Tags

, ,

Image result for nandigram, cpi(m)

ఎం కోటేశ్వరరావు

నందిగ్రామ్‌, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు, ప్రాంతం. భూసేకరణకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన వుదంతాల కారణంగా అప్పటికే సిపిఎం పాలనపై వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న మమతాబెనర్జీ కమ్యూనిస్టులను గద్దె దింపి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల క్రితం రెండవ సారి కూడా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో పన్నెండు సంవత్సరాల తరువాత గత ఆదివారం నాడు తిరిగి సిపిఎం తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఆక్రమించుకోవటం, కార్యకర్తలను నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని తరిమివేసినట్లు గతంలో పలుసార్లు సిపిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లోని సిపిఎం కార్యాలయం సుకుమార్‌ సేన్‌ గుప్తా భవనం గత పది సంవత్సరాలుగా మూతపడి వుంది. ఆదివారం నాడు కార్యాలయ ప్రారంభంతో పాటు తమ్లుక్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి ఇబ్రహీం ఆలీకి మద్దతుగా పెద్ద ప్రదర్శన కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీనేత రబిన్‌దేవ్‌ మాట్లాడుతూ ఒకనాడు వామపక్ష వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా వున్న చోట తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించటానికి కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలనను గమనించిన జనం తిరిగి తమవైపు రావటమే కారణం అన్నారు.

అయితే తృణమూల్‌ వ్యతిరేకులందరూ తమ వైపు వచ్చిన కారణంగా ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వారే సిపిఎంతో కుమ్మక్కై పార్టీ కార్యాలయ ప్రారంభానికి అవకాశమిచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ దాస్‌ ఆరోపించారు. దీన్ని తృణమూల్‌ అభ్యర్ధి దివ్యేందు అధికారి తోసి పుచ్చారు. బిజెపి పగటి కలలు కంటున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, మావోయిస్టు తదితర సిపిఎం వ్యతిరేకశక్తులన్నీ రైతులకు మద్దతు ఇచ్చి ఆందోళన చేయించాయి. ఆసందర్భంగా జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తరువాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ ప్రతిపక్షాలు హింసాకాండను కొనసాగించాయి.

ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మధ్య పరస్పర పోటీ నివారించుకొనేందుకు జరిగిన చర్చలు విఫలం కావటంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నందిగ్రామ్‌ ప్రాంతం వున్న తమ్లుక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మార్చిచివరి వారంలో బిజెపి నుంచి చేరిన లక్ష్మన్‌ సేథ్‌ను ప్రకటించారు. సేథ్‌ గతంలో సిపిఎం తరఫున మూడుసార్లు ఎంపీగా పని చేసి నందిగ్రామ్‌ వుదంతం తరువాత పార్టీ నుంచి వుద్వాసనకు గురయ్యాడు. తరువాత బిజెపిలో చేరాడు, ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలిపేది లేదని ఆ పార్టీ స్పష్టం చేయటంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా అధిష్టానవర్గం అభ్యర్ధిత్వాన్ని ప్రటించింది. తాను చెప్పిన అభ్యంతరాన్ని ఖాతరు చేయలేదని పార్టీ కార్యకర్తలు తగినన సమాధానం చెబుతారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ వ్యాఖ్యానించారు. తాము చేయగలిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు సోమేన్‌ మిత్రా అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు పార్టీలు పోటీలో వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 42 స్ధానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు స్ధానాలు మినహా 38 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన పుంజుకుంటుందా, బిజెపి తన స్ధానాలను సంఖ్యను పెంచుకుంటుందా అన్నది ప్రధాన చర్చ నీయాంశంగా వుంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి.తృణమూల్‌ను పక్కకు నెట్టి వామపక్ష వ్యతిరేక శక్తిగా తాను ముందుకు రావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘపరివార్‌ శక్తులు శ్రీరామనవమి, దుర్గాపూజ, వంటి మతపరమైన సందర్భాలన్నింటినీ వినియోగించుకొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు వున్నాయి.

ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన సభలను చూస్తే మోడీ పాల్గన్నది అత్యంత పేలవంగా వుంది, ఆ సభకోసం బిజెపి 32కోట్ల రూపాయలను ఖ ర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభకు రెండులక్షల మంది వరకు రాగా ఫిబ్రవరి మూడున వామపక్షాలు జరిపిన సభకు పదిలక్షల వరకు జనం హాజరయ్యారు. ఈ సభ వామపక్షాలలో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని నింపింది.

నరేంద్రమోడీ ఒక వలస పక్షి వంటి వారు, ఎన్నికలపుడే వస్తారు, కాగానే వెళ్లిపోతారు, మాకు కావాల్సింది నిజమైన చౌకీదారు తప్ప మోసగాడు కాదు అని మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తుతున్నారు. తృణమూల్‌ శారద-నారద పార్టీ అని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. అయితే శారద-నారద- హవాలా లీడర్లందరూ ఇప్పుడు బిజెపి అవతారమెత్తారని మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు.

Image result for after 12 years red flags again unfurled in nandigram

గత పార్లమెంట్‌,అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాయిజం గురించి మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పంచాయతీలన్నీ ఏక గ్రీవం అయ్యేట్లు చూశారన్న విమర్శలు వున్నాయి. ఎన్నికలు జరిగిన చోట్ల రిగ్గింగ్‌ చేశారు. అవినీతి కేసులు వున్న తృణమూల్‌ ఎంపీలు, నేతలు దాడుల భయంతో బిజెపికి ఫిరాయించారు. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను పొందేందుకు వామపక్ష సంఘటన, బిజెపి, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. వామపక్ష సంఘటనలో సిపిఎం 29, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ, ఆర్‌ఎస్‌పి మూడేసి సీట్లుకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు సీట్లకు వామపక్ష సంఘటన అభ్యర్ధులను ప్రకటించలేదు.కాంగ్రస్‌ స్పందనను బట్టి వాటి మీద కూడా తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. మొత్తం ఏడు దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల పరంగా చూస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ తరువాత వామపక్ష సంఘటనకే ఎక్కువ వున్నాయి. 2016లో వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ సర్దుబాట్లు చేసుకున్నాయి. అందువలన పొందిన ఓట్లు వాస్తవ బలాన్ని ప్రతిబింబించవు. ఆ సర్దుబాటును సిపిఎం కేంద్ర కమిటీ తప్పు పట్టింది. పార్టీ ఆమోదించిన విధానానికి వ్యతిరేకం అని పేర్కొన్నది.

2014లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

తృణమూల్‌    39.05     34

లెఫ్ట్‌ ఫ్రంట్‌     29.71     2

బిజెపి          17.02    2

కాంగ్రెస్‌         9.58      4

2016అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం సీట్లు

తృణమూల్‌   44.9    211

లెఫ్ట్‌ ఫ్రంట్‌    25 .8   30

సిపిఎం       19.8    26

సిపిఐ          1.5    1

ఆర్‌ఎస్‌పి       1.7    3

ఫార్వార్డ్‌బ్లాక్‌   2.8     2

బిజెపి        10.2    3

కాంగ్రెస్‌      12.3    44

ఇతరులు      0      4