Tags

, , ,

Image result for gloomy jobs scenario in india

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను నమ్మి జనం ఓటేసి గెలిపిస్తే తరువాత దాని అమలు విషయానికి వస్తే జుమ్లా (ఏదో అవసరానికి అలా చెబుతాం) అవుతుందా ? ఏమో ! నరేంద్రమోడీ వాగ్దానం చేసిన మేరకు నల్లధనాన్ని వెలికి తీసి ఆ మొత్తం నుంచి ప్రతి ఒక్కరికి వేస్తామన్న పదిహేను లక్షల రూపాయల సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే అమాయకులు ఇంకా వున్నారు కదా ! ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు అచరణకూ పొంతన వుండదని ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. రానున్న పది సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానుంది. అందువలన యువత, వారి భవిష్యత్‌ను కోరే వారు ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వుంది.

తాము అధికారంలోకి రాగానే 2020 నాటికి నాలుగు లక్షల కేంద్ర వుద్యోగాలను భర్తీ చేస్తామని ఇవిగాక రాష్ట్రాలలో వున్న మరొక ఇరవై లక్షల వుద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొన్నది. ఇవి గాక ఏటా 22లక్షల కొత్త వుద్యోగాల కల్పన కూడా చేస్తామని చెప్పారు. స్ధానిక సంస్దలలో పదిలక్షల సేవామిత్రల ఏర్పాటు గురించి కూడా వాగ్దానం వుంది. 2013 మార్చినెల నాటికి ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ వుద్యోగ ఖాళీలు వుండగా 2014 మార్చి ఒకటి నాటికి అవి 4లక్షల 21వేల వుద్యోగాలు ఖాళీగా వుండగా గత ఐదు సంవత్సరాలలో కూడా దాదాపు అదే స్దాయిలో ఖాళీలు వున్నాయి.గత ఏడాది పార్లమెంటులో వివిధ సందర్భాలలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను క్రోడీకరించగా కేంద్ర, రాష్ట్రాలలో, ప్రభుత్వ రంగ సంస్ధలలో మొత్తం 24లక్షల మేరకు ఖాళీలు వున్నాయి. విద్యా రంగంలో పదిలక్షలు, పోలీసుశాఖల్లో 5.4, రైల్వేల్లో 2.5, రక్షణ రంగంలో 1.2లక్షలు, పారా మిలిటరీలో 61వేలు ఖాళీలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వశాఖలలో మంజూరైన పోస్టుల సంఖ్య 36,33,935 కాగా వున్న సిబ్బంది 32,21,183 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలలో (సిపిఎస్‌ఇ) 2013-14లో 13.49లక్షల మంది సిబ్బంది వున్నట్లు నమోదు కాగా మోడీ అధికారానికి వచ్చాక 2016-17 నాటికి ఆ సంఖ్య 11.31లక్షలకు పడిపోయిందని తాజా ప్రభుత్వ రంగ సంస్దల సర్వే వెల్లడించింది. ఈ అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? ఖాళీగా వున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్దల వుద్యోగాల గురించి కాంగ్రెస్‌ ఏమీ చెప్పలేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కూడా నాలుగు లక్షల ఖాళీలు వున్నాయి. పదేండ్లు అధికారంలో వున్నపుడు చేయలేని పనిని రేపు వస్తే గిస్తే ఎలా చేస్తారో చెప్పాలా లేదా ?

India-automation-jobs-layoffs

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, వునికిలో వున్నవాటి నవీకరణ వలన మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువగా వుపాధి దొరుకుతోంది. విల్స్‌ టవర్‌ వాట్సన్‌ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పశ్చిమ భారత్‌లో అంటే మహారాష్ట్ర, గుజరాత్‌ వస్త్ర,నూలు మిల్లుల్లో కార్మికుల కంటే యంత్రాలే ఎక్కువగా వుండబోతున్నాయి. కార్ల తయారీలో నలుగురు కార్మికులు చేసే పనిని ఒక రోబో చేస్తోంది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం 13శాతం పనిని యంత్రాలు చేస్తుండగా రానున్న మూడు సంవత్సరాలలో అది 23శాతానికి పెరగనుంది. అదే మన దేశంలో 14 నుంచి 30శాతానికి పెరగనుంది. అందువలన అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు ఎన్ని కబుర్లు చెప్పినా వుద్యోగాలు రోబోట్లకు తప్ప అనంతపురం జనానికి కాదు.ఈ పరిశ్రమను తమ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలంగాణా యువత నిరాశ చెందనవసరం లేదు.

పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రస్తుతం యువతరం ఎక్కువ శాతం వున్నారు. ఈ కారణంగా రానున్న దశాబ్దిలో వుద్యోగాలు లేదా వుపాధి అవసరమైన వారు లేబర్‌ మార్కెట్‌లో 13.8కోట్ల మంది తోడు కానున్నారు. దేశంలో వున్న శ్రామిక శక్తిలో కేవలం 18.5శాతమే ఇంటర్‌ లేదా అంతకు మించిన విద్యతో నైపుణ్యం కలిగిన కార్మికులు వున్నారు. యాంత్రీకరణ కారణంగా దిగువ తరగతి కార్మికులే ఎక్కువగా వుద్యోగాలను కోల్పోతారని సర్వేలు తేల్చాయి. రాజకీయ పార్టీలు, నాయకులు వుపాధి గురించి ఎన్ని కబర్లు చెప్పినప్పటికీ రానున్న పది సంవత్సరాలలో యాంత్రీకరణ మరింత పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే వుపాధి రహిత అభివృద్ది, వేతన వృద్ధి లేని వుపాధి పెరుగుతుంది. ఈ పరిణామం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం.

కేంద్ర ప్రభుత్వ వుద్యోగులకు కనీస వేతనంగా నెలకు 18వేలు వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడు ఖాళీగా వున్న నాలుగులక్షల ఖాళీలను నింపితే ఏడాదికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వేతనం పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన నుయంతమ్‌ ఆయ యోజన(న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పధకం కింద ఏటా ఇరవై శాతం పేదలు ఐదు కోట్ల కుటుంబాలకు 72వేల రూపాయలు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. అందుకు గాను తొలి ఏడాది 3.6లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, మరుసటి ఏడాది ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ పధకం గురించి 2016-17 ఆర్ధిక సర్వేలో నాటి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం ప్రతిపాదించారు. దాని అమల్లో వున్న సమస్యల గురించి ఆయనే చెప్పారు. ప్రస్తుతం వున్న దారిద్ర నిర్మూలన పధకాలను రద్దు చేసి దాన్ని అమలు జరపకపో అదనపు భారం అవుతుందన్నారు. అందువలన కాంగ్రెస్‌ గానీ ఇలాంటి వాటి గురించే చెబుతున్న ఇతర పార్టీలుగానీ ముందుగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. వున్న పధకాలను కొనసాగిస్తూనే దీన్ని అమలు జరుపుతారా లేక వాటిని రద్దు చేసి ఈ కొత్త పధకాన్ని పెడతారా ? రెండవదే అయితే పేదలకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. లేదూ రెండూ అమలు జరుపుతామంటే అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుతారో వివరించాలి. ఇండియా రేటింగ్స్‌ సంస్ధ ప్రధాన ఆర్దికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ రెండూ ఒకేసారి అమలు సాధ్యం కాదని ఆర్ధికంగా ఎంతో వత్తిడి పెరుగుతుందన్నారు. విద్యమీద జిడిపిలో ఖర్చును ఆరుశాతానికి పెంచుతామన్నారు. గతంలో మోడీ సర్కార్‌ మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పిన మేరకు విద్యకు 4.6శాతం అంటే 8.76లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ చెప్పినదాని ప్రకారం ప్రతి ఏడాది మరొక 2.66లక్ష కోట్ల రూపాయలు కావాలి, ఏటా 11.4లక్షల కోట్ల రూపాయలు అవసరం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చు జిడిపిలో మూడు శాతానికి పెంచుతామన్నది ఒకటి. ఇప్పుడు 1.3శాతంగా వున్న ఖర్చుకు ఏటా 2.47లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మూడుశాతానికి పెంచితే 5.71లక్షల కోట్లు కావాలి. ఇలా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను అమలు జరపాలంటే ఏటా కనీసం పదిలక్షల కోట్లరూపాయలు అవసరం అని అంచనా వేస్తున్నారు.2018-19 బడ్జెట్‌ 24.57లక్షల కోట్ల రూపాయలు, 2023-24 నాటికి 45లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. వాగ్దానాల అమలుకు అదనపు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మరోవైపున జిఎస్‌టిని తగ్గిస్తామని వాగ్దానం చేసింది. జనానికి తగిన ఆదాయం లేనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దాని అర్ధం జిఎస్‌టి వసూళ్ల మీద పడుతుంది.

గతంలో రైల్వేకు వున్న మాదిరి రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రతి తరగతి తనకు ప్రత్యేక బడ్జెట్‌ కోరుతున్న నేపధ్యంలో ఇది చెప్పటానికి ఆకర్షణీయంగా వుంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులకు వుప ప్రణాళికలు వున్నాయి. అయినా వారి స్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని గమనించాలి. రైతాంగానికి అలాంటి ప్రణాళిక ఆచరణ సాధ్యమా ? వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూటికి 76 మంద సాగుదార్లు వ్యవసాయం మానుకొని అంతకంటే మెరుగైన వుపాధికి మరలాలని కోరుతున్నట్లు గతేడాది సిఎస్‌డిఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే తరువాత దేశంలో వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరిగింది. రైతుల్లో 62శాతం మందికి కనీస మద్దతు ధరల గురించి అవగాహన లేదని, వాటి గురించి తెలిసిన వారిలో 64శాతం మంది మద్దతు ధరలు సంతృప్తికరం లేవని చెప్పారు.

జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేశంలో రైతాంగ సంఖ్య తగ్గిపోతుండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని 2011 జనాభా వివరాలు తెలిపాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుదల కారణంగా వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోతున్న పూర్వరంగలో ఆ మేరకు వారికి పని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కనుక అది సమర్ధనీయమే.

2001లో దేశంలో రైతులు 12,73,12,851 మంది వుండగా 2011 నాటికి 11,87,00,000కు తగ్గిపోయారు. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,67,75,330 నుంచి 14,43,00,000కు పెరిగారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కారణంగా అనేక చేతి వృత్తులు నశించి వాటిలో వున్న వారు వ్యవసాయ కార్మికులుగా మారుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరల ప్రాతిపదిక ఆశాస్త్రీయంగా వుంటోంది. వ్యవసాయ ఖర్చులను పూర్తిగా పరిగణనలోకీ తీసుకోవటం లేదు. అన్ని పంటలకు ప్రకటించటం లేదు పోనీ ప్రకటించిన మేరకైనా అమలు జరిపే యంత్రాంగం రాష్ట్రాలలో లేదు. తెలంగాణాలో గతం కంటే ఎర్రజన్నలు, పసుపు ధరలు గణనీయంగా పడిపోవటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అచేతనంగా వుండటంతో రైతాంగం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. చివరకు చేసేదేమీ లేక నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 178 మంది రైతులు నామినేషన్లు వేసి కొత్త రూపంలో నిరసన తెలుపుతున్నారు. తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అక్కడి అన్నాడిఎంకె, కేంద్ర సర్కార్‌ విఫలం కావటంతో వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేసేందుకు వంద మంది రైతులు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చివరి దశలో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

నిజామాబాద్‌ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన రైతు బంధు నగదు తీసుకున్నా, పడిపోయిన ధరలతో పోల్చితే ఆ మొత్తం ఏమాత్రం చాలకనే ఆందోళనలకు దిగారు. అందువలన వివిధ పార్టీలు ఇప్పుడు ప్రకటిస్తున్న నగదు బదిలీ పధకాలు సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించేవి కాదు, ఇప్పుడున్న వాటితో పాటు అమలు జరిపితే కాస్త వుపశమనం మాత్రమే దొరుకుతుంది.

Image result for jobs scenario in india

దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో జిడిపి రీత్యా ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వుంది. ఏడుశాతానికి అటూ ఇటూగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి వున్నా దానికి అనుగుణంగా వుపాధి ఎందుకు పెరగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవారంగాలలో యాంత్రీకరణ, ఐటి కారణంగా ఆయా సంస్ధల ఆదాయాలు, లాభాలు పెరగటం తప్ప వుద్యోగాల వుపాధి తగ్గిపోతోంది.