Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.