Tags
Arvind Subramanian, ‘Pakodanomics’ and employment, India employment, India Unemployment, Narendra Modi, pakodanomics, Raghuram Rajan
ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహో జగమే వూగెనుగా తూగెనుగా అంటూ సాగుతున్న నరేంద్రమోడీ 2.0 నావ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. నాలుగు సంవత్సరాల పాటు ఆయనకు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్ సుబ్రమణియన్ జిడిపి వృద్ధి రేటు గురించి పేల్చిన బాంబు ప్రభావమది. కోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తరువాత స్పందిస్తామన్నట్లుగా అరవింద్ సుబ్రమణియన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయన లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం చెబుతామని ప్రస్తుతం ప్రధాని ఆర్ధిక సలహాదారులుగా వున్న బృందం ఒక ప్రకటన చేసింది. 2011 నుంచి 2017 మధ్య వాస్తవ జిడిపి వృద్ధి రేటు అంటే యుపిఏ 2 చివరి మూడు సంవత్సరాలు, ఎన్‌డిఏ 1 మొదటి మూడు సంవత్సరాల అభివృద్ధి రేటును అంకెల గారడీ చేసి లేనిదాన్ని వున్నట్లుగా చూపారన్నది సుబ్రమణియన్ విమర్శ. సత్యం కంప్యూటర్స్ దగా మాదిరి లేని లాభాలను వున్నట్లు కాగితాల మీద చూపిన తీరు అనుకోండి. వాస్తవ అభివృద్ధి ఏడు కాదు నాలుగున్నరశాతమే అన్నారు సుబ్రమణియన్. ఆయన ప్రధాన ఆర్దిక సలహాదారుగా వున్నపుడే ఈ విషయం చెప్పి వుండాల్సింది, అంకెలను తయారు చేసేది రాజకీయ నాయకులు కాదు, అంగీకరించిన ప్రమాణాల ప్రకారమే అంకెలు తయారు చేశాము, ఈ పద్దతి యుపిఏ హయాంలోనే ప్రారంభమైంది, సుబ్రమణియన్ లెక్కించిన విధానం అసాధారణమైనది, దాన్ని కూడా ప్రశ్నించాల్సిందే అంటూ సన్నాయి నొక్కులతో కేంద్రం ఒక వివరణ కూడా జారీ చేసింది. అభివృద్ధి అంకెలతో నరేంద్రమోడీకి ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పటం ఇది.
ప్రభుత్వం చెప్పినట్లు సుబ్రమణియన్ లేవెనెత్తిన అంశాలకు జవాబు ఏమి చెబుతారో చూద్దాం. అయితే ఆయన కంటే ముందుగానే రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లేవనెత్తిన ప్రశ్నకు మూడునెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రధాని ఆర్ధిక సలహాదారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రాజన్ లేవనెత్తిన విమర్శను తట్టుకోలేని బిజెపి మరుగుజ్జులు (పోకిరీలు అని కూడా అంటున్నారు) మాత్రం సామాజిక మాధ్యమంలో విరుచుకుపడ్డారు. పదవి నుంచి దిగిపోయిన ప్రతివారూ ఇలాగే అంటారు, మోడీని బదనామ్ చేసే కుట్రలో భాగం, ఆయన కాంగ్రెస్ మనిషి ఇలా దాడి సాగింది. ఇప్పుడు అరవింద్ సుబ్రమణియన్ మీద కూడా అదే తరహాదాడి జరగటంలో ఆశ్చర్యం లేదు. ఆయన విధుల్లో వున్నపుడే ఈ మాటలు చెప్పి వుండాల్సిందని మోడీ ప్రభుత్వం ప్రకటించింది అంటే ఎలా దాడి చేయాలో వుప్పందించటమే. సమస్యను పక్కదారి పట్టించటమే. రఘురామ్ రాజన్ లేవనెత్తిన ప్రశ్న ఏమిటి ? ప్రభుత్వం ప్రకటించినట్లు జిడిపి వృద్ధి రేటు ఏడుశాతం అయితే తగినన్ని వుద్యోగాలు వచ్చి వుండాలి కదా, ఎందుకు రాలేదు అన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ఎన్నికలకు ముందు అధికారిక సమాచారాన్ని అనధికారికంగా ఒక పత్రిక ప్రచురించినపుడు దానిని ఖండించిన సర్కార్ ఎన్నికల తరువాత సదరు సమాచారం వాస్తవమే అని చెప్పింది. ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారని అనుకుందా. నిరుద్యోగం ఎందుకు పెరిగిందో అధికారులు చెప్పరు, రాజకీయనేతలు మాట్లాడరు ? ఇప్పుడు సుబ్రమణియన్ లేవనెత్తిన అంశాలకు జవాబు చెబుతామని పలికితే నమ్మే దెట్లా ? మరో అయిదేండ్లు చేసేదేమీ లేదు కనుక గోళ్లు గిల్లుకుంటూ ప్రభుత్వం చెప్పేదాన్ని వినేందుకు వేచి చూద్దాం.
మోడీ1.0 హయాంలో తెచ్చిన మంచి రోజు లేమిటో తాజాగా వెల్లడించిన కొన్ని అంకెలు వెల్లడించాయి. మరోసారి మోడీ పాలన కోరుకోవటంలో జనానికి కనిపించిన, అనిపించిన కారణాల గురించి మోడీ 2.0 పనితీరుమీద చర్చ జరిగినపుల్లా ప్రస్తావన వస్తూనే వుంటుంది. ఎవరైనా అలాంటిదేమీ వద్దు అనే ప్రజాస్వామిక భావనను వ్యక్తీరిస్తే ఈ దేశంలో ఇంకా భావప్రకటనా స్వేచ్చ అంతరించి పోలేదు అని చెప్పాల్సి వుంటుంది. జూలై ఐదున కొత్త ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ వర్తమాన సంవత్సర పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి క్రతువుకు ఒక తతంగం వున్నట్లుగానే బడ్జెట్ గురించి అభిప్రాయసేకరణ వుంటుంది. అది ఈనెల 11-23 మధ్య జరుగుతుంది. దానికి చాయ్‌వాలాలు, చౌకీదార్లెవరూ రారు. పారిశ్రామిక- వాణిజ్యవేత్తలూ, వారి ప్రయోజనాలను కాపాడే బ్యాంకర్లూ, ఆర్ధికవేత్తలు, వారి ఆకాంక్షలకు అనుగుణ్యంగా వార్తలు రాసే జర్నలిస్టులూ హాజరై చెప్పాల్సింది చెబుతారు, పాలకులు చేయాల్సింది చేస్తారు. అరవింద్ సుబ్రమణియన్ ప్రభుత్వం ముందు కొత్త అజెండాను ముందుకు తెచ్చారు కనుక బడ్జెట్ సమాలోచనలు ఎలా సాగుతాయో చూద్దాం !
ఐదు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న చర్యలకు ‘ మోడినోమిక్స్ ‘ అని పేరు పెట్టారు. మరో ఐదు సంవత్సరాలకు ఓటర్లు ఆమోదం తెలిపారు కనుక నిజం చెబితే ఎవరైనా చేసేదేముంది అనే వుదారబుద్దితో కేంద్ర ప్రభుత్వం అసలు లెక్కలను బయట పెట్టింది. దాని ప్రకారం 2017-18లో నిరుద్యోగ రేటు 6.1శాతం, అది 45సంవత్సరాల రికార్డు స్దాయి. మోడీ నావ వడ్డుకు చేరింది, నిరుద్యోగులు మునిగారు. బతికి వున్నవారు అర్ధం చేసుకోవాల్సిందేమంటే సిఎంఐఇ సమాచారం మేరకు 2018 జూన్ నుంచి 2019 మే నెల వరకు పన్నెండు నెలల సగటు నిరుద్యోగశాతం 6.66, జూన్ ఒకటి నుంచి తొమ్మిది వరకు సగటు 7.36 శాతంగా గ్రాఫ్ పైకి ఎగబాకుతోంది. మరోవైపున జిడిపి వృద్ధి రేటు గతేడాది చివరి మూడు మాసాలలో 5.8శాతానికి పడిపోయింది. ఇది మూడు సంవత్సరాలలో కనిష్టం. అరవింద్ సుబ్రమణియన్ చెప్పిన ప్రకారం ఏడు అంటే నాలుగున్నర, ఏడుకు తగ్గితే ఇంకా పడిపోతుంది. వాస్తవం చెప్పటం మన ధర్మం, కార్యాచరణ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు, నిరుద్యోగులకు వదలివేద్దాం.
గతేడాది ఒక టీవీ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ గారు చెప్పిందేమిటి? ‘ ఒక ఏడాది కాలంలో 70లక్షలకు పైగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు జత అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్ర యోజన పధకం ద్వారా పది కోట్ల మంది లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వ చొరవల కారణంగా చిన్న తరహా సంస్ధలు, అసంఘటితరంగాలకు సాధికారత ఒనకూడింది. మీ కార్యాలయం ముందు ఎవరైనా ఒకరు పకోడీ బండిని ప్రారంభించారనుకోండి, అది వుద్యోగం లెక్కలోకి రాదా ? సదరు వ్యక్తి రోజువారీ ఆదాయం రెండు వందలు ఏ పుస్తకాలకు, ఖాతాలకు ఎక్కదు. వాస్తవం ఏమంటే పెద్ద సంఖ్యలో జనం వుపాధి కలిగి వున్నారు.’అని నరేంద్రమోడీ సెలవిచ్చారు కనుక దాన్ని కొందరు ‘ పకోడినోమిక్స్’ అని వర్ణించారు. ఇంత అభివృద్ధి జరిగిన తరుణంలోనే నిరుద్యోగులు రికార్డు స్ధాయిలో పెరిగారు అంటే ఇప్పుడు పరిస్ధితి ఏమిటి? కొనుగోలు చేసే వారు లేక, కొందరికి వుపాధి వున్నా కొనుగోలు శక్తి పడిపోయిన కారణంగా బండ్లను పక్కన పడేసి పకోడీలు చేసే వారు పని కోసం అడ్డామీదకు చేరుతున్నారని అనుకోవాలి.
ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడయినా విజయవంతమైన తమ విధానాలను కొనసాగిస్తామని బిజెపి నేతలు చెప్పారు. అదేగనుక జరిగితే రానున్న రోజుల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నడిపే చౌక భోజన కేంద్రాలు, షిరిడీ సాయి బాబా, ఇతర దేవాలయాల్లో పెట్టే వుచిత అన్నం కోసం నిలబడే వారు మరింత పెరిగిపోతారు. కార్యాలయాలల్లో ఫ్లాస్కుల్లో టీ అమ్ముకొనే వారు కూడా గిట్టుబాటుగాక నిరుద్యోగ సైన్యంలో చేరతారు. ఆర్ధిక వ్యవహారాలు, నిరుద్యోగం మీద, వుపాధి మరియు నైపుణ్యశిక్షణ వంటి 14 అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ వుపసంఘాలలో రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్‌కు చోటు కల్పించని కారణంగా ఆయన అలిగినట్లు వచ్చిన వార్తల కారణంగానే అనేక మంది అలాంటి కమిటీలు వుంటాయని తెలుసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీలు గతంలో కూడా వున్నాయి. దేశంలో పరిస్ధితులు దిగజారుతుంటే గత ఐదేండ్లుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నాయి, ఇప్పుడేం చేయనున్నాయన్నది ప్రశ్న.15-29 సంవత్సరాల వయస్సున్న గ్రామీణ యువకుల్లో 2017-18లో 17.4శాతం, యువతుల్లో 13.6శాతం, పట్టణ యువకుల్లో 18.7, యువతుల్లో 27.2శాతం నిరుద్యోగం వుందని తేలింది. గత ఏడాది కాలంలో ఇంకా పెరిగాయి. గ్రామాల్లో మహిళల వుపాధి, పట్టణాల్లో మొత్తంగా వుపాధి అవకాశాలు పడిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవభారత నిర్మాణం చేస్తానంటున్న నరేంద్రమోడీ బండి నల్లేరు మీదమాదిరి సాఫీగా సాగదని చెబుతున్నాయి.
రైతాంగానికి ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తామని నరేంద్రమోడీ సర్కార్ ప్రకటించింది. దానికి కారణం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా దిగజారటమే. అసంతృప్తి మరింత పెరగకుండా వుండాలన్నా, ఎన్నికల్లో లబ్ది పొందాలన్నా ఏదో ఒకటి చేయాలి గనుక చివరి క్షణంలో ఆపని చేశారు. మన జిడిపిలో వ్యవసాయ రంగ వాటా తక్కువే అయినప్పటికీ వుపాధి పొందుతున్నవారు ఎక్కువగా వున్నారు.2017-18 సంవత్సర చివరి మూడు మాసాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి 6.5 శాతం కాగా తరువాత సంవత్సరంలో ప్రతి మూడు మాసాలకు 5.1,4.2,2.7,0.1శాతాలకు పడిపోయింది. అది 2019-20లో కూడా కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. దాని నివారణలో భాగంగానే ఏడాదికి ఆరువేల రూపాయల అందచేత అనుకోవాలి. ఇది రైతాంగాన్ని గట్టుకు చేరుస్తుందా అంటే కాదనే చెప్పాలి. మొత్తంగా జిడిపి వృద్ధి రేటు 2018-19తొలి త్రైమాసికంలో 8శాతం వుండగా తరువాత మూడు త్రైమాసికాలలో అది వరుసగా 7, 6.6, 5.8శాతాలకు పడిపోయింది.అంకెలు ఎక్కువగా చెబితే కాస్త గందరగోళంగా వుండవచ్చుగానీ మరొక మార్గం లేదు.2018 మార్చినెలలో పారిశ్రామికవుత్పత్తి వృద్ధి రేటు 5.3శాతం వుండగా 2019 మార్చినాటికి అది 0.1కి చేరింది.
ఇతర అనేక అంశాలు ప్రతికూలంగా వున్నప్పటికీ మొదటి సారి మోడీ అధికారానికి వచ్చిన తొలి మూడు సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు బాగా పడిపోయిన కారణంగా అది అనుకోని వరంలా మారింది. ఇప్పుడు మరోసారి పైవైపు చూసే ధోరణే తప్ప తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. రంజాన్ మాసం ముగిసింది కనుక పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో యుద్దం వంటి పిచ్చిపనులకు డోనాల్డ్‌ట్రంప్ పాల్పడితే మోడీ సర్కార్‌కు పెద్ద పరీక్ష అవుతుంది. ఐదేండ్లు అంతా బాగుంది అని చెప్పిన తరువాత బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్ధక ఆస్ధులకు కాంగ్రెసే కారణమని చెబితే ఇంకేమాత్రం అతకదు. పడిపోతున్న పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని నిలబెట్టేందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలిస్తే పరిస్ధితి మెరుగుపడుతుందనే అభిప్రాయంతో రిజర్వుబ్యాంకుద్వారా వడ్డీని తగ్గిస్తున్నారు. గతంలో తగ్గించిన ఫలితాలేమీ కనపడలేదు. అనేక పెట్టుబడిదారీ దేశాలలో వడ్డీ రేటు మన కంటే చాలా తక్కువ, జపాన్‌లో అయితే డబ్బు దాచుకున్నవారే బ్యాంకులకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్ధితి. అయినా అక్కడ వృద్ధి రేటు పెరగటం లేదు. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవటం, తదితర కారణాలతో చైనాలో వృద్ధి రేటు కాస్త తగ్గినప్పటికీ నిలకడగా వుంటోంది. దానికి ప్రధాన కారణం ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూడటంతో పాటు అంతర్గత వినియోగ మార్కెట్‌ను పెంచటమే. అందుకోసం అది కార్మికుల వేతనాలను ఏడాదికేడాది పెంచుతోంది. ఈ కారణంగానే తమకు గిట్టుబాటు కావటం లేదు కనుక అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తమ పరిశ్రమలను తరలిస్తామని అమెరికా, తదితర దేశాల యజమానులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెరికాాచైనా వాణిజ్య యుద్దం, ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవటం(బ్రెక్సిట్), అమెరికా – ఇరాన్ వైరం, ఐరోపాలో పరిష్కారం కాని ఆర్దిక ఇబ్బందులను అవకాశాలుగా మలుచుకొని మన దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు మేకిన్ ఇండియా పిలుపు ఇచ్చినా, మరొకటి చేసినా మన దేశానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు లేవు, ఎగుమతులూ పెరగలేదు. అమెరికాతో ఎంతగా అంటకాగుతున్నా మన ఎగుమతులకు ఎంతో కాలంగా ఇస్తున్న పన్ను తగ్గింపు ప్రాధాన్యతను తగ్గించటం వంటి చర్యలతో మనకు మరింత నష్టం జరగనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి, మరో సందర్భంలో చెప్పుకోవచ్చు. ఒకవైపు రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ప్రభుత్వమే అంగీకరించింది కనుక దాని గురించి ఎలాంటి అనుమానాలు లేవు. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్ చెప్పినట్లు పెద్ద ఎత్తున మన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిందనే అంగీకరిద్దాం, మరి వుద్యోగాలెందుకు రాలేదు ? ఈ సారైనా మోడీ నోరు విప్పుతారా ?