ఎం కోటేశ్వరరావు
అమిత్ షా ! అమిత్ షా !!
ఓ….. సమయానికి నా ఆత్మ క్షోభను పంచుకోవటానికి నా ఆత్మ షా కూడా లేరే !
ఎవరక్కడ…. నా భ్రమ కాకపోతే సిబ్బంది అందరినీ పంపి సెక్యూరిటీని భవనం వెలుపల వుండమని చెప్పిన తరువాత ఎవరక్కడ అంటే పలుకునదెవరు…. హత విధీ….. ఆలి వున్నా….. వున్నట్లో లేనట్లో చెప్పుకోలేని స్ధితి…. పిల్లలు లేరు…. సమయానికి అమ్మ కూడా లేకపోయనే……
ప్రపంచ ఆనందమయ నివేదిక అట….. సిబ్బంది నాకు కనిపించే విధంగా బల్లమీద పెట్టి వెళ్లారు…..అదేమి అయివుండునో అని తీసి చూద్దును కదా అక్కటా…. పులి మీద పుట్రలా అది ఇప్పుడు రానేల…..ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా దానిని అక్కడ వుంచినారో అవగతమైనది….. ఎంతయినను మనసెరిగిన వారు కదా……
ఒకింత సంతసముగా కూడా యున్నది…… మీడియా ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు….. ఇచ్చినచో…..తలచుకొన్నంతనే కలవరము కలుగుచున్నది.
కలవరమా….. రానివ్వ రానివ్వ చెంతకు రానివ్వ…….వచ్చెను పో……156 రాజ్యములలో మన స్ధానం……తలచుకొనుటకు నాకే సిగ్గుగా వున్నది…. 140వ స్ధానమట……
కావచ్చు…. మనకు మంచి ర్యాంకు నానందుకు చింత లేదు, మన పొరుగు రాజ్యము పాకిస్ధాన్ స్ధానము చూచినంతనే అలనాటి ద్రౌపది నవ్వు గుర్తుకు వచ్చుచున్నది……..67వ స్ధానములో మన కంటే రెట్టింపు ఎత్తులో వుండుట ఎంత అవమానము……ఎందుకు ఆ విధముగా జరిగినదో ఎంత ఆలోచించినను తట్టుట లేదు….నాది మట్టి బుర్ర అనుకొందురేమో(వులిక్కి పడి వెనుకా ముందూ కలియ తిరిగి) హమ్మయ్య బహిర్గతమైన నా అంతరంగము విన్నవారు లేరు….
అమిత్ షా…. అమిత్ షా…… నా లాంటి స్ధితిలో యున్నవారిని మరొకరిని నా అంతరంగికునిగా ఎంచుకొనుట ఎంత వుత్తమమో ఇలాంటి సమయములలో కూడా కదా తెలియునది…..నాతో పాటు నిరంతరము వుండును కదా !
పాకిస్ధాన్‌లో జనము అంత సంతసముగా వుండుటకు అక్కడి వారు చేసినదేమి, నేను చేయనిదేమి……. గత ఐదు సంవత్సరములుగా కొనసాగించి ఇటీవలి పుల్వామా వుదంతము తరువాత రద్దు చేసిన అత్యంత సానుకూల హోదా కారణము అయి వుండవచ్చునా…. ఒక్క పాకిస్ధాన్ ఏమి ఖర్మ అఖండభారత్ అని మనము చెబుతున్న దేశములన్నింటా ఒక్క ఆఫ్ఘనిస్తానము తప్ప మిగతా చోట్ల మనకంటే జనము సంతోషముగా నుండిరట….. ఇది మరింత విపరీతముగా వున్నది. గతములో చేసిన సర్జికల్ దాడులు, గోవులను కాపాడుట వంటి చర్యలతో జనము సంతసముగా లేరా ? నేపాల్ 100, బంగ్లాదేశ్ 125, శ్రీలంక 130, మయన్మార్ 131 స్ధానములో వుండుటా ఇంతకంటే అప్రతిష్ట మరేమున్నది. మనకు ఎంతో అవసరము వున్నది కనుక అధికారికముగా పైకి అనలేము గాని నిరంతరము మన సంఘపరివారము కమ్యూనిస్టు నియంతృత్వ రాజ్యమని ప్రచారము చేయుచున్న చైనా 93వ స్ధానములో వున్నదట. దీనిని సమర్ధించుకొనుట ఎట్లు …….. అమెరికాలో విఫలమైన పెట్టుబడిదారీ విధానము కంటే సోషలిజమే మేలను కుర్రకారు పెరుగుతున్నదట…. ఇక్కడ కూడా వుద్యోగాలు కల్పించలేని ప్రజాస్వామ్యం కంటే చైనా మాదిరి కమ్యూనిస్టు పాలనే మెరుగని అనుకుంటే…….
ప్రతిపక్షుల విమర్శలను ఖాతరు చేయక విదేశీయానములు చేసి సాధించినదేమిటి అని…. నా సోదరులే ప్రశ్నించిన ఏమి చెప్పవలే. గడ్కరీ వంటి వారు వదులు పరోక్ష బాణములను తప్పించుకొనుట ఎట్లు ? మొదటికే మోసము వచ్చుననే అంచనాతో ప్రస్తుతము గడ్కరీ లేదా వృద్ధాశ్రమమునకు పరిమితం చేసిన అద్వానీ వంటి వారు నోరు మెదపకున్ననను ప్రతిపక్షముల నోటినేమి చేయగలము……ఛీ ఇదేమిటి ఎంత అణుచుకున్నను ప్రజాస్వామ్యపీక నొక్కినచో ఇటువంటి విపత్కర పరిస్ధితి తలెత్తపోవును కదా అనే ఆలోచన వుబికి వచ్చుచున్నదేమి? విదేశీయానముల వలన కలిగిన ఫలితమేమీ ? విదేశీ పెట్టుబడులెక్కడ, మేకిన్ ఇండియా సంగతేమిటి,కౌగిలింతల దౌత్యము అంతవరకే పరిమితమా, వాగ్దానములన్నీ అమలు జరిపిన తరువాత జనంలో సంతోషము ఎందుకు కలగటము లేదు అని ఎవరైనా ప్రశ్నించిన ఏమి చెప్పవలె……
ఒకింత వూరటగా వున్నది….. ఐదు సంవత్సరములుగా మీడియాతో మాట్లాడని వ్రతమును ఎన్నికల వరకు కొనసాగించిన….. మీడియా గండమును తప్పించుకొన వచ్చును. అంతగా ప్రతిపక్షము నిలదీసిన ఎడల దీని కంతకు నెహ్రూ, కాంగ్రెస్ పాలనే కారణమని అస్త్రమున్నది కదా …..
సపోజ్ పర్ సపోజ్ అలా ప్రచారము చేసితిమే అనుకొందుము నేటి ఆనందరాహిత్యమునకు గతము ఎట్లు కారణమని బుర్రవున్నవారెవరైనను అడిగినచో…… జనానికి బుర్రలో అంత గుంజు వున్నదా…..
ఛీఛీ ఎంత ఖర్మదాపురించినది….. ఇదియును ఎదురు తన్నును….. నేను ఇంద్రప్రస్తములో సింహాసనము అధిష్టించు సమయములో అనగా 2014లో ఆనందమయ సూచికలో మన స్ధానము 156 దేశములలో 111లో,పాకిస్ధాన్ 81లో వున్నదట…… ఈ వివరములు జనానికి తెలియకుండునా….తెలిసిన మన ఆబోరు దక్కునా…….ఏమిటి మార్గము……
మన ఏలుబడిలో వుపాధి అవకాశములు తగ్గినట్లు వెల్లడించిన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికను బహిర్గతపరచటమా తొక్కి పెట్టటమా అన్నది మన చేతులలో వున్నది కనుక లెక్కలు సరిగా వేయలేదనే కారణముతో తొక్కిపెడితిమి……ఆనందమయ సూచికకు అటు వంటి అవకాశము లేదు, అది ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 2012 నుంచి ప్రతి సంవత్సరము వెలువడుతున్నది. ఇప్పటికే బహిర్గతమైనది, ముందు తెలిసినను ఆపే అవకాశము లేదు. అయినను అబద్దము ఒకటి అయినా వంద అయినా ఒకటే కదా. ఒక అబద్దమును వందసార్లు చెప్పినచో అది నిజము అగునని గోబెల్స్ మహాశయుడు వుపదేశించినాడు. గత ఏడు దశాబ్దాలుగా కిరస్తానీ లెక్కలు మన భారతీయ ఆత్మను గ్రహించలేకపోయాయి. అందుకే గత ఐదు ఏండ్లుగా దేశములో కనిపిస్తున్న సంతోషమును కానలేకుండా వున్నారు. వేద గణితము ప్రకారం భారతీయులు సంతోషముతో ఓలలాడుతున్న విషయము విదేశీ కళ్లతో చూసిన ఎలా కనిపించును. పక్కా భారతీయ దృష్టితో చూడవలే….. ఇదే ఇంతకు మించి మరొక మార్గము కనిపించట లేదు…. మనసు ఎంత హాయిగా వున్నది !