Tags

, , ,

Image result for ranjan gogoi

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చింది. వాటిని నాలుగు వెబ్‌సైట్లు ప్రచురించాయి. ఆరోపణలకు గురైన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 46వ ప్రధాన న్యాయమూర్తి. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ ఒక వుద్యోగిని చేసిన ఆరోపణల గురించి అసాధారణ రీతిలో సుప్రీం కోర్టు శనివారం నాడు విచారణ జరిపింది. దీనికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఆయన కూడా ఒకరుగా వుండటం కూడా విశేషమే. సుప్రీం కోర్టులో పని చేసి తరువాత వుద్వాసనకు గురైన ఒక మహిళ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఫిర్యాదు చేస్తూ 22 మంది న్యాయమూర్తులతో పాటు మీడియా సంస్ధలకు కూడా సదరు కాపీని పంపటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. విచారణ ప్రారంభించిన తీరును పలువురు విమర్శిస్తున్నారు. సమర్ధించేవారు కూడా వున్నారు. ఈ విచారణ వుదంతం ఎలా ముగుస్తుందన్నది మరింత ఆసక్తికరంగా తయారైంది. వచ్చిన ఆరోపణలను ప్రచురించటం సరైందా కాదా అన్నదానిని తాము మీడియాకే వదలి వేస్తున్నామని రంజన్‌ గొగోయ్‌ పరోక్షంలో బెంచి పేర్కొన్నది.(నిర్ణయించే సమయంలో ఆయన బెంచ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు).

న్యాయ వ్యవస్ధకు మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రధాన న్యాయమూర్తి నైతిక నిష్ట తిరుగులేనిదని స్వయంగా న్యాయవాది అయిన కేంద్ర ఆర్ధిక మంత్రి చౌకీదార్‌ అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. విచారణ శనివారం జరిగితే ఆదివారం నాడు తన బ్లాగ్‌లో జైట్లీ వ్యాఖ్యలు చేశారు. రంజన్‌ గొగోయ్‌ న్యాయ సంబంధ వైఖరులను ఆయన విమర్శకులు సమర్ధించకపోవచ్చుగానీ వ్యక్తిగత మర్యాద, విలువలు, నైతిక నిష్టను ఎంతో గౌరవిస్తారని, ఆయన విలువల వ్యవస్ధను ఎవరూ ప్రశ్నించలేరని, గత చరిత్ర అంతగొప్పగా లేని అసంతృప్తి చెందిన ఒక వ్యక్తి నిరూపితంగాని ఆరోపణలు చేసినపుడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వుందని జైట్లీ పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వ్యవస్ధలను అస్దిరం గావించేవారు పెద్ద ఎత్తున సంఘటితం కావటం విచారకరమని, వారికి ఎలాంటి ఆంక్షల హద్దులు వుండవని, తమ వైఖరులతో ఏకీభవించని న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వారు చేసిన అనేక దాడులను దేశం చూసిందని’ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి చౌకీదార్‌ జైట్లీ అంతరంగంలో రెండు ముఖాలు వున్నాయి. వర్తమాన అంశం మీద అనుకూలంగానో, ప్రతికూలంగానో, తటస్ధంగానో ఒక అభిప్రాయం చెప్పటానికి ఎవరికైనా లేదా ఏ విషయం మీదైనా అభిప్రాయాలు వెల్లడించేందుకు ఒక హక్కు వుంటుంది. కానీ ఒకదాని గురిపెట్ట్టి వేరొకదానిని పేల్చేందుకు చూడటమే అభ్యంతరం. ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన అంశాలకే ఆయన పరిమితం కాలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని మీడియా, వామపక్ష భావజాలం మీద దాడికి పూనుకున్నారు. జైట్లీ మన్‌కీ బాత్‌లో ఒకటి ప్రధాన న్యాయమూర్తి పట్ల సానుభూతి ప్రదర్శన, రెండవది కాషాయ వైఖరి వెల్లడి. రెండవదాన్ని ఎలా వ్యక్త పరిచారో చూద్దాం.’ వ్యవస్ధలను అస్ధిరం గావించే వారిలో ఎంతో మంది వామపక్ష లేదా కుహనా వామపక్ష వాదుల వైఖరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారికి ఎన్నికల పునాది లేదా జనబాహుళ్య మద్దతు లేదు. అయినప్పటికీ వారు ఇప్పటికీ మీడియా, పండితీ ప్రకాండులలో విషమానుపాతంగా(వుండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ) వున్నారు. ప్రధాన స్రవంతి మీడియా వారిని బయటకు పంపితే డిజిటల్‌, సామాజిక మీడియాను ఆశ్రయించారు. వీరిలో ఎక్కువ మంది వులిపికట్టే భావజాలం, ఆలోచనలతో వుంటారు. బార్‌(లాయర్ల అసోసియేషన్‌) సభ్యులలో కాంగ్రెస్‌కు అనుబంధమైన సభ్యుల తరగతి ఇలాంటి వారితో చేతులు కలపటం విచారకరం. న్యాయమూర్తులు, చివరికి ప్రధాన న్యాయమూర్తిని కూడా ఫిర్యాదులకు తగని కారణాలతో అభిశంసించేందుకు పార్లమెంట్‌ సభ్యుల సంతకాలను కూడా సేకరించేందుకు ప్రయత్నించారు. అటువంటి వులిపికట్టెల ప్రచారచర్యలకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వటం తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది’ అని పేర్కొన్నారు. ఈ రెండింటినీ చూసినపుడు ప్రధాన న్యాయమూర్తి గురించి జైట్లీ చేసిన సానుకూల వ్యాఖ్యను ఎవరైనా శంకిస్తే, శల్యసారధ్యమని అనుకుంటే తప్పు పట్టలేము.

జైట్లీ పేర్కొన్నట్లుగా దేశంలో వామపక్ష లేదా కుహనా వామపక్ష భావజాలం, ఆలోచనలు, వులిపికట్టె ధోరణులు గల వారే కాదు. అవినీతి పరులు,దోపిడీదారులు వారికి అనుకూలమైన భావజాలం, ఆలోచనలను ముందుకు తెచ్చేవారు, పచ్చి మితవాదులు, మతోన్మాదులు, ఫాసిస్టులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేందుకు పూనుకున్నవారూ, గూండాలు, మూఫియాలు, మత మాఫియాలు, మెజారిటీ, మైనారిటీ మత వుగ్రవాదులూ వున్నారు. బహుశా జైట్లీకి ఒకటే దృష్టి పని చేస్తున్నట్లు వుంది. ఓవైపే చూడగలుగుతున్నారు. క్షీరసాగర మధనంలో వెలువడిన అమృతం వామపక్ష భావజాలం-ఆలోచనలు అని ఎందుకు అనుకోకూడదు. మిగిలిన రాజకీయ పార్టీలు లేదా శక్తులను చూస్తే హాని కలిగించే హాలా హలం వంటి కుహనా వామపక్ష భావజాలం-ఆలోచనలతో పాటు పైన పేర్కొన్న ఇతర అవాంఛనీయ ధోరణులకు ప్రాతినిధ్యం వహించేవారే ఎక్కువగా వున్నారు. వారు వెల్లడించే అభిప్రాయాల మీద స్వేచ్చగా చర్చించండి, సరైన వైఖరిని అలవర్చుకోనివ్వండి. నా శాపానికి గురయ్యే ముంబై పేలుళ్ల సందర్భంగా పోలీసు అధికారి హేమంత కర్కరే మృతి చెందాడు, బాబరీ మసీదును కూల్చివేసేందుకు వెళ్లివారిలో నేనూ ఒకతెను, అక్కడే రామాలయం నిర్మిస్తామని చెప్పిన ప్రజ్ఞ ఠాకూర్‌ ఒక సాధ్వి ముసుగును ఆశ్రయించలేదా, ఇంకా అలాంటి వారెందరినో దేశం చూడటం లేదా. ఏకంగా దేశానికి జవాబుదారీ వహిస్తానని చెబుతున్న బిజెపి ఆమెను వేలాది సంవత్సరాల మత, తాత్వికచింతన, నాగరికతా విలువలకు ప్రతీకగా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీయే అభివర్ణించారంటే బిజెపి పెద్దలు ఆమెకు ఏ ముసుగు వేస్తున్నారో కనిపించటం లేదా ? ఆమె మీద ఏదో ఒక గొలుసు, చీరల దొంగతనం కేసులు కాదు, వుగ్రవాద కేసు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆ కేసులో బెయిలు తీసుకొని ఏకంగా ఎన్నికల బరిలో ప్రచారం చేస్తున్న ఆమె ఎలాంటి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. కేసు విచారణ ముగిసి నిర్దోషిగా తేలిన తరువాత ఆంతటి మహోన్నత వ్యక్తిని అందలం ఎక్కించటమా లేదా అన్నది బిజెపి అంతర్గత వ్యవహారం.

దేశంలో రాజ్యాంగ వ్యవస్ధలను అస్ధిరపరుస్తున్నది, రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నది ఎవరో రోజూ ఏదో ఒక మూల నుంచి వింటూనే వున్నాం. సిబిఐ, ఆదాయపన్ను, ఇడి వంటి సంస్దలను ప్రత్యర్దుల మీద ప్రయోగిస్తున్నారు. గుడికి, ఇంటికి పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాగారు. రిజర్వుబ్యాంకును తన పని తాను చేసుకోనివ్వకుండా చేశారు. దాని దగ్గర వున్న నిల్వసొమ్ములాక్కొన్నారు. సరిహద్దులు, దేశ రక్షణకు పరిమితం కావాల్సిన భద్రతా దళాలను రాజకీయాల్లోకి తెచ్చారు. నిష్పాక్షికంగా వుండాల్సిన ఎన్నికల సంఘాన్ని గబ్బు పట్టించారు ఇవన్నీ చేసింది మీడియా, మేథావులుగా వున్న వామపక్ష భావాలు కలవారని జైట్లీ చెప్పదలచుకున్నారా ? గోబెల్స్‌ను అనుసరిస్తున్నవారే ఇలాంటి ప్రచారం చేయగలరు. మోడీ ఆయన భక్తులు ప్రాసకోసం కక్కుర్తి పడి కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిందీ లేదా చెయ్యలేని దానిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పటాన్ని వింటున్నాం కదా ? ఇక అసలు విషయానికి వస్తే ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల మంచి చెడ్డలు, విచారణ తీరుపై వెలువడుతున్న విమర్శలు లేదా అభిప్రాయాలను చూద్దాం.

విమర్శలు లేదా ఆరోపణలకు వాటిలోని, అంశాలకు వారు ఎంత పెద్ద పదవిలో వున్నా అతీతులు కారు. అలాగని వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలూ కాదు. తమ ప్రయోజనాలకు అడ్డుపడటం లేదా భవిష్యత్‌లో భంగం కలిగిస్తారని భావిస్తున్నవారికి వ్యతిరేకంగా ప్రయోజనాన్ని ఆశించే వారు అనేక ఆయుధాలతో దాడి చేస్తారు. వాటిలో ప్రలోభపెట్టటం, ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించటం ఇలా రకరకాలుగా వుంటాయి. అవి వ్యక్తిగత ప్రయోజనాలే అయివుండనవసరం లేదు. ఈ పూర్వరంగంలో జస్టిస్‌ గొగోయ్‌ మీద చేసిన ఆరోపణల మంచి చెడ్డలను చూడాల్సి వుంది.

ఇలాంటి ఆరోపణలు, ప్రలోభాలు ప్రపంచవ్యాపితంగా జరుగుతున్నవే. పశ్చిమ దేశాలలో జడ్జీలతో సహా రాజకీయ నేతలు, పలు రంగాలలో ప్రముఖుల మీద కోకొల్లలు. ఇజ్రాయల్‌లో తనను న్యాయమూర్తిగా నియమించేందుకు సాయపడవలసిందిగా ఒక మహిళ ఎంపిక కమిటీలోని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడితో పడక సుఖాన్ని పంచుకుంది. అమెరికాలో ఒక న్యాయమూర్తి తన దగ్గరకు విచారణకు వచ్చిన ఒక కేసులో ఫిర్యాదు చేసిన ఒక యువతిని ప్రలోభపరుచుకోవటమే కాదు, తన ఛాంబర్‌నే పడగ గదిగా మార్చివేశాడు. ఇక గత సంవవత్సరం అమెరికాలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ట్రంప్‌ సర్కార్‌ నియమించిన నియమించిన బ్రెట్‌ కవనాహ్‌ తమను లైంగికంగా వేధించినట్లు ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన నియామకాన్ని ఖరారు చేయటం కొద్ది రోజులు ఆలస్యమైంది. కవనాహ్‌ వయస్సు 54 సంవత్సరాలు. విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో (1983-04) ఒక రోజు తామందరం ఒక డార్మిటరీలో మద్యం సేవిస్తుండగా, కవనాహ్‌ తన పాంట్స్‌ జిప్‌ విప్పి మర్మాంగాన్ని తనకు చూపాడని ఒక మహిళ, అంతకు ముందు తనకు 15, అతనికి 17వయసపుడు ఒక హైస్కూలు పార్టీలో ఒక మంచం మీదకు తనను నెట్టి బట్టలు విప్పి నోరు మూసేందుకు ప్రయత్నించాడని ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నామె ఆరోపించింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఈ ఆరోపణల వెనుక వుందని రిపబ్లికన్లు ఆరోపించారు. మన దేశంలో కూడా ప్రతి వ్యవస్ధనూ దుర్వినియోగం చేయటం ప్రారంభమైన తరువాత ప్రతి నియామకాన్నీ రచ్చ చేయటం, రాజకీయంగా చూడటం, వాటి వెనుక ఎవరో ఒకరు వుండటం సహజం.

1973లో ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులను పక్కన పెట్టి నాటి ప్రధాని ఇందిరా గాంధీ జస్టిస్‌ ఎఎన్‌ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించటంలో కీలకపాత్ర వహించారు. దేశ న్యాయ వ్యవస్ధ చరిత్రలో ఇలా జరగటం అదే తొలిసారి. దానికి వ్యతిరేకంగా దేశంలో బార్‌ అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి. ఆ పెద్ద మనిషి ప్రతి చిన్న విషయానికి ఇందిరాగాంధీకి, చివరకు ఆమె కార్యదర్శికి కూడా ఫోన్‌ చేసి ఏం చేయమంటారో సలహాలు తీసుకొనే వారనే విమర్శలు వున్నాయి. రే పదవీ విరమణ తరువాత ఇందిరా గాంధీ మరోసారి సీనియారిటీని పక్కన పెట్టే అక్రమానికి పాల్పడ్డారు. హెచ్‌ ఆర్‌ ఖన్నా సీనియారిటీని తోసి పుచ్చి హెచ్‌ఎం బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా చేయటంతో నిరసనగా ఖన్నా రాజీనామా చేశారు. ఆయన చేసిన ‘తప్పిదం’ ఏమంటే ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితి, నియంతృత్వ పోకడలను అంగీకరించకపోవటమే. అక్రమంగా నిర్బంధించిన ఒక వ్యక్తి విషయమై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ విచారణ సందర్భంగా అత్యవసర పరిస్ధితిలో ప్రాధమిక హక్కులు అమలులో వుండవని చేసిన ప్రభుత్వ వాదనను బెంచ్‌లోని మిగతా న్యాయమూర్తులందరూ సమర్దిస్తే ఖన్నా మాత్రమే విబేధించారు. ఎప్పుడైనా ప్రాధమిక హక్కులకు హామీ వుండాల్సిందే అని స్పష్టం చేశారు. అందుకే ఆయన్ను పక్కన పెట్టారు. అంటే తమ కనుసన్నలలో వుండేవారిని అందలమెక్కించటం లేని వారిని అధ:పాతాళానికి తొక్కేయటం అన్ని వ్యవస్ధల్లోనూ వుంటుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. ఇది సాధ్యం కానపుడు, తమకు ఇష్టం లేని వారు కొన్ని బాధ్యతల్లో వున్నపుడు ఏమి జరుగుతుంది? మరో రూపంలో వేధింపులకు, ఇతర చర్యలకు పాల్పడవచ్చు.

Image result for arun jaitley attack on media

గతేడాది పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా స్దానంలో సీనియర్‌గా వున్న రంజన్‌ గొగోయ్‌ను నియమిస్తారా అని మీడియాలో కూడా చర్చ జరిగింది. ఒక ప్రధాన న్యాయమూర్తి( దీపక్‌ మిశ్రా) పనితీరుపై విబేధించి సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తుల్లో గొగోయ్‌ ప్రధములు. ఆయనతో పాటు జాస్తి చలమేశ్వర్‌, మదన్‌లాల్‌ బి లోకూర్‌, కురియన్‌ జోసెఫ్‌ ఒక విధంగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ మరొక మార్గం లేని స్ధితిలో రంజన్‌ గొగోయ్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించక తప్పలేదు. నిజానికి మన దేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 124 పేర్కొన్నది తప్ప ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి లేదు. పదవీ విరమణ చేసే ప్రధాన న్యాయమూర్తే సీనియర్‌ పేరును సిఫార్సు చేయటం, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేయటం ఒక ఆనవాయితీగా వుంది. దానికి ఇందిరా గాంధీ హయాంలో భంగం కలిగింది. తనతో వివాద పడిన సహచరుడిని దీపక్‌ మిశ్రా సిఫార్సు చేస్తారా, చేయకపోతే ఏమిటి అనే పద్దతుల్లో మీడియాలో వూహాగానాలు వచ్చాయి. వాటికి తెరదించి గోగోయ్‌ నియామకం సజావుగా జరిగింది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై ఒక తీవ్ర ఆరోపణ చేయటం అదీ నడత సరిగా లేదనే కేసులున్న ఒక సాధారణ స్ధాయి గుమస్తా సాహసం చేయటం వెనుక ఏ శక్తులున్నాయనే అనుమానాలు రావటం సహజం. పశ్చిమ దేశాలలో ప్రముఖులను బ్లాక్‌ మెయిల్‌ చేయటానికి, డబ్బుకోసం ఇలాంటివి చేయటం సర్వసాధారణం. అమెరికా అధ్యక్షుడిగా వున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మీద కనీసం 23 మంది మహిళలు లైంగికపరమైన ఆరోపణలు చేశారని, అనేక మంది నోరు మూయించటానికి పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. రంజన్‌ గొగోయ్‌ విషయానికి వస్తే ఫిర్యాదు చేసిన మహిళ గురించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి తనతో 2018 అక్టోబరు 10,11 తేదీలలో అనుచితంగా ప్రవర్తించినట్లు మహిళా వుద్యోగి ఆరోపించింది. ఆమె సుప్రీం కోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి నివాసానికి ఆగస్టు 27న బదిలీ అయింది. గొగోయ్‌ అక్టోబరు మూడవ తేదీన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అది జరిగిన వారానికి ఈ సంఘటన జరిగినట్లు ఆమె ఆరోపించటాన్ని గమనించాలి. లోకజ్ఞానం ప్రకారం ఆలోచిస్తే ఇది జరిగే అవకాశం లేదు. సదరు వుద్యోగిని ప్రధాన న్యాయమూర్తికి అవాంఛనీయమైన వ్యక్తిగత వర్తమానాలు(మెసేజ్‌లు) పెడుతోందని, తనను తిరిగి సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతోందని కోర్టు జనరల్‌ సెక్రటరీకి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అక్టోబరు 12న రాసింది. పది రోజుల తరువాత సుప్రీం కోర్టులో ఒక విభాగానికి బదిలీ చేస్తే దానిలో చేరేందుకు నిరాకరించటమే కాదు, వుద్యోగ సంఘం నేతలతో కలసి ఆందోళన చేసింది. దాంతో శాఖాపరమైన విచారణ జరిపి డిసెంబరు 21న వుద్యోగం నుంచి తొలగించారు. 2011,12 సంవత్సరాలలలోనే ఆమె మీద, కుటుంబ సభ్యుల మీద క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తేలింది.ఆమె ఫిర్యాదు వెనుక దేశ న్యాయవ్యవస్ధను అస్ధిర పరచే పెద్ద కుట్రవుందన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ అనుమానానికి బలం చేకూరుతోంది. ప్రధాన న్యాయమూర్తిపై చేసిన ఆరోపణలను తన వద్దకు తీసుకు వచ్చిన ఒక వ్యక్తి తనకు 50లక్షల రూపాయలు ఫీజుగా ఇస్తానని ఆశచూపాడని, బాధితురాలు ఎవరంటే తన సోదరి అన్నాడని, కోర్టులో కేసు వేయటంతో పాటు ఇండియా ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్టి పెట్టి ఈ విషయాలను వెల్లడించాలని కోరినట్లు వుత్సవ్‌ సింగ్‌ బెయిన్స్‌ అనే సుప్రీం కోర్టు న్యాయవాది వెల్లడించారు. ఆశారాంబాపు కేసులో బాధితురాలి తరఫున బాగా వాదించారంటూ తనను పొగడుతూ మాట్లాడిన సదరు వ్యక్తి ఒక బ్రోకర్‌ అని అర్ధమైందని, కేసు నిలవదని, అనేక అంశాలను తాను ప్రస్తావిస్తే సరైన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. చివరకు కోటిన్నర రూపాయలు ఆశచూపాడని తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగొయ్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు తగవని ఇచ్చిన తీర్పు విషయం తెలిసిందే. ఆ తీర్పును తాము ఆమోదించేది లేదంటూ బిజెపి, దాని అనుబంధ సంస్ధలు భక్తుల పేరుతో కేరళలో పెద్ద ఎత్తున ఆందోళన, విధ్వంసకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసు తీర్పును పునర్విచారణ చేయాలని దాఖలైన పిటీషన్లు కోర్టు ముందున్నాయి. అన్నింటికీ మించి రాఫెల్‌ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అందువలన గతంలో ఇచ్చిన తీర్పు మీద పునర్విచారణ జరపాలన్న పిటీషన్లను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అపహరణకు గురైన పత్రాలను సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న వాదనను తోసి పుచ్చి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పటం అంటే పాత తీర్పును పునర్విచారణ చేయటానికి అంగీకరించటమే. సుప్రీం కోర్టు రాఫెల్‌ లావాదేవీలలో అక్రమాలు లేవని ఇంతకాలం ప్రచారం చేస్తున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమే, బిజెపి బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఆర్టికల్‌ 370తో ముడి పడి వున్న ఆర్టికల్‌ 35ఏ చెల్లదని సవాలు చేసిన కేసు కోర్టు విచారణలో వుంది, ఇంకా ఇలాంటివే అధికార పక్షానికి ఇబ్బంది కలిగించే కొన్ని కేసులు సుప్రీం కోర్టులో వున్నాయి. బాబరీ మసీదు స్ధలవివాద కేసులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే శబరిమల తీర్పు మాదిరి వ్యతిరేకిస్తామని చెబుతున్న విషయం తెలిసిందే. బాబరీ మసీదుకు ముందు అక్కడ రామాలయం వుందన్నది తమ విశ్వాసమని, కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు ఎలా చెబుతాయని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్న విషయమూ తెలిసిందే.

తన మీద వచ్చిన ఆరోపణలను తాను కూడా బెంచ్‌లో వుండి విచారించకూడదు అన్నది ఒక విమర్శ. ఇది నైతిక పరమైనదా, నిబంధనలకు సంబంధించిందా అన్నది మొదటి విషయం.నిబంధనలకు సంబంధించిన వుల్లంఘన అయితే ఎవరైనా సవాలు చేసి వుండేవారు, అలాంటిదేమీ లేదు, అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు కనుక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక సాంప్రదాయం, నైతికత అంశాల విషయం చూద్దాం. ఒక పెద్ద ప్రమాదం జరిగితేనో, ఒక విధానపరమైన అంశానికి కోర్టులోనో మరో చోటో ఎదురు దెబ్బ తగిలితే స్వంతంగా బాధ్యత లేకపోయినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రాజకీయ నేతల వుదంతాలు వున్నాయి. హవాలా కేసులో ఇరుక్కున్న ఎల్‌కె అద్వానీ దాన్నుంచి బయటపడేంత వరకు తాను బాధ్యతల్లో వుండనని ప్రకటించి ప్రశంసలు పొందారు. కానీ అదే అద్వానీ బాబరీ మసీదు విధ్వంసం కేసులో ముద్దాయి అయినా ఆ తరువాత కేంద్రమంత్రిగా, ఎంపీగా వున్నారు. అలాగే ఎందరి మీదో కేసులు వున్నాయి. గుజరాత్‌లో గోద్రా అనంతర మారణహోమం సాగినపుడు రాజధర్మం పాటించి రాజీనామా చేయాలని వాజ్‌పేయి కోరితే అద్వానీ మద్దతుతో నరేంద్రమోడీ తిరస్కరించి ముఖ్య మంత్రిగానే కొనసాగారు. ఆయన మీద కేసులు నడిచిన సమయంలోనూ అదే జరిగింది. దేశంలో ఇంకా అనేక పార్టీల నేతల మీద కేసులు వున్నాయి. కేసులున్నంత మాత్రాన నైతికంగా రాజీనామా చేయాలా, పదవులు స్వీకరించకూడదా అని ఎదురుదాడులు చేస్తున్న రోజులి. అసలు ఫిరాయింపు నిరోధక చట్టం అమల్లో వుండగానే వేరే పార్టీలో చేరి పాత పార్టీ పేరుతో కొనసాగుతూనే మంత్రులుగా పని చేసిన వారిని చూశాము. ఈ అంశాలలో నిబంధనలూ లేవు నైతికతా ఎక్కడా కానరాలేదు. రాజకీయ ప్రత్యర్ధులు, స్వంతపార్టీల్లోనే ఏదో ఒక ఆరోపణ చేసి, చేయించి ఆ పేరుతో పదవుల నుంచి తప్పించటం ఒక కుట్ర.

న్యాయమూర్తులు, కోర్టుకు సంబంధించిన ఇతరుల మీద ఫిర్యాదులు వచ్చినపుడ అంతర్గత వ్యవహారాల కమిటీకి నివేదించాలని ఆ ప్రక్రియ లేకుండా నేరుగా బెంచ్‌కు నివేదించారన్న విమర్శ ఒకటి. ఈ కమిటీ అధ్యక్షురాలిగా జస్టిస్‌ ఇందు మల్హోత్రా వున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశం కేసులో మహిళలపై ఆంక్షలు కొనసాగించాల్సిందేనంటూ మెజారిటీ తీర్పుతో వ్యతిరేకించారు. ఆమె నోట్‌లోని అంశాలను ఆధారం చేసుకొనే బిజెపి, ఇతర సంస్ధలు అయ్యప్ప ఆలయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శాంతి భద్రతల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ఒక వేళ దీనికి కూడా స్పష్టమైన నిబంధనలు వుంటే వాటిని రంజన్‌ గొగోయ్‌ వుల్లంఘించి వుంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, చర్యను కూడా కోరవచ్చు. ఫిర్యాదు చేసిన మహిళకు అవకాశం ఇవ్వలేదన్నది మరొక విమర్శ. అ అంశం మీద ఆసక్తి వున్నవారు ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే అదే బెంచ్‌ తన వివరణ ఇస్తుంది. ఆ పని చేయకుండా కేవలం విమర్శలకే పరిమితం అయితే వారిని శంకించాల్సి వుంటుంది. తీర్పులనే పునర్విచాలించాలని పిటీషన్లు దాఖలు చేస్తున్నపుడు దీని మీద ఎందుకు వేయకూడదు ?

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తన మీద వచ్చిన ఏమాత్రం పసలేని ఆరోపణలకు భయపడి రాజీనామా చేస్తే జరిగేదేమిటి? నిజంగా ఆయన చెప్పినట్లు రంజన్‌ గొగోయ్‌ చెప్పినట్లు దాని వెనుక వున్న పెద్ద శక్తి వలలో పడినట్లే . ఆయనకు వచ్చే మంచిపేరు సంగతి దేవుడెరుగు, ఏదో ఒక సాకుతో అసలు పదవి నుంచే తప్పించరన్న గ్యారంటీ ఏముంది? ఇందిరా గాంధీ హయాంలో మాదిరి తమకు అనుకూలడైన న్యాయమూర్తులను ఆ పదవిలో నియమించే అవకాశం లేదని ఎవరైనా చెప్పగలరా ? సిబిఐ వున్నతాధికారుల విషయంలో జరిగిందేమిటో ఒక్కసారి వెనక్కు చూడవచ్చు. అనేక ముఖ్యమైన కేసుల్లో అధికారపక్షానికి లేదా దాని వాంఛలకు అనుకూలంగా, వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన పూర్వరంగంలో వాటి మీద పునర్విచారణ జరిగే సమయంలో అరుణ్‌ జైట్లీ చెప్పినట్లు నైతిక నిష్టగల రంజన్‌ గొగోయ్‌ వంటి వారు బాధ్యతల్లో లేకపోతే ఎలా? జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగితే నిందితులపై కేసులు పెట్టరాదని ప్రదర్శనలు చేసిన లాయర్లు చెలరేగిపోతున్న తరుణమిది. వారి మీద బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న చర్యలేమున్నాయి?

ఇప్పటికే పుల్వామా దాడి సరిగ్గా ఎన్నికలకు ముందు సంభవించటం గురించి ఇదంతా ఒక పధకం ప్రకారమే జరిగిందని సామాజిక మాధ్యమంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాస్తవమో కాదో తెలియని వీడియోలు, ఆడియోలు కూడా తిరుగుతున్నాయి. ఆరునెలల క్రితం జరిగిందని చెబుతూ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల మధ్యలో సదరు వుద్యోగిని రంజన్‌ గొగోయ్‌ మీద సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేయటం, దానిని మీడియాకు కూడా పంపటం అంటే అనుమానాలు రావటంసహజం. ఒక్కసారి మీడియా, ఓటర్ల దృష్టి ఎన్నికలు, పార్టీల మంచిచెడ్డలను వదలి ఎన్నికలు ముగిసే వరకు దీని గురించే చర్చించవచ్చు. కొందరికి కావాల్సింది కూడా అదేనా ? తాము కోరుకున్న విధంగా సుప్రీం కోర్టు తీర్పులు వుండవని పాలకపార్టీ, దాని అనుబంధ సంస్ధలు వూహిస్తున్నాయా, గతంలో ఇందిరా గాంధీ మాదిరి తీర్పులను తమకు అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాయా ? సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖల మాదిరి న్యాయవ్యవస్ధలను కూడా తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని వాంఛిస్తున్నాయా? ప్రస్తుతం చేసిన ఫిర్యాదు ఒక్క ప్రధాన న్యాయమూర్తి మీదే అయినప్పటికీ ఇతర న్యాయమూర్తులను కూడా భయపెట్టటానికి ఇలాంటివో మరొకటో రాబోయే రోజుల్లో రావని చెప్పలేము. ఈ ధోరణి రాజ్యాంగవ్యవస్ధల మీద వున్న విశ్వాసాలు మరింత దెబ్బతినటానికే దోహదం చేస్తుంది. తమ అజెండాను సులభంగా అమలు చేసేందుకు పాలకవర్గాలకు కావాల్సింది ఇదే.