ఎం కోటేశ్వరరావు
దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేస్తామని చెప్పుకుంటున్న బిజెపి కేరళలో దాన్ని బలపరచటమా ? దక్షిణాది అయోధ్య అని కొందరు వర్ణించిన శబరిమల అయ్యప్ప ఆలయం ఈ సారి కమ్యూనిస్టుల పాలనలోని కేరళ లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన అంశంగా మారనున్నదా ? ఈ ఎన్నికల్లో అయ్యప్ప భక్తుల మనోభావాలను మరోసారి రెచ్చగొట్టి లబ్ది పొందాలని కాంగ్రెస్, బిజెపి రెండూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు గాను రెండూ పరస్పర అవగాహనతో ఓట్ల బదిలీకి కొన్ని చోట్ల పరోక్ష ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాల మేరకు వడకర, కన్నూరు, కొల్లం, కోజికోడ్, ఎర్నాకులం నియోజకవర్గాలలో బిజెపి నామమాత్రంగా పోటీ చేయాలని, దానికి ప్రతిగా తిరువనంతపురంలో బిజెపి అభ్యర్ధికి కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని అవగాహనకు వచ్చినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్ చెప్పారు. గతంలో 1991లో వడకరలో ఇలాంటి ప్రయోగమే జరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అవగాహనతోనే నేమమ్ అసెంబ్లీ స్ధానంలో బిజెపిని కాంగ్రెస్ గెలిపించిందని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి బంధం మాదిరే ఎస్‌డిపిఐ-ముస్లిం లీగ్ వ్యవహరిస్తున్నాయని అలాంటి ఎస్‌డిపిఐతో కాంగ్రెస్ చేతులు కలుపుతున్నదని చెప్పారు.
బిజెపి విషయానికి వస్తే కేరళలో అసలైన పోటీ తమకూ కమ్యూనిస్టులకే నని, తదుపరి తమ లక్ష్యం కేరళ అని చెప్పుకొనే బిజెపి ఇరవైకి గాను కేవలం 14సీట్లలోనే పోటీ చేయాలని, మిగిలిన ఆరు సీట్లను మరో రెండు పార్టీలకు వదిలిపెట్టాలని నిర్ణయించింది. పోటీ చేసే చోట కూడా అభ్యర్ధుల విషయంలో కుమ్ములాటల కారణంగా ఎంతో ఆలస్యంగా 13మందినే ప్రకటించారు. శబరిమల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయనే ఆశతో ఆ సీటు తమకు కావాలంటే తమకు కావాలని కుమ్ములాడుకున్నారు.దాంతో తలలు పట్టుకున్న అధిష్టానం ఆ సీటు అభ్యర్ధి ప్రకటన వాయిదా వేసింది. మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖరన్ పదవికి రాజీనామా చేయించి బిజెపి తిరువనంతపురం అభ్యర్ధిగా నిలబెట్టింది. అక్కడ ప్రస్తుత కాంగ్రెస్ సభ్యుడు శశిధరూర్, సిపిఐ అభ్యర్ధి దినకరన్ పోటీలో వున్నారు.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని చోట్ల పరోక్ష అవగాహనకు వచ్చినట్లుగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బిజెపి అవగాహనకు వచ్చిన వార్తలను కాంగ్రెస్ కాదంటున్నది. కేరళలో తమకూ సిపిఎంకు మధ్య మాత్రమే పోటీ అని మతశక్తుల నుంచి తమకు ఒక్క ఓటు కూడా అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ అంటున్నారు. కొన్ని చోట్ల ఒకరికి మించి అభ్యర్ధులను పరిశీలించాల్సిన కారణంగా తమ జాబితా ఆలస్యమైంది తప్ప బిజెపితో పరోక్ష అవగాహన కోసం ఆపలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటికే అక్కడి 20 నియోజకవర్గాలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్) అందరి కంటే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్ధులను ప్రకటించి రెండవ దశ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బిజెపి, కాంగ్రెస్ ఇంకా అభ్యర్ధులను పూర్తిగా ప్రకటించలేని దశలోనే వున్నాయి.
పిల్లల్ని కనే వయస్సులో వున్న మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించటాన్ని సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టి ప్రవేశం కల్పించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును బిజెపి, కాంగ్రెస్ తొలుత స్వాగతించిన స్ధానిక పార్టీల నాయకత్వాలు వెంటనే ఈ అంశాన్ని రాజకీయంగా మార్చి ఓట్లు దండుకొనేందుకు ప్లేటు ఫిరాయించాయి. భక్తుల మనోభావాలను గౌరవించాలంటూ మహిళలకు ఆలయ ప్రవేశ హక్కును అడ్డుకొనేందుకు అయ్య ప్ప భక్తుల పేరుతో ఆందోళనలను నిర్వహించాయి. అవి హింసాత్మకంగా కూడా మారాయి. కమ్యూనిస్టులు అయ్యప్ప ఆలయ పవిత్రతను మలినం చేసేందుకు పూనుకున్నారని తప్పుడు ప్రచారం చేశాయి. నిజానికి అయ్యప్ప కేసుతో కమ్యూనిస్టులకు ఎలాంటి ప్రమేయం లేదు. దీనిపై కొంత మంది న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌పై కేరళ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినపుడు అధికారంలో వున్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తాము మహిళల ప్రవేశానికి అనుకూలమే అని సుప్రీం కోర్టుకు నివేదించింది. తరువాత కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ సర్కార్ అధికారానికి వచ్చిన తరువాత సంప్రదాయాలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి వున్నామంటూ మరొక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కేసు విచారణ చివరి దశకు వచ్చిన సమయంలో ప్రస్తుతం పినరయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం గతంలో వున్న వైఖరికే తాము కట్టుబడి వుంటామని తన అభిప్రాయాన్ని చెప్పింది.
కేసు విచారణ సమయంలో పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్‌లు తీర్పు తామూ వూహించని విధంగా రావటంతో కంగుతిని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తీర్పును పునర్విచారణ జరపాలని కోరుతూ పిటీషన్లు దాఖలు చేయించారు.వాటిపై సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పాల్సి వుంది. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్, బిజెపి ద్వంద్వ వైఖరులను ఎండగడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాతంత్ర వుద్యమ సాంప్రదాయాలను ముందుకు తీసుకు పోయే కృషిలో భాగంగా కేరళలో పలు సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన మహిళా మానవ హారంలో 40లక్షల మందికి పైగా అన్ని మతాలకు చెందిన మహిళలు పాల్గన్నారు.
పోటీల తీరు తెన్నులకు వస్తే ఇరవైకి గాను 18 చోట్ల సిపిఎంాకాంగ్రెస్ కూటమి మధ్య ముఖాముఖి పోటీ వుంటుందని, తిరువనంతపురం, శబరి మల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గాలలో బిజెపి కూడా పోటీలో వుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇరవై సీట్లలో సిపిఎం బలపరిచే స్వతంత్రులతో సహా 16చోట్ల పోటీ చేస్తుండగా సిపిఐ నాలుగు స్ధానాలలో వున్నది. కాంగ్రెెస్ 16చోట్ల, ముస్లింలీగ్ రెండు, మరో రెండు పార్టీలు రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. బిజెపి 14, దాని మిత్రపక్షాలు ఆరు చోట్ల బరిలో వున్నాయి. గత ఎన్నికలలో యుడిఎఫ్ 12సీట్లు, ఎల్‌డిఎఫ్ ఎనిమిది చోట్ల గెలుపొందింది. గత ఎన్నికలలో యుడిఎఫ్ కూటమికి 41.98శాతం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు 40.12శాతం బిజెపి కూటమికి 10.82 శాతం ఓట్లు వచ్చాయి. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు కూటములకు వరుసగా 38.81,43.48,15.10శాతాలు వచ్చాయి.
తాజా ఎన్నికల్లో శబరిమలై ఆలయ పవిత్రత పరిరక్షణ పేరుతో ఆందోళన సాగించిన బిజెపి, కాంగ్రెస్ రెండూ హిందూ ఓట్లకోసం ఏదో విధంగా మత అంశాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదం వెల్లడించింది. శబరిమల ఆందోళనలు జరిగిన తరువాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ వుప ఎన్నికలలో ఆ అంశం బిజెపికి లాభించిన దాఖలాలు లేవు. అనేక చోట్ల ఘోరపరాజయం పాలైంది. అయినప్పటికీ ఈ ఎన్నికలు మూడు పక్షాలకూ సవాలుగానే పరిణమించాయని చెప్పవచ్చు. లౌకిక, వామపక్ష భావాలకు నిలయమైన కేరళలో గతంలో ముస్లిం, క్రైస్తవ మత శక్తులు కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. తొలిసారిగా హిందూత్వశక్తులు అటువంటి ప్రయత్నంలోనే వున్నాయి. అందువలన అక్కడి ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.