Tags

, , , , ,

Image result for julian assange

ఎం కోటేశ్వరరావు

కాలిలో ముల్లు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ, ఇల్లాలి పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామా అన్న వేమన పద్యం తెలిసిందే. వికీలీక్స్‌ అధిపతి జూలియన్‌ అసాంజే చెప్పులో రాయిగా మారాడని వర్ణించిన ఈక్వెడోర్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో అన్నంతపనీ చేసి అసాంజేను వదిలించుకున్నాడు. దీనికి కారణాలేమిటి అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రపంచంలో వెల్లడయ్యే వ్యతిరేకత, వత్తిడే అమెరికా నుంచి అసాంజే జీవితాన్ని కాపాడతాయి. ఆ జర్నలిస్టు జీవితాన్ని ఏదో ఒకసాకుతో జీవితాంతం జైలుపాలు చేయవచ్చు. ఈక్వెడోర్‌ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన తరువాత ప్రభుత్వం దానిని రద్దు చేయటానికి వీల్లేదు. బ్రిటన్‌లో బెయిల్‌ నిబంధనలను వుల్లంఘించిన వారు వేలాది మంది వున్నారు. వారందరినీ వదలి అసాంజేను అరెస్టు చేయటం వెనుక బ్రిటన్‌ మీద అమెరికా తెచ్చిన వత్తిడే అన్నది స్పష్టం.

లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో శరణార్దిగా వున్న అసాంజే తామిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినందున లండన్‌ పోలీసులకు అప్పగించినట్లు తొలుత ప్రకటించిన మోరెనో, అతను తమ కార్యాలయాన్ని గూఢచార కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని కొద్ది రోజుల తరువాత మరొక అభాండం వేశాడు. ఇతని తీరు చూస్తే మేకపిల్లను తినదలచుకున్న తోడేలు చెప్పిన సాకుల కధ గుర్తుకు రాకమానదు. ఆస్ట్రేలియన్‌ పౌరుడైన జూలియన్‌ అసాంజే 2006 వికీలీక్స్‌ స్దాపక సంపాదకుడిగా అనేక అంశాల మీద ముఖ్యంగా అమెరికాకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం కావించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.2010లో అమెరికా అరెస్టు వారెంట్‌ జారీ చేయటమే కాదు, అతను దొరికితే తమకు అప్పగించాలని తనతో ఒప్పందం వున్న దేశాలన్నింటినీ కోరింది. ఆ వల నుంచి బయటపడిన అసాంజే 2012లో బ్రిటన్‌లో వుండగా ఈక్వెడోర్‌ రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించటంతో లండన్‌లోని రాయబార కార్యాలయంలో అప్పటి నుంచీ నివాసం వుంటున్నాడు. ఒక దేశ అనుమతి లేకుండా స్ధానిక లేదా బయటి ప్రభుత్వాలకు చెందిన పోలీసులు, ఇతర ఏజన్సీలేవీ ప్రవేశించటానికి లేదు. అయితే గత వారంలో ఈక్వెడోర్‌ అధ్యక్షుడు తాము అసాంజేను బయటికి పంపుతున్నామని తెలియచేసి మరీ లండన్‌ పోలీసులకు అప్పగించాడు. ఈ అసాధారణ చర్య మీద ప్రపంచవ్యాపితంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా పట్టించుకోవటం లేదు.

Image result for julian assange

లెనిన్‌ మోరెనో చర్య అంతర్జాతీయంగా ఈక్వెడోర్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. తమ సార్వభౌమత్వాన్ని తామే దెబ్బతీసుకోవటంతో పాటు, శరణార్దిగా , తరువాత దేశ పౌరుడిగా మారిన అసాంజేను అప్పగించి అంతర్జాతీయ న్యాయ సూత్రాల వుల్లంఘనకు పాల్పడ్డాడు. లండన్‌ పోలీసులను తమ కార్యాలయంలోకి స్వయంగా ఆహ్వానించాడు. వామపక్ష వాది రాఫెల్‌ కొరెయా వారసుడిగా అధికారానికి వచ్చిన లెనిన్‌ ఇలా ప్రవర్తించటం ఏమిటని వామపక్ష వాదులకు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రెండు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన అతగాడి కదలికలను గమనిస్తున్నవారికి ఏ క్షణంలో అయినా అసాంజేను అమెరికా రాక్షసికి అప్పగించవచ్చనే అభిప్రాయం ఎప్పటి నుంచో వుంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూశాడు.

లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాలలో వామపక్షాలు అధికారానికి వచ్చిన దేశాలలో ఈక్వెడోర్‌ ఒకటి.ఈ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన పార్టీలలో చేరిన వారందరూ అన్ని అంశాల మీద ఏకాభిప్రాయం కలిగిన వారు కాదు. నియంతలు, మిలిటరీపాలకులు, ప్రజాస్వామ్య హక్కులు, కార్మికవర్గంపై దాడులను, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే ఒక సాధారణ లక్షణమే ఈ పార్టీలలో చేరిన వ్యక్తులు, శక్తుల మధ్య అంగీకృతమైంది. నయావుదారవాద విధానాల కొనసాగింపు, పెట్టుబడిదారీ వ్యవస్ధను సమూలంగా తొలగించాలనిగాక సంస్కరించాలని కోరే వారి వరకు అందరూ ఈ పార్టీలలో వున్నారు. అందుకే ఎక్కడా నయా వుదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం రూపొందించకుండా వాటినే కొనసాగిస్తూ జనానికి వుపశమన చర్యలు తీసుకుంటున్నారు. వాటికి పరిమితులు ఎదురైనపుడు ఆ విధానాల నుంచి కూడా వైదొలుగుతున్నారు. అందుకు తాజా వుదాహరణ ఈక్వెడోర్‌.

అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్న పాయిస్‌ అలయన్స్‌. పయస్‌ అంటే స్పానిష్‌లో దేశం అని అర్ధం, ఆంగ్లంలో ప్రౌడ్‌ అండ్‌ సావరిన్‌ ఫాదర్లాండ్‌( గర్వించదగిన మరియు పితృభూమి) కూటమి. మధ్యేవాద-వామపక్ష ప్రజాస్వామిక సోషలిస్టు మరియు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా దీని లక్షణాన్ని విశ్లేషకులు వర్ణించారు. ఈ కూటమికి నాయకుడిగా మూడుసార్లు అధ్య క్షపదవి చేపట్టిన రాఫెల్‌ కొరెయా అక్కడి నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేసేందుకు వీలులేని కారణంగా తమ అభ్యర్ధిగా లెనిన్‌ మోరెనోను ప్రకటించాడు.(వామపక్ష వాది అయిన మోరెనో తండ్రి తన కుమారుడు లెనిన్‌ అంతటి వ్యక్తి కావాలనే ఆకాంక్షతో పేరులో లెనిన్‌ చేర్పాడు. ) అసాంజేను లండన్‌ పోలీసులకు అప్పగించిన లెనిన్‌ మోరెనో ఈక్వెడోరియన్‌ మరియు లాటిన్‌ అమెరికా చరిత్రలో పేరుమోసిన విద్రోహి అని అదే రాఫెల్‌ కొరెయా తీవ్రంగా స్పందించాడు. మోరెనో ఒక అవినీతి పరుడు, అతను చేసిన నేరాన్ని మానవాళి ఎన్నటికీ మరవదు అని ట్వీట్‌ చేశాడు.

అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మోరెనో తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. అచిర కాలంలోనే జనం నుంచి దూరమయ్యాడు. ప్రస్తుతం అతన్ని సమర్ధించేవారి సంఖ్య 17శాతానికి అటూఇటూగా మాత్రమే వుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మార్చినెల చివరి వారంలో ప్రతిపక్ష ఎంపీ ఒకరు మోరెనో అవినీతిని వెల్లడించే పత్రాలను బహిర్గతం చేశాడు. వాటిలో వున్న వివరాల ప్రకారం పన్నుల ఎగవేతల స్వర్గం, బినామీ కంపెనీలకు నిలయమైన పనామాలో ఐఎన్‌ఏ పెట్టుబడుల కంపెనీ పేరుతో మొరెనో అక్రమాస్తులను కూడపెట్టాడు. అది సోదరుడు ఎడ్విన్‌ మోరెనో పేరు మీద వుంది. లెనిన్‌ మోరెనో కుమార్తెలు ఇరినా, క్రిస్టినా,కరీనా పేర్లు కలసి వుండేలా ఐఎన్‌ఏ కంపెనీ వుంది. అందుకు ఆదే పేరుతో అక్రమాల కుంభకోణాన్ని పిలుస్తున్నారు. దీని మీద వచ్చిన ఫిర్యాదులను ప్రాధమికంగా విచారించేందుకు ఏప్రిల్‌ నాలుగున తమ ముందుకు హాజరుకావాలని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం దేశాధ్యక్షుడికి సమన్లు పంపింది. ఇదంతా తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్ర అని, మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా ఏర్పాటు చేసిన రాజకీయ సంస్ధ సిటిజన్‌ రివల్యూషన్‌లో సభ్యుడిగా వున్న ఎంపీ ఇదంతా చేస్తున్నాడని మోరెనో ఆరోపించాడు. పాయిస్‌ అలయన్స్‌ అభ్యర్ధిగా ఎన్నికైన మోరెనో దానికే ద్రోహం చేశాడని, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కొరెయా విమర్శించారు. విచారణ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, అమెరికా అనుకూల శక్తులను తనవైపు తిప్పుకొనేందుకు అసాంజేను బలిపెట్టారన్నది ఒక కోణం.దానికి అనుగుణ్యంగానే మీడియా కేంద్రీకరణ అవినీతి నుంచి అసాంజే వైపు మళ్లింది.

గతంలో పాయిస్‌ అలయన్స్‌ నేత, మాజీ వుపాధ్యక్షుడైన జార్జి గ్లాస్‌ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి 20017 ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో మోరెనో వుపాధ్యక్షుడిగా, రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా వున్నారు. తరువాతే మోరెనో అధ్య క్షుడయ్యాడు. ఆ వుదంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తాను అవినీతి పరుల అంతం చూసే వ్యక్తినని జనం ముందుకు వెళ్లాడు. ఇప్పుడు ఐఎన్‌ఏ పత్రాలలో అతగాడే పెద్ద అవినీతి పరుడని బయటపడింది. తనను అధ్యక్షుడిని చేసిన రాఫెల్‌ కొరెయాను కూడా మోరెనో వదల్లేదు. 2012లో అధ్యక్షుడిగా వున్న సమయంలో ప్రతి పక్ష ఎంపీని కిడ్నాప్‌ చేయించారనే ఒక తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో హాజరుకాకపోవటంతో కొరెయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది జూలైలో ఆదేశించింది. ఆ సమయంలో బెల్జియం వాస్తవ్యురాలైన భార్యతో కొరెయా అక్కడే వుంటున్నారు. ఇప్పటికీ అక్కడే వున్నారు.అసాంజే అరెస్టు సందర్భంగా కొరెయా ఫేస్‌బుక్‌ పేజీని తొలగించారు. ఇతరుల వ్యక్తిగత వివరాలన్నీ వెల్లడించారనే తప్పుడు కారణాలు చూపారు.

తప్పంటూ ఒకసారి చేసినా వందసార్లు చేసినా ఒకటే అన్నట్లుగా లండన్‌ పోలీసులతో అసాంజేను అరెస్టు చేయించిన మోరెనా దేశంలో తన పోలీసులను ప్రయోగించి అసాంజే మద్దతుదార్లును అరెస్టు చేయించాడు. విదేశీయులను అరెస్టు చేసినపుడు ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియచేయాల్సి వుంది. దాన్ని కూడా పాటించలేదు. తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు రష్యన్‌ హాకర్స్‌, వికీలీక్స్‌ సభ్యులు వున్నారని హోంమంత్రి ఆరోపించారు.ఈక్వెడోర్‌ మాజీ విదేశాంగ మంత్రి రికార్డో పాటినో ఒక ప్రకటన చేస్తూ నెంబరులేని ప్రభుత్వ ట్రక్కు ఒకటి భార్యతో కలసి ప్రయాణిస్తున్న తన కారును వెంటాడిదని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు ఒక రేడియోలో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌, అమెరికా పెత్తనంలో వున్న ఆర్ధిక సంస్ధల నుంచి రుణాల కోసం లొంగిపోయి అసాంజేను అప్పగించాడని రికార్డో పాటినో చెప్పారు.పాటినో కూడా తన ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు కుట్రచేసిన వారిలో ఒకరని మోరెనో ఆరోపించాడు.

అసాంజే అప్పగింతకు జరుగుతున్న ప్రయత్నాల గురించి రాఫెల్‌ కొరెయా ఈఏడాది ప్రారంభంలోనే ఒక హెచ్చరిక చేశారు. ఆశ్రయం పొందిన అసాంజే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడా లేదా అన్నది మదింపు జరుగుతోందని ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ నుంచి పొందే పది బిలియన్‌ డాలర్ల రుణానికి గాను ప్రతిగా అసాంజేను అమెరికాకు అప్పగించాలని, ఈక్వెడోర్‌ వర్షపు అడవులను కాలుష్యం గావించిన అమెరికా కార్పొరేట్‌ చమురు కంపెనీ చెవరాన్‌ నుంచి ఎలాంటి నష్టపరిహారం కోరకూడదని తదితర షరతులను ఐఎంఎఫ్‌ సూచించింది. ఐఎంఎఫ్‌లో 17.46శాతం వాటా కలిగిన అమెరికా గతంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ వంటి సంస్ధల నుంచి తాము వైదొలగాల్సి వుంటుందని బెదిరించిన విషయం బహిరంగమే. ఐఎంఎఫ్‌ను సాంప్రదాయేతర ఆర్ధిక ఆయుధంగా వాడుకోవాలన్న అమెరికా మిలిటరీ సూచనలను వికీలీక్స్‌ బయట పెట్టింది. ప్రత్యర్ధులు అమెరికాకు లొంగితే రాయితీలు , వ్యతిరేకంగా వుంటే దెబ్బతీయాలని సూచించారు.

మోరెనా సర్కార్‌ అసాంజేను అప్పగించటమే కాదు, ఐఎంఎఫ్‌ ఇతర షరతులను కూడా వెంటనే అమలు జరిపింది.ఒప్పందంపై సంతకాలు చేయకముందే తమ చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు లేదా అప్పుకు వుద్యోగుల తొలగింపుకు సంబంధం లేదని చెప్పుకొనేందుకు సంస్కరణల పేరుతో పదివేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఇంటికి పంపింది. అంతేకాదు రెండున్న దశాబ్దాల క్రితం చెవరాన్‌ కంపెనీ కలుషితం చేసిన ప్రాంతాన్ని ప్రభుత్వ నిధులతో శుద్ది చేసేందుకు పూనుకొని కంపెనీకి ఖర్చు తప్పించింది. అధికారానికి రాగానే 2017లోనే క్విటో నగరంలో మోరెనో, అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాబర్ట్‌ ములర్‌, ట్రంప్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పాల్‌ మానాఫోర్ట్‌ సమావేశమయ్యారు.దానిలో అసాంజే అప్పగింతకు తగిన చర్యలు తీసుకుంటామని, దారి వెతుకుతామని మోరెనో హామీ ఇచ్చాడు. పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా 2018లో లండన్‌ రాయబార కార్యాలయంలో అసాంజేకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని, భద్రతా సిబ్బందిని తొలగించారు. అమెరికాకు సంతోషం చేకూర్చేందుకు వెనిజులా నాయకత్వంలో ఏర్పడిన లాటిన్‌ అమెరికా దేశాల కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు గతేడాది ఆగస్టులో ప్రకటించారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష వ్యతిరేకి జైర్‌ బోల్‌సోనారోకు అభినందనలు తెలిపాడు. తమ సహనం నశించిన తరువాతే అసాంజేను తీసుకుపోవాల్సిందిగా లండన్‌ పోలీసులను కోరినట్లు ఈనెల 11న మోరెనో ప్రకటించాడు.

Image result for julian assange

నయావుదారవాద విధానాల ప్రాతిపదికన సంక్షేమ రాజ్యాలను ఏర్పాటు చేయాలన్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యాన్ని అవకాశంగా తీసుకొని అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల సామ్రాజ్యవాదులు ప్రజావ్యతిరేకులను తిరిగి ప్రతిష్ఠించగలిగారు.ఈక్వెడోర్‌లో వామపక్ష వేదికనే వుపయోగించుకొని నెగ్గిన మోరెనోను ఏకంగా తమ వాడిగా మార్చుకోవటం సరికొత్త పాఠాలను నేర్పుతోంది. అక్కడి వామపక్షాలలో సాగుతున్న మధనం ఇలాంటి హాలాహలాన్ని అధిగమించగలదనటంలో ఎలాంటి సందేహం లేదు.