Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.