Tags

, , , , , ,

Image result for Adavani  an useless entity  In BJP

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో పిలుపు ఇచ్చారు. బిజెపి అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ ఇప్పుడు వూడగొట్టిన నాగటి కర్రు. అది నాగలికి వుంటేనే దున్నటానికి పనికి వస్తుంది. ఒట్టి కర్రుతో పొలం దున్నలేరు. తాను ఏమి మాట్లాడినా తనకు ఇంతకు మించి పోయేదేమీ లేదన్నట్లుగా తొమ్మిది పదులు దాటిన బిజెపి కురువ ద్ధుడు ఎల్‌కె అద్వానీ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా ! బిజెపిలో అంత ధైర్యమూ లేదు, ఎవరికీ అంతసీన్‌ లేదు. అందుకే వుక్రోషంతో తన బ్లాగ్‌లో తన అంతరంగం ద్వారా నరేంద్రమోడీ తీరు తెన్నులపై పరోక్షంగా ధ్వజమెత్తారని కొందరి అభిప్రాయం.

తన బ్లాగ్‌లో అద్వానీ విప్పిన అంతరంగ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. బిజెపిలో వున్న మనమందరం పార్టీ వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా వెనుకా, ముందూ చూసుకోవటం, ఆత్మపరిశీలన చేసుకోవటం మంచిది అని చెప్పారు. పార్టీలోపలా, విశాలమైన దేశ వ్యవస్ధలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడు కోవటం బిజెపి ప్రమాణ చిహ్నంగా వుండాలి.మన ద ష్టిలో జాతీయ వాదం అంటే రాజకీయంగా మనతో ఏకీభవించని వారిని మనం ఎన్నడూ జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు, వ్యక్తిగతంగా రాజకీయ స్దాయిలో వ్యక్తులు ఎంచుకొనే స్వేచ్చకు బిజెపి కట్టుబడి వుంటుంది. ముందు దేశం, తరువాత పార్టీ,మన గురించి చివరిగా ఆలోచించాలన్న సూత్రం తనకు జీవిత మార్గదర్శిగా వుందని, జీవితాంతం దానికి కట్టుబడి వుంటానని అద్వానీ పేర్కొన్నారు.

బిజెపి నిజమైన స్వభావాన్ని అద్వానీ గారు పక్కాగా చెప్పారు. దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర వుండాలనే మార్గదర్శక మంత్రం బాగా తెలిసిందే. బిజెపి కార్యకర్తగా గర్వపడుతున్నాను మరియు ఎల్‌కె అద్వానీ వంటి గొప్పవారు దాన్ని మరింత బలపరిచారు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ద్వారా వ్యాఖ్యానించారు. అద్వానీ ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఆయనకు పోయేదేమీ లేదు అంటూ ఒక పత్రికలో వ్యాఖ్యానం మొదలైంది. అద్వానీకి నోరు విప్పటానికి ఐదేండ్లు పట్టింది, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అని బిజెపి మిత్రపక్షం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.

Image result for Advani , modi in different occasions

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు కిసుక్కున నవ్వటం తగని పని అన్నట్లు అద్వానీ గురించి రాహుల్‌ గాంధీ చేసిన వాటి కంటే చౌకీదారు పంగనామాలు పెట్టుకున్న బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడిన రాహులు ఇలా అన్నారు.’ బిజెపి హిందూయిజం గురించి మాట్లాడుతుంది, హిందుస్దాన్‌లో గురువు అధిపతి. పార్టీ గురుశిష్య సంబంధాల గురించి మాట్లాడుతుంది. మోడీ గురువు ఎవరు? అద్వానీ, అద్వానీని ప్రజాజీవన వేదిక మీది నుంచి తోసివేశారు’ అన్నారు. గురువును అవమానించటం హిందూ సంస్క తి కాదంటూ నరేంద్రమోడీని వుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యా నించారు. హిందూ సంస్క తి గురించి మాట్లాడే హక్కు తమకే వుందని, పేటెంట్‌ తీసుకున్నామన్నట్లుగా చెప్పుకొంటుంది బిజెపి. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు హిందూత్వను హిందూత్వతోనే దెబ్బతీయాలి అన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? లేక తామూ హిందూ సంస్కృతి గురించి చెప్పగలమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా వుంది. అదే హిందూ సంస్క తిలో గురువు తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన ఒక శిష్యుడి కోసం తనను పరోక్షంగా గురువుగా భావించిన మరొక శిష్యుడి బొటనవేలిని కానుకగా కోరిన దారుణం కూడా తెలిసిందే. దాని మంచి చెడ్డలను మరోసారి చూడవచ్చు.

Image result for Advani , modi in different occasions

అసలు విషయం ఏమంటే బిజెపి వ్యవస్దాపక నేతలలో ఒకరైన ఎల్‌కె అద్వానీ పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పటం మినహా మిగిలిన అవమానాలన్నీ జరిగాయి. వాటన్నింటినీ దిగమింగుతూ ఏప్రిల్‌ ఆరున బిజెపి వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా ఎవరూ కోరకుండానే పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు తన బ్లాగ్‌ ద్వారా అద్వానీ ఈనెల నాలుగు ఒక సందేశాన్ని పంపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక బ్లాగ్‌ పోస్టు పెట్టటం ఇదే ప్రధమంట. నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రతి నెలా తన అంతరంగాన్ని బయట పెడితే, అంతకు ముందే అద్వానీ తన ఇంటర్నెట్‌ బ్లాగ్‌లో తన అంతరంగాన్ని అభిప్రాయాల రూపంలో అప్పుడు రాస్తుండేవారు. ఏమి రాస్తే, ఏమి మాట్లాడితే ఎవరికేమి కోపం వస్తుందో అన్నట్లుగా గత ఐదేండ్లుగా బ్లాగులో రాయట మానుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభకు హాజరు కావటం, అలవెన్సులు తీసుకోవటం తప్ప ఒక్కసారి కూడా నోరు విప్పని సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయారనే విమర్శలకు గురయ్యారు. ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం 365పదాలను మాత్రమే మాట్లాడారని, అది కూడా 2014లో అని ఇండియా టుడే పత్రిక పేర్కొన్నది, బహుశా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయి వుండవచ్చు.

ఆరు సార్లు గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి ఎంపీగా వున్న అద్వానీని వయసు మీరిందనే సాకు చూపి ఈ సారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోగా ఆయనే పోటీ చేయటం లేదని చెప్పారంటూ బిజెపి నేతల నుంచి మీడియాకు వుప్పందించారు. ఈ చర్య ఆయనను అవమానించటంగా మీడియా, ప్రతిపక్షాలు వర్ణించాయి తప్ప బిజెపి ప్రముఖులెవరూ నోరు విప్పలేదు. రాహుల్‌ గారూ మీ మాటలు మమ్మల్ని ఎంతగానో గాయపరిచాయి, అద్వానీ మాకు బిజెపిలో తండ్రితో సమానుడు . మీ వుపన్యాసాల్లో కాస్త ఔచిత్యం ప్రదర్శించండి’ అని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

నిజానికి రాహులు గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించారు గానీ నరేంద్రమోడీ గురువుకు పంగనామాలు పెట్టారని ఐదు సంవత్సరాల క్రితమే జనానికి అర్దమైంది. అనుమానాస్పద స్దితిలో జరిగిన గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణ కాండ సమయంలో నరేంద్రమోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ప్రధానిగా వున్న వాజ్‌పేయి పదవి నుంచి తప్పుకోవాలని మోడీని ఆదేశించారని, అద్వానీ మద్దతుతో మోడీ తిరస్కరించి ముఖ్యమంత్రిగా కొనసాగారని, చేసేదేమీ లేక రాజధర్మం పాటించాలన్న వుద్బోధతో వాజ్‌పేయి సరిపెట్టారని అప్పుడే వార్తలు వచ్చాయి. నాడు అద్వానీ మద్దతు లేకపోతే నేడు ప్రధానిగా నరేంద్రమోడీని వూహించలేము.

ప్రధాని పదవిపై ముందునుంచీ కన్నేసిన నరేంద్రమోడీ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి కోసం 2013లోనే పావులు కదిపి విజయం సాధించారు. ఆయన పేరును పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించగానే అద్వానీ మౌనంగా వుండటం తప్ప మరేమీ చేయలేని స్దితిలో పడ్డారు. అద్వానీకి పదవి నిరాకరించితే సమస్యలు వస్తాయని వూహించి 75 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని ఒక నిబంధను ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారితో మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామంటూ మండలి ఏర్పాటు గురించి ప్రకటించారు. అది ఐదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు, నరేంద్రమోడీ సర్కార్‌ సలహా ఇమ్మని ఒక్కసారి కూడా కోరలేదు.ఇది పొమ్మన కుండా పొగపెట్టటమే అని అందరూ అప్పుడే వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని అస్త్రాలను నరేంద్రమోడీ ప్రయోగిస్తున్న దశలో అధికారం కోసం ఏం చేసినా తప్పులేదనే ఒక అభిప్రాయాన్ని దిగువ స్దాయి కేడర్‌ వరకు బిజెపి ఎక్కించింది. దేశంలో హిందూత్వ, హిందూ మతాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీ తప్ప మరొకరి వల్ల కాదనే అభిప్రాయాలు నిత్యం సామాజిక మాధ్యమంలో వెల్లడి అవుతున్నాయంటే దాని అర్దం అదే. అందువలన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల గురించి బిజెపి కార్యకర్తలకు ఎంత మేరకు ఎక్కుతాయనేది ప్రశ్న. నరేంద్రమోడీ గోరక్షకులు హద్దులు మీరవద్దంటూ అనేక సుభాషితాలు పలికారు. అలా హద్దులు మీరి, హత్యలు చేసిన నిందితులు అనేక మంది వుత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న బిజెపి ఎన్నికల సభల్లో ముందువరుసల్లో కూర్చున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారికి విద్వేషం వద్దు ప్రేమే ముద్దు అంటే ఎక్కుతుందా ?

భిన్నాభి ప్రాయం చెప్పిన వారందరినీ దేశద్రోహులుగా సంఘపరివార్‌ సంస్ధలూ, వాటికి వంత పాడిన మీడియా గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంచిత్రీకరిస్తోంది.గతంలో అనేక మంది ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని దేశం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు చెప్పిన మాటలను అద్వానీ అప్పుడు చెప్పివుంటే వాటికి ఎంతో విలువ వుండేది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను, స్వతంత్ర అధికార వ్యవస్దలను నాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వెలువడిన సమయంలో అద్వానీ ఎందుకు నోరు విప్పలేకపోయారు, పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరు విప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు. నక్కబోయిన తరువాత బక్కపూడ్చినట్లు ఇప్పుడు చెప్పారు అనే వారిని తప్పు పట్టలేము. తనకు తిరిగి సీటు ఇచ్చి వుంటే ఇలా మాట్లాడేవారా అనే వారు కూడా లేకపోలేదు. దేశమంతటికీ ముఖ్యంగా బిజెపికి ఎన్నికల, మరోసారి అధికార జ్వరం తీవ్ర స్దితికి చేరిన సమయంలో చెబితే ఎంత మంది వినిపించుకుంటారు అన్నది ప్రశ్న.

దేశంలో అత్యవసర పరిస్దితి విధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా 2015లో అద్వానీ మాట్లాడుతూ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నలిపివేశే శక్తులు బలంగా వున్నాయని వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరుతో పశువుల వ్యాపారులు, మైనారిటీల మీద దాడులు ప్రారంభమైన సమయ మది. దేశంలో హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభమైనపుడే ఇలాంటి వాటిన్నింటికీ బీజాలు పడ్డాయి. అవి పెరిగి పెద్ద వ క్షాలుగా ఎదగటానికి తోడ్పడిన వారిలో అద్వానీ పాత్ర లేదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.1980లో బిబిసితో మాట్లాడుతూ బిజెపిని హిందూ పార్టీ అని పిలవటం తప్పేమీ కాదు అన్నారు. తరువాత కొన్ని సంవత్సరాలకు దేశ లౌకిక విధానం హిందువుల ఆకాంక్షలపై సహేతుకంగాని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. ఎవరైతే హిందువుల ప్రయోజనాలకోసం పోరాడతారో ఇక నుంచి వారే దేశాన్ని ఏలుతారు అన్నారు. కుహనా లౌకిక వాదం అనే పదాన్ని ప్రయోగించటం, ప్రాచుర్యంలోకి తేవటంలో అద్వానీ చేయాల్సిందంతా చేశారు.

Image result for Advani , modi in different occasions

అయితే అద్వానీకి అలా హితబోధ చేసే హక్కు లేదా అని ఎవరైనా అనవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి వుద్బోధలు మోడీ, బిజెపికి హాని కలిగిస్తాయి కనుక అద్వానీ అయినా సరే అలా మాట్లాడటాన్ని సహించం అని హిందూత్వ పులినెక్కిన వారు హూంకరించవచ్చు. అద్వానీకి ఆ హక్కు, అవకాశం వుందని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే చరిత్ర నిర్దాక్షిణ్యమైనది. గాంధీని మోసిన రైలేే గాడ్సేను కూడా అనుమతించింది. అద్వానీ వుద్బోదధలను నమోదు చేసి సానుభూతి కలిగేట్లు చేసినట్లుగానే ఆయన విద్వేష పూరిత రాతలు, ప్రసంగాలను కూడా జనం ముందుంచి ఆయన మీద ద్వేషం, వ్యతిరేకతను కలిగేట్లు చేసింది.

ప్రస్తుతం మీడియాలో, జన వాడకంలో వున్న కుహనా లౌకిక వాదం అనే పదాన్ని వుపయోగించి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ బహుళ ప్రచారం తెచ్చింది అద్వానీయే. ఆ పదం మరింత ముదిరి బిజెపి నేతలు,అనుచరులు లౌకికవాదులంటే దేశాన్ని ముక్కలు చేసే గాంగ్‌ అని నిందిస్తున్నది.1997 ఆగస్టులో బిజెపి టు డే అనే పత్రికలో అద్వానీ రాసిన దానిలో ఇలా వుంది.’ హిందుత్వ లేదా సాంస్క అతిక జాతీయ వాదం మతపరమైనది కాదు,(ముస్లింలు) రాముడు, క అష్ణుడు ఇతరులను జాతీయ సంస్క అతికి చిహ్నాలుగా అంగీకరించాలి మరియు అయోధ్యలో రామాలయానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే రాముడు భారత సంస్క అతి మరియు నాగరికతకు చిహ్నం’ అని రాశారు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

Image result for Advani , modi in different occasions

రధయాత్ర పేరుతో అద్వానీ దేశంలో ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో, ఎంతటి మారణకాండకు ఆద్యుడయ్యారో తెలిసిందే. ఆయన కళ్ల ముందే బాబరీ మసీదు కూల్చివేత, దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. తనకు రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారని, అవమానించారని అంటున్నారంటే వూరికే కాదు. 2008లో అద్వానీ తన ఆత్మకథను ప్రచురించారు.దానిలో ఇలా రాశారు.’ గోద్రాలో కరసేవకుల సామూహిక హత్యల అనంతరం గుజరాత్‌లో మతహింసాకాండ చెలరేగింది. ఆ దారుణమైన సంఘటన గురింఎతీ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఖండనలకు గురయ్యారు. మోడీని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారు. నా అభిప్రాయంలో జరిగిన దానికంటే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నారు.’ అలావెనకేసుకు వచ్చిన పెద్దమనిషి ఇప్పుడు మోడీ చేశారని చెబుతున్నదానిని ఎలా ఖండించగలరు, ప్రత్యక్షంగా మోడీని ఎలా విమర్శించగలరు.

దేశంలో 1990దశకలో తలెత్తిన మత హింసాకాండకు అద్వానీ రధయాత్ర ఎంతగానో దోహదం చేసింది. బాబరీ మసీదు కూల్చివేత కుట్రలో అద్వానీ, మురళీ మనోహర జోషి, వుమా భారతి(బిజెపి లేదా నరేంద్రమోడీ పక్కన పెట్టిన జాబితాలోని వారు) తదితరుల ప్రమేయం గురించి రోజువారీ విచారణ జరిపి 2019 ఏప్రిల్‌ 19లోగా రెండు సంవత్సరా వ్యవధిలో పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

బాబరీ మసీదుకు ముందు రామాలయం వుండేదని రుజువు అవుతుందని సంఘపరివార్‌ సంస్ధలు చెబుతుండేవి. అయితే క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దిలో అయోధ్యలో మానవ ఆవాసాలు వున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని రామాయణ స్ధల ప్రాజెక్టు నివేదికలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఐ) తెలిపింది. దాంతో రామాలయ వాదుల నోట్లో వెలక్కాయపడింది. సరిగ్గా ఆ సమయంలో అద్వానీ వారిని ఆదుకున్నారు. రాముడు ఒక నమ్మకం దానికి సాక్ష్యాలు ఎలా వెతుకుతారంటూ అద్వానీ వాదించారు.అప్పటి నుంచి కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు చెప్పలేవంటూ సంఘపరివార్‌ వాదించటం మొదలు పెట్టింది. అంటే కోర్టు తీర్పును తాము అంగీకరించేది లేదని చెప్పేందుకు వేసిన ప్రాతిపదిక ఇది. శబరిమల ఆలయంలో కూడా అదే వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయోధ్యలో రామాలయ నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పేవారు. దానికి సాంస్కృతిక జాతీయవాదాన్ని పైన చేర్చింది అద్వానీ మహాశయుడే అన్నది తెలిసిందే.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీని ప్రభుత్వ సకల వసతి గృహంలో నిర్భందించారు. ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసాలలో డిసెంబరు ఆరు తన జీవితంలో విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఇలా చెప్పటం మసీదును కూల్చివేసినందుకు క్షమాపణగా భావించవచ్చా అన్న ప్రశ్నకు కాదని సమాధానమిచ్చారు. తరువాత స్మృతులలో అద్వానీ మరొక కధనాన్ని వినిపించారు. బాబరీ మసీదు వద్ద చేరిన జనాన్ని అదుపు చేయటంలో విఫలమైనందుకు తాను విచారపడుతున్నానని,వ్యక్తిగతంగా తనకు పరువు నష్టమని, ఆ స్ధలంలోని కట్టడానికి ఎలాంటి నష్టం కలిగించకుండా నామ మాత్రంగా రామాలయ నిర్మాణ కార్యక్రమం చేపడతారని అనుకున్నానని పేర్కొన్నారు. కూల్చివేత పట్ల విచారం ప్రకటించినందుకు సంఘపరివార్‌లో, బయటి లౌకికవాదులు కూడా తనను విమర్శించారని, తన వ్యక్తిగత విశ్వసనీయత కరిగిపోయిందని చెప్పుకున్నారు.

Image result for Advani , modi in different occasions

అద్వానీ గళం అప్పుడేమైంది? భిన్నాభిప్రాయం కలిగినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులు అనాల్సిన అవసరం లేదని అద్వానీ ఇప్పుడు అంటున్నారు. అసలు నోరు మూసుకోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు తెరవటం మంచిదే కదా అనే అరగ్లాసు సంతృప్తి జీవులుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి జరిగిన తరువాత మార్చిమూడవ తేదీన బీహార్‌లో మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాని వారందరినీ పాకిస్దాన్‌కు మద్దతుదార్లుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెలవిచ్చినపుడు మార్గదర్శక మండలి సభ్యుడిగా అద్వానీ నోరు మెదపలేదు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

స్వాతంత్య్ర వుద్యమ సమయంలోనే కమ్యూనిస్టులు మహాత్మా గాంధీ వైఖరితో విబేధించారు, వ్యతిరేకించారు. తరువాత కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు, బిజెపి మత పోకడలు చూసి కనీసం గాంధీ చెప్పిన అంశాలకైనా కట్టుబడండని అదే కమ్యూనిస్టులు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్దితి తలెత్తింది. దేశమంటే బిజెపి,బిజెపి అంటే దేశం, బిజెపిని విమర్శించటమంటే దేశాన్ని విమర్శించటమే అనే ఒక వున్మాద వాతావరణం దేశంలో నెలకొన్న స్దితిలో అద్వానీ మంచి మాటలు ఎందరికి ఎక్కుతాయన్నది ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలను చూశాము. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మనీలో హిట్లర్‌ను చూసిన తరువాత వాడి కంటే పూర్వపు నియంతలే మెరుగు అనిపించాడు. బాబరీ మసీదును కూలదోస్తున్న సమయంలో స్వయంగా అక్కడే వున్న ఎల్‌కె అద్వానీ నాడు ఒక పెద్ద మతోన్మాది, పచ్చిమితవాదిగా కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బిజెపిని విమర్శించిన తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీకే కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే వాజ్‌పేయిని చూసి తప్ప బిజెపిని చూసి కాదని చెప్పుకున్న విషయాన్ని మరచి పోరాదు. ఇప్పుడు అలాంటి అద్వానీయే మెరుగని నరేంద్రమోడీ తీరుతెన్నులు జనం చేత అనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలు చెప్పింది వినకపోతే పాయే మీ అద్వానీ చెప్పింది అయినా పాటించమని జనం గళం విప్పాలి.