Tags

,

Image result for narendra modi  maiden press conference

7, లోక కల్యాణ్‌ మార్గ్‌ , న్యూఢిల్లీ నుంచి వర్తమానం ! ప్రధాని నరేంద్రమోడీ మాడ్లాడతారు మీడియా వారంతా రండి అన్నది దాని సారాంశం.

ఇంకే ముంది ఢిల్లీ, శివార్లలోని గురుగ్రామ్‌ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లి పోయిన మీడియా సంస్ధలలో ఎవరు కనిపించినా సరే ఎదుటి వారిని పట్టుకొని గిల్లటం, తమను గిల్లమని కోరటం. ఆడామగా తేడా లేదు,ఎడిటర్‌ నుంచి సబ్‌ ఎడిటర్‌ వరకు, సాధారణ రిపోర్టర్‌ నుంచి బ్యూరో చీఫ్‌ల వరకు ఎవరిని చూసినా అరిచేతుల్లో, ఎక్కడ చూసినా గిచ్చుళ్లతో ఎర్రగా కంది పోయి వున్నాయి. చివరకు ఎన్నడూ లేనిది అటెండరు నుంచి ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వరకు ఈ సమాచారంతో అందరూ విస్తుపోతున్నారు. అది ఆఫీసులకే పరిమితం కాలేదు, ఎవరైనా తమను ఆటపట్టించేందుకు అలా చేశారేమో అని ప్రతి ఒక్కరూ రెండు మూడు కార్యాలయాలకు ఫోన్లు చేసి నిర్ధారించుకుంటున్నారు. పట్టించుకోని వారెవరంటే పెయిడ్‌ న్యూస్‌, ఆర్టికల్స్‌ రాసే వారే బిజీగా వున్నారు. ప్రకటనల విభాగం, మేనేజిమెంట్‌ ఇచ్చిన సూచనల మేరకు వారంతా అనుకూల కధనాలను రాయటంలో బిజీగా వున్నారు. నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెడితేనేం పెట్టకపోతేనేం, మన పని మనకు తప్పదు కదా అని వారంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పూనుకున్నారు. పెయిడ్‌ న్యూసైనా, వ్యాసాలైనా స్వంత అభిప్రాయాల్లా వుండకపోతే ఫిర్యాదులొస్తాయని యాజమాన్యాలు హెచ్చరిస్తాయి కదా !

రెండు విడతల ఎన్నికలు చూసిన తరువాత మోడీ గాలి సూచనలు ఎక్కడా కనిపించకపోవటంతో సీనియర్‌ ఎడిటర్లందరూ మనం ఇక అటుతిప్పి ఇటు తిప్పి కష్టపడి విశ్లేషణలు రాయాల్సిన అవసరం లేదని తాపీగా వున్నారు. అలాంటి వారందరిలో ఒకటే ఆలోచన. ఏమై వుంటుంది? ఏమి జరిగి వుంటుంది. ఏమిటీ విపరీతం . పరిపరి విధాలా ఒకటే ఆలోచన, పట్టపగలే బాటిల్స్‌ మీద బాటిల్స్‌ ఖాళీ అవుతున్నాయి తప్ప మీడియాతో మాట్లాడాలని మోడీ ఎందుకు నిర్ణయించుకున్నారో ఎవరూ నిర్ధారణకు రాలేకపోతున్నారు. మోడీ మారు మనస్సు పుచ్చుకున్నారా? దేవతలెవరైనా అర్ధరాత్రి కలలోకి వచ్చి చివరి రోజుల్లో అయినా నారాయణా అనిపించమని అమిత్‌ షాకు నిర్దేశించారా !

క్షణ క్షణానికీ వుత్కంఠ పెరిగిపోతోంది. ఒక్కో సంస్ధ నుంచి ఎంత మంది రావచ్చని ప్రధాని పత్రికా కార్యాలయానికి ఫోన్లు. దివాలా తీయించిన ప్రభుత్వ రంగ సంస్ధ మాదిరి ఐదేండ్లుగా మూతపడి వుండటం, ఎన్నడూ పలకరించని విలేకర్లు మాట్లాడుతుండటంతో పరిమితంగా, పాడుబడిన ఇంట్లో బిక్కుబిక్కు మంటూ వుండే వారిలా వున్న సిబ్బందికి ఏం చెప్పాలో పాలుపోలేదు. మాక్కూడా ఆహ్వానాలు వచ్చాయి, నిజమేనా అని వుర్దూ, కాశ్మీరీ పత్రికల విలేకర్ల ప్రత్యేక విచారణలు. విలేకర్లకు, కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఐదేండ్లుగా సంబంధాలు లేవు. అందువలన ఎవరెవరో తెలియదు, ఫోన్లు చేస్తున్నవారు విలేకరులా లేక మరెవరైనా అని అడుగడుగునా అనుమానాలు. కొద్ది సేపటి తరువాత ఒక్కో మీడియా సంస్ధనుంచి ఎందరైనా రావచ్చు, ఏర్పాట్లకు గాను ఎందరు వచ్చేది ఒక ఫోన్‌ నంబరుకు తెలియచేయమని కోరారు. దానికి ఎడతెగని ఫోన్లు రావటంతో లైను దొరక్క కొందరు నేరుగా కార్యాలయానికి వచ్చారు. ఐదేండ్ల కాలంలో అనేక మంది కొత్త విలేకర్లు వుద్యోగాల్లోకి రావటంతో చాలా మందికి కార్యాలయ చిరునామా కూడా తెలియలేదు. జిపిఎస్‌ సాయంతో వచ్చేసరికి కొండవీటి చాంతాడంత పొడవున క్యూ. అప్పటికే పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు వచ్చాయి. లేకపోతే విలేకర్లు అదుపులోకి వచ్చేట్లు లేరు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ తన తొలి పత్రికా గోష్టికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయలేదు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అంటే ఇదే అని బిజెపి లీకు వీరులు వూదరగొడుతున్నారు.

మరోవైపున పన్నెండెకరాల విస్తీర్ణంలో వున్న ప్రధాని నివాసం. కొంత మంది అధికారులు, పని వారు తప్ప మిగిలిన వారెవరూ గత ఐదు సంవత్సరాలుగా అటు అడుగు పెట్టలేదు. కాపురం చేసే ఇల్లయితే కదా ! అలాంటిది పదులకొద్దీ ట్రక్కుల్లో షామియానాలు, ఇతర సామాన్లు దిగుతున్నాయి.అవన్నీ విలేకర్ల సమావేశానికి అవసరమైన ఏర్పాట్ల కోసమట. అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియా వారు వుంటారు గనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరికి నచ్చిన వంటకాలకోసం వారికి ప్రత్యేకంగా వంటవారిని అప్పటికే పిలిపించారు. ఆయా రాష్ట్రాల భవన్లలోని కాంటీన్లు మూసి వేయించి వంటవారిని ఇక్కడకు తరలించారు. మోడీ పత్రికా గోష్టా మజాకానా !

ఇంకోవైపున ప్రతి మీడియా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాట్లు చేశారు. ప్రశ్నలు అడగటానికి ఎంత మందికి అవకాశం వస్తుంది, ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఒక వేళ అడగాల్సి వస్తే ఏమి అడగాలి, ఎవరు అడగాలి, సంస్ధ ప్రతిష్టను పెంచే ప్రశ్నలు కొన్నింటిని తయారు చేయాలని నిర్ణయించారు. మొత్తానికి యావత్‌ మీడియాకు ఇదొక కొత్త పరిస్ధితి. తొలిసారిగా భారత ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రతి వారూ తమ కొత్త అనుభవం ఎలా వుంటుందో అనుకొనే శోభనపు దంపతుల్లా వున్నారు. మధ్య మధ్యలో తుళ్లి పడుతున్నారు. ఎలాగైతేనేం మొత్తానికి సీనియారిటీని బట్టి సంపాదకులు, తరువాత వరుసగా ఎవరెవరు అడగాలో నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల అయితే నమూనా మీడియా గోష్టి నిర్ణయించారు.

ప్రధాని నరేంద్రమోడీ మీడియా సమావేశ సమయం దగ్గర పడుతోంది. కొందరైతే రెండు మూడు గంటల నుంచి అక్కడే తారట్లాడుతున్నారు. గేటు తీయగానే పొలో మంటూ పరుగులు తీశారు. తోపులాటలు, నెట్టుకోవటాలు, కెమెరాలు, ఫోన్లు, కళ్ల జోళ్లు కిందపడటాలు, చొక్కాలు, కోట్లు నలగటాలు, ఆడవాళ్లని కూడా చూడరా ఇదేం వరస అంటూ శాపనార్ధాలు. జర్నలిజంలో ఓనమాలు తెలియని వారి హడావుడే ఎక్కువగా వుందని సీనియర్ల పెదవి విరుపు. మొత్తానికి వేసిన వేలాది కుర్చీలు నిండిపోయాయి. అమిత్‌ షా గడ్డం సవరించుకుంటూ మెల్లగా వచ్చి ప్రధాని అత్యవసరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడుతున్నారు. ఈ లోగా అందరూ స్నాక్స్‌, టీ తీసుకుందాం రండి అంటూ తానే ముందుగా దారి తీయటంతో మీడియా వారంతా అటువైపు పరుగులు తీశారు. వెనుక బడితే తమ సీట్లు గల్లంతై వెనుక కూర్చోవాల్సి వస్తుందని ఎవరికి వారు కంగారు పడుతున్నారు. కొందరు తమ టీ తమమీదే ఒలకపోసుకుంటే మరికొందరు పక్కవారి మీద పోశారు. కొద్ది సేపటికి తిరిగి అందరూ వచ్చారు. నరేంద్రమోడీ గారు కొత్త కోటును సవరించుకుంటూ మిత్రోం అంటూ పలకరింపుగా అందరి వైపు చూశారు. ఆ మాత్రానికే కొందరు తమ జన్మ ధన్యమైందన్నట్లుగా పులకించిపోయారు.

ఇంతలో ఒక అధికారి వచ్చి ఒకరి తరువాత ఒకరు ఒక్కొక్క ప్రశ్న మాత్రమే అడగాలి, వచ్చిన వారందరికీ అవకాశం వుంటుందని ప్రకటించారు. దాంతో ప్రతి వారికీ అవకాశం వస్తుందన్న భరోసా వచ్చింది కనుక అందరూ తాపీగా వున్నారు. ముందు అందరూ ప్రశ్నలు అడగండి, ఒక ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతారు గనుక ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన ప్రధాని ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పటం కాకుండా ఒకే తరహా ప్రశ్నలన్నింటికీ తీరిగ్గా సమాధానం చెబుతారు, తరువాత వివరణ అడిగే అవకాశం కూడా వుంటుంది అని మరో అధికారి ప్రకటించారు.

భారత ప్రధాని ఐదు సంవత్సరాల తరువాత తొలిసారిగా నోరు విప్పుతున్నారంటే సహజంగానే అంతర్జాతీయ మీడియా సంస్ధలకు సైతం ఆసక్తి లేకుండా ఎలా వుంటుంది. పిల్లి గడ్డాల వారు, పొట్టి లాగుల వారు, పలు రంగుల వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తం మీద న్యూఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఇంతగా విలేకర్లు పోటెత్తి వుండరు. ఢిల్లీ గల్లీ నుంచి వాషింగ్టన్‌ డిసి వరకు చైనా మాంజాల నుంచి అమెరికా చికెన్‌ దిగుమతుల వరకు ప్రపంచవ్యాపితంగా వున్న సమస్యలన్నింటినీ విలేకర్లు ఏకరువు పెట్టి దాని మీద ప్రధాని అభిప్రాయం చెప్పాలని కోరారు. ముందే హామీ ఇచ్చినట్లుగా అందరికీ అవకాశం ఇవ్వటంతో ఒకే ప్రశ్న అయినా చాంతాడంత పొడవున సాగదీసి అడగటంతో సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం అర్దరాత్రి పన్నెండు కొట్టేదాకా సాగింది.

టీవీ ఛానల్స్‌కు ఇబ్బంది లేదు ఏదో ఒక చెత్త, చెప్పిందే చెప్పటం, చూపిందే చూపే సోది కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పత్రికలన్నీ ఎడిషన్లను కొద్ది గంటల పాటు వాయిదా వేసి ఆలశ్యమైనా పాఠకులకు ప్రధాని తాజా సందేశం అందించాలని నిర్ణయించాయి. కొందరైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఏజంట్లందరికీ పత్రికల కట్టలు ఎలా వస్తాయో ముందే తెలియచేశారు. అప్పటికే అరడజను సార్లు ఇంట్లోకి బయటకు తిరిగిన నరేంద్రమోడీ, అమిత్‌ షాలు పన్నెండు దాటగానే కొత్త దుస్తులు వేసుకొని వచ్చారు. క్రికెట్‌ స్డేడియంలో ఫ్లడ్‌ లైట్ల మాదిరి అంబానీ కంపెనీ నుంచి వచ్చిన లైటింగ్‌ అదిరి పోతోంది.ఇంతలో అదానీ కంపెనీ ప్రతినిధి వచ్చి విలేకర్లందరికీ తమ కంపెనీ ప్రత్యేక డిన్నర్‌ ఏర్పాటు చేసిందని, అందరూ ఆరగించి వెళ్లాలని సవినయంగా ఆహ్వానం పలికి వెళ్లారు.

నరేంద్రమోడీ ప్రత్యేక వేదిక వద్దకు వచ్చేందుకు వుద్యుక్తులై ఒక్కసారి అమిత్‌ షావైపు చూశారు. పదండి అంటూ షా ముసి ముసి నవ్వులు నవ్వారు. ఒక్కసారి నిశ్బబ్దం. అందునా అర్ధరాత్రి కావటంతో చీమ చిటుక్కుమన్నా వినిపించేట్లుగా వుంది. నరేంద్రమోడీ మాట్లాడబోతున్నారగానే యధావిధిగా టీవీ ఛానల్స్‌ కెమెరాల వారు తోపులాట ప్రారంభించారు. వెనుక కూర్చున్న ప్రింట్‌ మీడియా జర్నలిస్టులకు అడ్డంగా నిల్చున్నారు. ఇక్కడ కూడా మీ తీరు మారదా అంటూ వారు విసుక్కుంటున్నారు.

Image result for how narendra modi beats journalists in his maiden press conference

ఇంతలో నరేంద్రమోడీ గారు అటూ ఇటూ చూసి మిత్రోం మీరు ఎన్నో విలువైన, తెలివైన ప్రశ్నలు వేశారు. వాటిన్నింటికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే అదేమంటే మీరు లేవనెత్తిన అంశాలన్నింటికీ కారకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వం. అంటూ ముగించి కూర్చున్నారు. అది విన్న సీనియర్‌ జర్నలిస్టులు కొందరు కుర్చీల్లోనే మూర్ఛపోయారు. కొందరు పక్కవారి కుర్చీల మీద పడిపోయారు. కొందరు తలగోక్కున్నారు, కొందరు జుట్టుపీక్కున్నారు, వెనుకా ముందూ, కిందాపైనా చూసుకున్నారు. కొందరు కేకలు వేయబోయారు, కొందరు ఏడుపు లంకించుకున్నారు, కొందరు పిచ్చినవ్వులు నవ్వుతున్నారు. చిత్రం ఏమిటంటే టీవీ చర్చల్లో అందరి మీదా ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి ప్రధాని, అమిత్‌ షాలకు దగ్గరగా ముందు వరుసలో విధేయుడైన సేవకుడి మాదిరిగా నడుము, తలా వంచుకుని తాపీగా కూర్చున్నాడు, మధ్యమధ్యలో అమిత్‌ షా, ప్రధాని వైపు చూసి చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఈలోగా ఇంకేమైనా అడిగేది వుందా సమావేశం ముగిద్దామా అని మరొక అధికారి ఎంతో వినమ్రంగా అడిగాడు. ఈ లోగా షాక్‌ నుంచి తేరుకున్న కొందరు వివరణలు అడగటం ప్రారంభించారు. తిరిగి ప్రధాని లేవగానే మరోసారి నిశ్శబ్దం. మరోసారి చెబుతున్నా దేశ సమస్యలన్నింటికీ కారణం నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వమే. ఏం అమిత్‌ షా అంటూ అటు తిరిగారు.

ఆయన అంతేగా మరి అంటూ తాను కూడా లేస్తూ గడ్డాన్ని సవరించుకున్నాడు. సిబ్బంది వెంటనే వారికి దారి సుగమం చేశారు. ఇంతలో ఏమిటా కలవరింతలు, ఏమిటా పిచ్చినవ్వులు అంటూ మా ఆవిడ ఒక్కటివ్వటంతో నా మధ్యాహ్ననిద్ర భంగమైంది. ఎన్నికలప్పుడే ఇల్లు ప్రశాంతంగా వుంది, ఇప్పుడు ఈ పగటి నిద్రలేమిటో, కలవరింతలేమిటో చిరాకు పుట్టిస్తున్నారు అంటూ కసురుకుంటోంది. ఇంటి పట్టున వుండని జర్నలిస్టులెవరైనా ఎప్పుడైనా ఇంట్లో వుంటే అంతేగా మరి !

సత్య