ఎం కోటేశ్వరరావు
బీహార్‌లో రైతాంగ వుద్యమ నిర్మాత ! ఆలిండియా కిసాన్ సభ తొలి అధ్యక్షుడు !! స్వామి సహజానంద సరస్వతి కలియ తిరిగిన నేల, వుద్యమాల పురుటి గడ్డ బెగుసరాయ్. స్వాతంత్య్ర వుద్యమంలో పరిచయం అవసరం లేని ప్రాంతం. మరోసారి జాతీయంగా జనం నోళ్లలో నానుతోంది. అటు పచ్చి మితవాదులు, ఇటు పురోగామి వాదులు ఇప్పుడు కేంద్రీకరించిన ఎన్నికల పోరుగడ్డ. సోమవారం నాడు జరిగే ఎన్నికల ఫలితం ఏమౌతుందన్నది ప్రశ్నే కాదు.
ఏ మతానికి చెందిన వారైనా పిల్లల్ని కనే సంఖ్య ఒకటిగానే వుండాలి. హిందువులు మరింత ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా సంఖ్యను పెంచాలని ప్రబోధించిన మిత, మతవాది అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బిజెపి అభ్యర్ధి. దేశానికి మిత, మతవాదుల నుంచి పొంచి వున్న ముప్పును చిత్తు చెయ్యాలన్న పురోగమన వాది కన్నయ్య కుమార్ వామపక్షాలన్నీ బలపరిచిన సిపిఐ అభ్యర్ధిగా పోటీలో వున్నారు. బిజెపిని ఓడించాలన్న వామపక్షాల పిలుపును విస్మరించిన ఆర్‌జెడి, కాంగ్రెస్ కూటమి తరఫున ఆర్‌జెడి అభ్యర్ధిగా తన్వీర్ హసన్ పోటీలో వున్నారు.
ఆ నియోజకవర్గంలో భూమిహార్‌లు గణనీయ సంఖ్యలో వున్నారు. గిరిరాజ్ సింగ్, కన్నయ్య ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వారు. భూమిహార్లు తాము వ్యవసాయం చేసే బ్రాహ్మణులమని, తాము యాచక తరగతికి చెందిన వారం కాదని చెప్పుకుంటారు. కర్మకాండలు చేసే తరగతి బ్రాహ్మణులు వారు అసలు సిసలు బ్రాహ్మలు కాదంటూ తమతో సమంగా గుర్తించేందుకు నిరాకరిస్తారు. భూమిహార్లలో పెద్ద పెద్ద జమిందార్లు వున్నారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన పేద భూమిహార్లు వున్నారు. స్వామి సహజనాంద తరగతి నాడు రెండవ కోవకు చెందితే నేడు ఆ వారసత్వాన్ని కన్నయ్య కుమార్ కొనసాగిస్తున్నాడు.
కన్నయ్యకు మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి కుల, మత, భాషా, ప్రాంత భేదంలేకుండా చురుకుగా పాల్గొంటున్నవారితో బెగుసరాయ్ ఓ ‘మినీ భారత్’ను తలపిస్తున్నదని న్యూస్ క్లిక్ వెబ్‌సైట్ ప్రతినిధి నివేదించాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు చర్చల్లో నిమగమై ఉండగా.. మరికొందరు తమ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు. మరికొందరు మండుతున్న వేడి నుంచి సేదతీరేందుకు చెట్ల నీడన తలదాచుకున్నారు. ఇదంతా బేగసరాయ్ లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత నివాసం వెలుపల ద శ్యం. అక్కడ ఉన్నవారంతా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. వారి లక్ష్యం ఒక్కటే. బేగుసరారు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కన్నయ్యకుమార్‌కు ప్రచారంలో సహాయ పడటం. బిహత్ గ్రామంలోని కన్నయ్యకుమార్ ఇంటికి చేరుకునేసరికి వారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పరిచయంలేదు. యువకులు, మధ్యవయస్కులు, వ ద్దులు, మహిళలు ఇలా అందరూ ఇప్పుడు మంచి స్నేహితులు. ‘ఉదయం ప్రచారానికి బయలుదేరే ముందు వరకూ.. అలాగే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత… వారంతా కన్నయ్యకుమార్ ఇంటివెలుపల బహిరంగ ప్రదేశంలో గడుపుతున్నారు..’ అని సీపీఐ అభ్యర్థి ప్రచార సమన్వయకర్త ధనుంజరుకుమార్ చెప్పారు. ప్రత్యేకమేమంటే.. అక్కడ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, కళాకారులు, పర్యావరణ ఉద్యమ కారులు, విద్యావేత్తలు.. ఇలా విభిన్నవర్గాలకు చెందినవారే కాదు, వివిధ భాషలు, కులాలు, సంస్క తులకు చెందిన వారూ ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు, సాంస్క తిక గ్రూపు, వీధి నాటకాలకు, సోషల్ మీడియా నిర్వహణ ఇలా… అందరినీ ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. ముమ్మర ప్రచారం నిర్వహించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని మరీ వీరంతా అక్కడకు చేరుకొని ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురితో సహా విదేశీయులు కూడా ఉండటం ప్రత్యేకం. పన్నెండు అంతర్జాతీయ మీడియాసంస్థలు ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించాయి. నివాసం వెనుక ఖాళీ స్థలంలో భోజనశాలను ఏర్పాటుచేశారు. కన్నయ్యకుమార్ తల్లి సహా పలువురు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లుచూస్తున్నారు. ‘నా సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడకు వచ్చాను. నేను సీసీఐ కార్యకర్తనుకాను. అలాగని ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ, కన్నయ్య విజయం కోసం నా వంతు సహాయం చేయాలన్న తపనతో ఇక్కడకువచ్చాను. చీకటిలో కాంతిరేఖలా కన్నయ్యకుమార్ కనిపించారు నాలాగే వివిధ రాష్ట్రాల నుంచి కన్నయ్యకు సహాయపడేందుకు వందలాది మంది బేగుసరారు వచ్చారు..’ అని పంజాబ్‌లోని భటిధర్ నుంచి వచ్చిన జబర్ జంగ్ సింగ్ చెప్పారు.
‘దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరం నుంచి నేను ఇక్కడకు వచ్చాను. గత ఐదేండ్లుగా గోవాలోనూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యావరణంపై మోడీ ప్రభుత్వ రాజీపడిన ధోరణిని ఇక్కడ ప్రజలకు వివరిస్తున్నాను’ అని పర్యావరణ కార్యకర్త సుదీప్ దాల్వీ చెప్పారు. ‘కన్నయ్యకు మద్దతివ్వాల్సిందిగా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాను. అసంఘటిత రంగ, బలహీనవర్గాలు, మైనార్టీల, పేదల గొంతుక కన్నయ్య. ఆయన కోసం నేను ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ వచ్చాను’ అని ఒడిషాలోని జగత్‌సింగ్‌పుర్ నుంచి వచ్చిన మిర్జా లుక్మన్ చెప్పారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నుంచి సందీప్ గుప్తా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ విద్యార్థి జైన్ మొహమ్మద్ సులేమన్, అలహాబాద్ వర్సిటీ నుంచి ఆరిఫ్ సిద్ధికి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మహేశ్ కుమార్, జేఎన్‌యూ నుంచి పలువురు విద్యార్థులు, తెలంగాణ నుంచి సల్మాన్ అలీ, క్రిష్ణరామ్, ఆంధ్రప్రదేశ్ నుంచి నాగేశ్వర్‌రెడ్డి.. ఇలా అన్ని ప్రాంతాలవారూ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటువేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని మతవాద, నియంతత్వ దళాలను ఓడించేందుకే నా పోరాటం., బేగుసరారు ప్రజలు నాకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉంది’ అని కన్నయ్యకుమార్ చెప్పారు.
వామపక్షాలకు బెగుసరాయ్ ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం. లెనిన్‌గ్రాడ్‌గానూ దీనికి పేరు. 1967లో యోగేంద్ర శర్మ సీపీఐ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ సీపీఐ అభ్యర్థికి 11.87్న ఓట్లు వచ్చాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ మళ్లీ సత్తా చాటాలనే ఉద్దేశంతో నవడా స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను రంగంలో దించింది. ఆయన అయిష్టంగానే బరిలో దిగారని వార్తలు వచ్చాయి. ఆర్జేడీ గత ఎన్నికల్లో 3.69 లక్షల ఓట్లు దక్కించుకున్న తన్వీర్ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించి త్రిముఖ పోరుకు తెరతీసింది. బిజెపి-సిపిఐ మధ్య భూమిహార్ ఓట్లు చీలితే తమకు లాభమని ఆర్జేడీ భావిస్తోంది. పైగా తన్వీర్ ముస్లిం కావడం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తోంది. కన్నయ్యకు మద్దతుగా గెలిపించేందుకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా, కె నారాయణ, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దంఢులు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాగొంతుకను గెలిపించాలని కోరారు.
షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్, స్వరభాస్కర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కన్నయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా స్వయంగా బెగుసరాయ్‌లో ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని గిరిరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరఫున ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి కన్నయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల ఘర్షణలకు కూడా ప్రయత్నించారు. నితీశ్ కుమార్ నేత త్వంలోని జేడీ(యూ) మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు తన్వీర్ హసన్ స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో తామే గెలుస్తామని ఆర్జేడీ అంచనాలు వేసుకుంటోంది.
మొత్తం ఓటర్లు 17.78 లక్షలు
పురుషులు 9.49 లక్షలు
మహిళలు 8.28 లక్షలు