Tags
Brexit Party, Europe Far-Right, european parliamentary elections 2019, european parliamentary elections 2019 verdict, European Union, Far-right populists, Le Pen’s National Rally, Salvini’s Lega party, The Greens
ఎం కోటేశ్వరరావు
ఆదివారం నాటితో ముగిసిన మూడు రోజుల ఐరోపా యూనియన్ తొమ్మిదవ పార్లమెంట్ ఎన్నికలు సంస్ధ భవిష్యత్‌ను సంక్లిష్టగావించాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టమైంది. పర్యావరణ పరిరక్షణ కోరే గ్రీన్స్ పార్టీలు, తీవ్ర మితవాద పార్టీలు గతం కంటే బలం పుంజుకున్నాయి, నాలుగు దశాబ్దాల తరువాత సాంప్రదాయ మధ్యేవాద, వామపక్ష పార్టీలు మెజారిటీని కోల్పోయాయి. ఫలితాలు ఐరోపా సమాజంలో జరుగుతున్న మధనానికి అద్దం పట్టాయి. ఇటీవలి సంవత్సరాల పర్యవసానాల పలితాలు ఇవి. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి 50శాతం పైగా ఓట్లు పోలు కావటం ఒక విశేషం అయితే కొన్ని చోట్ల పోలింగ్ తగ్గటం జనంలో వున్న నిర్లిప్తతను, కొన్ని చోట్ల పెరగటం గ్రీన్స్, పచ్చి మితవాదులకు మద్దతుగా ఓటర్లు ముందుకు వచ్చినట్లు కూడా వెల్లడించింది. మితవాద శక్తులు మొత్తం మీద బలం పెంచుకున్నప్పటికీ వూహించినంతగా విజయం సాధించకపోవటమే ఒక వూరటగా కొందరి విశ్లేషణ వుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో 20శాతంగా వున్న బలాన్ని ఇప్పుడు 25శాతానికి పెంచుకున్నారు. అదే విధంగా గ్రీన్స్ విజయాన్ని కూడా వూహించలేదు. అన్ని దేశాల్లో ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద ఐరోపా రాజకీయ రంగంలో వారొక శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలని కోరుకొనే వారి సంఖ్య మరింత పెరిగే ధోరణులు వ్యక్తమయ్యాయి. గ్రీన్స్‌తో పాటు ఇటీవలి కాలంలో స్ధిరోష్ణ పేటిక(ఇంకుబేటర్)లో వున్న జాతీయవాద పార్టీలు ఇప్పుడు యుద్ధ భూమిలో చురుకుగా వున్నట్లుగా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. వీటన్నింటికీ మితవాదం, జాతీయ వాద లక్షణాలలో సారూప్యత వున్నప్పటికీ విడివిడిగా చూస్తే వాటి మధ్య వైరుధ్యం వుంటుంది. ఎవరికి వారు తమ దేశప్రయోజనాలే ముఖ్యం అనుకున్నపుడు వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం. ప్రస్తుతం వున్న వాటిని కూల్చివేయాలనటంలో వున్న ఏకీభావం వాటి స్ధానంలో వేటిని నిర్మించాలనటంలో వుండదు.
1979లో ఐరోపా యూనియన్ పార్లమెంట్ వునికిలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 28దేశాలకు చెందిన 51.2 కోట్ల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించే 751 మంది ఎంపీలను ఎన్నుకొనే ప్రక్రియ మే 23 నుంచి 26వరకు జరిగింది. యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించటంతో స్ధానాల సంఖ్యను 751 నుంచి 705కు తగ్గించారు. అయితే ఈ ఏడాది అక్టోబరు వరకు బ్రిటన్ సభ్యత్వాన్ని పొడిగించిన కారణంగా అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి.( అధికారిక ఎన్నికల ఫలితాల వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ఈ సమీక్ష కొన్ని పరిమితులకు లోబడి వుంటుందని పాఠకులు గమనించమనవి.) ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లలో మితవాద శక్తులు అతి పెద్ద పార్టీలుగా ముందుకు రాగా మరికొన్ని చోట్ల కూడా గణనీయమైన విజయాలు సాధించాయి.
గ్రీన్స్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో 51 సీట్లు తెచ్చుకోవగా ఇప్పుడు 70కి పెరిగాయి. జర్మనీలో మధ్యేవాద వామపక్షంగా వర్ణితమయ్యే సోషల్ డెమోక్రటిక్ పార్టీని వెనక్కు కొట్టి రెండవ పెద్ద పార్టీగా గ్రీన్స్ అవతరించారు. ఫిన్లాండ్‌లో 16శాతం, ఫ్రాన్స్‌లో 13, బ్రిటన్‌లో 12శాతం చొప్పున తెచ్చుకున్నారు. వీరు వలసలకు, ఐరోపా యూనియన్ ఐక్యతకు అనుకూలురు. అయితే పర్యావరణం పేరుతో వీరు తీసుకొనే కొన్ని వైఖరులతో అటు మితవాదులకు, ఇటు వుదారవాదులకు కూడా కొన్ని విబేధాలు వున్నాయి.
ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతుందా లేదా, అదే జరిగితే ఎలా అనే విషయాలను పక్కన పెడదాం. అక్టోబరు వరకు సాంకేతికంగా అది యూనియన్ సభ్యురాలిగా వుంటుంది. తరువాత విడిపోతే ఈ ఎన్నికలు వృధా ప్రయాస. అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఈ ఎన్నికలు బ్రిటన్ రాజకీయ రూపు రేఖలను మార్చివేసేవిధంగా సాంప్రదాయ కన్సర్వేటివ్, లేబర్ పార్టీలకు పోటీగా మరొక పార్టీ ముందుకు వచ్చింది. మూడు నెలల క్రితం పెట్టిన బ్రెక్సిట్(ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలని కోరుకొనే ) పార్టీ 32శాతం ఓట్లతో బ్రిటన్‌లోని 73 సీట్లకు గాను 29 పొందింది. ఒక్క లండన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ పార్టీ ప్రాతినిధ్యం సంపాదించింది.1834తరువాత కన్సర్వేటివ్ పార్టీ అత్యంత దయనీయ స్ధితిలో తొమ్మిదిశాతం ఓట్లతో ఐదవ స్ధానంలో మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో దీనికి 24శాతం వచ్చాయి. ఈ పార్టీ మద్దతుదారులు అత్యధికులు బ్రెక్సిట్ పార్టీకి ఓటు చేశారు. ఐరోపా యూనియన్ అనుకూల లిబరల్ డెమోక్రాట్లు గతం కంటే బలం పుంజుకొని 20శాతం ఓట్లతో రెండవ స్ధానంలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ 14శాతం, గ్రీన్స్ పార్టీ 11, యుకెఐపి నాలుగుశాతంలోపు ఓట్లతో చివరి స్ధానంలో వుంది.గత యూరో పార్లమెంట్ ఎన్నికలలో 24సీట్లు తెచ్చుకున్న యుకెఐపి పార్టీ ఇప్పుడు ఒక స్ధానానికి పరిమితం అయింది. ఈ పార్టీ నేత నైగెల్ ఫారజే దాన్నుంచి విడిపోయి బ్రెక్సిట్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పూర్వరంగంలో జూన్ ఏడున కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని థెరెసా మే ఫలితాలు రాక ముందే రాజీనామాకు నిర్ణయించుకున్నారు. ఈ ఓటింగ్ తీరుతెన్నులు చూసిన తరువాత ఆమె స్ధానంలో వచ్చేవారు ఎవరు? అసలేమీ జరగనుంది అనేది చూడాల్సి వుంది.
ఫ్రాన్స్‌లో పచ్చి మితవాది మారినే లీపెన్ నాయకత్వంలోని నేషనల్ ర్యాలీ పార్టీ (ఆర్‌ఎన్) 23.3శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో నిలిచింది. అయితే గత ఎన్నికలలో ఈ పార్టీకి 24.9శాతం వచ్చాయి. అధ్యక్షుడు మక్రాన్ పార్టీకి తాజా ఎన్నికలలో 22.4శాతం వచ్చాయి. గ్రీన్ పార్టీకి 13.4శాతం వచ్చాయి. మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ నాయకత్వంలోని రిపబ్లికన్స్ పార్టీకి 8.4, సోషలిస్టు పార్టీకి 6.3శాతం ఓట్లు వచ్చాయి. గత కొద్ది నెలలుగా ప్రతివారాంతంలో ఆందోళనలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పసుపు చొక్కాల పార్టీకి కేవలం 0.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి కంటే ఎక్కువగా జంతు ప్రేమికుల పార్టీకి 2.17శాతం వచ్చాయి. ఫ్రాన్స్‌లో మొత్తం 34 పార్టీలు పోటీ చేశాయి.
ఇటలీలోని అధికార మితవాద లీగ్ పార్టీ 34.3శాతం ఓట్లతో 28సీట్లతో ప్రధమ స్ధానంలో వుంది. ఎగ్జిట్ పోల్స్ 27-31శాతం మధ్య వస్తాయని పేర్కొన్నవాటి కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష లెఫ్ట్ డెమోక్రాట్స్ 22.7శాతం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ఫైవ్ స్టార్ పార్టీ(ఎం5ఎస్) 17.1శాతం ఓట్లు తెచ్చుకుంది.మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఫోర్జా ఇటాలియాకు 8.8శాతం, ఇటలీ బ్రదర్స్ పార్టీకి 6.5శాతం వచ్చాయి. కనీసం నాలుగుశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీలకే ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక్కడ మరో పార్టీ ఆమేరకు ఓట్లు సంపాదించలేదు. ఇటలీ పార్లమెంట్ ఎన్నికలలో ఏడాది క్రితం 32శాతం ఓట్లు తెచ్చుకున్న ఫైవ్ స్టార్ పార్టీ ఓట్లు ఈ ఎన్నికలలో 17శాతానికి పడిపోయాయి. మరోవైపు సాల్వినీ నాయకత్వంలోని లీగ్ పార్టీ బలం 17 నుంచి 34శాతానికి పెంచుకుంది. దీంతో సాల్వినీ ప్రధాన పదవిని డిమాండ్ చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి.
ఇటీవలి కాలంలో జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) పేరుతో ముందుకు వచ్చిన పచ్చి మితవాద శక్తులు తాజా ఎన్నికల్లో కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద బలాన్ని నిలుపుకున్నాయి. పూర్వపు తూర్పు జర్మనీలో ఇది బలమైన పార్టీగా ముందుకు వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 13శాతం తెచ్చుకున్న ఈ పార్టీ ఇప్పుడు 11శాతానికి పరిమితమైంది. ఐరోపా మితవాత శక్తుల్లో బలాన్ని కోల్పోయిన పార్టీ ఇదొక్కటే కనిపిస్తోంది. తూర్పు జర్మనీలోని రెండు రాష్ట్రాలలో రెండు పార్టీల మధ్య తేడా రెండుశాతమే అయినప్పటికీ అధికార ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాట్స్(సిడియు)ను రెండవ స్ధానంలోకి నెట్టి ఎఎఫ్‌డి ప్రధమ స్దానంలో వచ్చింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మొత్తం మీద సిడియు 29శాతంతో ముందుండగా తరువాత గ్రీన్స్ పార్టీ 20.5శాతం ఓట్లతో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ(ఎస్‌పిడి) 16శాతం ఓట్లతో మూడవ స్ధానంలో వుంది. పట్టణాలలోని యువత గ్రీన్స్ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపించింది.
ఎన్నికలు ఐరోపా పార్లమెంట్‌కు అయినప్పటికీ సభ్య దేశాలలో పోటీలు మాత్రం స్ధానిక ప్రాతిపదికగానే జరిగాయి. ఎలాంటి వుమ్మడి ఎన్నికల ప్రణాళికలు, వాగ్దానాలు లేవు. బ్రిటన్‌లో బ్రెక్సిట్( ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలా లేదా ) అనే ప్రాతిపదిక మీద జరిగాయి. ఫ్రాన్స్‌లో గత అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడిన ప్రత్యర్ధి పార్టీలు మరోసారి తమ బలనిరూపణ ప్రాతిపదికనే తలపడ్డాయి. స్పెయిన్‌లో కొద్ది వారాల ముందు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో గణనీయ విజయాలు సాధించిన సోషలిస్టు వర్కర్స్ పార్టీ తన బలాన్ని పటిష్ట పరచుకొనేందుకే ప్రయత్నించింది. ఇటలీలో మితవాద లీగ్ పార్టీ ఏడాది క్రితం సాధించిన ఓట్లను మెరుగుపరచుకొవటం మీదే కేంద్రీకరించింది.
ఐరోపా యూనియన్లోని నాలుగు ప్రధాన దేశాల వివరాలను చూసిన తరువాత . మొత్తం మీద ఐరోపా అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా మరింత స్పష్టంగా వేరుబడటం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణులు మరింతగా తీవ్రం కానున్నాయని చెప్పవచ్చు. కార్మికవర్గంలో అసంతృప్తికి అన్ని దేశాలలో ఒకే కారణం కానప్పటికీ మొత్తం మీద పెరుగుతోంది. ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎప్పుడు ఏది జనాకర్షక నినాదంతో ముందుకు వస్తే దాని వెనుక సమీకృతం అవుతున్నారన్నది ఇటలీ ఓటింగ్ తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. పచ్చిమితవాదులు బలంపుంజుకోకపోయినా సాంప్రదాయ పార్టీలు బలహీనం కావటం ఫ్రెంచి పరిణామం సూచించింది.జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్ ఐరోపా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే వలస కార్మికుల సమస్య ఐరోపాను ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టం.
ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు, వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, అధికారం కోసమే పని చేసినా మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు, మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్ చెప్పారు. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని అవమానిస్తారు.
ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్ డెమోక్రసీ తరుగుతోంది. నాజీ హిట్లర్ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్ కార్పొరేట్ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ నిర్ణయం.
ఓటింగ్ తీరుతెన్నులను చూసినపుడు మొత్తం మీద మెజారిటీ జనం ఐరోపా యూనియన్ ఐక్యతకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పవచ్చు. అనేక దేశాలలో విడిపోవాలనే వారు క్రమంగా పెరుగుతుండటం కనిపిస్తోంది. ప్రపంచీకరణ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే శక్తులు దాన్ని వ్యతిరేకించటం ఒకటైతే అంతకంటే ప్రమాదకరమైన వైఖరి జాతీయ వాదంవైపు మొగ్గటం. జనంలో మార్పు కావాలనే వాంఛ కనిపిస్తున్నది, అయితే అది ఎటుంవంటిది అన్న విషయంలో స్పష్టత లేదు. ఏ నేత లేదా పార్టీ నినాదం ఆకర్షణీయంగా వుంటే దాని వెంట సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ బూర్జువాపార్టీలు, వామపక్ష శక్తులను జనం పక్కన పెడుతున్నారు. జనాకర్షక, జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. 2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తిన నాటి నుంచి ఐరోపాలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవటం లేదు. కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి, పాత పార్టీలను వెనక్కు నెడుతున్నాయి. తాజాగా ఎన్నికలకు ముందు మద్యేవాద మితవాద, పురోగామి సోషలిస్టులు, డెమోక్రాట్లు పార్లమెంట్‌లో 54శాతం మంది వుంటే ఇప్పుడు వారి సంఖ్య 43శాతానికి పడిపోయిందని కొన్ని విశ్లేషణలు వెల్లడించాయి. ఈ మేరకు పచ్చి మితవాదులు, గ్రీన్స్ పెరిగారు. ధనిక దేశాల ఆర్ధిక సమస్యలు, మాంద్యానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోగా మరో తీవ్ర మాంద్యం పొంచి వుందనే హెచ్చరికల నడుమ వున్నాం. అందువలన ఐరోపాలో లేదా మరొక చోట భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ, నాటకీయ పరిణామాలు జరుగుతాయో జోశ్యం చెప్పలేము.