Tags

, , , , , , ,

Image result for wayanad lok sabha assembly constituency map manorama

ఎం కోటేశ్వరరావు

దాదాపు రెండు నెలల పాటు  తర్జన భర్జన పడి ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వైనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమేధీతో పాటు ఎన్నికల ఫోకస్‌ ఇక్కడ కూడా ప్రసరించనుంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ నుంచీ రెండు సార్లు కాంగ్రెస్‌దే పై చేయిగా వుంది. వైనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దీనిలో వున్నాయి. ఈనెల 23న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌ గాంధీని ఓడించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపీని పోటీకి దించవచ్చని మీడియాకు అనధికారికంగా వుప్పందించిన బిజెపి చివరకు బలహీనమైన భారత జన ధర్మ సేన అనే మిత్రపక్షానికి చెందిన వి.నటేశన్‌ను పోటీకి దింపింది. ఈ చర్య కమ్యూనిస్టులను ఓడించేందుగా, రాహుల్‌ గాంధీని గెలిపించేందుకా అన్న సందేహం ఓటర్లలో కలుగుతోంది. రాజకీయ పరిస్ధితులను అర్ధం చేసుకోవటంలో విఫలమైన కారణంగా గతంలో తాను రాహుల్‌ గాంధీని అమూల్‌ బేబీ అని వ్యాఖ్యానించానని, ఇప్పుడు వైనాడ్‌లో పోటీకి దిగి తన వ్యాఖ్యను మరోసారి నిజం చేశారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ వ్యాఖ్యానించారు. పరిస్ధితులను పిల్లచేష్టలు, ఆవేశంతో ఎదుర్కొంటారని నడి వయస్సు వచ్చినా పెద్ద మార్పేమీ లేదని అన్నారు. రాహుల్‌ను పోటీకి దింపటం ద్వారా కాంగ్రెస్‌ కూర్చున్న కొమ్మనే నరుక్కొనే రీతిలో వ్యవహరిస్తోందని, తప్పుదారి పట్టించే కాంగ్రెస్‌ నేతల మాటలను రాహుల్‌ అనుసరిస్తున్నారని చెప్పారు.

రాహుల్‌ గాంధీ పోటీకి నిర్ణయించుకోవటంతో కేరళ ఎన్నికల రంగం వేడెక్కిందనే చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టటంతో పాటు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్ధాయికి దిగజారారు. ఈనెల ఒకటవ తేదీన మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల సభలో మాట్లాడుతూ అమేథీలో హిందువుల ఆగ్రహానికి భయపడి మైనారిటీలు మెజారిటీగా వున్న నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పోయారని ఎద్దేవా చేశారు. అక్కడ సగం మంది ఓటర్లు హిందువులున్నారు. వైనాడ్‌ ఎన్నిక అధికారంలో వున్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డిఎఫ్‌) ఐక్య ప్రజాతంత్ర కూటమి(యుడిఎఫ్‌), బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడి పోటీ తీరు తెన్నులను ముందుగా చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వైనాడ్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, మలప్పురం జిల్లాలోని మూడు, కోజికోడ్‌ జిల్లాలోని ఒక నియోజకవర్గంతో ఇది ఏర్పడింది. ఇక్కడ రాహుల్‌ గాంధీ పోటీ చేసినందువలన కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటా కాంగ్రెస్‌కు వూపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ఆయన పోటీ చేయని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ డీలాపడుతుంది. రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా రాహుల్‌ గాంధీ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు. అలాంటిది దేశంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్నది ప్రశ్న.

ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వున్నారన్న అంచనాతో రాహుల్‌ గాంధీ పోటీలోకి దిగుతున్నారు.అది కూడా వాస్తవం కాదు. తాజా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 13,25,788 మంది ఓటర్లు వున్నారు. వీరిలో మహిళలు 6,70,002, పురుషులు 6,55,786 మంది వున్నారు. సామాజిక తరగతుల రీత్యా చూస్తే హిందువులు 49.48, ముస్లింలు 28.65, క్రైస్తవులు 21.34, ఇతరులు 0.53శాతం వున్నారు.

Image result for pp suneer cpi

వైనాడ్‌ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ మలప్పురం జిల్లా కార్యదర్శి పిపి సునీర్‌ పోటీ చేస్తున్నారు.1968లో జన్మించారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని ముగించి రెెండవ దశలో ప్రవేశించారు. ప్రజా మన్ననలను పొందిన సునీర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ద్వారా విద్యార్ధి వుద్యమాలు, యువజన రంగం, అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో 2004లో పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తమ అవకాశాలను పెంచుకొనేందుకు రాహుల్‌ గాంధీని బరిలోకి దించి.గతంలో ఇందిరా గాంధీ, పివి నరసింహారావు, ఎన్‌టిఆర్‌, నరేంద్రమోడీ రెండు చోట్ల పోటీ చేసిన వుదంతాలు వున్నాయి. రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా అధికార పీఠం ఎ్కకుండానే ఆ పనిచేస్తున్నారు. ఈ పోటీ తమకు బలాన్నిస్తుందని కాంగ్రెస్‌ చెబుతుంటే ఆ పార్టీ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమేథీ నుంచి పారిపోయి వస్తున్నారని బిజెపి ఎద్దేవా చేసింది. గుజరాత్‌ నుంచి నరేంద్రమోడీ వారణాసిలో పోటీ చేస్తున్నారంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ వైనాడ్‌లో పోటీ చేయటం అంటే కేరళలో ప్రధాన శత్రువుగా వామపక్షాలను ఎంచుకున్నట్లే అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ వ్యాఖ్యానించారు.రాహుల్‌ను పోటీకి దించటమంటే వారి ప్రాధాన్యత కేరళలో వామపక్షాల మీద వ్యతిరేకత, బిజెపిని ఓడించాలన్న కాంగ్రెస్‌ జాతీయ విధానానికి వ్యతిరేకం, కేరళలో ప్రధాన శక్తి బిజెపి కాదు, ఎల్‌డిఎఫ్‌ అందువలన రాహుల్‌ను ఓడిస్తాం అన్నారు. ఈ చర్య కాంగ్రెస్‌లో తలెత్తిన విశ్వాసరాహిత్యాన్ని వెల్లడిస్తున్నదని, రాహుల్‌ గెలిస్తే ఏ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తారో తెలుసుకోగోరుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్‌ అన్నారు.

Image result for rahul gandhi wayanad

కాంగ్రెస్‌కు బలమున్న స్ధానంగా వున్న వైనాడ్‌లో తమ అభ్యర్ధులను నిలిపేందుకు కాంగ్రెస్‌లోని ప్రధాన ముఠా నాయకులందరూ ప్రయత్నించారన్నది కొద్ది రోజులుగా వచ్చిన మీడియా వార్తలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ ఒక దశలో విముఖంగా వుండటంతో కోజికోడ్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి సిద్దికిని అభ్యర్ధిగా ప్రకటించారు. పార్టీలో ‘ఎ’ వర్గనాయకుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ సిద్దికీ పేరును ప్రతిపాదించగా ‘ఐ ‘ గ్రూప్‌ నాయకుడిగా వున్న రమేష్‌ చెన్నితల షానిమోల్‌ వుస్మాన్‌, వివి ప్రకాష్‌ పేర్లను ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన లక్షలాది కార్యకర్తలు రాహుల్‌ పోటీ చేయాలని కోరినట్లు కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వర్ణించారు.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీని పోటీకి దించినా, దించకపోయినా అక్కడ ప్రధాన పోటీ సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ మధ్యనే జరుగుతుంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును తొలుత స్వాగతించి తరువాత ఓటు బ్యాంకు రాజకీయాలకు వుపయోగించుకోవాలని చూసిన కాంగ్రెస్‌, బిజెపిలో భక్తుల మనోభావాల పేరుతో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే తమకు ఓటింగ్‌ శాతం పెరగనుందని బిజెపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌కూడా ఆ ఓట్లమీదనే కన్నేసింది. అయితే రాజకీయంగా ఎప్పటి నుంచో సమీకరణ అయిన కేరళ ఓటర్లు ఎంత మేరకు మొగ్గుతారన్నది ప్రశ్న.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ ప్రవేశంతో బిజెపికి ఒక విధంగా ఇరకాటం అని చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఓటింగ్‌ తీరుతెన్నులే ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చిందీ వివరాలను పట్టికలో చూడవచ్చు. గత లోక్‌సభ ఎన్నికలలో 80వేల ఓట్లు తెచ్చుకున్న బిజెపి రెండు సంవత్సరాల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో 93,641 ఓట్లు తెచ్చుకుంది. నాలుగు సీట్లలో విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌కు 4,55,019 ఓట్లు వస్తే మూడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు 4,73, 434 ఓట్లు వచ్చాయి. 2014లోక్‌ సభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్ధి కంటే కాంగ్రెస్‌కు 20వేలు మాత్రమే. దాదాపు అదే తేడా అసెంబ్లీ ఎన్నికలలో 17,600కు పడిపోయింది.

Image result for Amul Baby Rahul Gandhi in Wayanad Fray

కేరళలో బిజెపి పైకి ఏమి చెప్పినప్పటికీ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను కూడగడుతున్నది. దేశవ్యాపితంగా ముక్త కాంగ్రెస్‌ పేరుతో ఆపార్టీని మట్టికరిపిస్తానని చెబుతున్నది. వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నందున బిజెపి ప్రధాన లక్ష్యం ఏమిటన్నది ప్రశ్న. అంతకు ముందు ఆ స్దానాన్ని దాని మిత్రపక్షానికి కేటాయించింది. ఇప్పుడు రాహుల్‌ ఖరారు కావటంతో ఆ స్ధానాన్ని తాము తీసుకొని ప్రముఖ అభ్యర్ధిని దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపి కావచ్చని మీడియా పేర్కొన్నది. చివరకు తోక ముడిచి మిత్రపక్ష అభ్యర్ధినే ఖరారు చేసింది. గతంలో అనేక చోట్ల బిజెపి బలహీనమైన వారిని పోటీ పెట్టి కమ్యూనిస్టులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు సహకరించింది. ఈ సారి అదే జరుగు తుందా లేక రాహుల్‌ గాంధీని ఓడించేందుకు తన ఓట్లను తమ అభ్యర్ధికే వేయిస్తుందా అన్నది దాని ముందున్న ప్రశ్న. శబరిమల ఆలయం పేరుతో చేసిన ఆందోళనతో కాంగ్రెస్‌, బిజెపి రెండూ లబ్ది పొంద చూస్తున్నాయి. అదే జరిగితే బిజెపి ఏ మాత్రం ఓట్లు పెంచుకున్నా అవి కాంగ్రెస్‌కు సంబంధించినవి తప్ప వామపక్షాల నుంచి పోయేవి కాదన్నది స్పష్టం. ఒకవేళ అదే జరిగితే బొటాబొటీ మెజారిటీ వున్న స్ధితిలో అక్కడ రాహుల్‌ గాంధీ ఓడిపోవటం ఖాయం. ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితిలో ఒక వేళ రాహుల్‌కు ఓటు వేసి గెలిపించినా ఆయన అమేథీని ఎంచుకుంటారు, వైనాడ్‌ను వదిలి వేస్తారు, ఆ మాత్రానికి ఎందుకు వేయటం, వుప ఎన్నికలకు పోవటం ఎందుకని తటస్ధ ఓటర్లు ఆలోచించవచ్చు. మరొక వూహ ప్రకారమైతే రాహుల్‌ గాంధీని నిజంగా బిజెపి ఓడించాలనుకుంటే ప్రధాన ప్రత్యర్ధి సిపిఐకి ఓటు వేయటం ద్వారానే ఆపని చేయగలగుతుంది. మరొక మార్గం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన స్ధితిలో అది జరుగుతుందా అన్నది సందేహమే. అందువలన ఏ రీత్యా చూసినప్పటికీ వైనాడ్‌ ఎన్నిక ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పవచ్చు.

2014 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు,

కాంగ్రెస్‌ 3,77,035 41.20

సిపిఐ 3,56,165 38.92

బిజెపి 80,752 8.82

ఇండి 37,123 4.60

ఎస్‌డిపిఐ 14,327 1.57

డబ్ల్యుపిఐ 12,645 1.38

ఆప్‌ 10,684 1.17

2009 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు

కాంగ్రెస్‌ 4,10,703 41.20

సిపిఐ 2,57,264 31.23

ఎన్‌సిపి 99,663 12.10

బిజెపి 31,687 3.85

2016లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

సిపిఎం 26.7 58

సిపిఐ 8.2 19

ఎల్‌డిఎఫ్‌ ఇండి 2.4 4

జెడిఎస్‌ 1.5 3

ఎన్‌సిపి 1.2 2

కాంగ్రెస్‌ 23.8 22

ముస్లింలీగ్‌ 7.4 18

బిజెపి 10.6 1

కెసిఎం 4 6

బిడిజెఎస్‌ 4 0