Tags
ANDHRA PRADESH CM, Anti defection law, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp, ys jagan vs chandrababu, ysrcp
ఎం కోటేశ్వరరావు
‘ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను వుద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి వుంటుందని, వుండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి వుండటం పెద్ద సమస్య కూడా కాదు.
సీన్ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసిపి అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. మరీ పాత కథ చెప్పినట్లు వుందా, అయితే వైసిపి అనకొండ తెలుగుదేశాన్ని మింగదలచుకుంది అందాం. అయితే అది ఎలా ఎప్పుడు అన్నదే కిక్కునిచ్చే అంశం. ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినపుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్ధి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా వుంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ వూహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా వుంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.
ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలో వున్న లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ఆమోదించిన రాజ్యాంగాలు, వాటికి అనుగుణ్యంగా చేసిన చట్టాల మీద కమ్యూనిస్టులకు అంతగా విశ్వాసం లేకపోయినా, పార్లమెంటరీ పార్టీ వ్యవస్ధను ఆమోదించి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వాటికి కట్టుబడి వుంటున్నాయి తప్ప మిగతాపార్టీలేవీ అలా లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన గత మూడున్నర దశాబ్దాలు లేదా అంతకు ముందు కూడా కమ్యూనిస్టులు ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. అసలా ఫిరాయింపుల చట్టం గురించి నాలుగు ముక్కలు.
హర్యానా మన దేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఆయారామ్ గయారామ్ అంటే అతిశయోక్తి కాదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్, దానికి వ్యతిరేకంగా రూపొందిన పలు పార్టీల కూటమి యునైటెడ్ ఫ్రంట్ మధ్య ఫిరాయింపుల పర్వం నడిచింది. పంజాబ్ నుంచి విడివడి 1966 నవంబరు ఒకటిన హర్యానా ఏర్పడింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన గయాలాల్ అనే ఎంఎల్‌ఏ ఒకే రోజు తొమ్మిది గంటల వ్యవధిలో మూడు సార్లు పార్టీ మారాడు.కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్‌కు మారిన తరువాత తిరిగి కాంగ్రెస్‌కు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ నేత రావు బీరేంద్ర సింగ్ గయాలాల్‌ను చండీఘర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లకు చూపుతూ గయారామ్ ఇప్పుడు ఆయారామ్ అయ్యాడు అని ప్రకటించారు. ఆయారామ్ తరువాత వెంటనే తిరిగి గయారామ్‌గా మారి తిరిగి యునైటెడ్ ఫ్రంట్‌కు ఫిరాయించాడు.( తండ్రి గయాలాల్ బాటలో నడిచిన కుమారుడు వుదయ్ భాను 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించారు.) అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కొనే భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం.
దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నా ,వుద్దేశ్యపూర్వకంగా సభకు గైర్‌హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్ లేదా అసెంబ్లీలో వున్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనం అయినా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎంఎల్‌ఏలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి గాని వాటిని ఇంతవరకు ఆమోదించి చట్టసవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్చందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్చందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదు అని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణాలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్‌పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన వుదంతాలు వున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌ఏగా వుంటూ ఫిరాయించిన ఒకరు తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత వుంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది తెరాసలో చేరేవరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్ తెదే శాసనసభా పక్షం తెరాసలో విలీనమైనట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ సభ్యత్వానికి వుత్తమ కుమార్ రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్ శాసనభా పక్షాన్ని విలీనం చేయటం కూడా ఇదే పద్దతిలో జరిగింది.
ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులు వున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వున్న 23 మంది సభ్యులలో పదకొండు మంది మినహా 13 మంది తమతో సంబంధాలలో వున్నారని వైసిపి ఎంఎల్‌ఏలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసిపిలో చేరాలన్నా 16 మంది కావాల్సి వుంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసిపి వారు చెబుతున్నట్లు 13 మంది టచ్‌లో వుంటే మరో ముగ్గురు ఎంఎల్‌ఏలను ఆకర్షించితే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13 మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్‌ఆర్‌సిపి లేదా మరొక పార్టీ దేనిలో అయినా చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు, అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.
దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నైతిక విలువలకు ఏ పార్టీ కూడా కట్టుబడి వుండటం లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ చీలికపక్షమైన బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరటం ఫిరాయింపు కాదా అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదని వైసిపి సమర్ధించుకుంది. చట్టం వున్నా లేకున్నా ఫిరాయింపు ఫిరాయింపే, నైతికంగా అక్రమమే. బెదిరించి లేదా ప్రలోభపెట్టి ఆకర్షించిన తెలుగుదేశం చర్య కూడా గర్హనీయమే. ముందే చెప్పుకున్నట్లు చట్టాన్ని పటిష్టపరచటం గాకుండా లోపాలను వుపయోగించుకొని తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు చూస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మూడు ప్రాంతీయ పార్టీలలో రెండు మిత్రపక్షాలుగా వున్నాయి. రెండూ అధికారంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపిలో ప్రాతినిధ్యం లేకపోవటం బిజెపికి తలకొట్టేసినట్లుగా వుంది. అందుకోసం అది వైసిపికి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బిజెపితో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసిపి చెప్పి వుండవచ్చు, విధిలేని స్ధితిలో బిజెపి సరే అని వుండవచ్చు. అనూహ్యంగా బిజెపి కేంద్రంలో రెండవసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది వుంటుందా అంటే వుండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాము. వాటికీ ఆంధ్రప్రదేశ్‌కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సిబిఐ, ఇడిలను ప్రయోగించాల్సి వుండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు కనుక జగన్‌కు ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక బిజెపి ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే వుంటుంది, జగన్‌కు అది తెలిసిందే కనుక వేటు పడకుండా చూసుకుంటారు. కొంతకాలం రేచుక్క పగటి చుక్క, చిక్కడు-దొరకడు వ్యవహారం నడుస్తుంది.
రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్ ఆకర్ష పధకానికి తెరతీసినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో తెరాసలోకి పోగా మిగిలిన కాంగ్రెస్‌ను తమలో విలీనం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్ నాయకులు బిజెపికి ముద్దు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్ పెద్దలు బిజెపిలో చేరారు. బిజెపి ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నువేసినట్లు చెబుతున్నారు. నిజానికి బిజెపి గతంలోనే తెలుగదేశం పార్టీని మింగివేసేందుకు ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బిజెపిలో చేరితే వైసిపికి మింగా కక్కలేని స్ధితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా వుండదనుకొని వైసిపి సర్దుకు పోతుందా ? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకొన్న నాయకులకు పని ఇవ్వకుండా బిజెపి మాత్రం ఎంతకాలం వుంటుంది? కొద్ది కాలం తరువాత అదే బిజెపి తాను బలపడేందుకు సిబిఐ, ఇడి సంస్ధలను ప్రయోగించి జగన్ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసిపి సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి వుంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కెయి వర్గాలే కలసిపోగా లేనిది వైసిపి తన అవసరాల కోసం కనీసం జగన్ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటలోనే పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బిజెపికి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనై పోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది !