Tags

, , , , , ,

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !