Tags
AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu
ఎం కోటేశ్వరరావు
ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.
గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్ జగన్ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.
రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?
శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్ 14 రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.
2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.
ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్ గవర్నర్ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.
దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.
సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్ చెబుతున్నారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.
భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.
వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్ నవరత్నాలలో గానీ, గవర్నర్ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.