Tags

, , , , ,

Image result for Hong kong protests

ఎం కోటేశ్వరరావు

హాంకాంగ్‌ ఈ మధ్య ప్రపంచ వార్తల్లోకి వచ్చిన ప్రాంతం. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వార్తలను చదివేవారికి అదొక ప్రత్యేక దేశం అనే భ్రమ కలిగే అవకాశం వుంది. ఎందుకంటే అక్కడ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు హాంకాంగ్‌ పాలనా వ్యవస్ధ ఒక బిల్లును ఆమోదించేందుకు గత కొన్ని నెలలుగా అవసరమైన చర్యలను చేపట్టింది. ఇంకేముంది మా స్వేచ్చకు ముప్పు వచ్చింది అని బిల్లును వ్యతిరేకించిన వారు ఆందోళనకు దిగారు.నిజమే అన్యాయం అంటూ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు వారికి మద్దతు పలికాయి. జనంలో తలెత్తిన వుద్రేకాలను తగ్గించేందుకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టి చర్చలు జరుపుతామని ప్రత్యేక పాలనా అధికారి ప్రకటించిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అంటూ డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కొట్లాటలకు దిగుతున్నారు. దీన్ని బట్టి నేరస్ధుల అప్పగింత కంటే మించిన అంశాలు ఈ ఆందోళన వెనుక వున్నాయన్నది స్పష్టం.గత మూడు దశాబ్దాలుగా హాంకాంగ్‌ను అడ్డం పెట్టుకొని విదేశాలు చైనా మీద వత్తిళ్లు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్ధలో వున్న లోపాలను సరి చేసేందుకు, నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకొనేందుకు గాను నేరస్ధుల అప్పగింతతో సహా మరికొన్ని అంశాలను దానిలో పొందుపరిచారు.నేరగాండ్లను ఒక్క చైనా ప్రధాన భూభాగానికే కాదు, తైవాన్‌కు సైతం అప్పగించేందుకు కూడా దానిలో నిబంధనలను పొందుపరిచారు. ఆందోళనల పూర్వరంగంలో బిల్లును వాయిదా వేయటం, చర్చలు జరుపుతామన్న ప్రకటనను చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘స్వేచ్చ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో ముందు పీఠీన జరిగే పోరులో హాంకాంగ్‌ ‘అనే శీర్షికతో అమెరికాకు చెందిన టైమ్‌ పత్రిక ఒక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పోరుకు నాయకులెవరూ లేరని, దానంతట అదే తలెత్తిన విద్యార్ధులు, యువకుల వుద్యమం అని ప్రపంచ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. జూన్‌ పన్నెండవ తేదీ ప్రదర్శనల గురించి టైమ్‌ కధనం ఇలా ప్రారంభం అయింది. గుమికూడిన గుంపులు కేవలం ఒక గాలివానను తట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లతోనే రాలేదు, అలాంటిదొకటి వస్తుందని వారు లెక్కవేసుకుంటున్నారు. వర్షం ప్రారంభం కాగానే ‘గా యావ్‌ ‘ అంటూ గొడుగులు పట్టుకున్నవారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.( దాని అర్ధం అగ్నికి ఆజ్యం పోయండి అని) కొద్ది గంటల్లోనే వచ్చిన అనేక గుడారాలతో తాత్కాలిక రక్షణ శిబిరాలు తయారయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించినా, పెప్పర్‌ స్ప్రే చల్లినా తప్పించుకొనేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇలాంటి ఆందోళన అసంఘటితమైనదని, ఎవరూ వెనుక లేరని లోకాన్ని నమ్మింప చూస్తున్నారు. తొంభై తొమ్మిదిసంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో ఎలాంటి హక్కులూ లేనపుడు అక్కడి వారికి స్వేచ్చ, స్వాతంత్య్రాలు కావాలని అనిపించలేదు. ఎలాంటి ప్రజావుద్యమాలూ జరపలేదు. ఆకస్మికంగా చైనాలో విలీనమైన తరువాత వాటికోసం వారు ఆందోళన ప్రారంభించారని ప్రపంచానికి చెబుతున్నారు.

హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ ఒక ప్రత్యేక పాలిత ప్రాంతం. తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత 1997లో అది చైనాలో విలీనమైంది. అయితే అది ఒక అంతర్జాతీయ ఓడరేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా అప్పటికే అభివృద్ధి చెంది వున్న కారణంగా, దాని తరువాత పోర్చుగీసు నుంచి అదే మాదిరి కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం అయ్యే మకావో దీవులు, అప్పటికే తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ సమస్యలను దృష్టిలో వుంచుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక వైఖరిని తీసుకుంది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అని దాన్ని పిలిచారు. హాంకాంగ్‌ వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందితే, మకావో పెద్ద జూదకేంద్రంగా వలసపాలనలో మారింది. అందువలన అక్కడ వున్న ప్రత్యేక పరిస్ధితులు, పెట్టుబడులు, ఇతర సామాజిక అంశాలను గమనంలో వుంచుకొని 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని, ఇతర దేశాల సంస్ధలతో మాదిరి అక్కడి కార్పొరేట్లు ప్రధాన భూభాగంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వాటికి హామీ ఇస్తామని పాలక కమ్యూనిస్టు పార్టీ ఒక ఒప్పందం ద్వారా భరోసా ఇచ్చింది. విలీనాన్ని చైనా ఆక్రమణగా వక్రీకరిస్తున్నారు. ఆ గడువు మరో 30దశాబ్దాలలో ముగిసి చైనా సమాజంలో పూర్తిగా అంతర్భాగం కావాల్సివుంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ సాఫీగా హాంకాంగ్‌ను ఆవైపు నడిపేందుకు చైనా ప్రయత్నిస్తుండగా వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టేందుకు, పరిస్ధితులను సంక్లిష్టం గావించేందుకు విలీన వ్యతిరేకశక్తులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకుంటేనే అక్కడి పరిణామాలు అర్ధం అవుతాయి.

బ్రిటీష్‌ పాలకులు హాంకాంగ్‌ను తమ వలసగా చేసుకున్న తరువాత ఏ రకమైన ప్రజాస్వామిక వ్యవస్ధనూ అమలు జరిపేందుకు వారెలాంటి ప్రయత్నమూ చేయలేదు. నామ మాత్ర పాలనా మండళ్లను ఏర్పాటు చేశారు, అదీ ధనికులకు మాత్రమే పరిమితంగా ఓటింగ్‌ హక్కు ఇచ్చారు, నామినేటెడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు, చాంగ్‌ కైషేక్‌, అతని నాయకత్వంలోని మిలిటరీ, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో తైవాన్‌కు పారిపోయి దాన్ని స్ధావరంగా చేసుకొని చైనా పేరుతో అక్కడి నుంచి పాలన ప్రారంభించారు.ఐరాస కూడా 1970వరకు దానినే అసలైన చైనాగా గుర్తించింది. 1950 దశకంలో బ్రిటీష్‌ వారు హాంకాంగ్‌లో ప్రజాస్వామిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామంటూ ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రాంతాన్ని మరొక తైవాన్‌ మాదిరి తిరుగుబాటు ప్రాంతంగా చేయాలనే ఎత్తుగడ దాని వెనుక వుంది. అందుకే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించి గడువు మీరే వరకు ఒక వలస ప్రాంతంగానే వుంచాలి తప్ప మరొకవిధంగా చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో వెనక్కు తగ్గిన బ్రిటీష్‌ వారు, 1997గడువు దగ్గరపడే కొద్ది స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామిక వ్యవస్దల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించి అసమ్మతికి బీజాలు నాటారు. చైనాలో విలీనమైన తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రత్యేక పాలనా మండలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుతూ అందరికీ ఓటు హక్కు కలిగించింది. పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలించేవారిగా చీలిపోయి పోటీ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో విలీనానికి మొగ్గుచూపే వారు పాలకమండలిలో మెజారిటీగా వున్నారు.

తాజా ఆందోళన వెనుక అమెరికా, మరికొన్ని దేశాలు వున్నాయన్నది చైనా అభిప్రాయం. బిల్లును సమర్ధించేవారు నడుపుతున్న వెబ్‌సైట్‌ మీద దాడి జరిపిన వారి మూలాలు అమెరికాలో కనిపించాయి.మార్చినెలలో ఈ బిల్లును హాంకాంగ్‌ పాలక మండలికి సమర్పించిన వెంటనే స్పందించిన తొలి విదేశం అమెరికాయే. ఒక వేళ బిల్లును ఆమోదించినట్లయితే హాంకాంగ్‌కు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల రద్దు గురించి ఆలోచించాల్సి వుంటుందని అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బెదిరించారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచాయి. జపాన్‌లో త్వరలో జరిగే జి20 సమావేశాల్లో తమ అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా విదేశాంగ మంత్రి మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. బిల్లును వక్రీకరిస్తూ హాంకాంగ్‌ అంతటా అనేక కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులు, ఇతరులను రెచ్చగొట్టేవిధంగా వాటి రాతలున్నాయి. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, మతాన్ని అణచివేస్తారని, ఇతర దేశాలకు వీసాలతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశాలు రద్దవుతాయంటూ వాటిలో పేర్కొన్నారు. నిజానికి అలాంటి అంశాలే బిల్లులో లేవు. ఆ బిల్లు చట్టంగా మారితే నేరస్ధులకే కాదు, సామాన్య పౌరులకూ తరువాత పొడిగిస్తారు, నగరంలో ప్రవేశించే వారందరూ అనుమతి పాస్‌లు తీసుకోవాల్సి వుంటుంది. అందువలన మరోసారి నేను ఇక్కడకు రావాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అమెరికా మాజీ దౌత్యవేత్త సీన్‌ కింగ్‌ వంటి వారు తప్పుడు ప్రచారాలు చేశారు. వుఘీర్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలను పాటించని వారిని పదిలక్షల మందిని నిర్బంధించారు, టిబెట్‌ బౌద్ధ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నారంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

2016లో హాంకాంగ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుగురు చైనా వ్యతిరేకులు, హాంకాంగ్‌ వేర్పాటు వాద సభ్యులు ఒక వేదికగా చేసుకున్నారు. హాంకాంగ్‌ చైనా కాదు అని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హాంకాంగ్‌ దేశానికే తాము విధేయులమై వుంటామని ప్రమాణస్వీకారాన్ని అపహాస్యం చేశారు. చైనాను అవమానపరిచారు. దాన్నొక వుపన్యాస వేదికగా మార్చివేశారు. వారి ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు ప్రకటించారు. అయితే వారి ప్రవర్తన సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తూ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ తాము చేసింది తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. అక్కడి న్యాయమూర్తి వేర్పాటు వాదులకు వూతమిచ్చే విధంగా తీర్పు చెప్పారు. అంతకు ముందు హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పుస్తక ప్రచురణకర్తల అరెస్టును వివాదం చేశారు. హాంకాంగ్‌ మరియు బ్రిటీష్‌ పౌరసత్వం వున్న ఇద్దరు చైనీయులు పుస్తక ప్రచురణ పేరుతో చైనా వ్యతిరేకతను, అశ్లీలంతో సహా అన్ని రకాల అరాజకత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సాగిన రచనలను అక్రమంగా ముద్రించి పంపిణీ చేశారు. వారు సరైన పత్రాలు లేకుండా చైనాలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు, అలాంటి వారే మరో ముగ్గురిని చైనా నిర్బంధించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తరువాత బ్రిటన్‌తో సహా ఇతర చైనా వ్యతిరేకులు మానవహక్కులు, స్వేచ్చ అంశాలను ముందుకు తెచ్చారు తప్ప వారి చైనా వ్యతిరేకచర్యలను మరుగుపరిచారు. వారిని చైనా అధికారులే అపహరించారని ఆరోపించారు. ఐదుగురిలో ఒకడు తమ పౌరుడేనని చైనా ప్రకటించింది. వారు హాంకాంగ్‌ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు చేసిన ప్రకటనకు భిన్నంగా తమ చేత చైనాలో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేయించారంటూ మీడియా ముందు ప్రకటించి చైనా వ్యతిరేకతను వెల్లడించుకున్నాడు. ఈ పూర్వరంగంలోనే ఇలాంటి వారిని చైనాలో విచారించేందుకు వీలుగా అప్పగింత బిల్లు వచ్చిందని గమనించాలి. ఎక్కడ నేరం చేస్తే అక్కడే విచారించాలనే పేరుతో ఇలాంటి నేరస్ధులను రక్షించేందుకు చైనా వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్తలు స్ధానిక అంశాల మీద పుస్తకాలు ప్రచురించి అక్రమాలకు పాల్పడితే అక్కడే విచారించాలని అంటే అర్ధం వుంది. సమంజసం కావచ్చు, చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగం అయినపుడు సదరు చైనా సర్కార్‌ను కూల్చివేయాలని, కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని అక్కడ మానవహక్కులు లేవని దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినపుడు, స్దానిక చట్టాలు పటిష్టంగా లేనపుడు ఏమి చెయ్యాలన్నది సమస్య.

రాజకీయ పరమైన ఈ సమస్యలు ఇలా వుండగా 2018 ఫిబ్రవరిలో జరిగిన ఒక నేరం బిల్లు రూపకల్పనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. హాంకాంగ్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితురాలితో కలసి తైవాన్‌ వెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి హాంకాంగ్‌ తిరిగి వచ్చాడు. చిన్న చిన్న నేరాలకు జైలు పాలయ్యాడు. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం హాంకాంగ్‌ వెలుపల జరిపిన నేరాలకు గాను నిందితులను హాంకాంగ్‌లో విచారణ జరపటానికి లేదు. అందువలన అతని మీద విచారణ జరపాలంటే తైవాన్‌కు పంపాలి. ఈ పూర్వరంగంలో ఈ బిల్లును రూపొందించారు.

Image result for Hong kong protests

ఈ బిల్లు మీద తలెత్తిన వ్యతిరేకతను, దాని వెనుక వున్న శక్తుల ఎత్తుగడలను గమనించిన చైనా, హాంకాంగ్‌ అధికారులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎంతగా రెచ్చగొట్టి హింసాపూరితంగా మార్చాలని చూసినా దానికి వీలులేకుండా చూశారు. ఆందోళనలో పాల్గొన్నవారి సంఖ్య గురించి బయటి మీడియా చిలవలు పలవలుగా వర్ణించింది. అంత సీను లేకపోయినా గణనీయ సంఖ్యలో పాల్గొనటాన్ని గమనించిన చైనా నాయకత్వం తాత్కాలికంగా బిల్లును వాయిదా వేయాలని సలహా ఇచ్చింది. వాయిదా కాదు, పూర్తిగా రద్దు చేయాలనే ఆందోళన ఇప్పుడు సాగుతోంది. ప్రస్తుతం చైనాను లొంగదీసుకొనేందుకు అమెరికన్లు వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేయటంతో పాటు అనుకోకుండా వచ్చిన హాంకాంగ్‌ బిల్లును కూడా వుపయోగించుకొనేందుకు పూనుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ ఏడాది మార్చినెలలో అమెరికాను సందర్శించి మద్దతు కోరారు. దాని పర్యవసానమే అమెరికా జోక్యం, బెదిరింపులు అన్నది స్పష్టం. అమెరికా లేదా మరొక దేశం గానీ నేటి చైనా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారికి కౌలుకు ఇచ్చిన నాటి స్ధితిలో చైనా వుందనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. సున్నితమైన ఈ సమస్యను చైనా నాయకత్వం ఎంతో జాగ్రత్తగా చూస్తోంది. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇతర అంశాలలో కూడా దీనిని గమనించవచ్చు.

మన దేశంలో పోలీసు చర్యతో సంస్ధానాలను విలీనం చేసినట్లుగా, రష్యా పాలకులు క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ను మిలిటరీ చర్యద్వారా చైనాలో విలీనం చేయటం పెద్ద సమస్య కాదు. దాని వెనుక వున్న సామ్రాజ్యవాదుల హస్తం, ఇతర అంశాలను గమనంలో వుంచుకోవటంతో పాటు ఆయా ప్రాంతాలలోని జన అంగీకారం, మద్దతు ముఖ్యం. విశృంఖలమైన పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరిగిన వారు ఒక క్రమశిక్షణకు వెంటనే సిద్ధం కావటం చిన్న విషయం కాదు. అందువలన బలప్రయోగం మార్గం కాదనే చైైతన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రదర్శిస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, మకావోల్లో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యవధి పట్టవచ్చుగాని, వాటి కుట్రలకు వమ్ము చేసి ఆ ప్రాంతాలను కాపాడుకోవటం అనివార్యం !