Tags

, , , ,

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.