Tags

, , , ,

Image result for cash support schemes for farmers

ఎం కోటేశ్వరరావు

ఢిల్లీ మెట్రోలో మహిళలకు వుచిత ప్రయాణం కల్పించాలనే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ ఆలోచన లేదా నిర్ణయం రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకే అని బిజెపి గోలగోల చేసింది. ఐదేండ్లూ చేయని ఆలోచన ఇప్పుడు చేస్తున్నారని రుసరుసలాడింది. అధికారమే యావగా వున్న పార్టీలకు ప్రత్యర్ధుల ఎత్తులు బాగా అర్ధం అవుతాయి. చిన్న, సన్నకారు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సొమ్ము చెల్లించాలని నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్లూ ఏమీ చేయకుండా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తాత్కాలిక బడ్జెట్‌లో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నేమనాలి ? రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో బిజెపి ఓడిపోవటం, అంతకు ముందు పలుచోట్ల రైతాంగ ఆందోళనల నేపధ్యంలో ఓట్లకోసం మోడీ సర్కార్‌ ఆ పని చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆమ్‌ ఆద్మీ కూడా అంతే !

ఆమధ్య, బహుశా ఇప్పటికీ సామాజిక మాధ్యమంలో తిరుగుతూనే వుండి వుంటుంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ వెనెజులాలో అమలు జరుపుతున్న సంక్షేమ పధకాల మాదిరే మన దేశంలో కూడా ప్రకటిస్తున్నారు, దేశాన్ని దివాలా తీయిస్తారు జాగ్రత్త అనే అర్ధంలో ఒక పోస్టు పెట్టారు. సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ప్రతి చోటా దేశాన్ని దివాలా తీయించటంతో పాటు జనాన్ని సోమరులుగా మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తూనే వున్నాయి. కిలో రెండు రూపాయల బియ్యం పధకం, గతంలో పనికి ఆహార పధకం, ఇప్పుడు మహాత్మాగాంధీ గ్రామీణ వుపాధి పధకం, నిరుద్యోగ భృతి ఇలా ఒకటేమిటి ప్రతిదానికి ఏదో ఒక కారణం చూపి వ్యతిరేకించే వారు మనకు కనిపిస్తారు. ఇది మనదేశం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. అమెరికాలో కూడా ఆరోగ్యబీమా, ఆహార కూపన్లు( మన దగ్గర రెండురూపాయల బియ్యం పధకం మాదిరి), నిరుద్యోగభృతి, స్కూళ్లలో వుచిత మధ్యాహ్నభోజన పధకం, బలహీనవర్గాలకు గృహనిర్మాణం, పిల్లల సంరక్షణ సహాయం వంటి పధకాలన్నీ జనాన్ని ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేస్తాయని, పనిచేయటానికి ఇష్టపడని వాతావరణాన్ని సృష్టిస్తాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం చేసే పార్టీలు, శక్తులలో రిపబ్లికన్లు ముందుంటారు. ఓడిపోయినా సరే పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు, సోమరిపోతులను తయారు చేయకూడదని చెప్పేవారు మనకు అన్ని చోట్లా కనిపిస్తారు. పన్నుల రూపంలో తాము చెల్లించిన మొత్తాలను సంక్షేమ పధకాల పేరుతో కొంత మందికి దోచిపెడుతున్నారని, ఎందుకు పెట్టాలనే భావం దీని వెనుక వుంటుంది. ఇలాంటి వారు మహాఅయితే వికలాంగులు, పని చేయలేని వారి వరకు ఏదో దయా దాక్షిణ్యంగా సాయం చేసేందుకు సరే అంటారు.

Image result for cash support schemes for farmers

ఈ వాదన నిజమే అనుకుందాం, సంక్షేమ పధకాల పేరుతో పొందుతున్న నిధులను కుటుంబ అవసరాలు లేదా వినియోగానికి ఖర్చు చేస్తారనే అంగీకరిద్దాం. దాని వలన లబ్ది పొందేది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులే కదా ! అంటే వారి వుత్పత్తులు వినియోగించేవారు లేకపోతే పరిశ్రమలూ నడవవు, వ్యాపారాలూ సాగవు. వుదాహరణకు వృద్దులకు ఇచ్చే పెన్షన్లూ, పిల్లలను బడికి పంపిన తలిదండ్రులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాల వంటివి వాటిని ఏదో ఒక అవసర నిమిత్తం ఖర్చు చేసుకొనేందుకు తప్ప మరొకందుకు కాదు. అసలేమీ ఆదాయం లేకపోతే వారికి ఇచ్చే సొమ్ము వస్తు లేదా సేవల మార్కెట్లోకి వచ్చే అవకాశం వుండదు. ఆ మేరకు లావాదేవీలు తగ్గిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనారోగ్యంతో వుంటూ పని చేయలేకపోతే అలాంటి వారిని భారంగా ఆ సమాజం భావిస్తుంది. పని చేస్తేనే పెట్టుబడిదారులకు లాభం. అందుకోసమైనా జనానికి వైద్య రాయితీలు ఇచ్చేందుకు పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలకులు ముందుకు వస్తారు. అవి తమ ఘనతగా ఫోజు పెడతారు. ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారు పని చేయగలిగిన వారు అనారోగ్యాలకు గురైతే సంభవించే నష్టం ఎంతో గతంలో అనేక సర్వేలు, పరిశోధకులు అంచనా వేశారు. సంక్షేమ పధకాల వెనుక దాగి వున్న అంశాలలో ఇవి కొన్ని. అన్నింటి కంటే వీటి గురించి ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పిందనేది మరొక ముఖ్యాంశం.

ఎస్కే వాన్‌ గిల్స్‌, ఎర్డెమ్‌ ఓరక్‌ అనే ఇద్దరు పరిశోధకుల వ్యాసాన్ని సేజ్‌ వెబ్‌సైట్‌ 2015లో ప్రచురించింది. దానిలో అంశాల సారాంశాన్ని చూద్దాం.(అసక్తి వున్నవారు ఇక్కడ ఇస్తున్న లింక్‌లో దానిని పూర్తిగా చదువుకోవచ్చు). ‘ అభివృద్ధి చెందుతున్న మరియు సంధి దశలో వున్న దేశాలలో సామాజిక సాయం: రాజకీయ మద్దతు సాధన, రాజకీయ అశాంతిని అదుపు చేసేచర్య ‘ అన్నది దాని శీర్షిక. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ఏర్పాటుతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత మార్కెట్లను అదుపులోకి తెచ్చుకొనేందుకు సూచించిన విధానాలనే నయా వుదారవాద విధానాలు లేదా నూతన ఆర్ధిక విధానాలు అని పిలుస్తున్నారు. ఆ విధానాలను అమలు జరుపుతున్నామని చెప్పుకొనే ధైర్యం లేని పాలకవర్గం వాటికి సంస్కరణలు అనే ముద్దు పేరు పెట్టి జనం మీద రుద్దారు. తామే ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు. ప్రపంచ బ్యాంకు 1980-2013 మధ్య సిఫార్సు చేసిన 447 విధానపరమైన పత్రాలను ప్రచురించింది. వాటిని తీసుకున్న పరిశోధకులు తేల్చిన సారం పైన పేర్కొన్న శీర్షికలో వుంది. తమకు అభివృద్ధి తప్ప రాజకీయ అజెండా లేదు అని ప్రపంచబ్యాంకు ఎంతగా చెప్పుకున్నా, అవి వెల్లడించిన పత్రాలలో పరోక్షంగా చేసిన ప్రస్తావనల ప్రకారం ఆయా దేశాలలో తలేత్తే సామాజిక అశాంతిని చల్లార్చేందుకు, పక్కదారి పట్టించేందుకు, తమ విధానాలను అమలు జరుపుతున్న పాలకులకు రాజకీయ మద్దతు వుండాలంటే ఏమి చేయాలో ప్రపంచబ్యాంకు నిపుణులు సూచించారు. వాటిలో భాగమే సంక్షేమ పధకాలు.

Image result for cash support schemes for farmers-ysrcp

లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో మిలిటరీ, ఇతర నియంతలను సమర్ధించటం, గద్దెనెక్కించి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్న అమెరికా, ఇతర ధనిక దేశాలు వుక్కు పాదాలతో జనంలో తలెత్తిన అసంతృప్తి, తిరుగుబాటును అణచలేమని గ్రహించి వారిని తప్పించి ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో తమకు అనుకూలమైన శక్తులను అధికారంలోకి తెచ్చారు. ఇది కూడా ప్రపంచబ్యాంకు సలహా ప్రకారమే అన్నది గమనించాలి.లాటిన్‌ అమెరికాలో జరిపిన ప్రయోగంలో నియంతలను తొలగించినా జనంలో అసంతృప్తి తొలగలేదని గ్రహించారు. అందువల్లనే సామాజిక సహాయ పధకాలను ముందుకు తెచ్చారు. ఈ పూర్వరంగంలో మన దేశంలో 1990దశకంలో తలుత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ బ్యాంకు షరతులను మన పాలకులు ఆమోదించారు. వాటికే సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాలు, నూతన శతాబ్దంలోకి తీసుకుపోతామనే తీపి కబుర్లు చెప్పారు. పాలకులకు ప్రజల నుంచి నిరసన ఎదురు కాకుండా చూసేందుకు 1995లో మన దేశంలో సామాజిక సహాయపధకాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్‌లు తదితరాలు. తరువాత అవి ఇంకా విస్తరించాయి.

రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. చివరికి పదిహేను ఏండ్లుగా ఎదురులేని రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రైతాంగాన్ని బుజ్జగించేందుకు, ఆ పరిస్ధితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకొనేందుకు రూపొందించిందే ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం పధకం. రెండవ సారి గద్దెనెక్కిన తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించిన రైతుల భాగస్వామ్య పెన్షన్‌ పధకం అన్నది స్పష్టం. ఇలాంటి పధకాల గురించి ప్రపంచబ్యాంకు గతంలోనే సూచించింది. తెలంగాణాలో చంద్రశేఖరరావుకు రైతు బంధు పధకం గురించి సలహాయిచ్చిన అధికార యంత్రాంగానికి వాటి గురించి తెలుసు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా అవగాహన వుంది కనుకనే ముందుగా ప్రకటించి అమలు జరిపిన ఖ్యాతిని పొంది ఎన్నికల్లో ఎలా వినియోగించుకున్నారో చూశాము.

Image result for cash support schemes for farmers

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి.రాబోయే రోజుల్లో ఇంకా రావచ్చు కూడా. ఈ సంక్షేమ పధకాలు శాశ్వతమా అంటే అవునని ఎవరూ చెప్పలేరు. వీటితో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కావని లాటిన్‌ అమెరికా అనుభవాలే తిరిగి చెబుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులు మౌలిక విప్లవ సంస్కరణల జోలికి పోలేదు. నయా వుదారవాద పునాదుల మీద నిర్మించిన వ్యవస్ధల పరిధిలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. వాటిని కూలదోసేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేసే నిరంతర కుట్రలు ఒక భాగమైతే, వామపక్ష ప్రభుత్వాలు అనుసరించిన విధానలకు వున్న పరిమితులు కూడా వెల్లడయ్యాయి. అందుకే పదిహేనేండ్లు, ఇరవై సంవత్సరాల తరువాత ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనం ప్రజాకర్షక మితవాదులను గుడ్డిగా నమ్ముతున్నారు. తెలంగాణా పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతులు కూడా రైతు బంధు పధకంతో లబ్ది పొందిన వారే. అయినా సరే మార్కెట్లో తమ వుత్పత్తులకు పడిపోయిన ధరలు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి గనుకనే ఎన్నికలు ముగిసిన వెంటనే రోడ్డెక్కారు. లోక్‌సభ ఎన్నికలలో దాన్నొక సమస్యగా ముందుకు తెచ్చారు.

Image result for cash support schemes for farmers

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002-03 నుంచి 2008-09 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తంలో ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల వాటా 26.56శాతం నుంచి 62.22 శాతానికి పెరిగింది. అంటే వంద రూపాయల సబ్సిడీ ఇస్తే దానిలో ఎరువులకు రూ 62.22, దీన్ని జిడిపితో పోల్చి చూస్తే మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018-19నాటికి నిఖర ఎరువుల సబ్సిడీ 26.51 శాతానికి జిడిపిలో 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాం తొలి ఏడాది 2014-15లో 0.62శాతం వుండగా ఐదేండ్లలో అది 0.43శాతానికి పడిపోయింది. ఐదేండ్ల సగటు నిఖర సబ్సిడీ 28.73శాతంగానూ, జిడిపిలో సగటు 0.51శాతంగా వుంది. అంటే చివరి ఏడాది గణనీయ మొత్తం తగ్గిపోయింది. అక్కడ మిగిల్చిన మొత్తంలో కొంత రైతులకు పెట్టుబడి సాయం పేరుతో బదలాయించి అదనపు సాయం అన్నట్లుగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో రైతాంగాన్ని మాయచేసిన తీరును చూశాము.

Image result for cash support schemes for farmers

జరిగిన మోసం, దగా ఎలా వుందో చూద్దాం. ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పు పేరుతో నూట్రియంట్స్‌ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి ఇది ఎడమ చేయి కాదు పుర చేయి అని చెప్పటమే.ఎన్‌పికె మిశ్రమ ఎరువును రైతు ఒక కిలో కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ మూడింటికి కలిపి 2010లో ఇచ్చిన సబ్సిడీ రూ.24.66 వుంటే 2014-15 నాటికి రూ.18.35కు, 2018-19కి రూ.15.08కి తగ్గిపోయింది. అందువల్లనే పైన పేర్కొన్నట్లుగా బడ్జెట్‌లో సబ్సిడీ మొత్తాలను పెంచలేదు. గత పదేండ్ల కాలంలో పది రూపాయల వరకు రైతుల సబ్సిడీ కోత పడింది. ఇదిగాక మార్కెట్లో పెరిగిన ధరలు అదనం. దీన్నే చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు. వ్యవసాయ పెట్టుబడుల మొత్తం పెరగటానికి ,రైతాంగానికి గిట్టుబాటు కాకపోవటానికి ఇదొక కారణం కాదా ! ఒక దగ్గర తగ్గించి మరొక దగ్గర ఇవ్వటం వలన అసలు సమస్య పరిష్కారం కాదు. సంక్షేమ పధకాలు శాశ్వతం అని చెప్పలేము. ఏదో ఒకసాకుతో రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ కొనసాగించినా పెరుగుతున్న ఖర్చులతో పోల్చితే అవి ఏమూలకు సరిపోతాయన్న ప్రశ్న వుండనే వుంది. అసలు లేని దాని కంటే ఎంతో కొంత సాయం చేస్తున్నారుగా ! అని ఎవరైనా అనవచ్చు. అదే ఆ సంతృప్తితో వ్యవసాయ రంగంలో తలెత్తుతున్న ఆగ్రహాన్ని చల్లార్చటమే అసలు లక్ష్యం. పోగాలము దాపురించినపుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు-కుంకము పేరుతో బదలాయించిన డబ్బు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగిందా ! ఎవరికైనా అదే గతి, వెనుకా ముందూ తేడా అంతే !