నం. గతంలో మతం కోసం వుగ్రవాదులు తయారైతే ఇప్పుడు సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలలో భాగంగా మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు. అదే నాటికీ నేటికీ తేడా !