Tags

, , , , , ,

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.