Tags

, , , , , , , ,

Image result for YS Jagan Navaratnalu

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో ఎవరికీ పేచీ లేదు. అసలేమీ లేనిదాని కంటే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో జనానికి ప్రభుత్వం నుంచి సంక్షేమం రూపంలో అందటం మంచిదే. సంక్షేమ పధకాల గురించి యండమూరి వీరేంద్రనాధ్‌ వంటి పేరు మోసిన రచయితల మొదలు, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి విమర్శలు చేశారో, ఎంత చులకనగా వ్యాఖ్యానిస్తున్నారో తెలిసిందే. అవన్నీ బడుగు, బలహీన వర్గాల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు. వారు వినియోగిస్తున్న వస్తువులు, సేవలకు మిగతావారితో పాటు జిఎస్‌టి చెల్లిస్తున్నారు. విదేశీ, స్వదేశీ విమానాలకు సరఫరా చేసే ఇంధనానికి ఇచ్చే రాయితీలకు చెల్లిస్తున్న సొమ్ములో సామాన్యుల వాటా వుంది. విదేశాల నుంచి ధనికులు దిగుమతి చేసుకొనే సౌందర్యసాధనాలకు, చివరికి దోసకాయలు, యాపిల్‌ పండ్లకు, బంగారానికి, నగలు, వజ్ర వైఢూర్యాలకు, విదేశీ మద్యం వంటి వాటికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న విలువైన విదేశీ మారకద్రవ్యంలో కూడా పేదల వాటా వుందని తెలుసా? కనుక పేదలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలను అందుకోవటానికి సంకోచించనవసరం లేదు గానీ వారు చేయనితప్పుకు అవమానాలు పడాల్సిన అవసరం వుందా అన్నది సమస్య. వారు సంక్షేమం పేరుతో తీసుకున్న మొత్తాలతో తిరిగి సరకుల కొనుగోలు, సేవలకే కదా వెచ్చిస్తున్నది. అంటే తిరిగి ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు చెల్లిస్తున్నారు. ఆ విధంగా వస్తు, సేవల డిమాండ్‌ను పెంచటానికే తోడ్పడుతున్నారు తప్ప విదేశీ బ్యాంకుల్లో ఆ సొమ్మును దాచుకోవటం లేదు.

ప్రభుత్వ వుద్యోగులు, టీచర్లకు 27శాతం మధ్యంతర భృతి ప్రకటించటం హర్షణీయమే, వారికి ఐదు సంవత్సరాల క్రితం 47శాతం వేతనాలు పెంచారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన పెంపుదల చేస్తున్నందున మరోసారి వేతన పెంపుదల బకాయి వుంది, దాన్ని ఖరారు చేసే లోగా మధ్యంతర భృతి చెల్లించటం హర్షణీయమే. చంద్రబాబు వాగ్దానం చేసినదాని కంటే ఎక్కువే ఇస్తామనటం మంచిదే. వైఎస్‌ జగన్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో జనంలో వున్నారు. యాత్రలు చేశారు, జనం సమస్యలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటిన్నర మంది వరకు అసంఘటిత రంగ కార్మికులు వున్నారని అంచనా. వారిలో ఏ ఒక్కరూ, ఏ గ్రామం లేదా పట్టణంలోగానీ, లేదా వైసిపి కార్మిక నేతలు గానీ వారి వేతనాల పెంపుదల గురించి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదా అన్నది ఒక ముఖ్యాంశం. ఇవ్వలేదు అనేందుకు ఆస్కారం లేదు. గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా వారి సమస్యల ప్రస్తావన లేదు. ఎందుకన్నది ప్రభుత్వంతో పాటు జనం గూడా ఆలోచించాలి. ఎన్నికల మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగిసిన తరువాత 2019ఏప్రిల్‌ 16న రాష్ట్ర కార్మిక శాఖ ఒక గజెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దానిలో అసంఘటితరంగ కార్మికులకు చెల్లించాల్సిన కరువు భత్యం గురించి పేర్కొన్నది. దాని వివరాల్లోకి వెళితే 2014 తరువాత ఎవరికీ వేతనాలను సవరించలేదు. 2006 నుంచి సవరించని వారు వున్నారు. ఎక్కువ తరగతులకు 2006-2009 మధ్య సవరించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయని వైసిపి నాయకులకు, గవర్నర్‌ ప్రసంగం రాసిన సీనియర్‌ అధికారులకు తెలియనిదా ? అంటే చివరి తరగతిని తీసుకుంటే పదమూడు సంవత్సరాలుగా ఒకే వేతనం తీసుకుంటూ, దాని మీద కరువు భత్యం పొందుతున్నారని అనుకోవాలి. నిజంగా ఎన్ని యాజమాన్యాలు కరువు భత్యం చెల్లిస్తున్నాయన్నది పెద్ద బేతాళ సందేహం.

Image result for YS Jagan Navaratnalu

వుదాహరణకు పబ్లిక్‌ మోటార్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు 2006 డిసెంబరు నాలుగవ తేదీన నిర్ణయించిన వేతనాలలో అనాటికి వున్న కరువు భత్యం 502 పాయింట్లను కలిపి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటికి కరువు భత్యం పాయింట్లు 1306కు పెరిగాయి. అంటే మూలవేతనంలో పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి పెరుగుదల లేకుండా 502 పాయింట్లు పోను మిగిలి ఒక్కో పాయింట్‌కు ఆరున్నర రూపాయల చొప్పున 804 పాయింట్లకు, మూలవేతాన్ని కలిపి చెల్లిస్తారు. మన ఇండ్లకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకు వచ్చే వారికి మొదటి జోన్‌లో 3,700, రెండవ జోన్‌లో 3,370 రూపాయల వేతనాన్ని 2007 డిసెంబరు 19న 525పాయింట్ల కరువు భత్యాన్ని విలీనం చేసి నిర్ణయించారు. ఇప్పుడు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు రూ 5,226, గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చే వారికి రూ.5,076 కరువు భత్యం మొత్తాన్ని మూలవేతనానికి కలిపి చెల్లించాలి.అసలు కంటే కరువు భత్యం అధికం. ఇది ఏ విధంగా సమర్ధనీయం. ప్రభుత్వ సిబ్బందికి ఒక న్యాయం అసంఘటిత రంగ కార్మికులకు ఒక న్యాయమా? ప్రభుత్వం అంటే ప్రజల పక్షమా, యజమానుల పక్షమా ? ఈ విషయాలను జగన్‌ పట్టించుకోరా? ప్రభుత్వ వుద్యోగులకు వేతన సవరణ చేసినపుడు డిఏను కలిపి మూలవేతనం మీద కొంతశాతం పెంచి కొత్తవేతనాలను నిర్ణయిస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు పదమూడేండ్లు అంటే ఇప్పటికి రెండుసార్లు మూలవేతనం పెంచాల్సి వుండగా ఒక్కసారి కూడా పెంచలేదు. ఇది సామాజిక న్యాయమా? అన్యాయమా ? ఇంత పెద్ద సంఖ్యలో వున్న వారి సమస్య ప్రభుత్వ విధానాన్ని తెలిపే ప్రసంగంలో చోటు చేసుకోలేదంటే కావాలని విస్మరించినట్లా, నవరత్నాలే జిందా తిలిస్మాత్‌ కాదని గ్రహించాలి.

ఆశావర్కర్లకు నెలవేతనాన్ని మూడు నుంచి ఒక్కసారిగా పదివేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనేక మందికి ఇంత వుదారమా అనిపించింది. ఇది వేతనమా లేక ప్రోత్సాహకాలతో కలిపి ఇచ్చే మొత్తమా ? ప్రస్తుతం వున్న విధానం ప్రకారం మూడువేల రూపాయల వేతనానికి తోడు చేసిన పనిని బట్టి ప్రోత్సాహకాలను జత చేసి రూ.8,600 వరకు చెల్లిస్తామని గత పాలకులు వాగ్దానం చేశారు. ఆచరణలో గరిష్ట ప్రోత్సాహకాన్ని మూడువేల రూపాయలకు పరిమితం చేశారు. అంటే అంతకంటే తక్కువ పని చేస్తే కోత పెడతారు, ఎంత ఎక్కువ చేసినా ఇచ్చేది పెంచరు. దీని వలన అత్యధిక ఆశావర్కర్లకు ఇప్పుడు అన్నీ కలిపి నాలుగున్నర-ఐదున్నరవేల మధ్య వస్తుండగా ఒక పదిశాతం మందికి గరిష్టంగా ఆరువేలు వస్తున్నాయని ఆశా సంఘాలు చెబుతున్నాయి. ఆశావర్కర్లకు చెల్లించే పారితోషికంలో 60శాతం కేంద్రం, నలభైశాతం రాష్ట్రం చెల్లిస్తున్నాయి. ఈ పారితోషికాల మొత్తాన్ని ఇటీవల పెంచింది. అయితే అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న మొత్తం కంటే తక్కువే కనుక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా కొంత సొమ్ము జమ అవుతుంది తప్ప ఆశావర్కర్లకు ఒరిగేది, పెరిగేదేమీ వుండదు. జగన్‌ ప్రకటించినది వేతనమే అనుకుంటే పదివేలు, దానికి ప్రోత్సాహంగా మూడువేలు, సీలింగ్‌ను ఎత్తివేస్తే అంతకంటే ఎక్కువ వస్తాయి, అలా జరిగితే అభినందనీయమే, అలాగాక కిరికిరి చేసి అన్నీ కలిపి పదివేలే అని అన్యాయం చేస్తే పరిస్ధితి ఏమిటి?

వ్యవసాయ రంగం ప్రధానంగా వున్న రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. గతంలో రాజన్న రాజ్యంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం గాకుండా ఆదర్శరైతుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంపిక చేశారు. వారిలో వ్యవసాయం తెలియని వారు, మానుకున్నవారు కూడా వున్నారు. నియమించిన తరువాత వారు కాంగ్రెస్‌ సేవకులుగా మారారు తప్ప రైతులకు అందించిన సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం ఏటా వారికి 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ సేవలను అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని, పొరుగుసేవల ద్వారా వాటిని అందించాలని ప్రపంచబ్యాంకు మన మీద రుద్దిన ఆదేశాల ఫలితమే. రైతు భరోసా పేరుతో ఏటా ప్రతి రైతు కుటుంబానికి రు.12,500 చెల్లించాలని జగన్‌ నిర్ణయించటం హర్షణీయమే. ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన ఆరువేలకు అదనమా అది పోను మరో ఆరున్నరవేలు ఇస్తారా ? స్పష్టత ఇవ్వాలి.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై సబ్సిడీ మొత్తాలను గణనీయంగా తగ్గించిన కారణంగా రైతులు వాటిని కొనలేక సబ్సిడీ వున్న యూరియాను అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.ఎరువుల ధరల పెరుగుదల,సబ్సిడీ గణనీయంగా తగ్గింపు కారణంగా 2010లో 41లక్షల టన్నులుగా వున్న వినియోగం 2017 నాటికి 32లక్షల టన్నులకు పడిపోయింది. సగటు వాడకం కూడా బాగా తగ్గింది. ఎరువుల సబ్సిడీ నామమాత్రం అవుతున్న కారణంగా రైతులపై ఏటా పడుతున్న అదనపు భారాలను రైతు భరోసా పధకం పూడ్చుతుందని అనుకుందాం. మరి గిట్టుబాటు ధరల మాటేమిటి? కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు పడిపోయినపుడు రైతులను ఆదుకొనే మార్గాలేమిటి? ఇలాంటి సమస్యలు అనేక వున్నాయి. వాటి గురించి రైతులు, నిపుణులు, రైతు సంఘాలతో సమగ్ర చర్చలు జరిపితే ప్రయోజనం వుంటుంది. అలాగాక చంద్రబాబు నాయుడి మాదిరి సహజ వ్యవసాయం పేరుతో కాలక్షేపం చేయటం వలన ప్రజాధనం దండగ తప్ప రైతులకు ఒరిగేదేమీ వుండదు. అనేక పంటల దిగుబడులు అంతర్జాతీయ పరిస్ధితితో పోల్చితే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బాగా తక్కువగా వున్నాయి. పప్పుధాన్యాల సగటు దిగుబడులు ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక పోవటానికి ఇది కూడా ఒక కారణం.

2014-17 మథ్య మినుముల దిగుబడి హెక్టారుకు(రెండున్నర ఎకరాలు) 946 కిలోల నుంచి 920కు పడిపోగా నాలుగేండ్ల సగటు 856 కిలోలుగా వుంది.పెసల దిగుబడి ఇదే కాలంలో 825 నుంచి 662కు పడిపోగా సగటు దిగుబడి 656 కిలోలు. కందుల విషయానికి వస్తే 503 నుంచి 430కి పడిపోయింది. నాలుగేండ్ల సగటు 478కిలోలు, శనగల దిగుబడి 1143 నుంచి 1132కు తగ్గిపోగా నాలుగేండ్ల సగటు 1074 కిలోలు. ఇక పత్తి సంగతి చూస్తే 588 నుంచి 549కి తగ్గిపోయింది, నాలుగేండ్ల సగటు 545కిలోలు. వీటి తీరుతెన్నులను చూస్తే ప్రకృతి అనుకూలతలు, ప్రతికూలతల మీద రైతులు ఆధారపడటం తప్ప దిగుబడులను పెంచేందుకు ప్రభుత్వ కృషి కనిపించదు. ప్రధాన ఆహార పంటల విషయానికి వస్తే ధాన్య దిగుబడి 3022 నుంచి 3815కిలోలకు పెరిగింది. నాలుగేండ్ల సగటు 3460కిలోలు. చంద్రబాబు నాయుడు తొలిసారి అధికారంలో వున్నంత కాలం ఇజ్రాయెల్‌ వ్యవసాయమని, గత ఐదేండ్లు పాలేకర్‌ సహజ సాగు అంటూ కాలక్షేపం చేశారు.

Image result for YS Jagan Navaratnalu

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి అధికారంలోకి రాగానే ప్రముఖ ఆర్ధికవేత్త జయతిఘోష్‌తో ఒక కమిషన్‌ వేసి వ్యవసాయ రంగం మీద సిఫార్సులను తీసుకున్నారు. అనేక కమిషన్లకు పట్టిన దుమ్ము మాదిరే దానికీ పట్టింది.ఆ కమిషన్‌ సిఫార్సులలో అనేక మౌలిక అంశాలున్నాయి. వాటిని రాజశేఖరరెడ్డి, తరువాత ఆయనవారసులుగా వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు గానీ, గత ఐదు సంవత్సరాలు అధికారంలో వున్న చంద్రబాబు నాయుడు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌ ఆ కమిషన్‌ సిఫార్సులను తిరిగి పరిశీలిస్తారా ? ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ను రైతాంగ కమిషన్‌లో పనిచేయవలసిందిగా జగన్‌ ఆహ్వానించినట్లు, కమిషన్ల సిఫార్సులను అమలు జరుపుతారనే విశ్వాసం తనకు లేదంటూ శాయినాధ్‌ సున్నితంగా తిరస్కరించినట్లు, కమిషన్‌ కాదు, కార్యక్రమానికి తోడ్పడమని జగన్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వారి సలహాలను తీసుకోవాలని ప్రయత్నించటం మంచిదే. అయితే జయతీ ఘోష్‌ సిఫార్సుల అమలు తీరుతెన్నులను చూసిన తరువాత మరొకరెవరూ అలాంటి వృధా ప్రయాసకు పూనుకోరు. పదిహేను సంవత్సరాల నాటి పరిస్ధితుల మీద జయతీఘోష్‌ చేసిన సిఫార్సులు, వుమ్మడి రాష్ట్రానికి చెందినవి కనుక కొన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్తమానానికి వర్తించకపోవచ్చు. కానీ వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం, వ్యవసాయానికి అవసరమైన వాటన్నింటినీ సరఫరా బాధ్యతను ప్రభుత్వమే చేెపట్టాలనేటువంటి సిఫార్సులు వున్నాయి, వాటికి కాలదోషం పట్టదు. రాజన్న రాజ్యం తిరిగి తీసుకువస్తామని చెబుతున్నవారు, ఆ రాజన్న ప్రభుత్వం నియమించిన కమిషన్‌ సిఫార్సులు, పరిస్ధితులను అధ్యయనం చేసి పనికి వచ్చేవాటిని అమలు జరుపుతారా? చంద్రబాబు మాదిరి మభ్యపెట్టి కాలం గడుపుతారా ?