ఎం కోటేశ్వరరావు
‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్,చైనాకు భారత్ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్ విత్ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.
దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.
2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్ లైన్ జనవరి 4, 2019).
ఎకనమిక్ టైమ్స్ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్ లెగ్గా ఐరన్ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !
చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్ 17వ తేదీన లైవ్ మింట్ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏప్రిల్ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్ కథనాన్ని నిర్ధారించింది.
పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్ నుంచి 728శాతం పెరిగాయి.లాన్ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్ డాలర్లు. దీనిలో భారత్ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్ టైమ్స్ పేర్కొన్నది.
మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?