Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు.ఈ సందర్భంగా రాస్తున్న దిగువ అంశాలు యండమూరి వంటి వారిని మార్చేందుకో లేక వారికి తెలియచేసేందుకో కాదు, ఏడు పదులు నిండిన వారు నేర్చుకొనేదేమి వుంటుంది. ఆ పేరుతో రాసింది నిజం అని గుడ్డిగా నమ్మేవారిని భిన్న కోణంలో ఆలోచించమని కోరేందుకే ఇది. ఆసక్తి వున్నవారే ముందుకు పోండి. లేని వారు సమయం వృధా చేసుకోవద్దని మనవి.

వెనిజులా గురించి కానీ మరొకదాని గురించి గానీ రాసే హక్కు యండమూరికి వుంది. అది కాపీ చేసిందా, లేక వక్రీకరణలను గుడ్డిగా అనుసరించిందా అని చర్చ చేసే హక్కు దాన్ని చదివిన వారందరికీ వుంది. అలాగే ఒక రచన, ఒక కళారూప ప్రయోజనం ఏమిటన్నది అవి వెలువడిన నాటి నుంచీ చర్చ జరుగుతూనే వుంది. యండమూరి రచనలనూ అలాగే పరిశీలించాలి. అవి కాపీ కొట్టినవా లేక మిగిలిపోయిన ఇడ్లీలను పొడి చేసి ఘమఘమ లాడే తాలింపుతో తయారు చేసిన వుప్మా వంటివా అన్నది వేరే విషయం. మీడియాలో వచ్చిన వార్తల మేరకు ఆయన వయస్సులో వుండగా ఒక యువకుడు, ఒక యువతి ఆయన రచనలను చదివి ‘వుత్తేజం’ పొంది ఆత్మహత్య చేసుకున్నారని 1980దశకం పత్రికల్లో వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆ రచనలను విమర్శించినందుకుగాను తన పరువు పోయింది, దాని వెల 20వేల రూపాయలంటూ యండమూరి ఒక లాయర్‌ ద్వారా నోటీసు ఇప్పిస్తే దానికి ఆమె తగిన సమాధానం ఇచ్చిందనుకోండి. బహిరంగంగా ఒక రచన చేసినా, చరిత్ర అంటూ చెత్తను కుమ్మరించినా వాటి మీద వచ్చే విమర్శలను హుందాగా స్వీకరించాలి. ఆసక్తి వుంటే అర్దవంతమైన చర్చ జరపాలి.

2019 ఫిబ్రవరి 19వ తేదీన జాన్‌ పిల్గర్‌ అనే జర్నలిస్టు గ్లోబల్‌ రిసర్చ్‌ అనే పత్రికలో ‘అబద్దాల ప్రాతిపదికగా వెనిజులా మీద యుద్ధం'(ది వార్‌ ఆన్‌ వెనిజులా బిల్ట్‌ ఆన్‌ లైస్‌) అందువలన అంతర్జాతీయంగా సాగుతున్న ప్రచారానికి (బహుశా వాట్సాప్‌ పరిజ్ఞానం అయివుండవచ్చు) యండమూరి ప్రభావితులై నేను సైతం అన్నట్లుగా ఒక అబద్దాన్ని వండి వడ్డించారనుకోవాలి.

‘ ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో …. ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికి, బీద కుటుంబాలకూ నెలనెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. ‘ ఈ మాటలకు ముందు ‘తీరాల్లో సమృద్ధిగా ఆయిల్‌ వుంది, 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాసిన యండమూరి అలాంటి దేశంలో ఖాళీగా ఇంట్లో కూర్చొనే వారు, బీద కుటుంబాలు ఎందుకున్నాయో, దానికి కారకులు ఎవరో,అలాంటి బీదలకు సాయం చేస్తే తప్పేమిటో, ఆ దేశ సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోయిందో, అదెలా సమర్ధనీయమో చెబుతారా ? చరిత్ర అంటూ చెప్పేటపుడు దానికి వున్న అన్ని కోణాలను చెప్పకపోతే చెప్పేది చరిత్ర కాదు, చెత్త అవుతుంది. యండమూరి రాత చదివిన వారు అదేమిటో నిర్ణయించుకోవచ్చు.

‘దేశ ఐశ్యర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, వుద్యోస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. సింగిల్‌ పేరెంట్స్‌ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు ‘ అని యండమూరి తన అక్కసును వెళ్లగక్కారు. దేశ సంపదను అందరికీ గాక అద్వానీ, అంబానీల మాదిరి కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకే అప్పగించాలా? విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా సంపదలను విదేశాలకు తరలించి విదేశీ పెట్టుబడుల రూపంలో వాటినే తిరిగి తీసుకు వచ్చి లాభాల మీద లాభాలు ఆర్జిస్తున్నారు. వెనిజులా కార్మికులు, వుద్యోగులకు వేతనాలు పెంచితే అవి తిరిగి వెనిజులా ఆర్దిక వ్యవస్దలోకే తిరిగి వస్తాయి, వారేమీ డాలర్లుగా మార్చివిదేశాల్లో పెట్టుబడులుగా పెట్టేవారు కాదు. ఈ మాత్రం కూడా తెలియని మేథావి యండమూరి అనుకోలేము. ఇక సింగిల్‌ పేరెంట్స్‌ మహిళలకు అనూహ్యంగా కానుకలిచ్చాడట అంటూ తన అక్కసుసు వెళ్లగక్కారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా భర్తలు లేని ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కసారి పెన్షన్‌ కార్యాలయం దగ్గరకు వెళ్లి మీకెందుకు ఇవ్వాలని వారిని ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తుందో, ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటే మంచిది, చేయి తిరిగిన రచయిత కదా, కొత్త ఇతివృత్తం దొరుకుతుంది.

వెనిజులా గురించి పక్షపాతం అంటే తెలియని మీడియా సంస్ధగా కొందరు చెప్పే బిబిసి పదేండ్ల కాలంలో ఇచ్చిన 304 వార్తల గురించి వెస్ట్‌ ఇంగ్లండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చిందేమంటే వాటిలో మూడంటే మూడే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సానుకూల వార్తలు వున్నాయట. అక్కడి మానవహక్కుల చట్టం, ఆహార, ఆరోగ్య, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధన, మిలియన్ల మంది ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతుగా చేసిన ప్రదర్శన కనిపించలేదు. ఏమ్మా మదురో వ్యతిరేక ప్రతిపక్ష ప్రదర్శన వార్తను మాత్రమే ఇచ్చావేమిటి అని బిబిసి రిపోర్టర్‌ ఓర్లా గుయెరిన్‌ను అడిగితే ఒకే రోజు రెండు ప్రదర్శనల వార్తలను ఇవ్వటం ఎంతో కష్టం అని సమాధానమిచ్చింది.

ఏ వాస్తవం ఆధారంగా వెనెజులా మీద యుద్ధం ప్రకటించారో వార్త ఇవ్వటం కూడా ఎంతో కష్టం. ప్రధానంగా వాల్‌స్ట్రీట్‌ నేరపూరితమైన యంత్రాంగం కారణంగా 2014 నుంచి చమురు ధరలు కుప్పకూలటం గురించి నివేదించటం కూడా కష్టమే, అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త ఇవ్వటం కూడా చాలా కష్టం, రెండు బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతి చేసుకున్న ఔషధాలతో సహా 2017 నుంచి వాషింగ్టన్‌ ఆంక్షలు, వాటి వలన కనీసంగా ఆరు బిలియన్‌ డాలర్లు వెనిజులా నష్టపోయిందని వార్త రాయటం ఎంతో కష్టం, వెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. వాటిని కాదనే ధైర్యం యండమూరితో సహా ఎవరికైనా వుందా, ఇది చరిత్రలో భాగం కాదా అని సవినయంగా అడగాలి.

‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఛావెజ్‌ గురించి యండమూరికి ఏబిసిడిలు కూడా తెలియవు లేదా ముందే చెప్పినట్లు వాట్సాప్‌ పరిజ్ఞానంతో రాశారనుకోవాలి. 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధ(మన దగ్గర నక్సల్స్‌)ను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. తన అజెండాను అమలు జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, రాజ్యాంగ సవరణలు చేసిన ప్రజాస్వామిక వాదిగా ఆయన చరిత్రకెక్కారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. అక్కడ పదవీ కాలం ఆరేండ్లు, దాని మేరకు తరువాత ఎండమూరి చెప్పినట్లు 2008లో అసలు ఎన్నికలు జరగలేదు, 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. 2008లో బ్లాక్‌మార్కెటీర్లు ధరలను విపరీతంగా పెంచేసిన పూర్వరంగంలో ‘ యండమూరి చరిత్ర ‘లోని రొట్టెల మీదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నింటి మీద నియంత్రణలో భాగంగా ఆంక్షలు విధించాడు.నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

ఇక యండమూరి చరిత్ర పేరుతో రాసిన చెత్త అంతటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెద్దమనిషికి నేరాల రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలిసినట్లు లేదు. వెనిజులాలో ప్రతి లక్షమంది జనాభాకు ప్రతి ఏటా 20వేల మంది హత్యలకు గురి అవుతున్నారట. ఇంతకంటే అతి శయోక్తి లేదు ప్రపంచంలో అత్యధికంగా హత్యల రేటు వున్న దేశాల వరుసలో ముందున్న ఎల్‌సాల్వెడార్‌లో లక్షమందికి 82.84 మంది హతులవుతుండగా వెనిజులాలో 56.33 వుంది. లాటిన్‌ అమెరికా దేశాలన్నింటా, అనేక ఆఫ్రికా దేశాలలో ఇలాంటి పరిస్ధితికి కారణం నియంతలు, వారిని బలపరిచిన అమెరికా, సిఐఏ అన్నది జగమెరిగిన సత్యం. వెనిజులా రాజధాని కారకాస్‌ అంటే జంతుకళేబరం అని సెలవిచ్చారు. అక్కడ హత్యల రేటు 111.19 వుంది. ప్రధమ స్ధానంలో వున్న మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ జంటనగరాల్లో అది 111.33 వుంది. లాస్‌ కాబోస్‌ అంటే సురక్షితమైన రేవు అని అర్ధం. మరి అక్కడెందుకు జరుగుతున్నట్లు, అక్కడేమీ ఛావెజ్‌ లేదా వామపక్ష పాలన లేదే. అంతెందుకు సెయింట్‌ లూయీస్‌ పేరుతో వున్న అమెరికా నగరంలో హత్యల రేటు 65.83తో అమెరికాలో ప్రధమ స్ధానంలో వుంది. మరి పవిత్రమైన పేరు పెట్టుకున్న అక్కడెందుకు అన్ని హత్యలు జరుగుతున్నట్లు ? అందుకే చరిత్ర తెలియకపోతే చౌకబారు వ్యాఖ్యానాలు వస్తాయంటారు.

ఇక ఒళ్లమ్ముకొనే బాలికలనీ, సగం తాగిన సిగిరెట్ల కోసం వెంపర్లాడే పెద్దలనీ ఇలా ఏవేవో అతిశయోక్తులు రాశారు. వెనిజులా ఆర్ధిక ఇబ్బందులతో వున్న మాట నిజం, తనకు లంగలేదన్న కారణం, చమురు సంపదలను జాతీయం చేసిందన్న వుక్రోషం వంటి అనేక అంశాల కారణంగా అమెరికా కక్ష తీర్చుకుంటున్న దేశాలలో వెనిజులా మొదటి స్ధానంలో వుంది. అవి కొన్ని సామాజిక సమస్యలను సృష్టిస్తాయి. భూతల స్వర్గం అమెరికాలో ఒళ్లు అమ్ముకుంటున్నవారు, అడుక్కొనే వారు కూడా సూటూ బూటూ వేసుకొని అడుక్కొనే వారెందుకు వున్నట్లు, ధాయ్‌లాండ్‌ మంచి దేశమే కదా రాజధాని బ్యాంకాక్‌, ఇతర నగరాల్లో ఒళ్లమ్ముకొనే బాలికల కోసం ఎగబడి పోతున్న జనం గురించి యండమూరికి తెలియదా?

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.

సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. అలాంటి వారిలో యండమూరి ఒకరు. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం. చరిత్ర పేరుతో కుమ్మరించిన చెత్త విషయాలలో పేర్కొన్న అంశాలు అనేక దేశాలలో అంతెందుకు మన దేశంలో ఏ పట్టణంలో లేవు. రూపాయి కోసం హత్యలు చేసే వారు, కడుపు ఆకలి తీర్చితే మానం పోగొట్టుకొనేందుకు సిద్దపడే అభాగినులు ఇక్కడెందుకు వున్నట్లు ? సమసమాజం మంచిదే అంటూ జనానికి కాస్త వుపశమనం కలిగించే చర్యలను కూడా వ్యతిరేకించే వారు నిజంగా దాన్ని కోరుకుంటారంటే నమ్మేదెవరు ?