Tags

, , ,

Image result for golan heights

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. సరిగ్గా అలాంటి సాకులతోనే అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌కు అమెరికా తాన తందాన అంటోంది. అది ఆక్రమించుకున్న సిరియాకు చెందిన గోలన్‌ గుట్టల ప్రాంతం ఇజ్రాయెల్‌దే అని ప్రకటించింది. ప్రపంచం యావత్తు వ్యతిరేకిస్తున్నా దాని అడ్డగోలు వాదనలను సమర్ధిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత పొడిగింపు, సంక్లిష్టం చేయటమే కాదు, ప్రపంచంలో పలుచోట్ల కొత్త సమస్యలు, సంఘర్షణలు తలెత్తటానికి నాంది పలికింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్ధ ఐక్యరాజ్యసమితి ఈ ధోరణిని అడ్డుకోవటంలో విఫలమైంది. ఇది మానవాళి శాంతికే ముప్పు. అనేక ప్రాంతీయ ఒప్పందాల వుల్లంఘన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికితే, నానాజాతి సమితి వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధానికి బాటలు వేసింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా వైఫల్య పరంపరలో వుంది. ఇది ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో ?

పాలస్తీనా అరబ్బులకు చెందాల్సిన జెరూసలెం పట్టణాన్ని ఇజ్రాయెల్‌ రాజధానిగా గత ఏడాది గుర్తించిన అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 1967 దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న సిరియా భూ భాగం గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌ అంతర్భాగంగా తాను గుర్తిస్తున్నట్లు గత వారంలో నిర్ణయించింది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్‌, తాజాగా అరబ్‌ లీగ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే అమెరికా వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు చేసింది అంటే ఇజ్రాయెల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార పక్షానికి ఓట్లు వేయించటం తక్షణ ప్రయోజనం తప్ప పశ్చిమాసియా వివాదాన్ని కొనసాగించే ఎత్తుగడలో భాగమే ఇది. ట్యునిస్‌లో ఆదివారం నాడు జరిగిన లీగ్‌ వార్షిక సమావేశంలో కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయానికి రానప్పటికీ గోలన్‌ హైట్స్‌ సిరియా అంతర్భామనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

1947 నవంబరులో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు బ్రిటీష్‌ వలసగా వున్న పాలస్తీనా దేశాన్ని రెండు మ్కులుగా చేశారు. అప్పటికే ముందస్తు కుట్రకు తెరలేపిన ఇజ్రాయెల్‌ సాయుధదళం బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాకు మిగిల్చిన ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు దాడులకు పూనుకుంది. దానికి ప్రతిగా పరిసర ప్రాంతాలలో వున్న అరబ్‌ దేశాలన్నీ వాటి రక్షణకు నడుంకట్టాయి. దీనిని 1948 ఇజ్రాయెల్‌-అరబ్బు యుద్దంగా పిలుస్తున్నారు. అదే ఇజ్రాయెల్‌ 1967లో మరోసారి పశ్చిమ దేశాల అండతో మరికొన్ని ప్రాంతాల ఆక్రమణకు పూనుకుంది. ఈ సారి పక్కనే వున్న సిరియా దక్షిణ ప్రాంతం గోలన్‌ గ్టులను చేజిక్కించుకుంది.1974 కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి శాంతి సేనల ఆధీనంలోకి వచ్చింది.1981లో ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది, అయినప్పటికీ ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగుతున్నాయి. నాటి ఇజ్రాయెల్‌ నిర్ణయాన్ని తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు గత సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగటానికి దీనికి సంబంధం లేదని, అవి అక్కడే వుండవచ్చని అమెరికా నమ్మబలుకుతోంది. 1974నుంచి ప్రతి ఆరునెలలకు ఒకసారి గోలన్‌ గుట్టలలో శాంతి పరిరక్షక దళాల కొనసాగింపు నిర్ణయం తీసుకుంటున్నారు. జూన్‌ 30వ తేదీతో తాజా ఆరునెలల గడువు ముగుస్తుంది. అమెరికా నిర్ణయ నేపధ్యంలో మరోసారి పొడిగింపు వుంటుందా, అమెరికా అందుకు సహకరిస్తుందా అన్నది సందేహాస్పదంగా మారింది.

గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్నట్లు చేసిన ప్రకటన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐరాస నిబంధనలకు విరుద్దం కనుక చెల్లదని 1981లోనే భద్రతా మండలి తీర్మానించింది. దానికి అమెరికా తూట్లు పొడిచినందున వెంటనే చర్చించాలన్న సిరియా కోరిక మేరకు గత వారంలో భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. అమెరికా తప్ప అన్ని దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలు వున్న ప్రాంతానికి పక్కనే నిత్యం సిరియా సాయుధ దళాలు కొనసాగుతున్నాయని, అది 1974 ఒప్పందానికి వ్యతిరేకమని అమెరికా వాదించింది. సిరియా సరిహద్దులో హిజబుల్లా సాయుధులు కూడా వున్నారనే వార్తలు వుద్రిక్తతలు పెరగటానికి దోహదం చేస్తున్నాయని కూడా ఆరోపించింది. మొత్తం మీద శాంతి నెలకొన్న గోలన్‌ గుట్టలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఇటీవలి పరిణామాలను సాకుగా తీసుకోవద్దని, ఆ సమస్య విషయంలో భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాల్లో ఎలాంటి మార్పు లేదని, కట్టుబడి వుంటాయని ఐరాస వుప ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రోజ్‌ మేరీ డికార్లో స్పష్టం చేశారు. ఆత్మరక్షణకు తాము చేసిన యుద్దంలో విజయం సాధించామని, దురాక్రమణలను నిరోధించేందుకు చేసే యుద్దాలు, కొన్ని ప్రాంతాలను కలిగి వుండటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దం కాదని, అమెరికా తమ నిర్ణయాన్ని సమర్ధించటం తప్పు కాదని ఇజ్రాయెల్‌ వాదించింది.అయితే ఈ వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా నిపుణులతో సహా ప్రపంచవ్యాపితంగా అందరూ తప్పు పట్టారు.

ఇజ్రాయెల్‌ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలకు ముందే యూదు దురహంకారులు యూదు రాజ్య పున:స్ధాపన ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం పాలస్తీనా ప్రాంతాలేగాక బైబిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలతో కూడిన ఇజ్రాయెల్‌ ఏర్పడాలి. వాటిలో గోలన్‌ గుట్టలు వున్న దక్షిణ సిరియా ప్రాంతం కూడా వుండాలని ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దానిలో భాగంగా ఆక్రమించుకున్నారే తప్ప సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ఎలాంటి ముప్పు లేదు. బెన్‌ గురియన్‌ అనే యూదు దురహంకారి 1918లో రూపొందించిన ఒక పధకంలో తొలి దశలో ఏ ప్రాంతాలను, తరువాత వేటిని ఆక్రమించుకోవాలన్నది బహిరంగంగా పేర్కొన్నాడు. దాని ప్రకారమే సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్‌ గిల్లికజ్జాలు పెట్టుకుంది. చివరికి 1967లో ఆక్రమించుకుంది. అయితే సిరియాలో పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వాలు వున్న సమయంలో గోలన్‌ గుట్టలను సిరియాకు వదలి, జోర్డాన్‌ నది, టిబ్రెయాస్‌ సరస్సులో ఇజ్రాయెల్‌కు నీటి వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే గుట్టలతో పాటు నీరు కూడా తమకు కావాల్సిందేనని,దాని గురించి చర్చలు కూడా లేవని ఇజ్రాయెల్‌ అడ్డగోలుగా వాదించింది. ఆ తరువాత వివాదాన్ని కొనసాగించేందుకు, నీటిని మళ్లించేందుకు నిరంతరం రెచ్చగొట్టే చర్యలకుపూనుకుంది. సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు వుందనేది ఒక సాకు మాత్రమే. ఇటీవల సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో చెలరేగుతున్న ఐఎస్‌ మూకలకు ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా సహకరిస్తోంది.

Image result for golan heights

1973 యుద్దం తరువాత మిలిటరీ బలంతో గోలన్‌ గుట్టలను తిరిగి పొందలేమని, సంప్రదింపులే మార్గమని సిరియా నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో సిరియా-ఇరాక్‌ సంబంధాలు బలపడటం, రాజకీయంగా సిరియన్లు రష్యాకు దగ్గర కావటంతో అమెరికన్లు రెచ్చిపోయి గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌వే అని గుర్తించిందని చెప్పవచ్చు. సిరియాతో అరబ్‌ లీగ్‌ సంబంధాలు సజావుగా లేకున్నా అరబ్‌ పౌరుల మనోభావాల కారణంగా ఆదివారం నాడు ట్యునీసియా రాజధాని ట్యునిస్‌లో జరిగిన శిఖరాగ్రసమావేశం అమెరికా చర్యను ఖండించాల్సి వచ్చింది. దీనికి అమెరికా అనుంగు దేశం సౌదీ అరేబియా చొరవ తీసుకోవటం విశేషం. రాజు సల్మాన్‌ స్వయంగా అమెరికా వైఖరిని ఖండించారు. తూర్పు జెరూసలెం పట్టణం పాలస్తీనా రాజధాని అన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అయితే పనిలో పనిగా దీనికి ఆ ప్రాంతంలో ఇరాన్‌ జోక్యమే కారణమని దాని మీద ఒక రాయి వేశాడు.

యాభై రెండు సంవత్సరాల క్రితం 1,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వున్న గోలన్‌ గుట్టలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. రెండు పట్టణాలు, 340 గ్రామాల నుంచి సిరియన్‌ అరబ్బులను ఇజ్రాయెలీ మిలిటరీ తరిమి వేసింది ఆ సమయంలో లక్షా 28వేల మంది సిరియన్‌ పౌరులు వున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణలోకి పోగానే వారంతా తమ ఆస్ధులు, ఇండ్లను వదలి సిరియా ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. ఆరువేల మంది డ్రజే అనే మతశాఖకు చెందిన వారిని మాత్రమే అక్కడ వుండేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించింది. వారు ఇజ్రాయెల్‌కు అనుకూలురు. 1981లో ఆ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా ప్రకటించుకున్న ఇజ్రాయెల్‌ అక్కడి వారికి తమ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అది చెల్లదని ఐరాస పేర్కొన్నది. 1967లో సిరియాకు వెళ్లిన వారి వారసుల సంఖ్య ఇప్పుడు ఐదులక్షలకు పెరిగింది. వారంతా తమ స్వస్ధాలలకు రావాలని కోరుకుంటున్నారు.

Image result for golan heights

అమెరికా చర్యను దాని నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు కూడా అంగీకరించటం లేదు. ఇది అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించటమే, ఆ ప్రాంతంలో వుద్రిక్తతలను పెంచుతుందని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా చర్య ఆ ప్రాంత సమస్యకు ఒక పరిష్కారం కాదని ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధికారి మోఘెరినీ అన్నాడు. గోలన్‌ గుట్టల ఆవలి సిరియా నుంచి ఇరాన్‌ సేనలు తమ మీదకు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంత పాడుతూ ఇరాన్‌తో పాటు అనేక వుగ్రవాద బృందాలు కూడా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌పై దాడులకు వుపయోగించుకుంటున్నాయన్నాడు. అమెరికా వైఖరి ఇలాంటి అన్ని సమస్యల పట్ల ఒకే విధంగా లేదు. దాని ప్రయోజనాలకే పెద్ద పీట వేసింది. దాని సమర్దన ఒక్క గోలన్‌ గుట్టలకే పరిమితం అవుతుందని అనుకోరాదు. మన దేశాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రేపు తన ఆధీనంలోని ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్ధాన్‌ తన అంతర్భాగంగా ప్రకటించుకొంటే అమెరికా దానికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అన్నింటికీ మించి బలమైన దేశాలు తమ సరిహద్దుల రక్షణలను సాకుగా చూపి బలహీనమైన ఇరుగు పొరుగుదేశాల భూ భాగాలను ఆక్రమించుకొనే అవకాశాలు పెరుగుతాయి. గతంలో ఇరాక్‌ అధినేత పొరుగునే వున్న కువాయిట్‌ తమ ప్రాంతంలోని చమురును అక్రమంగా తోడుకుంటోందని, దొంగతనం చేస్తోందని ఆరోపించి సైన్యాన్ని పంపి ఏడు నెలల పాటు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అదే ఇరాక్‌లో అమెరికా జోక్యానికి నాంది పలికింది. అదే అమెరికా మరో వైపు రష్యా ఆక్రమణలోని క్రిమియా ప్రాంతం విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేయటం రాజకీయం మాత్రమే. తమ భద్రతకు క్రిమియా అవసరమని రష్యా వాదిస్తున్న విషయం తెలిసినదే. ఏదో ఒక సాకుతో ఒక దేశ ప్రాంతాన్ని మరొకటి ఆక్రమించుకోవటం, దాడులను సమర్ధించే అమెరికా వైఖరి ప్రపంచానికే ముప్పు.