Tags

, , , , , , ,

Image result for bad for India’s soul

ఎం కోటేశ్వరరావు

ఇది నేను చెబుతున్నది కాదు. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించటంపై బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ రాసిన సంపాదకీయ శీర్షిక. ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు అని వ్యాఖ్యానించింది.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు. అని పేర్కొన్నది. అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలన్నట్లుగా ఆ సంపాదకీయంలో మోడీ గురించి ఇంకా ఏం చెప్పారనేది మొత్తం ప్రస్తావించాల్సిన పని లేదు.

అధికారంలో పాతుకు పోయిన వున్నత వర్గం తమ గోడును పట్టించుకోవటం లేదనే అసంతృప్తితో వున్న సాధారణ జన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రంగంలోకి వచ్చే వారిని ప్రజాకర్షక రాజకీయవేత్తలు అంటున్నారు. అలాంటి వారి గురించి అమెరికాకు చెందిన ‘అట్లాంటిక్‌’ పత్రిక గతేడాది డిసెంబరు 26న ప్రజాకర్షక నేతలు ప్రజాస్వామ్యానికి ఏమి చేస్తారు అనే శీర్షికతో ఒక పరిశోధనా విశ్లేషణను ప్రచురించింది. ఇక్కడ ఒక స్పష్టత అవసరం. పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో వెనెజులా నేతలు హ్యూగో ఛావెజ్‌, నికోలస్‌ మదురో, బొలీవియా నేత ఇవో మొరేల్స్‌, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులను నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారినీ ఒకే గాటన కడుతున్నారు. ఫాసిస్టులు ఎంత ప్రమాదకారులో సోషలిస్టులు, కమ్యూనిస్టులూ అంతే ప్రమాదకారులనే తప్పుడు అవగాహన పర్యవసానం లేదా పని గట్టుకొని చేసే ప్రచారంలో భాగమిది. వెనెజులా, బలివీయాల్లో వున్న వామపక్ష, ప్రజాతంత్రశక్తుల ప్రభుత్వాలను కూల్చేందుకు ట్రంప్‌ వంటి సామ్రాజ్యవాదులు నిరంతరం కుట్రలు చేస్తున్నారు. దానికి వంత పాడుతూ వెనెజులా నుంచి చమురును కొనుగోలు చేయరాదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. అందరూ జనాకర్షక నేతలే అయితే వారిలో కొందరు తోటి వారిని కూల్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు? పెట్టుబడిదారీ వర్గాన్ని కూల్చివేసేందుకు ఛావెజ్‌, మదురో, ఇవో మొరేల్స్‌ చర్యలు తీసుకోకపోయినా, వారికి సహకరించటం లేదు. అందుకే ఆ వర్గ ప్రతినిధులైన ట్రంప్‌, మోడీ వంటి వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి ప్రజాకర్షక నేతలు చేస్తున్నదేమిటి అన్న అట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణను చూద్దాం.తమ పరిశోధనలో తేలినదాని ప్రకారం ప్రజాకర్షక ప్రభుత్వాలు అవినీతిని మరింతగా పెంచుతాయి, వ్యక్తిగత హక్కులను హరిస్తాయి, ప్రజాస్వామిక వ్యవస్ధలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నరేంద్రమోడీతో సహా ప్రజాకర్షక నినాదాలు, ఆచరణ గురించి 66 ప్రముఖ పత్రికల్లో చోటు చేసుకున్న వ్యాసాలు, విశ్లేషణలను ఆ పత్రిక పరిశోధించింది. వాటి నుంచి 1990 నుంచి 2018 వరకు 33దేశాలకు చెందిన 46 మంది అధికార నేతలను ఎంచుకొని వారి తీరు తెన్నులను విశ్లేషించి పైన పేర్కొన్న సారాన్ని తన పాఠకులకు అందచేసింది. అట్లాంటిక్‌ పత్రిక సర్వేలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది.

పరిశోధన ఫలితాలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఎంతో నైపుణ్యంతో అధికారంలో కొనసాగారు, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర ముప్పుగా మారారు. సగటున సాధారణ ప్రజాస్వామిక ప్రభుత్వాలు స్వల్ప కాలం మూడు సంవత్సరాలు కొనసాగాయి. కొన్ని తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత ఆరు సంవత్సరాలు వున్నాయి. ఐదింట నాలుగు ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయి. అదే ప్రజాకర్షక ప్రభుత్వాలు దీర్ఘకాలం అధికారంలో వుండేట్లు నడపగలిగాయి. సగటున అవి ఆరున్నర సంవత్సరాలు లేదా ప్రజాకర్షకులు కాని వారి ప్రత్యర్ధుల కంటే రెట్టింపు కాలం వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఒకటి రెండు సార్లు ఎన్నిక అవటం కాదు, దశాబ్దకాలానికి పైగా అధికారంలో వుంటారు. వారు దీర్ఘకాలం అధికారంలో వున్నారంటే అది వారి పలుకుబడి, సామర్ధ్యాలను సూచిస్తుంది. 1990-2015 మధ్య కాలంలో అధికారానికి వచ్చిన నేతలను చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే సాధారణ ప్రజాస్వామిక ప్రక్రియలో అధికారానికి దూరమయ్యారు. కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. మరో 17శాతం మంది తమ పదవీ వ్యవధులు పూర్తి అయిన కారణంగా అధికారం నుంచి వైదొలిగారు. అయితే 23శాతం మంది నాటకీయ పరిణామాలు అంటే అభిశంసన లేదా బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చి వైదొలిగారు. సర్వేకు ఎంచుకున్న ప్రజాకర్షక నేతల్లో 30శాతం ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు. వారిలో 36శాతం మంది గత ఐదు సంవత్సరాలుగా పదవుల్లో వున్నారు. ప్రజాకర్షక నేతలు ఎంత ఎక్కువ కాలం పదవిలో వుంటే అంత ఎక్కువ ఆందోళన తలెత్తుతోంది. సగం మంది తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో వున్నారు.

ప్రజాకర్షక నేతలు ఎంత కాలం అధికారంలో వున్నారు, అంతిమంగా వారు పదవులను ఎలా వదులుకున్నారు అనేదానికంటే ముఖ్యమైన అంశం అధికారంతో వారేమి చేశారు అన్నది. వారి పదవీకాలంలో రాజకీయ శాస్త్రవేత్తలు వర్ణించినట్లుగా ‘ ప్రజాస్వామ్యం తప్పుదారి పట్టడం ‘ పౌరులు అనుభవిస్తున్న మౌలిక హక్కులు దిగజారటానికి వారి పదవీ కాలం కారణం అవుతున్నది. అనేక దేశాలలో వీరు తమకు అనుకూలంగా ఆట నిబంధనలను శాశ్వతంగా తిరిగి రాసుకున్నారు. సగం మంది నేతలు తమ దేశ రాజ్యాంగాలను తిరిగి రాసుకోవటం లేదా సవరించుకున్నారు. ఇన్ని దఫాలు మాత్రమే అధ్యక్షపదవిలో వుండాలి అనే నిబంధనలను ఎత్తివేయటం, కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించే, సరి చూసే అంశాలను నామమాత్రం చేయటం వంటి పనులు చేశారు. మీడియా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ,రాజకీయ హక్కుల వంటి ప్రజాస్వామిక మౌలిక హక్కులకు సంబంధించి ఈ దేశాలన్నింటా తరతమ తేడాలువున్నప్పటికీ అవన్నీ దిగజారాయి. మీడియా స్వేచ్చ ఏడుశాతం, పౌరహక్కులు ఎనిమిదిశాతం, రాజకీయ హక్కులు 13శాతం పడిపోయాయి. ఇతర పాలకులతో పోల్చితే ప్రజాకర్షక పాలకుల పాలనలో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రజాస్వామ్యం తప్పుదారి పడుతున్నది.

మితవాద ప్రజాకర్షక నేతల పాలనలో మైనారిటీలను బాధించటం, చట్టబద్దంగాని లక్ష్యాల కోసం ప్రజాగ్రహాన్ని ఆయుధంగా మార్చటం వంటి చర్యలకు పాల్పడతారు. వీరు తరచుగా అవినీతి వేళ్లను పెకలించి వేస్తామనే నినాదాలతో ఎన్నిక అవుతుంటారు. బ్రెజిల్‌లో బోల్‌సోనారో, అమెరికాలో డోనాల్డ్‌ట్రంప్‌ అదే నినాదాలతో అధికారానికి వచ్చారు. ఇటలీలో నార్తరన్‌ లీగ్‌ అనే పచ్చిమితవాద పార్టీ అవినీతి వ్యతిరేకనినాదాలతోనే జనాన్ని సమీకరిస్తోంది.( మన దేశంలో నరేంద్రమోడీ తొలిసారి నల్లధనం వెలికితీత, కాంగ్రెస్‌ పాలనలో అవినీతి గురించి పెద్ద నినాదాలతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వాటి వూసే లేదు.) వీరు అధికారానికి వచ్చిన తరువాత అవినీతిని అరికట్టకపోగా ప్రధాన స్రవంతిలోని మొసళ్ల వంటి వారి స్ధానంలో వారికి చెందిన అంతకంటే ప్రమాదకరమైన వారిని ముందుకు తెస్తారు. వీరు స్వతంత్ర దర్యాప్తు సంస్ధలను పని చేయనివ్వరు, అందువలన వారి దుష్కృత్యాలు పెద్దగా బయటకు రావు. అయినప్పటికీ 40శాతం మంది ప్రభుత్వాధినేతలు అంతిమంగా అవినీతి కేసులలో విచారణకు గురి అయ్యారు. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం, అంతకు ముందున్నవారి మీద తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తప్పుదారి పట్టిన ప్రజాస్వామ్యాలను సరైనదారిలో పెడతారు అనే భ్రమలు కలిగిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా చేస్తారని దొరికిన సాక్ష్యాలు వెల్లడించాయి. అవినీతి పెరగటం, వ్యక్తిగత హక్కులు హరించుకుపోవటం, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర నష్టం కలిగిస్తారని తేలింది.

అట్లాంటిక్‌ పత్రిక నరేంద్రమోడీకి వ్యతిరేకమైనది కాదు, అమెరికాలో వున్న ఇతర బడా పత్రికలతో పోలిస్తే చాలా చిన్నది. అది చేసిన పరిశోధన ప్రజాకర్షక నేతల సాధారణ లక్షణాలను ఎంతో స్పష్టంగా వెల్లడించింది. దీన్ని గీటురాయిగా పెట్టుకొని మోడీని రాజకీయంగా వ్యతిరేకించేవారు గానీ, మద్దతు ఇచ్చేవారు గానీ పోల్చుకుంటే రాగల పర్యవసానాల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ పత్రిక విశ్లేషణలో బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడు, మాజీ సైనిక కెప్టెన్‌ అయిన జైర్‌ బోల్‌సోనారో ఎన్నికై జనవరి ఒకటిన అధికారాన్ని చేపట్టక ముందే క్లుప్తంగా ప్రస్తావించింది. అక్టోబరులో ఆయన ఎన్నికైనపుడు పర్యవసానాల గురించి సాంప్రదాయ రాజకీయ పెద్దలు, వ్యాఖ్యాతలు భిన్న వైఖరులు తీసుకున్నారు. బ్రెజిల్‌ను 1964-1985 మధ్య పాలించిన మిలిటరీ నియంతల పాలనను ఆయన ప్రశంసించటం ప్రజాస్వామిక వ్యవస్ధకు తీవ్రమైన ముప్పును సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని మీడియా, స్వతంత్ర న్యాయవ్యవస్ధ, ఇతర బలమైన ప్రజాస్వామిక వ్యవస్ధలు, సంస్ధలు నియంతృత్వపోకడలను అడ్డుకుంటాయని మరికొందరు పేర్కొన్నారు. అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్న ప్రపంచంలోని నలుగురు పెద్ద ప్రజాకర్షక నేతల్లో బోల్‌సొనారోతో పాటు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వున్నారు.

అనేక అక్రమాలకు పాల్పడి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో ఐదు నెలలు గడవక ముందే అభిశంసనకు గురవుతారా లేక మరొక పద్దతుల్లో తప్పించే చర్య వుంటుందా అనే విధంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మేనెల ప్రారంభంలో మిలిటరీలో మాజీలైన కాబినెట్‌ మంత్రులు బోల్‌సోనారో దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇచ్చే మితవాద శక్తులను రంగంలోకి దించకపోతే ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దాని పర్యవసానంగా ఐదునెలల్లోనే గబ్బు పట్టిన అధ్యక్షుడికి మద్దతుగా వీధుల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. జనవరి నుంచి సామాజిక మాధ్యమాల్లో అధ్యక్షుడి అనుకూల మరుగుజ్జులు లేదా పోకిరీలు(ట్రోల్స్‌),ముగ్గురు కుమారులు అందరూ రెచ్చిపోతున్నారు. మంత్రివర్గంలో మూడో వంతు మంది మాజీ సైనికాధికారులే వున్నారు.ఆర్ధిక వ్యవస్ధతో సహా అన్ని రంగాలలో అస్తవ్యస్ధ పరిస్థితి ఏర్పడింది. విద్యారంగంలో కోతలకు వ్యతిరేకంగా లక్షలాది మంది గతవారంలో వీధుల్లోకి రాగా దానికి పోటీగా అధ్యక్షుడికి మద్దతు అంటూ బ్రెజిలియన్‌ మిలిటరీ క్లబ్‌ ఆదివారం నాడు(26న) ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చింది.

Image result for bad for India’s soul

బ్రెజిల్‌లోని వామపక్ష దిల్మారౌసెఫ్‌ మంత్రివర్గం మీద అభిశంసన ప్రక్రియతో ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మాజీ అధక్షుడు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో వాగ్దానాలతో, ఆశలు కల్పించి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో అక్కడి ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దలేక సంక్షేమ పధకాలకు, పెన్షన్లకు కోత పెడుతూ, జనం మీద భారాలు మోపుతూ ఐదునెలలకే గబ్బుపట్టిన స్ధితి. గద్దెనెక్కించిన వారే దింపేందుకు లేదా పక్కన పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు. ఆయన కుమారులే పెద్ద అవినీతి పరులుగా తేలింది. అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను కప్పిపుచ్చి జనాన్ని పక్కదోవ పట్టించేందుకు ఒక బూతు వీడియోను స్వయంగా సామాజిక మాధ్యమంలోకి వదిలి దేశంలో క్షీణ సంస్కృతి ఎలా తయారైందో చూడాలంటూ జనాన్ని కోరాడు. బ్రెజిల్‌లో వున్న చట్టాల ప్రకారం 50సంవత్సరాలు దాటిన వారు వుద్యోగాల నుంచి రిటైరై పెన్షన్‌ తీసుకోవచ్చు. ఆ సౌకర్యాన్ని రద్దు చేసి వుద్యోగ విరమణ వయస్సును పెంచేందుకు చేసిన యత్నాలతో మద్దతుదార్లలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. పచ్చిమితవాదులైన వారు పార్లమెంట్‌, సుప్రీం కోర్టులను రద్దు చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఆదివారం నాటి ప్రదర్శనల్లో అది కూడా ఒక డిమాండని వార్తలు వచ్చాయి. అలాంటి డిమాండ్‌ సరికాదని చివరకు అధ్యక్షుడే చెప్పాల్సి వచ్చింది.

ప్రజాకర్షక నినాదాలతో ముందుకు వచ్చే మితవాత శక్తుల పట్ల జనానికి ఎలా భ్రమలు వుంటాయో బ్రెజిల్‌ అనుభవం మన కళ్ల ముందే వుంది. వారు విఫలమైతే వ్యతిరేకత ఎలా వుంటుందో రాబోయే రోజుల్లో చూస్తున్నాము. అందువలన మితవాదశక్తులు బలపడ్డాయని, అధికారానికి వచ్చాయని గుండెలు బాదుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. వారి మీద జనానికి భ్రమలు తొలిగే రోజులు కూడా వుంటాయి. ఒకసారి జనం పొరపాటు పడినా, తప్పు చేసినా వారిని నిందించి ప్రయోజనం లేదు. వారితో వుంటూనే వారి విశ్వాసం పొందేవరకు వారి సమస్యల మీద నిరంతరం పని చేయటం, అనువైన పరిస్ధితులు ఏర్పడే వరకు ఎదురు చూడటం తప్ప ప్రజావ్యతిరేక శక్తులను ఓడించేందుకు మరొక దగ్గరదారి లేదు.