Tags

, , , ,

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!