Tags

, , , , ,

Image result for chandrababu naidu debacle

ఎం కోటేశ్వరరావు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నాలుగు జిల్లాల్లో తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని ఒక జిల్లాకు పరిమితం చేయకపోతే విజయ నగరం, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు చిత్తూరు కూడా అదే కోవకు చెందుతుంది. అక్కడ మరొక తెలుగుదేశం అభ్యర్ధి గెలవలేదు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి స్ధానాలకు, విశాఖ పట్టణం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాల చొప్పున ఆ పార్టీ గెలుచుకుంది. ఇక ఓటింగ్‌ వివరాలకు వస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.9, తెలుగుదేశం పార్టీకి 39.2శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 6.78, దానితో సీట్లు సర్దుబాటు చేసుకున్న సిపిఎం, సిపిఐలకు 0.43శాతం, కాంగ్రెస్‌కు1.17, బిఎస్‌పికి 0.28, బిజెపికి 0.84శాతం ఓట్లు, వైసిపికి 151, తెలుగుదేశం పార్టీకి 23, జనసేనకు ఒక స్ధానం వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి గతంలో ఓటు చేసిన బిజెపి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల ఓట్లు ఈసారి పడవని, ఎవరి బలం వారికి వుంటుందని, ఆ పరిస్ధితి వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వుంటుందనేది అంకెలు చెప్పిన సత్యం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 44.6, వైసిపికి 44.2, కాంగ్రెస్‌కు 8.8, బిజెపికి 2.2శాతం వచ్చాయి. ఇప్పుడు శాతాల వారీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఐదుశాతం ఓట్లు తగ్గగా వైసిపికి 5.7శాతం పెరిగాయి. దీన్నిబట్టి చూసినపుడు కాంగ్రెస్‌కుకు తగ్గిన ఏడున్నరశాతం ఓట్లు మొత్తం వైఎస్‌ఆర్‌సికికి పడి వుంటే దాని ఓటింగ్‌ ఇంకా పెరిగి వుండేది. మెజారిటీ ఓట్లు మాత్రమే వైసిపికి పడ్డాయన్నది స్పష్టం. ఇక తెలుగుదేశానికి తగ్గిన ఓట్లు, దానిపునాది చెదిరింది అనేదాని కంటే బిజెపి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో వచ్చిన ఓట్లు ఐదుశాతం తగ్గినట్లు పరిగణించ వచ్చు. ఈ ఓట్లు తగ్గటం, కాంగ్రెస్‌, బిజెపి ఓటింగ్‌ కొంత మళ్లిన కారణంగా వైసిపి అఖండ విజయం సాధించింది. ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ రెండు పార్టీలలోని ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చింది అనుకున్నా, కొందరు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారని అనుకున్నా ఎవరి బలం వారికి వుంది అని అంకెలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం ఓటమి గురించి వెలువడుతున్న విశ్లేషణలు, వెల్లడవుతున్న అభిప్రాయాలను చూద్దాం. తెలుగుదేశం పార్టీ పైనుంచి కింది వరకు అవినీతి అక్రమాలకు పాల్పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి వుంటే తెలుగుదేశం ఓటింగ్‌ ఇంకా ఘోరంగా పడిపోయి వుండేది, అన్ని ఓట్లు వచ్చి వుండేవి కాదు, బహుశా చంద్రబాబు నాయుడు నామమాత్ర మెజారిటీతో గెలిచి ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో మిగిలి వుండేవారు. అసలు పట్టించుకోలేదు అనలేము గాని ఎవరు తక్కువలే ఎవరు వచ్చినా తినకుండా వుండేవారెవరు అని జనం అవినీతిని నిత్యజీవితంలో విడదీయని భాగంగా పరిగణించి పెద్దగా పట్టించుకోలేదా అన్నది సూక్ష్మ పరిశీలన చేస్తే తప్ప తెలియదు. ఒక వేళ అవినీతి అక్రమాలపై ఆగ్రహం కారణంగా కోల్పోయిన ఓట్లను ఎన్నికల ముందు తెలుగుదేశం పందారం చేసిన తాయిలాలు పూడ్చాయా అన్నది కూడా ఒక ముఖ్య అంశమే.

తెలుగుదేశం పార్టీ అధికారయుతంగా ఎన్నికల ఓటమి కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయినా తెలుగుదేశం మద్దతుదార్లుగా లేదా పాకేజి ఒప్పంద భాగస్వాములుగా లేదా వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకులుగా పేరు ఏదైనా కానివ్వండి ముద్రపడిన పత్రికల వ్యాఖ్యాతలు, ఎన్నికలలో ఆ పార్టీ తరఫున సీట్లు ఆశించి, చివరి వరకు మద్దతుదార్లుగా వున్న జర్నలిస్టులు ఇప్పుడు తెలుగుదేశం ఓటమి కారణాల గురించి వెంటనే స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానిలో చిత్తశుద్ధి వుందా, విశ్వసనీయత ఎంత అన్నది అనుమానమే.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలం కాలేదు, పార్టీ నేతగా వైఫల్యం చెందారు అన్నది ఒక సూత్రీకరణ. ఈ మాటలను సెలవిచ్చిన పెద్దలే ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతిని అరికట్టలేకపోయారు అంటారు. సన్నిహితులు చెప్పినా ఖాతరు చేయలేదు అంటారు, మరో వైపు జగన్‌కు విజయసాయి రెడ్డి వంటి వారు ఎందరో వున్నారు, చంద్రబాబుకు అలా లేరు అంటారు. మరి చంద్రబాబు సన్నిహితులంటే ఎవరు ? తొలి వ్యాక్యంలో ఏమి రాస్తున్నామో మలిగా ఏమి చెబుతున్నామో తెలలియకుండా రాయటాన్ని ఏమనాలి? ఎడా పెడా ఏదో ఒకటి రాస్తున్నట్లా ? అంటే ముఖ్య మంత్రిగా అవినీతి పరులను సహించటం, చెప్పింది వినకపోవటం చంద్రబాబు విజయమని చెబుతున్నట్లా ? వైఎస్‌ జగన్‌ గురించి గతంలో ఇలాంటి ప్రచారమే చెప్పారు. ఆయన ఎవరి మాటా వినడు, తాను చేయదలచుకున్నది చేస్తాడు , ఎంద పెద్ద వారైనా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే ఇంకా అలాంటివి ఎన్నో .ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు గురించి చెబుతున్నారు. గుండెలు తీసిన బంట్లంటే వేరే వుంటారా ? గతంలో గత ఐదేండ్లలో కూడా కొన్ని పత్రికలు, ఛానల్స్‌లో ఇదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచే చేశారు, అనర్ధాలకు అధికార యంత్రాంగమే కారణం అని సూత్రీకరించి పాఠకుల మెదళ్లకు ఎక్కించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లను చూశాము. మీడియా రంగంలో వున్న వారు చంద్రబాబును ఇలా మునగచెట్టిక్కించి మూతిపళ్లు వూడగొట్టేట్లు చేయటం తప్ప మరొకటి కాదు. అయినా నరేంద్రమోడీ కంటే సీనియర్‌ను అని చెప్పుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పార్టీనేతగా జరుగుతున్నదానిని చూడలేక పోవటానికి ధృతరాష్ట్రుడేమీ కాదుగా. ఇక్కడ చంద్రబాబును గతంలో సమర్ధించిన, ఇప్పుడు ఏ కారణంతో అయినా సమర్ధిస్తున్న మీడియాలో ఎన్నడైనా ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీల అవినీతి గురించి పతాకశీర్షికలు కాదు, పక్కన అయినా వార్తలు ఇచ్చాయా ? పాఠకులకు మతిమరపు ఎక్కువ అనే ధైర్యంతో ఇప్పుడు తగుదునమ్మా అంటూ అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. మీడియా గురించి చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. అధికారంలో వున్నవారు, మీడియా సంస్ధలు నీకిది, నాకది అనే పద్దతుల్లో ఎవరికి కావాల్సినదానిని వారు పొందటం బహిరంగ రహస్యం. గతంలో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, అదే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయినట్లు ? ఏది వాటంగా వుంటే అది రాయటమేనా ? 2016 నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు వున్నప్పటికీ వుత్సవిగ్రహంగా తప్ప ఆయనకు అధికారాలు ఎక్కడున్నాయి. మీడియా పండితులు అన్నీ చంద్రబాబు నాయుడే చూసుకున్నారని చెప్పారు కదా !

అధికారంలో వుండి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిధుల కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఒక ముక్తాయింపు. తెలుగుదేశం పార్టీ వారికి 50 చోట్ల నిధులు అందకుండా ప్రత్యర్ధులు సఫలమయ్యారని మరొక బాజా. ఇలాంటి వాటిని చదివి, చూసి దేనితో నవ్వాలో అర్ధం కాదు. పాఠకులు మరీ అంతగా చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? ప్రత్యర్ధి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతల వ్యాపారాలు, పరిశ్రమలలో జరిపే అక్రమాల బలహీనతలను ఆధారం చేసుకొని కేంద్రంలోని బిజెపి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అనేక మందిని తన పార్టీలోకి ఫిరాయించేవిధంగా చేసిన గతం ఎవరికి తెలియనిది. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. ఇదే విషయాలను ఎన్నికల సమయంలో సదరు మీడియా ఓటర్ల ముందుకు ఎందుకు తీసుకురాలేదు? అధికారంలో వుండి సంక్షేమ పధకాల పేరుతో ఎన్నికల ముందు ఓటర్లకు ఇచ్చిన వేల కోట్ల తాయిలాల మాటేమిటి? ఐదేండ్ల పాటు ఎంఎల్‌ఏలు, ఎంపీలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వీరే చెబుతారు, ఎక్కడో ఒకరో అరా తప్ప వారు లేదా వారసులు అభ్యర్ధులుగా వచ్చారు, మరి వారు జనం నుంచి కొల్లగొట్టిన సొమ్మంతా ఏమైనట్లు? అసలు తెలుగుదేశం లేదా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధుల్లో డబ్బు లేని వారెందరు?

ఆడలేక మద్దెల ఓడన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ఆర్‌సిపి వ్యూహాలను తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందని మరొక సూత్రీకరణ. అసలు మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలు అందుబాటులో వున్నవారెందరు? 250 మేర ఛానళ్లు, గ్రూపులతో వైఎస్‌ఆర్‌సిపి చేసిన ప్రచారాన్ని తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందట. ప్రధాన స్రవంతి మీడియాలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సాగించిన ప్రచారం సంగతేమిటి? బహుశా ఇలాంటి మీడియా పండితులు చెప్పిన అంశాలనే తెలుగుదేశం పార్టీ తన సమీక్షగా ముద్రవేసుకొని జనం ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత అనుభవం ఇదే. లీకుల పేరుతో ఇదే మీడియా పెద్దలు తెలుగుదేశం చెప్పిన అంశాలనే జనానికి అందచేసేవారు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలను తమ అభిప్రాయాలుగా పాఠకుల ముందు వుంచలేదని ఎలా అనుకోగలం. రాజకీయనేతల మాదిరే నేడు మీడియా విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా వున్నపుడు ఇలా అనుకోవటంలో తప్పేముంది?

Image result for chandrababu naidu debacle

వుదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయానే తీసుకుందాం. దీని గురించి చంద్రబాబు నాయుడుగాని, ఆయనను సమర్ధించిన మీడియా గానీ ఎప్పుడైనా పాఠకులకు వాస్తవాలు చెప్పిందా? ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మంచిది. దాని మీద చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ వేసిన పిల్లి మొగ్గలను తు.చ తప్ప కుండా మీడియా కూడా వేసింది. జాతీయ అభివృద్ది మండలి ప్రత్యేక హోదా గురించి గతంలో ఆమోదించిన నిబంధనలను మార్చకుండా హోదాను ఆంధ్రప్రదేశ్‌కు వర్తింప చేయటం అసాధ్యం. అటువంటి ప్రయత్నమే చేయలేదు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఆధారంగా అలా చేసేందుకు నిబంధనలు మార్చటం అంటే తేనెతుట్టెను కదిలించటమే. అధికారానికి రాక ముందు ఓటర్లను మభ్య పెట్టేందుకు చెప్పినా నరేంద్రమోడీకి ముందే తెలుసు కనుకనే గద్దెనెక్కిన మరునాటి నుంచి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ అంశాన్ని ముందుకు రాకుండా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వమే దాని మీద అసెంబ్లీ తీర్మానాల పేరుతో మరొక పేరుతో నాటకాలాడింది. తరువాత దాని బదులు ప్రత్యేక పాకేజి అంటే దానికి కూడా మీడియా తాన తందాన పలికింది. పోనీ దాని బండారాన్ని అయినా బయట పెట్టారా అంటే అదీ లేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావటానికి పాతికేండ్లు పట్టింది, అదే జగన్‌కు పదేండ్లు మాత్రమే అని కొందరి సూత్రీకరణ. దాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 నుంచి 2004 మధ్య 1989నుంచి ఒకసారి కాంగ్రెస్‌ పాలన ఐదేండ్లు కొనసాగటం తప్ప మిగతా కాలమంతా తెలుగుదేశం పాలనే కొనసాగింది. అందువల్లనే రాజశేఖరరెడ్డి అంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కాలంలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలు, 1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక సంస్కరణలు అమలు జరిగాయి. వాటితో జనానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా భారాలు పెరిగాయి, అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. దేశం దృష్టిని ఆకర్షించిన విద్యుత్‌ వుద్యమం వంటివి ఈ కాలంలోనే జరిగాయి. దీనికి తోడు బిజెపితో తెలుగుదేశం పార్టీ జట్టుకట్టిన పూర్వరంగంలో కాంగ్రెస్‌తో వామపక్షాలతో పాటు టిఆర్‌ఎస్‌కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంది కనుకనే 2004లో రాజశేఖరేఖరరెడ్డి అధికారానికి వచ్చారు. అదే విధానాలను అమలు జరిపిన కారణంగా వైఎస్‌ఆర్‌పై కూడా అసంతృప్తి తలెత్తినప్పటికీ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండవ సారి అధికారానికి వచ్చేవారు కాదన్నది తెలిసిందే. అంటే నూతన ఆర్ధిక విధానాలు ఏ పాలకపార్టీని కూడా వరుసగా రెండవ సారి అధికారానికి తెచ్చే పరిస్ధితి లేదన్నది స్పష్టం. తెలంగాణాలో తెరాస మీద భ్రమలు తొలగకపోవటం, ఇతర అంశాలు తోడై తిరిగి చంద్రశేఖరరావు అధికారానికి వచ్చారు. ఆరునెలల్లోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లడైందా లేదా ? ఆ దివాలా కోరు విధానాలతో రెండవ సారి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు జన విశ్వాసం పొందలేకపోవటంతో పాటు పైన చెప్పుకున్న ఇతర కారణాలు కూడా తోడై ఈ ఎన్నికల్లో జగన్‌కు అవకాశం వచ్చింది.

చంద్రబాబు నాయుడు , మరొకరు ఎవరైనా ప్రజాకర్షక విధానాలతో కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టినంత మాత్రాన జనానికి వాటితోనే సంతృప్తి వుండదు. నిరుద్యోగం, దారిద్య్రం వంటి అనేక అంశాలు జనాన్ని పీడిస్తున్నపుడు సంక్షేమ పధకాలు వుపశమనం తప్ప మరొకటి కాదు. తెలంగాణాలో రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులే నిజామాబాద్‌లో రోడ్డెక్కారు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఎన్నికలలో కూడా నిరసన తెలిపారు. నయావుదారవాద విధానాలు జనంలో ప్రతి తరగతిలోనూ భ్రమలను పెంచుతాయి. అవినీతిని మరింతగా విస్తరింప చేస్తాయి. అందరూ అడ్డదారిలో సంపాదించుకోగలిగినపుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదనే దగ్గరి దారి ఆలోచనలను ప్రతివారిలో రేకెత్తిస్తాయి.ఈ క్రమంలో ప్రతి పాలక పార్టీ భ్రమలను పెంచటంలో, మరిన్ని ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటంలో, చర్యలు చేపట్టటంలో పోటీ పడతాయి. విలువలను నాశనం చేస్తాయి. గతంలో ఓటర్లు డబ్బు తీసుకున్నపుడు ఓటేయకపోతే ఎలా అని విశ్వాసంతో తీసుకున్న పార్టీకి ఓటు వేసేవారు, మరో పార్టీ దగ్గర తీసుకొనే వారు కాదు. ఇప్పుడు ఎవరు ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకొని నచ్చిన వారికి ఓటు చేస్తున్నారు. అంటూ ఎవరికీ లేని నిజాయితీ మనకెందుకు అనుకోబట్టే ఈ స్ధితి. అందుకే చంద్రబాబు ఎన్ని తాయిలాలు పెట్టినా ఎన్నికల ముందు ఎవరైనా చేస్తున్నది అదేలే అని లబ్ది పొందిన వారు చూశారు తప్ప, కృతజ్ఞత చూపలేదు. చూపుతారనే ఆశతో గతం చంద్రబాబు నా పధకాల వలన లబ్దిపొందిన వారు నాకే ఓట్లు వేయాలన్నట్లుగా మాట్లాడిన తీరు తెలిసిందే.

Image result for chandrababu naidu hypocrisy

చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరాల కాలంలో వామపక్షాల బలం ఎంత పరిమితం అయినప్పటికీ ఆయన పర్యటనకు వెళ్లిన ప్రతి చోటా ఆ పార్టీల కార్యకర్తలు, నేతలను ముందస్తు అరెస్టులు చేయించటం, వివిధ తరగతుల సమస్యలపై ఆందోళనలకు పిలుపులు ఇచ్చినపుడు వాటిని సాగకుండా ఎక్కడికక్కడ పోలీసులను ప్రయోగించి అణచివేత, విఫలం చేసేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. అంటే ప్రజాకర్షక నేతలు వైఫల్యం చెందినపుడు అణచివేతలకు పాల్పడతారన్న ప్రపంచ అనుభవం ఇక్కడ కూడా వాస్తవ రూపం దాల్చింది. దీనికి తోడు కార్మిక సంఘాలను చీల్చటం, నిరంకుశ పద్దతుల్లో డిమాండ్లను వ్యతిరేకించటం, తమతో చేతులు కలిపితే పరిష్కరిస్తామంటూ పోరాడే కార్మిక సంఘాలన్నింటినీ చీల్చటం వంటి అనేక ప్రజాస్వామ్య విరుద్ద చర్యలను చూశాము.

పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధికల్పనకిందికే వస్తుందని నరేంద్రమోడీ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చెప్పకపోవచ్చుగానీ వుద్యోగ కల్పన. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఎంత ప్రచార ఆర్భాటం చేశారో చూశాము. స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ నగర కేంద్రంగా ప్రపంచ ఆర్ధిక వేదిక పని చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే సమావేశాలకు చంద్రబాబు నాయుడు పెద్ద పరివారాన్ని వేసుకొని తీర్ధయాత్రల మాదిరి తిరిగి వచ్చేవారు. ఆ పిచ్చి ముదిరి ఎంతవరకు పోయిందంటే దవోస్‌ నగరంలో తిరిగే బస్సుల మీద మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రచారానికి డబ్బు ఖర్చు చేశారు. అంటే ప్రపంచ పెట్టుబడిదారులు దవోస్‌ రోడ్ల మీద తిరుగుతుంటారని, వారు బస్సుల మీద ప్రకటనలు చూసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పెట్టుబడులు పెడతారని జనం నమ్మాలి. ఎంత మందికి వుపాధిని అదనంగా కల్పించారో నరేంద్రమోడీయే కాదు, చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు.

ప్రపంచ వ్యాపితంగా ప్రస్తుతం వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది. దానికి మనం మినహాయింపు కాదు. రోబోట్‌లు, కంప్యూటర్‌ నియంత్రణ యంత్రాలతో పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు. అటువంటపుడు వుపాధి పెరగకపోగా తరుగుతోంది. రెండవది పెట్టుబడులకు తగిన రాయితీలు లేదా మార్కెటింగ్‌ను బట్టి ఆయా ప్రాంతాలకు వస్తాయి తప్ప వ్యక్తుల గొప్పనో, మొహమాటాలకో రావు. ఐటి సంస్ధలు కూడా అంతే ఎక్కడైతే కేంద్రీకరణ జరిగిందో అక్కడికే ప్రతి కంపెనీ వెళ్లాలని చూస్తుంది తప్ప కొత్త ప్రాంతాలలో పెట్టి ప్రయోగాలు జరపదు. అందువలన బాబొస్తే జాబస్తుంది అనే ఒక నినాదం ప్రహసన ప్రాయంగా మారింది. అందువలన ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ, గెలిచిన వైఎస్‌ఆర్‌సిపి అయినా చిత్తశుద్దితో గుణపాఠాలను తీసుకోవటం అవసరం.