Tags

, , , , , , ,

Image result for eu far right

ఎం కోటేశ్వరరావు

జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. మే చివరి వారంలో జరిగిన ఆ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం జాతీయవాదులు లేదా పచ్చి మితవాదులు సంపూర్ణ మెజారిటీ వైపుగాక పోయినా గతం కంటే ఎక్కువ స్ధానాలు సంపాదించారు. మన దేశంలో రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీగా ఎన్నికలు జరిగాయని, బిజెపి పేరు పెట్టి చెప్పకపోయినా జాతీయవాదులు విజయం సాధించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. మన కాషాయ బ్రాండ్‌ జాతీయవాదులు విదేశీయులకు బదులు మైనారిటీలు, మైనారిటీ మతాలను, కమ్యూనిజాన్ని ద్వేషిస్తున్నారు. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికా జాతీయవాదం. దానికోసం అనేక దేశాలలో జోక్యం చేసుకొని యుద్దం చేస్తున్నది, చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. మన వంటి దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది. అవి దాని జాతీయవాదంలో భాగం. ఆఫ్రో-అమెరికన్‌లను ద్వేషించటం అమెరికాలోని మెజారిటీ శ్వేతజాతీయ వాదం. మన స్వాతంత్య్రవుద్యమలో బ్రిటీష్‌ పాలకులను వ్యతిరేకించటం, వారి పాలనకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటివి మన మహత్తర జాతీయవాదంలో భాగం. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన సావర్కర్‌ను కీర్తించటం, గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు రావటం కూడా నేడు తామే అసలు సిసలు జాతీయ వాదులమని చెప్పుకొనే కుహనా శక్తులు చేస్తున్నపని. పాకిస్ధాన్‌ను, చైనా వస్తువుల దిగుమతులను వ్యతిరేకించటం, అమెరికా ఆంక్షలను ప్రశ్నించకుండా ఆమోదించటం మన కాషాయ వాదుల జాతీయ వాదం. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యావాదుల దాడులను ప్రతిఘటించటం చైనా జాతీయవాదం. వీటిన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఏ జాతీయవాదాన్ని ఎంచుకోవాలి, ఏది పురోగామి, ఏది తిరోగామి అనే ఎంపిక క్లిష్టంగా వుంటుంది. ఒక దగ్గర జాతీయవాదులకు బుద్ధిలేదని తిడుతుంటే, మరొక దగ్గర జాతీయవాదుల విజయాన్ని కీర్తిస్తున్నారు. అమెరికా జాతీయ వాదానికి మన కాషాయవాదులు మినహా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతం వ్యక్తం అవుతోంది. ఏమిటీ వైపరీత్యం ? అసలు జాతీయ వాదం అంటే ఏమిటి?

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు -వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. ఐరోపానే తీసుకుందాం. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపాలో, అమెరికాలో ఒకనాడు పాలకులే వలసలను ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్‌ శక్తులకు వలస కార్మికుల వలన లాభాలు ఎక్కువగా వుంటాయి కనుక. గతకొద్ధి దశాబ్దాలుగా వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది కనుక ధనిక దేశాలలో నిరుద్యోగం, వేతనాల పతనం, ఎగుమతుల అభివృద్ధి పేరుతో వేతనాల కోత, ప్రజాధనం ఎగుమతుల రాయితీలకు మళ్లించటంతో సంక్షేమ పధకాలకు కోతలతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మితవాదులు, జాతీయవాదులు, జాత్యంహకార వాదులు పెరుగుతున్నారు. అది తమకు నష్టదాయకమని కార్పొరేట్‌లు భావిస్తున్న కారణంగానే వారి ప్రతినిధి జుంకర్‌ మండిపడుతున్నారు. ఇది పాలకశక్తుల మధ్య అధికారం కోసం జరిగే పోరులో జాతీయవాదులు, జనాకర్షకవాదులది దగ్గర దారి. నరేంద్రమోడీ భారత్‌లో పెద్ద (సామాజిక) విభజన వాది అని టైమ్‌ పత్రిక వర్ణించిన విషయం తెలిసిందే. ముస్లింలు, క్రైస్తవులు మన కళ్ల ముందే పుట్టి పెరిగిన వారిని హిందూత్వ జాతీయ వాదులు ఎలా చూస్తున్నారో వివరించాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశానికి విధేయులుగా లేరనే ప్రచారం, జాతీయవాదులుగా నిరూపించుకోవాలని పదే పదే అనటం తెలిసిందే. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని ఇలాగే అవమానిస్తారు.

Related image

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. మన దేశంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సూచిక అది. లౌకికశక్తుల మీద మిత, మతవాద శక్తులు పైచేయి సాధించాయి. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అసలు అది ఎలుకలను పట్టగలదా లేదా అన్నది అసలు సమస్య అన్నట్లుగా ఐక్య ఐరోపా లేదా ప్రపంచీకరణ ఏ పేరు పెట్టినా ఐరోపాలో అమలు జరిగింది పెట్టుబడిదారీ విధానమే. అది ఇప్పుడు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటటోంది. కమ్యూనిజం వైఫల్యం చెందింది అన్నది దాని వ్యతిరేకుల మాట. ఇప్పుడు పెట్టుబడిదారీ వైఫల్యం చెందింది అన్నది దాని అనుకూలురు చెబుతున్నమాట. ఈ ఏడు దశాబ్దాల్లో చూస్తే కార్మికవర్గం సాధించుకున్న లేదా పాలకులు వుదారంగా ఇచ్చిన అనేక సంక్షేమ పధకాలకు కోతపడుతోంది. వేతనాలు పెరగటం లేదు. వుపాధి సమస్యలు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని మూల మూలకు వలసలు పోయి అక్కడి సంపదలను స్వంతం చేసుకున్న చేసుకున్నారు. అసలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలే అలా ఏర్పడ్డాయి. స్దానికులను మైనారిటీలుగా మార్చి వారి మీద పెత్తనం చేసిన, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర మన కళ్ల ముందు వుంది. మరి అలాంటి దేశాలలో ఇప్పుడు ఇతరం ఖండాల నుంచి వలస వస్తున్న వారినే కాదు, ఐరోపాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వస్తున్న తోటి వారినే అనుమతించకూడదన్న సంకుచిత భావాలు తలెత్తటానికి, పెరిగి పెద్దవి కావటానికి అనువైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా అంతే పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలు రాకుండా ట్రంప్‌ మహాశయుడు ఏకంగా సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. బెర్లిన్‌ గోడను బద్దలు చేసినందుకు సంతోషం వెలిబుచ్చిన పెద్దలు వారే ఇప్పుడు కొత్త గోడలు కడుతున్నారు.

ఎటు తిరిగి ఎటు చూసినా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యమే కనిపిస్తోంది. అందుకు సాంప్రదాయ పార్టీలే కారణం అంటే కాదనలేని స్ధితిలో అవి పడ్డాయి. దాన్ని అవకాశంగా తీసుకొని చూడండి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి అద్బుతాలు చేస్తామని చెప్పేశక్తులు ముందుకు వస్తే ఒకసారి చూస్తే పోలా అని ఎవరికి వారు అనుకుంటున్నారు. వారికి ఫాస్ట్‌ ఫుడ్‌ లేదా ఎటిఎం మాదిరి వెంటనే కోరుకున్నది కావాలి. ఇన్నేండ్లుగా మేము నమ్మిన పార్టీలు నట్టేట ముంచాయి. వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. వారు చేయలేనిదానిని మేము చేస్తామని కొత్తగా రంగంలోకి వచ్చిన వారు చెబుతున్నారు. వారు మితవాదులా అతివాదులా అన్నది మాకనవసరం, పని చేసే వారు, ఫలితాలు ఇచ్చేవారు కావాలి. వారికీ ఒక అవకాశం ఇచ్చి చూస్తాం, మితవాదులు వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు, అలాంటిదేదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణులు ఐరోపా అంతటా ప్రబలుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే అనేక పార్టీలు ఇలా పుట్టి అలా ఓట్లు పొంది దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంప్రదాయ పార్టీలు మట్టి కరుస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు నెలల క్రితం పుట్టిన పార్టీ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో 32శాతం ఓట్లు తెచ్చుకొని బస్తీమే సవాల్‌ అంటోంది. మన దేశంలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్‌ అవినీతిని అక్రమాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నది బిజెపి లేదా కాషాయ జాతీయవాదుల వాగ్దానం. యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదు సంవత్సరాలలో తాము చేశామని జనాన్ని నమ్మింప చూసిన యత్నాన్ని చూశాము.

నూటయాభై సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్‌ లాసలే కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆయనతో తీవ్రంగా విబేధించారు.చివరికి ఆ పెద్ద మనిషి కమ్యూనిస్టు వ్యతిరేక బిస్మార్క్‌తో చేతులు కలిపిన వైనం తెలిసిందే. అయితే ఐరోపాలో కమ్యూనిజాన్ని ఎదుర్కొనే క్రమంలో సంస్కరణ వాదలక్షణాలుండే సోషల్‌ డెమోక్రసీని ముందుకు తెచ్చిన ఆద్యుడిగా లాసాలేను చెబుతారు. నిజమైన రాజ్యాంగబద్దమైన రాజ్యంలో నిజమైన పాలకుడు ఓటరే అనే లాసాలే ప్రవచనాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని పాలకవర్గాలకు తెలిసినా, చాలా మంది ప్రజాస్వామిక వాదులు అది నిజమని నిజంగానే నమ్మారు. అయితే నూటయాభై సంవత్సరాల తరువాత వారికి ఆభ్రమలు తొలిగిపోతున్నాయన్నవి విశ్లేషకుల అభిప్రాయం. ఓటర్ల పేరుతో తీర్పులను హైజాక్‌ చేస్తున్నారు. తమకు ఎవరు ప్రయోజనకారులో, ఎవరు హాని చేస్తారో కూడా తెలియని స్ధితికి నేడు ఓటర్లు లోనై వున్నారు.

Image result for jean-claude juncker eu president

సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సమస్యలతో పార్టీలు విడిపోయాయి. ఆ తరువాత ఆ వ్యవస్దలు కనుమరుగు కావటంతో అనేక మందిలో విశ్వాసం సన్నగిల్లింది. నీరు గారిపోయారు, అనేక పార్టీలు కనుమరుగై బూర్జువా పార్టీల అవతారమెత్తాయి. ఒక విధమైన శూన్యం ఏర్పడింది. పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను ఎండగట్టి జన విశ్వాసాన్ని చూరగొనే స్ధితిలో మిగిలి వున్న కమ్యూనిస్టులు లేకపోవటంతో దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితులను అవకాశంగా తీసుకొని మరోసారి మితవాద, జాతీయవాద శక్తులు మోరలెత్తుతున్నాయి. అనేక మంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

1857లో మన దేశంలో తలెత్తిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి అనేక పరిమితులు వుండవచ్చు గానీ, ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తీవ్రంగా అణచివేసిన తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఎలాంటి వుద్యమాలూ రాలేదు. తరువాత కూడా బ్రిటీష్‌ వారిని పరిమిత హక్కుల కోసం ప్రాధేపడే కాంగ్రెస్‌తో ప్రారంభమైన వుద్యమంలో తరువాత ఎన్నిమార్పులు, ఎన్ని ఆలోచనలు తలెత్తిందీ చూశాము. అలాగే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమం, భారత వామపక్ష, కమ్యూనిస్టు వుద్యమం కూడా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకోవటం అనివార్యం. అయితే అనేక మందికి ఆ విషయంలో విశ్వాసం లేదు. ఇక్కడ ఒకటే సమస్య. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి చెప్పనవసరం లేదు. చైనా సోషలిస్టు వ్యవస్ధ గురించి కొందరికి కొన్ని అనుమానాలు వున్నాయి. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్దే అన్నది కొందరి భావన. అలా భావించే వారు ఎవరికి వారు ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు దోపిడీలేని మరొక ప్రత్యామ్నాయం కమ్యూనిజం తప్ప మరొకటి ఎక్కడైనా కనిపిస్తోందా? చైనా సోషలిస్టు వ్యవస్ధ కానట్లయితే దాన్ని కూల్చివేసేందుకు అమెరికా ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ? అక్కడ మిగతా పెట్టుబడిదారీ దేశాల మాదిరి సంక్షోభాలు ఎందుకు రావటం లేదు? అంతవేగంగా పురోగమించటానికి చైనా వెనుక వున్న శక్తి కమ్యూనిస్టు పార్టీ గాకపోతే మరేమిటి ? జర్మన్‌ జాతీయ వాదం హిట్లర్‌ను, ఇటలీ జాతీయ వాదం ముస్సోలినీ, అమెరికన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాలతో నింపే యుద్దోన్మాదులను తయారు చేసింది. మన దేశంలో కాషాయ జాతీయ వాదం ఎవరిని తయారు చేయనున్నది ?