Tags

, , , ,

Image result for iran us war

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా ? అలాంటి వున్మాదిని అక్కడి పాలకవర్గం ఎందుకు అనుమతిస్తోంది? ప్రపంచాన్ని ఎటు వైపు తీసుకుపోతున్నారు? గత వారం పదిరోజులుగా పరిణామాలను చూస్తున్న సామాన్యులకు సైతం ఎదురవుతున్న ప్రశ్నలు.అమెరికా ప్రస్తుతం ఒక కొత్త యుద్ధాన్ని ప్రారంభించి మరొక రెండింటిని తీవ్రతరం చేస్తోంది. ఇరాన్‌ తీరానికి మరో యుద్ద నౌకను పంపుతోంది. అది సముద్రంలోనూ అవసరమైతే భూమ్మీదకు వచ్చి దాడి చేయగలదు. మరో వైపు గుర్తుతెలియని వారు తమ రెండు చమురు టాంకర్లపై దాడి చేసి నష్టం కలిగించారని సౌదీ అరేబియా ఆరోపించింది. చమురు పైప్‌లైన్లపై కూడా దాడి జరిగిందని రెండో రోజు ప్రకటించింది. చైనా నుంచి చేసుకొనే 200 బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతులపై 25శాతం వరకు పన్ను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా కూడా 60బిలియన్‌ డాలర్ల అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు విధించింది. ఇది ఏడాది క్రితం ప్రారంభించినదాని కొనసాగింపు. ఇరాన్‌ తీరానికి అమెరికా యుద్దనౌకలను పంపటం, అవసరమైతే లక్షా ఇరవై వేల మంది సైనికులను ఆ ప్రాంతానికి తరలించేందుకు పెంటగన్‌ పధకాలను సిద్ధం చేసినట్లు వార్తలను వ్యాపింప చేయటం మానసిక యుద్ధాన్ని ప్రారంభించటమే. మరోవైపు ఇరాన్‌ నుంచి తమకు, తమ అనుయాయులకు ముప్పువుందని అమెరికా చెబుతుంటే అందుకు నిదర్శనం అంటూ సౌదీ అరేబియా తమ నౌకలపై దాడి జరిగిందని ఆరోపించింది. ఎవరు చేశారో చెప్పకపోయినా అది ఇరాన్‌వైపే సంకేతాలిచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. ఇది గత ప్రచార యుద్ద కొనసాగింపు.

ట్రంప్‌ యంత్రాంగం యుద్దోన్మాద ప్రేలాపనలు చేస్తుంటే కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని బ్రిటన్‌ గాలి తీసింది. మంగళవారం నాడు పెంటగన్‌ వద్ద బ్రిటీష్‌ సీనియర్‌ మిలిటరీ అధికారి మేజర్‌ జనరల్‌ క్రిస్‌ ఘికా విలేకర్లతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు అసాధారణం, బ్రిటన్‌ ఆలోచనా తీరుకు ప్రతిబింబం. అమెరికా యుద్ధానికి దిగేందుకు సిద్దమౌతున్న తరుణంలో దాని మిత్రపక్షానికి చెందిన ఒక వున్నతాధికారి ఇలా మాట్లాడటం చిన్న విషయమేమీ కాదు. అయితే అంతిమంగా బ్రిటన్‌ ఏం చేస్తుందనేది వేరే విషయం. ఘికా మాట్లాడిన కొద్ది సేపటికే అమెరికా మిలిటరీ కమాండ్‌ ఒక ప్రకటన చేస్తూ అమెరికా, దాని మిత్రపక్షాల వద్ద వున్న విశ్వసనీయమైన ముప్పుకు సంబంధించి వున్న సమాచారానికి విరుద్ధంగా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సేనలకు డిప్యూటీ కమాండర్‌ కూడా అయిన బ్రిటీష్‌ అధికారి చెప్పారని ప్రకటించటం కూడా అసాధారణ అంశమే. ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడుతుందా లేదా అన్నది ఒక అంశమైతే, అందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్ధం చేస్తోందన్నది స్పష్టం. చరిత్రలో జరిగిన అనేక యుద్దాలు సాకులు, చిన్న చిన్న కారణాలతోనే ప్రారంభమయ్యాయి. వీటిలో అమెరికాదే అగ్రస్ధానం.మచ్చుకు కొన్నింటిని నెమరు వేసుకుందాం.

వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ఫ్‌ వుదంతం

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలి, చైనాకు పక్కలో బల్లెంగా మారాలంటే అప్పటికే దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికన్లు వియత్నాంలో కూడా స్ధావరం ఏర్పాటు చేసుకోవాలని పధకం వేశారు.హోచిమిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదుల పోరాటానికి తోక ముడిచిన ఫ్రెంచి సామ్రాజ్యవాదలు వియత్నాం నుంచి వైదొలుగుతూ దేశాన్ని రెండు ముక్కలుగా చేశారు. పరిస్ధితులు బాగుపడిన తరువాత ఎన్నికలు జరిపి రెండింటినీ విలీనం చేయాలనేది జెనీవా ఒప్పంద సారం. అయితే సామ్రాజ్యవాదుల తొత్తులుగా వున్న దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్య తిరేకులు, మిలిటరీ విలీనానికి అడ్డుపడింది. ఈ పూర్వరంగంలో దక్షిణ వియత్నాంకు మద్దతుగా రంగంలోకి దిగేందుకు పొంచి వున్న అమెరికాకు ఎలాంటి అవకాశం దొరకలేదు. దాంతో టోంకిన్‌ గల్ఫ్‌లోని తమ యుద్ధ నౌకలపై వుత్తర వియత్నాం సేనలు దాడి చేశాయనే కట్టుకధలు అల్లి 1964లో అమెరికా వుత్తర వియత్నాంపై దాడులకు తెగబడింది. ఇప్పుడు సౌదీ అరేబియా తన నౌకల్లో ఎవరూ మరణించలేదని, చమురు సముద్రం పాలు కాలేదని అయితే నౌకలకు నష్టం జరిగిందని చెబుతున్నట్లుగానే టోంకిన్‌ గల్ఫ్‌లో కూడా వియత్నాం దాడిలో ఎవరూ మరణించలేదని, తమ నౌకకు చిన్న రంధ్రం మాత్రమే ఏర్పడినట్లు, ఇదే సమయంలో తాము మూడు వియత్నాం యుద్ద బోట్లను కూల్చివేశామని, నలుగురు సైనికులను మట్టుపెట్టామని అప్పుడు అమెరికా చెప్పుకుంది. అయితే అదంతా వియత్నాం మీద దాడికి అల్లిన కట్టుకధ అని తరువాత వెల్లడైంది. వియత్నాం మీద జరిపిన దుర్మార్గ దాడుల్లో అమెరికా ఎంత మారణకాండకు పాల్పడిందీ, చివరకు ఎలా తోకముడిచిందీ, రెండు వియత్నాంలు ఎలా ఒకటై కమ్యూనిస్టు దేశంగా మారిందీ చెప్పనవసరం లేదు.

పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి పేరుతో రెండవ ప్రపంచ యుద్దంలో అడుగు పెట్టిన అమెరికా

రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభంలో అమెరికా తటస్ధ దేశంగా ఫోజు పెట్టింది. రెండు పక్షాలకూ ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకుంది. అయితే యుద్దంలో నాజీలు ఓడిపోతున్నారనే అంచనాకు వచ్చిన అమెరికన్లు యుద్ధానంతరం తమ పలుకుబడిని విస్తరించాలనే కాంక్షతో ఎలాగైనా యుద్ధంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ పూర్వరంగంలో 1941 డిసెంబరు ఏడున అమెరికా పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ సేనలు దాడి చేశాయి. అమెరికన్లు ఆసియాలో జోక్యం చేసుకొనేందుకు పధకం వేశారని తెలిసిన తరువాత ముందస్తు ఎదురుదాడిలో భాగంగా ఇది జరిగినట్లు చెబుతారు. ఇదే సమయంలో జపాన్‌ అలాంటి దాడులకు పధకం వేసిందని అమెరికన్లకు ముందుగానే వుప్పందింది. అయినా దాడి జరిగిన తరువాత ఆ పేరుతో తాము యుద్ధానికి దిగాలన్నది వారి ఎత్తుగడగా తరువాత బయటపడింది.1941నవంబరు 30న హిలో(హవాయి) ట్రిబ్యూన్‌ హెరాల్డ్‌ అనే పత్రిక వారాంతంలో జపాన్‌ దాడి చేయవచ్చు అంటూ ఎనిమిది కాలాల పతాక శీర్షికతో వార్తను ప్రచురించింది. జపాన్‌ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా పూర్తి స్ధాయి యుద్దానికి దిగిందంటే అది అప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకుందన్నది స్పష్టం. దాడులు చేసే విధంగా జపాన్‌ను ప్రోత్సహించిదని కూడా కొందరు చెప్పారు. అది ఒక్క అమెరికాకే కాదు, బ్రిటీష్‌ వారికి కూడా తెలుసని తేలింది.యుద్దం చివరిలో జపాన్‌ దాదాపు లొంగిపోయి, పోరు ముగిసే సమయంలో అమెరికన్లు హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసి తమ దగ్గర ఎంతటి ప్రమాదకర ఆయుధాలున్నాయో చూడండి అంటూ ప్రపంచాన్ని బెదిరించారు. ఆ వుదంతం తరువాతే ప్రపంచంలో ఆయుధ పోటీ పెరిగిందన్నది తెలిసిందే.

రెండో ప్రపంచ యుద్ధానికి జర్మనీ సాకు

రెండవ ప్రపంచ యుద్దాన్ని 1939 సెప్టెంబరు ఒకటిన పోలాండ్‌పై దాడితో హిట్లర్‌ సైన్యం ప్రారంభించింది. అంతకు ముందు రోజు అందుకు అవసరమైన సాకును సృష్టించింది. ఆగస్టు 31న ఆరుగురు నాజీ సైనికులు పోలాండ్‌ ప్రతిఘటన యోధుల పేరుతో వేషాలు వేసుకొని ఒక పోలాండ్‌ రైతును పట్టుకొని అతకి మాదకద్రవ్యాలిచ్చి పోలాండ్‌ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గిలివైస్‌ అనే చోట ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలాండ్‌ యోధుల వేషాల్లో వున్న నాజీ సైనికులు స్టేషన్‌ ఇంజనీర్లను నిర్బంధించి రేడియోను స్వాధీనం చేసుకొని పోలిష్‌ భాష వచ్చిన ఒక సైనికుడు తాము జర్మన్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నామని, న్యూయార్క్‌ వర్ధిల్లాలి, జర్మనీపై కెనడా దాడి చేయనున్నది అంటూ మాట్లాడి జర్మన్లను రెచ్చగొట్టారు. తరువాత మాదకద్రవ్యాల మత్తులో వున్న రైతును రేడియో స్టేషన్‌ మెట్ల మీద పోలిష్‌ సైనిక యూనిఫాం వేసి కూర్చోబెట్టి నుదిటిపై కాల్చి వదలి వెళ్లారు. జర్మనీపై పోలాండ్‌ జరిపిన దాడికి చిహ్నంగా చూపారు. తరువాత జరిపిన మారణ హోమం ఏమిటో ప్రపంచానికి తెలిసిందే.

అబద్దాలతో యుద్దాన్ని ప్రారంభించిన బిస్మార్క్‌

జర్మన్లను ఐక్యం చేసిన ఘనుడిగా బిస్మార్క్‌ను చరిత్రకారులు రాశారు. జర్మనీని ఒక సామ్రాజ్యవాద శక్తిగా మార్చేందుకు అతగాడు అబద్దాలతో యుద్ధాన్ని ప్రారంభించిన విషయాన్ని కావాలనే విస్మరించారు. 1870లో ప్రష్యా ప్రధానిగా బిస్మార్క్‌ వున్నాడు. అప్పటికే ఫ్రాన్స్‌తో విబేధాలు వున్నాయి. ఈ పూర్వరంగంలో ఘర్షణలను నివారించేందుకు ఫ్రాన్సు ఒక టెలిగ్రామ్‌ను పంపింది, దానిని ప్రచురించి జనానికి తెలియచేయాలని కోరింది. అయితే బిస్మార్క్‌ దానిలోని కొన్ని అంశాలను పూర్తిగా మార్చి జర్మన్లను అవమానపరిచే విధంగా ఫ్రెంచి వారు రాశారంటూ దానిని ప్రచారం చేశాడు. అది జరిగిన వారం రోజులకే ఫ్రాన్స్‌ యుద్దం ప్రకటించింది. ఆ యుద్ధాల్లో అది ఓడిపోయింది. ప్రష్యాలో భాగంగా వున్న జర్మన్‌,ఇతర ప్రాంతాలను కలిపి జర్మనీగా ఏర్పాటు చేయటంలో బిస్మార్క్‌ కీలక పాత్ర వహించాడు. తరువాత అదే జర్మనీ మొదటి ప్రపంచ యుద్దానికి కారణమైంది. దానిలో ఓడిపోయి, అవమానకర షరతులతో రుద్దిన సంధిని అంగీకరించింది. ఆ సంధిని చూపి పోయిన జర్మనీ పరువు నిలబెట్టాలి, తిరిగి జర్మనీకి పూర్వప్రాభవం కల్పించాలనే పేరుతో హిట్లర్‌ రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Image result for iran us war

మన కళ్ల ముందే జరిగిన అనేక దాడులకు ఇలాంటి సాకులనే సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా అమెరికన్లు ప్రయోగించారు. ఇరాక్‌లో సద్దాం హుసేన్‌ పెద్ద మొత్తంలో మారణాయుధాలను పోగు పెట్టాడని ప్రచారం చేసి అమెరికా, దాని మిత్ర దేశాలు దాడులు చేసి సద్దాంను హతమార్చిన విషయం తెలిసిందే. మారణాయుధాలు లేవు మరొకటి లేదు. అలాగే లిబియాలో గడాఫీ మీద తప్పుడు ప్రచారం చేసి హతమార్చిన విషయమూ జగద్విదితమే.ఇప్పుడు ఇరాన్‌ మీద అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇరాన్‌తో ఇతర దేశాలతో కలసి చేసుకున్న అణుకార్యక్రమ నిలిపివేత ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయినప్పటికీ ఇరాన్‌ దానికి కట్టుబడే వుందని, ఎలాంటి వుల్లంఘనలు తమ దృష్టికి రాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ప్ర కటించింది. మిగతా భాగస్వాముల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయినా అమెరికా తప్పుడు ప్రచారం మానలేదు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ట్రంప్‌కు ఏదో ఒకటి అవసరం కనుక ఇరాన్‌ మీద కాలు దువ్వుతున్నాడన్నది ఒక అంచనా.

డోనాల్డ్‌ ట్రంప్‌ తన లబ్దికి చేసే పిచ్చిపనులకు అమెరికా పాలకవర్గం ఎందుకు మద్దతు ఇస్తోంది అన్నది కొందరి సందేహం. అమెరికా కార్పొరేట్లకు ఆయుధాల వ్యాపారం ఇప్పుడు అసలైన ఆదాయ వనరు. అందుకు గాను వారికి మార్కెట్‌ అవసరం. కొత్తగా రూపొందించిన మారణాయుధాలు ఎలా పని చేస్తాయో చూడాలంటే జనం మీద ప్రయోగించాలి, అందుకు గాను ఎక్కడో ఒక చోట యుద్ధాలు చేయాలి. రెండవది వివిధ దేశాల మధ్య తగాదాలు పెట్టాలి, లేదా ఫలానా దేశం నుంచి మీకు ముప్పు వుందంటూ పరస్పరం పురి ఎక్కించి రెండు దేశాలకూ ఆయుధాలను అమ్ముకోవాలి. ఇలాంటి పనులు చేసే వారే సదరు కార్పొరేట్లకు అమెరికా గద్దె మీద వుండాలి. సౌమ్యుడని పేరు తెచ్చుకున్న డెమోక్రాట్‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అయినా పిచ్చిపనులు చేస్తున్నాడని పేరు తెచ్చుకున్న ట్రంప్‌ అయినా ఆచరణలో అమలు జరిపింది ఒకే అజండా. చైనాతో వాణిజ్య యుద్దం అమెరికన్లకు హాని అనేకంటే అక్కడి వాణిజ్య సంస్ధల లాభాలకు గండికొట్టేది కనుక ఆ తరగతికి చెందిన కార్పొరేట్లు వాణిజ్య యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో వస్తూత్పత్తి చేసి తిరిగి తమ దేశానికే ఎగుమతి చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ విధించే పన్నులు వాటిమీద కూడా వుంటాయి. ఈ చర్య అమెరికా నుంచి ఎగుమతులను దెబ్బతీస్తుంది, వినియోగదారులపై భారాలు మోపుతుంది, కార్పొరేట్ల లాభాలను హరిస్తుంది. అందుకే ఇరాన్‌ మీద యుద్ధం అంటే ముందుకు నెట్టే వారు కొందరైతే వాణిజ్య యుద్దం అంటే వెనక్కు లాగేవారు మరి కొందరు. రెండు చర్యలూ కార్పొరేట్లకు అవసరమైనవే.

Image result for sabotage attacks an american alibi,Britain says no new Threat from iran

తాజా పరిణామాల్లో సౌదీ అరేబియా నౌకల మీద దాడి అనే వుదంతాన్ని సృష్టించారన్నది స్పష్టం. తమ మీద ఆంక్షలు మరింతగా విధించినా,మరొకటి చేసినా హార్ముజ్‌ జలసంధిలో చమురు నౌకల రవాణాను అడ్డుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ ప్రాంతానికి దాదాపు 140కిలోమీటర్ల దూరంలోని ఎమెన్‌ జలసంధిలో యుఏయి రేవు ఫుజైరాలో ఆదివారం నాడు నార్వేకు చెందిన ఒకటి, సౌదీ అరేబియాకు చెందిన రెండు నావల మీద ఇరాన్‌ పంపిన వారు దాడులు చేశారని, నౌకలకు పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే అవి నకిలీ వార్తలని తమ రేవుల్లో ఎలాంటి వుదంతం జరగలేదని యుఏయి వాటిని ఖండించింది. అయితే తరువాత అప్పుడప్పుడూ అలాంటివి జరుగుతుంటాయని, తరువాత నిజంగానే దాడులు జరిగాయని ప్రకటించింది.

Image result for iran us war

మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలకు ముప్పుగా ఇరాన్‌ తయారైందని, లెబనాన్‌, ఇరాక్‌, సిరియాలలో షియా మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నదని, ఎమెన్‌లో హుతీ తిరుగుబాటుదార్లకు క్షిపణులు అందిస్తున్నదని, పర్షియన్‌ గల్ఫ్‌లో యుద్ద విన్యాసాలకు తన నౌకాదళాన్ని అనుమతిస్తున్నదని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది. ఇవన్నీ కొత్తవేమీ కాదని, ఈ అంశాలన్నీ తమకు తెలిసినవేనని, వాటిని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నామని కొత్తగా పెరిగిన ముప్పేమీ లేదని బ్రిటీష్‌ అధికారి చెప్పారు. గతంలో ఇరాక్‌ విషయంలో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పేర్చారని తప్పుడు ఆరోపణలతో చేసిన యుద్ధం గురించి తెలిసిన ఐరోపా మిత్ర దేశాలు ఇప్పుడు ఇరాన్‌ విషయంలో చెబుతున్న అంశాలను తాపీగా తీసుకుంటున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధిపతి ఒక ప్రకటన చేస్తూ గరిష్ట సంయమనం పాటించాలని, వత్తిడిని పెంచాలని చెప్పారు తప్ప అమెరికాకు వంత పాడలేదు. ట్రంప్‌ సలహాదారు బోల్టన్‌, మైక్‌ పాంపియోలు ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని ఐరోపా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం విషయంలో అమెరికా చెబుతున్నదానికి విశ్వసనీయత లేదని మిగతా భాగస్వామ్య దేశాలన్నీ భావిస్తున్నాయి.అయితే వెలువడిన వార్తల ప్రకారం ఇరాన్‌ మీద దాడికి ఐరోపా యూనియన్‌ సుముఖంగా లేదన్న వాదన వినిపిస్తోంది. అందువలన అదే నిజమైతే వాటిని కాదని అమెరికా ముందుకు పోతుందా, ప్రచార దాడితో సరిపెడుతుందా అన్నది చూడాల్సి వుంది. ఆ జలసంధిలో అమెరికా యుద్ద నౌక ఇప్పటికే ప్రవేశించింది, ఈ నేపధ్యంలో ఇరాన్‌ తన ఆధీనంలో వున్న హార్ముజ్‌ జలసంధిని మూసివేయటం అంటే అమెరికాతో యుద్ధానికి సిద్దపడటమే. అది జరుగుతుందా, మూసివేసినా దాడులకు అమెరికా తెగిస్తుందా ? ఇప్పటికి వూహాజనిత ప్రశ్నలే.