Tags

, , , ,

Image result for modi 2.0

ఎం కోటేశ్వరరావు

2019 మే 23కు ముందు, తరువాత వచ్చిన మార్పు ఏమిటి? మీడియాలో వర్ణించిన దాని ప్రకారం నరేంద్రమోడీ 2.0గా మారారు. దీని భావం ఏమిటంటే తిరుమలేశా, మారుతున్న కాలంతో మారని మీకు అది వర్తించదు. అసలైన భావం, తొలి వుత్పత్తి, తొలి సేవల వంటివి ఏవైనా మలిగా ఆధునిక రూపం, మార్పులు సంతరించుకొంటే దాన్ని వ్యక్తీకరించటానికి 2.0ను సూచికగా వాడుతున్నారు. దాని ప్రకారం మోడీలో వచ్చిన మార్పు ఏమిటి? నిరుద్యోగం గురించి ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అసలు సిసలు పాత మోడీ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే లెక్కలు బయటకు రాకుండా చేశారు. ఒక పత్రికలో వెల్లడైన వాటిని తప్పుల తడకలని వర్ణించారు. ఇప్పుడు కొత్త మోడీ తన భక్తుల నోరు మూయించేందుకు ఆ లెక్కలనే అధికారికంగా విడుదల చేయించారు. విడుదల చేయక తప్పని స్ధితి, ఎందుకంటే నాటకంలో రెండో అంకం మొదలు కావాలి కదా ! మోడీ సర్కార్‌ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి గతంలో వాస్తవాలను బయట పెట్టిన మీడియా, ప్రతిపక్షాల మీద వీరంగం వేసిన పార్టీ కార్యకర్తలు, గుడ్డి భక్తులు వాస్తవాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేరు, జీర్ణించుకున్నా నోరు తెరవలేరు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఎలాగూ అసలు విషయాల గురించి మోడీ నోరెత్తరు. నాటకం నడవక తప్పదు, మద్దతుదారులకు ఏదో ఒక పని చెప్పాలి కనుక వారు తేరుకొని గళం విప్పేందుకు కొత్త వాదనను అందుబాటులోకి తెచ్చారు. నిరుద్యోగ అంకెలు తప్పుల తడకలని గతంలో మోడీ అండ్‌కో రాగం తీస్తే ఇప్పుడు భారత ప్రధాన గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ కొత్త పల్లవి అందుకున్నారు.

ఇంతకీ ప్రవీణ్‌ శ్రీవాత్సవ గారి వేద గణిత తర్క సారాంశం ఏమిటి ? ‘ తాజాగా అధికారికంగా విడుదల చేసిన నమూనా సర్వేక్షణ వుద్ఘాటన ఏమంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు హైస్కూలు విద్య, అంతకు మించి చదుకొని వుండి వుంటారు అనే ప్రాతిపదిక మీద జరిగింది, గత సర్వేలన్నీ తలసరి నెలవారి వినియోగం ఎంత అనే ప్రాతిపదిక మీద నిరుద్యోగాన్ని అంచనా వేశాయి కనుక గత సర్వేలతో పోల్చకూడదు. ఈ సర్వేలో ఆచార నవీకరణ లేదా కొత్త మార్పుల వంటి అనేక అంశాలు వున్నాయి. ప్రతి మూడు నెలలకు పట్టణాలు, గ్రామాలలో విడివిడిగా, రెండింటినీ కలిపి ఏడాదికి ఒకసారి గణించటం వంటి వన్నీ కొత్తమార్పులు. ఎవరైనా కొత్తగా ఒకదానిని ప్రారంభించినపుడు అది ఎలాంటి రాతలు లేని కొత్త పలక మాదిరి వుండాలనటాన్ని మీరు అభినందించాలి. అనేక విద్యా కోర్సులు యువతకు వుపాధి చూపేవిగా లేవు. వుద్యోగాలు చేయగల యువకులను యజమానులు పొందాలంటే నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచే విధంగా కార్యకలాపాలు పెరగాలి. అది జరగాలంటే అవసరం-సరఫరా తేడా ఎంత వుందో చూడాలి, దాన్ని కేవలం సంఖ్యతో మాత్రమే కాదు నైపుణ్య స్ధాయితో కూడా చూడాలి.’

దీని భావం ఏమిటంటే, ఫీజు రీఇంబర్సుమెంటో మరొకదానితోనో ఇంటికొకరు చదుకొని తగలడ్డారు, ఆ చదువు చట్టుబండలైంది తప్ప వుద్యోగం లేదా వుపాధికి పనికి రాదు. అలాంటి వారు పెద్ద సంఖ్యలో వున్నంత మాత్రాన వారందరినీ నిరుద్యోగులంటే ఎలా ! వారి నైపుణ్యం కూడా చూడాలి. అంటే ఇప్పుడు పెద్ద సంఖ్యలో వున్నవారందరూ పనికి రాని చదువులు చదివి, ఎలాంటి నైపుణ్యం లేకుండా వున్నారు. వారందరినీ నిరుద్యోగులంటే కుదరదు, రాబోయే రోజులలో పరిస్ధితిని, సర్వేలను పోల్చుకోవాలి తప్ప పాతవాటిని అంగీకరించం, బాగా చదువుకొని, బాగా నైపుణ్యం సంపాదించి పని పాటలు లేకుండా నిరుద్యోగిగా వుంటేనే అసలు సిసలు నిరుద్యోగి, అటువంటి వారెందరున్నారో అన్నది తేల్చేందుకు పూనుకున్నాం, కొత్త లెక్కలు రానున్నాయి, పాతలెక్కలను మరచిపోండి అన్నది ప్రవీణ్‌ గారి ప్రావీణ్య తర్కం. దీన్ని అంగీకరిస్తామా లేదా, దీన్ని అర్ధం చేసుకోగల చదువు సంధ్యల విజ్ఞానం లేదా నైపుణ్యం నిరుద్యోగులకు వుందా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎవరైనా నోరు తెరిచి కాదు గీదంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించి గోరక్షకుల మాదిరి చెలరేగి పోవటానికి మోడీ సర్కార్‌ రక్షకులు సిద్ధంగా వుంటారు మరి ! జాతీయ వాదానికే అర్ధం మార్చి కొత్త అర్ధాలు చెబుతున్నవారు చెప్పే నిరుద్యోగ కొత్త అర్దం తెలుసుకోవటానికి, అలవాటు పడటానికి మనం మరో ఐదేండ్లు సిద్దం కావాలి మరి.

సమస్యను పక్కదారి పట్టించటంలో నిరుపమాన సామర్ధ్యం కలిగిన వ్యక్తి గనుక 2018 ప్రారంభంలో ఒక ఛానల్‌తో ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి పకోడీలు అమ్మితే రోజుకు 200 మిగులు తుంది, దాన్ని వుపాధి కల్పనగా లెక్కవేయాలా వద్దా అని నరేంద్రమోడీ ఎదురు ప్రశ్నించారు.అది కూడా వుపాధి కల్పనే కదా, మా ఖాతాలోకే రావాలి కదా అని అప్పుడు మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో ప్రవీణ్‌ శ్రీవాత్సవగారు నైపుణ్యం, చదవు వున్నవారే నిరుద్యోగి అని మాట్లాడుతున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదేనా ?

ప్రపంచ వ్యాపితంగా వేగంగా జరుగుతున్న యాంత్రీకరణ, రోబో, ఇతర ఆధునిక పరిజ్ఞానం కారణంగా ఒక బ్యాచి యువతీ యువకులు నాలుగేండ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి డిగ్రీ చేతబట్టి బయటకు వచ్చేసరికి వారు నేర్చుకున్నది పాతబడిపోతోంది. అందుకే కంపెనీలు కొత్త నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చి అవి వున్నవారినే ఎంచుకుంటున్నాయి. ఈ పూర్వరంగలో నైపుణ్యశిక్షణ పేరుతో మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున వూదరగొట్టింది.కంపెనీలు వుద్యోగాలు ఇచ్చి నైపుణ్యాన్ని పెంచితే అందుకయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని లేదా ఇతరంగా రాయితీలు కల్పిస్తామని, ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లిస్తామని పేర్కొన్నది. పోనీ దాన్నయినా సక్రమంగా అమలు జరిపిందా?

ఒక వైపు వాజ్‌పేయి పాలన, కాంగ్రెస్‌పాలనా కాలంలో వున్నత విద్య ప్రయివేటీకరణ గావించి పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలను కేవలం డిగ్రీ ముద్రణ కేంద్రాలుగా మార్చివేసినా గత ఐదు సంవత్సరాలలో నాణ్యతను పెంచేందుకు ఎవరూ పట్టించుకోలేదు. బయటకు వచ్చిన వారు పెద్ద మొత్తంలో ప్రయివేటు శిక్షణకు ఖర్చు చేయటం తెలిసిందే. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(నైపుణ్య అభివ అద్ధి) పధకం 2016-20 ఒక ప్రహసనంగా మారింది. అందుకే ఈ మధ్య ఎక్కడా దాని ప్రస్తావనరావటం లేదు. ఈ కాలంలో కోటి మంది యువతీ యువకుల నైపుణ్యాలను పెంచాలన్నది లక్ష్యం. ఇందుకు గాను 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి గాను 2018 నవంబరు 30 నాటికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 36లక్షలు మాత్రమే. వారిలో 33.9లక్షల మందికి శిక్షణ ఇచ్చారు, 30.02లక్షల మంది గురించి మదింపు వేశారు. వారిలో 26లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చామని, వారు వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది జనవరి ఏడున లోక్‌సభలో ఒక ప్రశ ్నకు ప్రభుత్వం తెలిపింది. మరొక సమాచారం ప్రకారం 2018 ఆగస్టు నాటికి పది లక్షల మందికి వుద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా కోటి మందిలో ఇంతవరకు పదిలక్షలు అంటే పదిశాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. మరి ప్రవీణ్‌ గారు దీని గురించి ఏమంటారు?

వీరికి శిక్షణ ఇచ్చిన సంస్ధలది ఒక ప్రహసనం. బోధనా సిబ్బంది లేని ఇంజనీరింగ్‌,వైద్య, విద్యా శిక్షణా సంస్దల గురించిన సమాచారం బహిరంగ రహస్యమే. గతేడాది జనవరిలో పార్లమెంటరీ కమిటీ నైపుణ్య శిక్షణ సంస్ధల తీరు తెన్నుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. కొన్ని సంస్ధలు అప్పటికింకా నిర్మాణ దశలోనే వుండటం, కొన్నింటిలో పరికరాల లేమి, ఇతర అవసరాలకు వుపయోగిస్తున్నవి కొన్ని, అసలు చిరునామా తప్ప జాడలేనివి కూడా వున్నాయట. ఈ శిక్షణా సంస్ధలపై వివిధ రాష్ట్రాలలో 1173 కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. దీన్ని బట్టి అవిచ్చిన శిక్షణ ఏమిటో, ఈ తతంగమంతా తెలిసి వారికి వుద్యోగాలు ఇచ్చిన వారెవరో అంతా ఒక పెద్ద ప్రహసనం. నిరుద్యోగులు వుద్యోగాలకు పనికొచ్చే వారు కాదని మోడీ సర్కార్‌ మన్‌కీ బాత్‌ను ప్రవీణ్‌ గారు బయటపెట్టారు. విషాదం ఏమిటంటే నిరుద్యోగులు తమను మభ్యపెడుతున్నవారెవరో కూడా తెలుసుకోలేని దుస్ధితిలో వున్నారు. ఎవరు చేసుకున్న ఖర్మను వారు మరో ఐదేండ్లు అనుభవించక తప్పదనే వాస్తవాన్ని అయినా నిరుద్యోగులు గ్రహిస్తారా ?

Image result for Unemployment Rate NSSO Report : why now  released then suppressed

మన కుర్రకారు భాషలో చెప్పాలంటే పాత మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతల దౌత్యంతో పడేయాలని చూశారు. ఫలించినట్లు కనపడటం లేదు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు కొనవద్దంటే గడువుకు ముందే మానేశాం సార్‌ అని చెప్పారు. మీరు చెప్పినట్లు చేశాము, మరి మాకు ఇప్పుడు ఇరాన్‌ మాదిరి ఎక్కడైనా చౌకగా చమురు ఇప్పిస్తారా అంటే, ఏం మాట్లాడుతున్నారు, మేము ఇప్పించటం ఏమిటి , బయట కావాల్సినంత వుంది, ఎంతరేటు వుంటే అంతకు ఎంతకావాలంటే అంత కొనండి, కావాలంటే మాదగ్గర కూడా వుంది, రేటేమీ తగ్గదు, మీకు తెలిసిందే కదా, అంతా ప్రయివేటు వ్యవహారం అని చెప్పేసింది అమెరికా. మోడీ 2.0అవతారం ఎత్తి సంతోష తరంగాలలో తేలియాడుతుండగానే పెండ్లి అయిన మరుసటి రోజే కట్నం సంగతి ఏమిటని మొదలు పెడుతున్నట్లుగా కౌగిలింతల భాగస్వామి ట్రంప్‌ మరోబాంబు పేల్చాడు. రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణులు కొనుగోలు చేయటాన్ని నిలిపివేయకపోతే ఆంక్షలు తప్పవని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. మొండిగా ముందుకు పోతే అమెరికాతో కుదిరిన రక్షణ ఒప్పందాల భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడుతుందని, మినహాయింపులు ఇవ్వక ఎ్కడకు పోతారులే అంటే కుదరదని అమెరికా అధికారి చెప్పినట్లు హిందూ పత్రిక కధనం. ఇప్పటి వరకు మన దేశం నుంచి 560కోట్ల డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతులపై ఇస్తున్న పన్ను రాయితీలను వుపసంహరించుకుంటామని గతంలోనే ప్రకటించామని దానిని ఇప్పుడు అమలు జరపబోతున్నామని గురువారం నాడే మరో అమెరికా అధికారి విలేకర్లతో చెప్పాడు. మన మాదిరే టర్కీకి ఇచ్చిన ప్రాధాన్యతను రద్దు చేస్తూ మే17న ట్రంప్‌ వుత్తరువులు జారీ చేశారు. మనకు సంబంధించి తమ షరతులకు భారత్‌ అంగీకరించకపోతే ఏ క్షణంలో అయినా అలాంటి ప్రకటనే వెలువడవచ్చన్నది బహిరంగ బెదిరింపు అది. పాత మోడీ కౌగిలించుకుంటే , కొత్త మోడీ కాళ్ల బేర దౌత్యానికి పూనుకుంటారా ?