Tags
ఎం కోటేశ్వరరావు
అవును నిజంగానే ! ఆయనొక తిరుగుబాటుదారుడు !! రాసిన నాటకాలు, తీసిన సినిమాలు, పొల్గొన్న వుద్యమాలు, వెల్లడించిన అభిప్రాయాలు అన్నీ తిరుగుబాటు స్వభావం కలిగినవే. ఆయనే గిరీష్ కర్నాడ్. ఒక విప్లవకారుడు అస్తమించినపుడు ఎవరైనా సంతాపం ప్రకటించటం, కుటుంబానికి సానుభూతిని వెల్లడించటం వేరు. అతని జీవితాంతం అన్ని విధాలుగా వ్యతిరేకించిన వారు, దెబ్బతీసేందుకు ప్రయత్నించిన శక్తులు మరణించిన తరువాత కూడా అదేపని చేస్తే నిజంగా ధన్యజీవే అనటం కొంత మందికి రుచించకపోవచ్చు. విప్లవకారుడు లేదా తిరోగమన వాది భౌతిక శరీరాల సాధారణ లక్షణాలన్నీ ఒకే విధంగా వుంటాయి. భావజాలాలే భిన్నం. అందుకే గిరీష్ మృతికి ఆయన భావజాలాన్ని అభిమానించే, అనుసరించేవారు నివాళి అర్పిస్తే, వ్యతిరేకించే వారు సామాజిక మాధ్యమంలో విద్వేష వ్యాఖ్యలు చేశారు. అందుకే భావజాల పోరులో ఆయన తుదికంటా నిలిచిన ధన్యజీవి. ముందుతరాలకు వుత్తేజమిచ్చే ఒక తార.
గౌరీ లంకేష్‌ను హత్యచేసిన ప్రధాన నిందితుల దగ్గర నుంచి కనుగొన్న సమాచారం ప్రకారం వారి హంతక జాబితాలో ఆయన పేరు కూడా వుంది. అయితేనేం ఎక్కడా ఎలాంటి వెరపు లేకుండా కడవరకూ హిందూత్వశక్తులను వ్యతిరేకించిన ధీశాలి. దేశం, దాని రాజ్యాంగానికి ముప్పు వచ్చింది కనుక బిజెపి, దాని మిత్రపక్షాలను ఎన్నుకోవద్దంటూ దేశ ప్రజలను బహిరంగలేఖలో కోరిన ఆరువందలకు పైగా కళాకారుల్లో ఆయనొకరు. బహుశా ప్రజాజీవనంలో, హిందూత్వశక్తులకు వ్యతిరేకంగా ఆయన చివరి గళం, సంతకం అదే అయి వుంటుంది. చరిత్రలో గాంధీలు వుంటారు గాడ్సేలు వుంటారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలన్నదే అసలు సమస్య. ఘనమైన మన గత చరిత్రలో చార్వాకులు పురోగామి శక్తుల ప్రతినిధులు. వారిని భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి భావజాలాన్ని కూడా మితవాదులు, మతవాదులు వదల్లేదు. అందుకే మన కాలంలో వారి కోవకు చెందిన రాజీలేని యోధుడు కర్నాడ్‌ను మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో మతశక్తులు తూలనాడటంలో ఆశ్చర్యం ఏముంది.
కళ కళకోసం, కాసుల కోసం కాదు ప్రజల కోసం అని నమ్మిన వ్యక్తి గిరీష్. నాటక రచయిత, సినిమా నటుడు, లౌకిక వాది, సామాజికవేత్త గిరీష్ కర్నాడ్ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ 81వ ఏట ప్రధాన అవయవాల వైఫల్యంతో సోమవారం ఉదయం బెంగుళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన బాల్యం, యవ్వనాన్ని చూస్తే తిరుగుబాటు పుట్టుక నుంచే వారసత్వంగా వచ్చిందా అనిపిస్తుంది. ఒక బిడ్డ తరువాత గిరీష్ తల్లి భర్తను కోల్పోయింది. బతుకు తెరువు కోసం ముంబై వెళ్లి నర్సుగా శిక్షణ పాందాలనే ప్రయత్నంలో డాక్టర్ రఘునాధ్ కర్నాడ్‌ను లుసుకుంది. వితంతు వివాహాలకు నాటి సమాజ ఆమోదం లేని కారణంగా వివాహం చేసుకొనేందుకు వారు ఐదు సంవత్సరాలు వేచి చూశారు. చివరికి ఆర్యసమాజం వారిని ఒక్కటిగా చేసింది. వారికి కలిగిన సంతానం నలుగురిలో మూడవ వాడు గిరీష్. మహారాష్ట్రలోని ప్రస్తుత ధానే జిల్లాలోని మధెరాన్‌లో 1938 మే నెల 19న జన్మించాడు. ఆయన పధ్నాలుగవ ఏట వారి కుటుంబం కర్ణాటకలోని ధార్వాడకు వచ్చింది. అప్పటికే అది కన్నడ సాంస్కృతిక కేంద్రంగా వుండటంతో యక్షగానం వంటి కళా రూపాల పట్ల ఆకర్షితుడైన గిరీష్ 1958లో కర్ణాటక యూనివర్శిటి నుండి డిగ్రీ పట్టా పొందాడు. తరువాత ఎంఎ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించాడు. చిత్రం ఏమిటంటే ఆక్స్‌ఫర్డ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత చెన్నయ్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తుండగా సరస్వతి గణపతి అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమె తల్లి పార్సీ, తండ్రి కొడవ సామాజిక తరగతికి చెందిన వారు. పది సంవత్సరాల తరువాత గాని ఆయన 42ఏండ్ల వయస్సులో వివాహం చేసుకొనే వీలు కలగలేదు.
చిన్నతనంలోనే పురాణాలు, ఇతిహాసాల పూర్వరంగంలో పెరగటం, దేశంలో మొగ్గతొడిగిన పురోగామి భావాలు వికసించిన సమయంలో వున్నత విద్యాభ్యాసం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం ఆయన మానసిక పరిణితికి దోహదం చేశాయి. అనేక మంది ఆ కాలంలోని వారు అదే బాటలో నడక ప్రారంభించినప్పటికి అందరూ చివరి వరకు లేరు. గిరీష్ ప్రత్యేకత అదే. తనకు ఇష్టమైన కళారంగాన్ని ఎంచుకున్నప్పటికీ దానిలోనూ ఆయన ప్రత్యేకతను కనపరిచాడు. పురోగామి సినిమాలను నిర్మించటం, ప్రోత్సహించటమే కాదు, తాను సంపాదించినదానిలో కొంత మొత్తాన్ని నాటకరంగ వేదికల నిర్వహణకు వెచ్చించారు.
అనేక మఠాలు, పీఠాలకు నిలయమైన కర్ణాటకలో వాటి ప్రభావం ఎక్కువ. అదే సమయంలో వాటి తిరోగామి భావజాలాలకు వ్యతిరేకంగా అనేక మంది అక్కడే రాటుదేలారు. అక్కడి సామాజిక వాతవరణాన్ని వినియోగించుకొని సంఘపరివార్ శక్తులు దాన్నొక ప్రయోగశాలగా చేసుకొని తాత్కాలికంగా అయినా పాగా వేశాయి. వాటి దాడులను ఎదుర్కొని కళాకారులు నిలవటం సామాన్యవిషయం కాదు. గిరీష్ కర్నాడ్ చాలా నాటకాలు రాశారు. 1961లో యయాతి, 1972లో హయవదన, 1988లో నాగమందాల రచించారు. గిరీష్ కర్నాడ్ పలు భాషా సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడలో ఎక్కువగా నటించారు. 1970లో కన్నడ సినిమా సంస్కారలో నటించాడు. దానిలో ప్రఖ్యాత సోషలిస్టు కార్యకర్త స్నేహలతా రెడ్డి ముఖ్యపాత్రధారిణి. ఆమె వామపక్ష భావాల కారణంగా 1975లో అత్యవసర పరిస్ధితిలో అరెస్టయి జైలులో చిత్రహింసలకు గురై మరణించే స్ధితిలో పెరోల్‌పై బయటకు వచ్చిన ఐదురోజులకే ప్రాణాలు విడిచారు. ‘సంస్కార’ని వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా తీసి మెప్పుపొందారు. ఇందులో కర్నాడ్ ప్రాణేశాచార్య అనే ప్రధాన పాత్ర పోషించారు. మరో ప్రముఖ నటుడు పి.లంకేష్ ఇందులో నెగటివ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి పట్టాభిరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి స్వర్ణకమలం పొందిన కన్నడ చిత్రం కావడం విశేషం. తర్వాత బి.వి.కారంత్ అనే ప్రసిద్ధ దర్శకునితో కలిసి సహదర్శకత్వంలో ఎస్.ఎల్.బైరప్ప రాసిన వంశవ క్ష కావ్యం ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని రూపొందించారు. దీనికి పలు రాష్ట్రీయ, అంతరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కర్నాడ్ ‘ప్రేమికుడు’ సినిమాలో విలన్‌గా తన విలక్షణ నటనని ప్రదర్శించారు. తెలుగులో ‘ఆనంద బైరవి’, ‘రక్షకుడు’, ‘కొమరం పులి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘ధర్మ చక్రమ్’, ‘స్కెచ్ ఫర్ లవ్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. దీ హిందీలో కర్నాడ్ 1976లో మంథాన్, 2000లో పుకార్, 2005 ఇక్బాల్, 2012లో ఎక్‌దటైగర్, 2017లో టైగర్ జిందాహై అనే సినిమాలో నటించాడు.
1974లో పద్మశ్రీ అవార్డును, 1992లో పద్మభూషణ్ అవార్డును, 1998లో జ్ఞానపీఠ అవార్డును స్వీకరించారు. 2017లో ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేష్‌ను హిందూమతోన్మాద శక్తులు హత్య చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక గౌరిని హత్య చేస్తే మేమందరం గౌరిలుగా మారతామంటూ గౌరి హత్య తరువాత బెంగళూరులో నిర్వహించిన పెద్ద ర్యాలీలో, తరువాత జరిగిన సభలో పాల్గొని ప్రజాస్వామికవాదులపై ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు. పలువురిని అక్రమంగా నిర్బంధించటాన్ని వ్యతిరేకిస్తూ పౌరహక్కుల కార్యకర్తగా కూడా వ్యవహరించారు. దానిలో భాగంగానే తాను అర్బన్ నక్సల్‌నంటూ మెడలో బోర్డు వేసుకొని నిరసన తెలిపాడు.
మరణానంతరం కూడా హిందూత్వశక్తులు గిరీష్ కర్నాడ్‌పై దాడి చేయటాన్ని గౌరీ లంకేష్ సోదరి, చిత్రనిర్మాత కవితా లంకేష్ ఖండించారు. ‘ఇలాంటి వారంతా పడక కుర్చీలకు పరిమితం అయ్యే బాపతు. ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే ట్వీట్‌లు చేస్తారు. బెంగళూరు విమానాశ్రయానికి చారిత్రక వ్యక్తి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినపుడు మద్దతు తెలిపినందుకు ముస్లిం పేరున్నందుకు కర్నాడ్‌ను అపహాస్యం చేశారు. ఇలాంటి వారి హీనమైన వ్యాఖ్యలను సేకరించి కేసులు పెట్టాలి, ఏదో ఒక చర్య తీసుకోవాలి. అప్పుడే ఇతరులు అదుపులో వుంటారు. నరేంద్రమోడీ మాదిరి ప్రమోద్ ముతాలిక్ వంటి వారు ప్రతి కుక్క మరణించినపుడు సంతాపం తెలపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించే వారు తప్పించుకుంటున్నారు, వారిని అరెస్టు చేయటం లేదు. వారు ఇతరుల మీద ద్వేషాన్ని రెచ్చగొడతారు, అలాంటి వారిని ఎందుకు జైలుకు పంపరు? మీరు ఒక మంత్రిమీద జోక్ వేస్తే వెంటనే జైలుకు పంపుతారు, ఇలాంటి వారిని మాత్రం కాదు ‘ అన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి వుండటమే కాదు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జీవితాంతం నిలబడిన గిరీష్ కర్నాడ్ తోటి కళాకారులకే కాదు, యావత్ సభ్య సమాజానికి ఆదర్శనీయుడు.