Tags

, , , ,

Image result for ys jagan images

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్న పదవి సాధించారు. అదీ అఖండ మెజారిటీతో పొందారు. మరికొద్ది రోజుల పాటు అభినందనలు-ఆకాంక్షలను అందుకుంటూనే వుంటారు. ఇంకా మంత్రులను తీసుకోలేదు, తరువాత కూడా కొంతకాలం కాస్త కుదురుకునే వరకు ఏమి చేస్తారు, చేయరు అనే అంశాల మీద కాస్త ఓపిక పట్టక తప్పదు. అయితే తన పాలన ఎలా వుండబోతోందో జగన్‌ ప్రమాణ స్వీకారం రోజే వెల్లడించారు, సమీక్షల సందర్భంగా మరికొన్ని అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ పూర్వరంగంలో పాచిపొయ్యే వరకు మూసి పెట్టటం కంటే ఎదురయ్యే సవాళ్లు ఏమిటి, ఎలా పని చేయాలో కోరుకోవటం లేదా సూచించే చర్చ తప్పు కాదు. వింటారా, పరిశీలిస్తారా లేదా అనేది కొత్త ముఖ్యమంత్రికి, ఆయన పరివారానికి వదలి వేద్దాం. ఆ పార్టీ అభిమానులు, సామాన్యులు అయినా బుర్రలకు ఎక్కించుకోవటం అవసరం.

ఏ పార్టీ ఎన్నికల ప్రణాళిక చూసినా ఏమున్నది వాటిలో అంటే అన్నింటా ప్రజాకర్షక సంక్షేమ పధకాలే. పార్టీల నేతలను బట్టి పేర్లు మారుతుంటాయి. జగన్‌ అదేబాటలో నడుస్తున్నట్లు పేర్ల మార్పు ప్రక్రియ వెల్లడించింది. రాజకీయ లబ్ది కోసం, ప్రచారంలో భాగంగా ఫలానా వారు మా పధకాలను కాపీ కొట్టారంటే ఫలానా వారు మమ్మల్ని అనుకరిస్తున్నారని అనటం తప్ప వస్త్రం ఒక్కటే రంగులు, పన్నాలే తేడా. మనకంటే ముందే వివిధ దేశాలలో అమలు జరిపిన వాటిని అనుకరిస్తూ అందరూ ఇక్కడ తమ బుర్రలోంచి పుట్టినవి అన్నట్లుగా ఫోజు పెడుతున్నారు. సంక్షేమ పధకాలను వ్యతిరేకించే వారు, సమర్ధించేవారూ వుంటారు. అయితే అవే సర్వస్వం, బొందితో కైలాసానికి తీసుకుపోతాయని ఎవరైనా చెబితే అక్కడే తేడా వస్తుంది. సమర్ధించేవారు సైతం మింగలేరు. ఇంతవరకు ఎవరూ సంక్షేమ పధకాలతో జనాన్ని కైలాసానికి తీసుకుపోలేదు, ఇక ముందు కూడా తీసుకుపోలేరు అన్నది ఇప్పటికే అమలు జరిపిన దేశాల అనుభవం చెప్పిన సత్యం. ఎవరైనా తూర్పున వుదయించే సూర్యుడిని పడమరకు మారుస్తామని చెపితే, నిజమే వారికి అంత సామర్ధ్యం వుందని భక్తులు భజన చేస్తే చేసుకోనివ్వండి. బాబాలు ఎందరో భక్తులు కూడా అన్ని తరగతులుంటారు కదా ! ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి జగన్‌ ఎదుర్కొనే సమస్యల గురించి కొన్ని అంశాలను చూద్దాం.

అంత్య కంటే ఆదినిష్టూరమే మంచిది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలోనూ కేవలం సంక్షేమ పధకాలతో ప్రజల మన్ననలను చూరగొన్న వారు లేరు. ఎక్కడైనా వున్నా అది గరిష్టంగా రెండు ఎన్నికల వరకు మాత్రమే వుంటుందని అమెరికాలోని అట్లాంటిక్‌ పత్రిక 1991 నుంచి 2018వరకు 33 దేశాలలోని 46 మంది ప్రజాకర్షక నేతల పాలన, వారు పదవి నుంచి దిగిపోయిన తీరు తెన్నులు, ఇతర అంశాల గురించి ఒక విశ్లేషణలో పేర్కొన్నది. జగన్‌కు వాటన్నింటినీ అధ్యయనం చేసే తీరిక వుంటుందో లేదో తెలియదు కనుక ఆయన మంచి కోరుకొనే సలహాదారులైనా ఆపని చేసి నివేదించాలి. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని పదేపదే చెబుతున్నారు. కానీ ఫీజుల రాయితీ, ఆరోగ్యశ్రీ, ఇంకా ఇతర సంక్షేమ పధకాలను అమలు జరిపిన ఐదేండ్ల తరువాత ఆ రాజన్నకు 2009 ఎన్నికలలో వచ్చిన ఓట్లు 36.56శాతమే. ప్రజారాజ్యం చిరంజీవి తెచ్చుకున్న 17శాతం ఓట్ల పుణ్యమా అని కాంగ్రెస్‌కు అధికారం పొంది, తరువాత ప్రజారాజ్యాన్ని మింగివేయటం వేరే విషయం. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ పుణ్యమా అని జగన్‌ తొలిసారి అఖండ మెజారిటీ తెచ్చుకున్నారు.

కుందేటి కొమ్ము సాధించవచ్చు,తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు గానీ ఈ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి చేసిన కొన్ని వాగ్దానాలను అమలు జరపటం అసాధ్యం. వాటిలో ఒకటి ర్రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన.పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు పూర్తి మెజారిటీ రాదు, అందుకు అవసరమైన సీట్లను తాము సాధిస్తే వాటిని వుపయోగించుకొని ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అన్న అంచనాతో ఈ నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చారన్నది స్పష్టం. ఎన్నికల ఫలితాలు ఆ అంచనాను దెబ్బతీశాయి. ప్రత్యేక హోదా గురించి మరచి పొమ్మని బిజెపి నేతలు తెగేసి చెప్పారు, దానికి తోడు ఇతర అంశాలు వున్నాయి కను బిజెపితో వైఎస్‌ఆర్‌సిపికి దానికి జతకలవలేదు. నరేంద్రమోడీ 2.0కు గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇప్పటికే ఎదురవుతున్న అనేక సమస్యలకు తోడు ఏపికి ప్రత్యేక హోదాను తలకెత్తుకుంటారంటారని ఎవరైనా అనుకుంటే రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారనే చెప్పాలి.

ఇక మద్యపాన నిషేధం, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది స్పష్టం. ఆచరణ సాధ్యం కాని వాటి గురించి చెప్పటం ప్రజాకర్షక నేతల స్వభావం. ఈ వాగ్దానం చేసిన ఆ పార్టీ నేతలు లేదా కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా మద్యం జోలికి పోకుండా వున్నట్లయితే వారి చిత్తశుద్ది, ఆచరణను ప్రశ్నించాల్సి వచ్చి వుండేది కాదు. రైతుల రుణాల రద్దు సాధ్యం కాదని గతంలో ఒక వ్యూహాత్మక తప్పిదం చేసిన ఫలితం ఐదేండ్లపాటు అధికారానికి దూరంగా వుండటం అని జగన్‌కు అర్ధం అయింది కనుక ఈ సారి ఎక్కడా ఏ విషయంలోనూ అసాధ్యం అనే మాటే లేదు. మద్యపాన నిషేధం వలన ఆర్ధికంగా రెండు నష్టాలు. ఒకటి మద్యవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. జనం అలవాటును మానుకోలేరు గనుక నాటుసారా బట్టీలు తిరిగి మొదలవుతాయి, అవిగాకపోతే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అయ్యే మద్యాన్ని కొనుగోలు చేయటం ద్వారా రాష్ట్రంలోని జనం దగ్గర వున్న సొమ్ము బయటకు పోతుంది. ఆ రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ వాగ్దాన సలహా ఇచ్చిన వారు మత్తులో వుండి ఆపని చేశారో మరొక విధంగా చేశారో తెలియదు గానీ జగన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అవినీతిని పెంచుతుంది, మద్యం మాఫియాలను సృష్టిస్తుంది. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం గురించి ముందుగానే జనానికి చెప్పి అజెండానుంచి వాటిని ఎత్తివేస్తే అదొకదారి అలాగాక ఇతర సాకులు చెబితే ప్రతిపక్షానికి పని కల్పించినట్లే !

Image result for cm ys jagan

ప్రస్తుతం రెండు వేల రూపాయలుగా వున్న వృద్దాప్య పెన్షన్లను ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతూ నాలుగు సంవత్సరాలలో మూడువేలు చేస్తామని జగన్‌ ఫైలు మీద సంతకం చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా పెంపుదల లేని జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) పెన్షన్‌ మొత్తాలను పెంచాలని ఈ ఏడాది జనవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం రూ.200గా వున్న వృద్ధులు, వికలాంగుల, వితంతు పెన్షన్లను రూ.800కు, 80సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్న రూ 500లను 1200 పెంచాలన్నది దాని సారాంశం. కేంద్రం ఇస్తున్న ఈ నిధులకు రాష్ట్రాలు తమ వాటాను తోడు చేయాలని గతంలో కేంద్రం కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మరికొన్ని రాష్ట్రాలలో అంతకంటే ఎక్కువే జమచేసి అమలు జరుపుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించిన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టుబోయే బడ్జెట్‌లో చేర్చితే కేంద్రం నుంచి వచ్చే మొత్తం రెండు నుంచి ఎనిమిది వందలంటే నెలకు ఆరువందల పెరుగుతుంది.ఈ లెక్కన ఒకరికి ఏడాదికి రూ 7,200 పెరుగుతుంది. జగన్‌ మోహన రెడ్డి పెంచుతానన్నది నెలకు రూ 250, అంటే ఏడాదికి మూడువేల రూపాయలు. కేంద్రం ఎనిమిది వందలకు పెంచితే నాలుగు సంవత్సరాలకు రాష్ట్రానికి ఒక్కొక్కరికి 28,800 జమ అవుతుంది. జగన్‌ సర్కార్‌ పెంపుదల ప్రకారం ఏడాదికి మూడువేల చొప్పున నాలుగు సంవత్సరాలకు పడే అదనపు భారం పన్నెండువేలు మాత్రమే. ఒక వేళ కేంద్రం ఎనిమిది బదులు ఆరువందలు చేసినా 19,200 కేంద్రం నుంచి వస్తే రాష్ట్ర సర్కార్‌ మీద భారం తగ్గుతుంది తప్ప పెరగదు. గతేడాది చివరిలో జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ ఘర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురులేని బిజెపి పదిహేనేండ్ల పాలనకు ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దానికి వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం, పెరిగిన నిరుద్యోగం వంటి అంశాలు కారణం. జనంలో తలెత్తిన అసంతృప్తిని చల్లార్చేందుకు లేదా పక్కదారి పట్టించేందుకు కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌ అయినా కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో పాత తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఏటా ఆరువేల రూపాయల వ్యవసాయ పెట్టుబడి పధకాన్ని ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక సహాయ పెన్షన్ల పెంపు ప్రతిపాదన ఆలోచన కూడా దాన్నుంచే వచ్చింది.

దేశంలో ఇప్పటికీ ఈ నామమాత్ర సాయం కూడా అందుకోని వారు దాదాపు ఆరుకోట్ల మంది వున్నారని ఏడాది క్రితం పెన్షన్‌ పరిషత్‌ అనే పౌరసమాజ సంస్ధ జరిపిన సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ జాతీయ సామాజిక సహాయ పధకం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నది. సమాజంలోని తొంభైశాతం మంది వృద్ధులు, ఇతరులకు ఇస్తున్న పెన్షన్లకు జడిపిలో 0.04శాతం మాత్రమే ఖర్చవుతున్నదని, నెలకు రెండున్నరవేల రూపాయల వంతున చెల్లిస్తే జిడిపిలో 1.6శాతం అవుతుందని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ పెన్షన్‌ పరిషత్‌ సర్వే తీరు తెన్నుల మీద వ్యాఖ్యానించారు. దేశంలో మూడు కోట్ల మంది వృద్ధులు ఇతరులకు పెన్షన్లు పెంచితే మొత్తం బడ్జెట్‌ 30వేల కోట్ల రూపాయలని, ఇప్పటికే వున్నది గాక ఏటా అదనంగా అయ్యే ఖర్చు 18వేల కోట్ల రూపాయలు మాత్రమే అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర పెన్షన్‌ పధకాలను కూడా విలీనం చేసే అంశం గురించి చర్చలు జరుగుతున్నాయి. అది జరిగితే కొన్ని చోట్ల పెన్షన్‌లు గణనీయంగా పెరిగితే ఇప్పటికే ఎక్కువగా వున్న చోట్ల ఏమౌతాయన్నది ఒక పెద్ద ప్రశ్న. సార్వత్రిక పెన్షన్‌ పధకాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వాజ్యంపై విచారించిన న్యాయమూర్తులు అన్ని పధకాలను విలీనం చేసి ఒక సమగ్ర పధకాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ కారణంగానే విలీన అంశం తెరమీదికి వచ్చింది. జూన్‌ నాటికి ఒక రూపం తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. దీనిలో అనేక అంశాలు వున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కేంద్రం ఇస్తున్న మొత్తాలు రెండువందలే అమల్లో వుండగా ఏపిలో తాజాగా పెంచినదానితో 2,250 రూపాయలు వుంది. అందువలన కేంద్రం, రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, ఇతర అంశాలు ముందుకు వస్తాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా ప్రపంచంలో నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చి ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకోవటం, ప్రత్యక్ష దోపిడీ స్ధానంలో పరోక్ష దోపిడీకి తెరతీశారు. రెండవ ప్రపంచ యుద్ధ పర్యవసానాలు సోషలిస్టు దేశాల సంఖ్యను పెంచటంతో పాటు అనేక దేశాలలో కమ్యూనిస్టులు బలం పుంజుకోవటం గమనించిన సామ్రాజ్యవాదులు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన అనేక అంశాలలో భాగంగా సంక్షేమ రాజ్య భావన పేరుతో జనానికి తాయిలాలు అందించేందుకు తెరలేపారు. ఇదే సమయంలో ద్రవ్య పెట్టుబడిదారులకు అనుకూలమైన నయా వుదారవాద విధానాలు అమలు జరిగిన చోట జనంలో అసంతృప్తి పెరగటాన్ని గమనించిన తరువాత దాన్ని దారి మళ్లించేందుకు సామాజిక సహాయ పధకాలను అమలు జరపాలని దాని నిపుణులు సూచించారు. ఇదే సమయంలో నూతన శతాబ్ది లక్ష్యాల పేరుతో వాటికి పంచదారపూత పూశారు. మన దేశంలో 1991లో నూతన ఆర్ధిక విధానాల అమలు ప్రారంభమైంది. అప్పటికే పలు దేశాలలో సామాజిక అసమానతలు తీవ్రం కావటం, అశాంతికి దారి తీస్తున్న నేపధ్యంలో మన దేశంలో అలాంటిది పునరావృతం కాకుండా చూసేందుకు 1995లో సామాజిక సహాయ పధకాలను ప్రారంభించారు. ఇదేదో మన పాలకులు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పట్ల చూపుతున్న ఔదార్యమనో మరొకటో అనుకుంటే పొరపాటు ఎవరు వచ్చినా అమలు జరిపేవే అన్నది ఇప్పటికే స్ఫష్టమైంది. ఈ కారణంగానే ఎన్నికల ముందు ఎన్ని ఆకర్షణీయ పధకాలను ప్రకటించినా తెలుగుదేశం పాలనపట్ల తలెత్తిన అసంతృప్తి ముందు అవి నిలువలేకపోయాయి. ఎవరొచ్చినా అమలు జరుపుతారు, అవినీతి,అక్రమార్కులను వదిలించుకుందామనే కసితోనే ఓటర్లు రాత్రి వరకు వేచి వుండి మరీ తెలుగుదేశాన్ని ఓడించారు.దారిద్య్ర నిర్మూలన, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మన కంటే దరిద్రంలో వున్న దేశాలు కూడా సామాజిక సంక్షేమ పెన్షన్లు ఎక్కువ మొత్తాలు చెల్లిస్తున్నాయి.

అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో సంక్షేమ పధకాలను అమలు జరిపిన ప్రభుత్వాలు ప్రజల అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి. వాటి మూలాలను తొలగించలేవు.అందువలన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వలంటీర్‌ పేరుతో గ్రామాలలో లక్షలాది మందిని నియమించటం, ఆచరణలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు పునరావాసం కింద మారనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజన్య రాజ్యంలో రైతు వలంటీర్ల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలనే నియమించటాన్ని చూశాము. అందువలన నెలకు ఐదు వేల రూపాయలు పొందే వలంటీర్లుగా అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే వుంటారు లేకపోతే పార్టీలోనే అసంతృప్తి మొదలవుతుంది. మిగతా పధకాల అమలు గురించి సందర్భోచితంగా చర్చించుదాం.

Image result for cm ys jagan

ప్రభుత్వ వుద్యోగులకు కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని జగన్‌ వాగ్దానం చేశారు.కాంట్రాక్టు వుద్యోగుల క్రమబద్దీకరణ వంటి వాగ్దానాలు చేశారు. గతంలో పాత పెన్షన్‌ వర్తించే సిబ్బంది ఎక్కువగా, కొత్త పధకపు సిబ్బంది తక్కువ. ఇప్పుడు ప్రతి నెలా, ప్రతి ఏటా పాతవారు తగ్గిపోయి కొత్తవారు పెరుగుతున్నారు. అంటే అసంతృప్తి చెందేవారు పెరుగుతున్నట్లే. ఈ ముఖ్యమైన సమస్య గురించి ఏమి చెబుతారా అని వుద్యోగులు, వుపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇలాంటివే చాలా వున్నాయి.

చివరిగా రాజకీయంగా బిజెపి మరుగుజ్జు సేనలు వైఎస్‌ జగన్‌ మతం గురించి అప్పుడే ప్రచారం మొదలు పెట్టాయి. జగన్‌ హిందూ మతంలోకి మారినట్లు నకిలీ వీడియోలను ఇప్పటికే పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు అదంతా ఒట్టిదే క్రైస్తవమతానికి పెద్ద పీటవేశారంటూ ప్రమాణస్వీకారం సందర్భంగా ముందుగా క్రైస్తవ మతపెద్దల ఆశీర్వాదాన్ని పొందటాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో ఎవరు ఏమతంలో వుండాలన్నది వారి వ్యక్తిగత అభీష్టమే. నిజానికి రాజశేఖరరెడ్డి గురించి ఇలాంటి ప్రచారం వున్నా పరిమితం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. మరోవైపున జగన్‌ ప్రతి సందర్భంలోనూ హిందూ పీఠాధిపతుల సేవలో తరిస్తున్నారు. తన మీద ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్నారా లేక నిజంగానే నమ్మకాలు వున్నాయా? ఒక లౌకిక దేశంలో ఇలా చేయటం అభ్యంతరకరం. అందునా దేశంలో నేడు హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్న స్ధితిలో తగని పని. ఒక ప్రధానిగా తన భార్యను గురించి చెప్పలేదని నరేంద్రమోడీపై ఇప్పటికే ఒక విమర్శ వుంది. జగన్‌ హిందూ మతంలోకి మారారని, మారలేదని సామాజిక మాధ్యమంలో నడుస్తున్న చర్చకు ఆదిలోనే ముగింపు పలకాల్సింది ఆయనే. అదే విధంగా దేశంలో వున్న మతతత్వం, తదితర అంశాలపై కూడా ఒక పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ వైఖరి ఏమిటన్నది తెలుసుకోవాలని సహజంగానే కోరుకుంటారు. అదే విధంగా హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నంపై వెంటనే స్పందించి వుండాల్సింది. అవకాశవాదాన్ని ప్రదర్శిస్తే కుదరదు.