Tags
Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.
ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్ అంటూ బరిలోకి దిగాయి.
శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.
అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్ మోడల్ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.
ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్ రామ్ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.
గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.
పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్ యుద్ధాన్ని, యూరి సర్జికల్ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.
కాంగ్రెస్ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్ వ్యాఖ్యానించారు.
లెక్కలు ఏమి చెబుతున్నాయి !
దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.
వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.
వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.
బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్ పాండే తాజా ఎన్నికల్లో లోక్ ఘటబంధన్ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.