Tags

, , , ,

Image result for modi bc  all modis are thieve  comments cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే రాజకీయ పార్టీలు ఇంతగా దిగజారుతాయనుకోలేదు అని పెద్ద తరం వారు నివ్వెరపోతున్నారు. చరిత్రలో నాటి ప్రముఖ రాజనీతిజ్ఞులకు, ఆచరణలో నేటి రాజకీయ నేతలకు ఇంత తేడా వుందా అని మెదళ్లలో గుజ్జు వున్న యువతరం అనుకుంటోంది. ‘ ముందు ఎల్‌కె అద్వానీ కాబోయే రాష్ట్రపతి గుసగుసలు వినిపించాయి. అయితే గుజరాత్‌లో అధికారం పోయే అవకాశం వుందని భయపడిన బిజెపి అద్వానీకి అవకాశాన్ని నిరాకరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక దళితుడిని రాష్ట్రపతిగా ఎంచుకుంది అని రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహలట్‌ చేసిన వ్యాఖ్య మీద బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఎన్నికలు గనుక భావోద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలను కోవటం స్వచ్చ రాజకీయాలు కోరు కొనే వారికి నీచంగా కనిపిస్తుంది. తాము చేసింది అంతా సరైనదే ఎదుటి వారు చేస్తేనే తప్పు అన్నది అధికార రాజకీయ పార్టీలు లేదా కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే బూర్జువా పార్టీల వైఖరి.

బిజెపి నేతలు తమ కింది నలుపును తాము చూసుకోగలిగితే ఇతరుల మీద దాడికి దిగరు, కనుక వారేం చెప్పారో నిర్దాక్షిణ్యంగా గుర్తు చేయకతప్పదు. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ జమాఖండిలో జరిగిన సభలో ఇలా చెప్పినట్లు ఆ పార్టీ ట్రోల్‌ సేన ట్వీట్‌ చేసింది.’ భారత రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎంచుకున్నారు, ఒక ఏడాది తరువాత కూడా సోనియా గాంధీ మర్యాద పూర్వకంగా ఆయను కలుసుకోలేదు.’ అదే రాష్ట్రంలో మరొక ఎన్నికల సభలో అదే నరేంద్రమోడీ 2018 మే మూడవ తేదీన బళ్లారి ఇలా చెప్పారు’ బిజెపి ఒక ముస్లిం, ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసింది, కాంగ్రెస్‌ దళితులను మోసం చేసింది. తమకు అధికారమిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ఓట్లడిగింది. అయితే ప్రముఖ దళిత నేత మల్లిఖార్జున ఖర్గే బదులు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దళితులను మోసం చేసింది. అబ్దుల్‌ కలాం ఒక ముస్లిం, బిజెపి ఆయనను రాష్ట్రపతిని చేసింది.ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ కూడా ఒక దళితుడే. బిజెపి అంటే బనియా,బ్రాహ్మల పార్టీ అని మమ్మల్ని ద్వేషించే వారు అంటారు. మేము ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశాము, ఒక ఓబిసి, ఓ చాయ్‌ వాలాను ప్రధాన మంత్రిని చేశాము’ అని చెప్పారు. అశోక్‌ గెహ్లట్‌ అన్నది తప్పు నరేంద్రమోడీ చెప్పింది ఒప్పంటారా ?ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా దిగజారి వ్యవహరించటం, గల్లీ స్ధాయి మాటలు మాట్లాడుతున్నారంటే తమ అడుగుజారుతోందన్న భయం పట్టుకున్నట్లే అన్నది మొత్తం మీద మెజారిటీ విశ్లేషకుల సారాంశం. వారెందుకీ అభిప్రాయానికి వచ్చినట్లు ? ఎన్నికల సర్వేలన్నీ బిజెపి పెద్ద పార్టీగా వస్తుంది తప్ప గతంలో మాదిరి తానే అవసరమైన మెజారిటీ తెచ్చుకోలేదు అని తేల్చాయి. చివరి దశ ఎన్నికలు కూడా ముగియక ముందే ఇది బిజెపికి తొలి ఓటమి. గత ఐదు సంవత్సరాలలో బిజెపి, దాని నేతలంతా చెప్పిందేమిటి? కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం అనే కదా ! రాజస్ధాన్‌, చత్తీస్‌ ఘర్‌, మధ్య ప్రదేశ్‌లో పదిహేనేండ్లుగా పాతుకుపోయిన బిజెపిని కాంగ్రెస్‌ పెకలించి వేసింది. ఇది వ్యక్తిగతంగా నరేంద్రమోడీ, బిజెపికి పెద్ద కుదుపు. ఆ తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి ఆ పదజాలాన్ని తగ్గించటం లేదా పూర్తిగా మానుకున్నారు. భారతీయలు కల్లాకపటం లేని వారు కావచ్చుగానీ, తెలివి తక్కువ వారు మాత్రం కాదు. బిజెపి వారసత్వ పాలన గురించి మాట్లాడుతుంది. కాంగ్రెస్‌లో కంటే బిజెపిలో వారసులు యూరియా, సూపర్‌ వేసిన పంటలు ఎదిగినట్లుగా ఎదుగుతున్నారు. అలా అతిగా ఎదిగిన పంటలు తుపాన్లు, వరదలకు ఏమాత్రం తట్టుకోలేక కుప్పకూలిపోతాయి. తమను వ్యతిరేకించే వారందరూ పాకిస్ధాన్‌ను సమర్ధించే వారే అనే ఒక కుహనా జాతీయవాదాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించారు. తాము తిరిగి బిజెపి అధికారానికి రావాలని, మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు, వారు వస్తేనే పాక్‌-భారత చర్చలు ముందుకు పోతాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రకటించటంతో బిజెపి నేతలు ఏం మాట్లాలో తోచక గిలగిలలాడిపోతున్నారు. పాకిస్దాన్‌తో బిజెపి లవ్‌జీహాద్‌ సంగతి ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సైన్యాన్ని రాజకీయాల్లోకి తేవద్దని, రాజకీయ నేతలను నివారించాలని వందలాది మంది మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి నివేదించటం బిజెపిని అభిశంచించటం తప్ప మరొకటి కాదు. అయినా తరువాత కూడా ఆ పార్టీ వారు ఏదో ఒక రూపంలో ప్రస్తావన తెస్తూనే వున్నారు. బాలాకోట్‌ దాడికి ప్రధాని నరేంద్రమోడీయే ఆదేశాలు ఇచ్చారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చెబితే, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొనే వారు పుల్వామా మృతులకు తమ ఓట్లను అంకితం ఇవ్వాలని నరేంద్రమోడీ చెప్పారు. వీటిని శవరాజకీయాలని ఎవరైనా అంటే తప్పేముంది.

నోరు పారవేసుకోవటంలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. చౌకీదారు దొంగ అని రాహుల్‌ గాంధీ అనటానికి కారణం తాను వెనుబడిన తరగతికి చెందిన వాడిని కావటమే, వెనుకబడిన తరగతుల వారిని కాంగ్రెస్‌ ఎలా చూస్తోందో చూడండి అందరినీ దొంగలంటోంది అని ప్రధాని నరేంద్రమోడీ బిసి భావోద్వేగాలను రేపేందుకు ప్రయత్నించారు. బుధవారం నాడు మహారాష్ట్రలో ఒక ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ ‘ కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నోసార్లు నన్ను నిందించాయి, కానీ ఈ సారి మొత్తం వెనుకబడిన తరగతి సామాజిక వర్గం అంతటినీ దొంగలుగా వారు ముద్రవేశారు ‘ అని ఆరోపించారు. ఇటీవలి రాహుల్‌ గాంధీ కూడా మహారాష్ట్ర ఎన్నికల సభలోనే మాట్లాడుతూ వాణిజ్యవేత్త నీరవ్‌ మోడీ, క్రెకెట్‌ నిర్వాహకుడు లలిత్‌ మోడీ ఇలా దొంగలందరి పేర్లలో మోడీ అని వుంది ఇంకా ఎంత మంది అలాంటి వారు బయటకు వస్తారో అని రాహుల్‌ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాలలో కొందరు పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారు. వారిలో అనేక మంది రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారు కాదు. గిరిజనులు, వెనుబడిన తరగతులు,కాపులు ఇలా ఎందరో వున్నారు. అలాగే మోడీ అని పేరున్న వారందరూ నరేంద్రమోడీ చెప్పినట్లు వెనుకబడిన తరగతులు కాదూ, వారందరినీ రాహులు గాంధీ దొంగలూ అనలేదు. లలిత్‌ మోడీ వైశ్యుడు, నీరవ్‌ మోడీ జైన్‌. దేశంలో జైనులను కొన్ని చోట్ల బిసిలుగా పరిగణిస్తే కొన్ని చోట్ల ముందుబడిన తరగతులుగా చూస్తున్నారు. అందువలన నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య వెనుక వెనుకబడిన తరగతులను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కనిపించటం లేదు. అసలు నరేంద్రమోడీ వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి కాదన్నది ఒక వివాదం వుంది. అంబానీ, మహాత్మాగాంధీలు జన్మించిన మోధ్‌ బనియా కులంలో ఒక వుపకులమైన మోధ్‌ గంచీకి చెందిన వ్యక్తి అని చెబుతారు. అయితే వుత్తర భారత్‌లో నూనె తీసే వృత్తి చేసే తేలీలు ఘంచిస్‌ కులానికి చెందిన వారని మోధ్‌ గంచీస్‌ తెలీస్‌ కాదని చెబుతారు. అందువలన వాటిలోకి పోతే ఒక దగ్గర తేలటం కష్టం. ఓట్ల కోసమే మోడీ కులాన్ని బయటకు తీశారన్నది స్పష్టం.

చివరగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ మాట్లాడిందేమిటో ఒకసారి చూద్దాం. ‘కాంగ్రెస్‌లో ఎవరైతే ఒక వితంతువు వున్నారో అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఆమె ఖాతాలో జమ చేశారు’ అంటే పేరు చెప్పకుండానే సోనియా గాంధీని వుద్దేశించి అన్నారన్నది స్పష్టం. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయిన తరువాత వున్నత పదవుల్లో వున్నవారి గురించి చెప్పుకోవాల్సింది ఏముంటుంది. ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాలలో చివరి క్షణంలో ఫలానా కులం వారిని ఫలానా అభ్యర్ది చులకనగా మాట్లాడాడు, ఫలనా తిట్లు తిట్టాడు అని పుకార్లు వ్యాపింప చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వుదంతాలు అనేక వున్నాయి. ఇప్పుడు అవి దేశవ్యాపితంగా విస్తరించాయి. ఎంత అభివృద్ధో కదా !