ఎం కోటేశ్వరరావు
దేశ రాజకీయాలలలో అధికారమే పరమావధిగా వుండే రాజకీయ నేతల అవకాశవాదానికి హద్దులు ఎన్నడో చెరిగిపోయాయి.రాత్రి వరకు కత్తులు దూసుకున్నవారు తెల్లవారే సరికి పొత్తులు కుదుర్చుకుంటున్నారు. గతంలో ఎన్నికల ముందు వరకు ఎవరు ఏ పార్టీలో వుంటారో తెలియని స్ధితి. ఇప్పుడు ఎన్నికల తరువాత ఎటువైపు చేరతారో కూడా తెలియని విధంగా అధికార రాజకీయాలు తయారయ్యాయి. అధికార దాహంగల పార్టీల తరఫున పోటీ చేస్తున్న అమీర్లు స్పష్టంగా వున్నారు. ఎన్నికల వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని లాభంతో సహా రాబట్టుకోవాలంటే ఏమి చేయాలన్నది బరిలోకి దిగే ముందే వారికి తెలుసు. బీద ఓటర్లే ఇంకా అయోమయంలో వున్నారు.
దేశంలో వుత్తర ప్రదేశ్ తరువాత 48లోక్‌సభ స్ధానాలతో ఎక్కువ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్రలో ఏప్రిల్ 11,18,23,29 తేదీలలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబరుతో ముగిసే అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ దేశంలో బిజెపి విజయంపై నీలి నీడలు కమ్ముకోవటంతో అసెంబ్లీ ఎన్నికల ఆలోచనను ఆ పార్టీ విరమించుకుంది. దీర్ఘకాలంగా ఈ రాష్ట్రం సంకీర్ణ రాజకీయాలకు నిలయంగా వుంది. ఒక నాడు పెద్ద పార్టీలుగా వున్న కాంగ్రెస్, శివసేన ప్రాభవం కోల్పోయాయి. గత ఎన్నికలలో యుపిఏ కూటమిలో కాంగ్రెస్ 26, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్‌సిపి) 21 స్ధానాల్లో పోటీ చేయగా ఎన్‌డిఏ కూటమిలో బిజెపి 24,శివసేన 20 చోట్ల పోటీ చేశాయి. మిగిలిన స్ధానాలలో కాంగ్రెస్, బిజెపి ప్రాంతీయ మిత్రపక్షాలు పోటీ చేశాయి.
మహారాష్ట్ర రాజకీయాలలో ఒకనాడు పులిలా వున్న శివసేన ఇప్పుడు బిజెపి ముందు పిల్లిలా తయారైంది. ఒక వైపు కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో అధికారం పంచుకుంటూనే గత ఐదు సంవత్సరాలలో శివసేన అనేక సందర్భాలలో బిజెపిని విమర్శించింది.ఏండాది క్రితం తాము ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించటమే కాదు, విమర్శల జోరు పెంచింది. కొండంత రాగం తీసి కీచు గొంతుతో అరచినట్లు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు బిజెపితో ఎన్నికల అవగాహనకు అంగీకరించింది. సామ్నా పత్రికలో, మీడియా సమావేశాలలో గతంలో ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ విడిగా పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసిన బిజెపి వాటన్నింటినీ దిగమింగింది. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి పాలన వైఫల్యాలను విమర్శించి వాటితో తమకేమీ సంబంధం లేదని జనం ముందు ప్రదర్శించుకొనేందుకు శివసేన ప్రయత్నించింది. నోట్ల రద్దు నిర్ణయం మాదిరే రామాలయ నిర్మాణంపై ఎందుకు నిర్ణయం తీసుకోరని మోడీని ప్రశ్నించింది. గోమాతల రక్షణ గురించి మాట్లాడుతున్నారు సరే మన మాతలను ఎలా రక్షిస్తారంటూ నిలదీసింది. చివరికి చౌకీదార్ చోర్ అన్న కాంగ్రెస్ నినాదాన్ని కూడా పునరుద్ఘాటించింది. అలాంటి పార్టీ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. మిగతా చిన్న పార్టీలను విస్మరించి బిజెపి 25,శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.కాంగ్రెస్ 24, ఎన్‌సిపి 20 సీట్లలో పోటీ చేసేందుకు, రెండేసి సీట్ల చొప్పున ఆయా పార్టీల అభీష్టం మేరకు ఇతర పార్టీలకు కేటాయించుకొనే విధంగా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
శివసేన తీరు తెన్నులను చూస్తే చివరి నిమిషం వరకు బిజెపితో దోస్తీ లేదని చెప్పటం వెనుక బేరసారాలలో సాధ్యమైనన్ని సీట్లు రాబట్టుకోవటం, బాబరీ మసీదు వంటి విషయాల్లో మతోన్మాదం, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్న ఎత్తుగడే కనిపిస్తున్నది.అనేక రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా తమకు పడవు అనుకొనే తరగతుల ఓట్లను తొలగించారనే విమర్శలు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి, జనతాదళ్(ఎస్) జాతీయ కార్యదర్శి బిజి కోల్సే పాటిల్ చెబుతున్నదాని ప్ర కారం దాదాపు 40లక్షల ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాయి. ఇదంతా బిజెపి కుట్రలో భాగమని, తొలగించిన ఓట్లలో 17లక్షలు దళితులు, పదిలక్షలు ముస్లింలకు చెందినవన్నారు. మిస్సింగ్ ఓటర్ యాప్‌ను తయారు చేసిన ఖాలిద్ సైఫుల్లా నాయకత్వంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలో మూడు కోట్ల మంది ముస్లింలతో సహా దాదాపు 12.7కోట్ల మంది ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాని పాటిల్ అన్నారు.
రాష్ట్ర రాజకీయాలలో చిన్న రాజకీయ పార్టీలు కొన్ని ప్రాంతాలలో పట్టు కలిగి వుండటంతో ఏదో ఒక పార్టీ వాటితో సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. శివసేన నుంచి విడిపోయిన వుద్దావ్ ధాకరే ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ఒకటి. ముంబై, మరికొన్ని పట్టణ ప్రాంతాలలో వున్న బలంతో శివసేన,బిజెపి అభ్యర్ధుల ఓటమికి తోడ్పడేది. కాంగ్రెస్,ఎన్‌సిపి కూటమితో కలసి పనిచేసింది. ఈ ఎన్నికలో ఎంఎన్‌ఎస్‌తో ఎలాంటి ఒప్పందం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. బిజెపి, శివసేనలను గట్టిగా వ్యతిరేకించే ఆ పార్టీ ఈసారి ఏవైఖరి తీసుకుంటుందో వెల్లడి కావాల్సి వుంది.
అంబేద్కర్ ప్రభావంతో మహారాష్ట్ర దళిత వుద్యమాలు, రాజకీయ పార్టీలు, సంస్ధలకు కేంద్రంగా వుంది. అయితే వాటిలో ఐక్యత లేదు. అవకాశవాదం, అధికార దాహంతో వ్యవహరిస్తుంటాయనే విమర్శ వుంది. పార్లమెంట్ సభ్యుడు, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని భారతీయ రిపబ్లికన్ బహుజన్ మహాసంఘ్ ఈ సారి అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీతో కలసి పని చేస్తానని ప్రకటించింది. బీమా కొరేగావ్ వుదంతం, అదే విధంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరాఠాల ఆందోళనల పూర్వరంగంలో జనాభాలో 12-14శాతం మధ్య వున్న దళితులు ఆగ్రహంతో వున్నారు. వీరికి ముస్లింలు కూడా తోడై ఒక సంఘటిత శక్తిగా వుంటే ప్రధాన పార్టీలను కొన్ని చోట్ల దెబ్బతీసే అవకాశం వుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు దళిత సంస్ధల మధ్య ఐక్యత లేకపోవటంతో కాంగ్రెస్,బిజెపి వంటివి వాటిని ఖాతరు చేయటం లేదు. వంచిత్ బహుజన్ అగాధీ వంటి పార్టీలు ముఖ్యంగా దళితుల్లో పని చేసేవి వున్నాయి.
2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు, సీట్లు
పార్టీ ఓట్ల వాటా మార్పు సీట్లు మార్పు
బిజెపి 27.30% 9.13% 23 14
శివసేన 20.60% 3.60% 18 7
కాంగ్రెస్ 18.10% -1.51 2 -15
ఎన్‌సిపి 16.00% -3.28 4 -4
స్వాభిమానిపక్ష 2.30% 1 0
అధికారం కోసంమే కాంగ్రెస్ నుంచి చీలి వేరు కుంపటి పెట్టుకున్న శరద్ పవార్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. ఆయన కుమార్తె సుప్రియ సూలే రంగంలో వున్నారు. ఈ వయసులో తాను పోటీ చేసినా చేయకపోయినా ఒకటే అని, అయినా ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పోటీ చేయటం ఎబ్బెట్టుగా వుంటుందని పవార్ అంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన బిజెపి-శివసేన కూటమి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్యపై పేచీ కారణంగా వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమి కూడా విడిపోయింది. అసెంబ్లీలోని 288 సీట్లకు గాను బిజెపి 27.8శాతం ఓట్లతో 122, శివసేన 19.3శాతం ఓట్లతో 63, ఎన్‌సిపి 17శాతం ఓట్లతో 41, కాంగ్రెస్‌కు 18శాతం ఓట్లు 42 సీట్లు వచ్చాయి.ఎంఎన్‌ఎస్ పార్టీ ఒక సీటు 3.7శాతం ఓట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి, శివసేన పార్టీల ఓట్లు దాదాపు సమంగా వున్నాయి. కాంగ్రెస్, బిజెపి ఓట్లుస్వల్పంగా పెరిగాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్నికల ముందు వరకు శివసేన, బిజెపి కుమ్ములాటలు ఆ కూటమి అవకాశాలను దెబ్బతీస్తాయని కొందరి అంచనా. అయితే ఆ రెండు పార్టీల కలయిక మెజారిటీ సీట్లను స్వంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. పది నుంచి పన్నెండు సీట్లు తాము గెలిచే అవకాశం వుందని ఎన్‌సిపి అంచనా వేసుకుంటున్నది. కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమికి 18 నుంచి 23 సీట్లవరకు వస్తాయని జనవరి పోల్ సర్వేలు తెలిపాయి.